పూర్వం మాళంక రాజ్యానికి వీరసింహుడు అనే రాజు ఉండేవాడు. అతనితో పనిచేయడం దర్బారులోని అధికారులు, మంత్రులకు కత్తిమీద సాములా ఉండేది. ఏ క్షణంలో తమ ఉద్యోగం ఊడుతుందో తెలీని పరిస్థితుల్లో ఉండేవారు. దీనికి కారణం రాజు వింత కోర్కెలే. ఆయనకు ఏదన్నా కావాలంటే తక్షణమే పని పూర్తి చేయమంటూ కిందివారిని ఆజ్ఞాపించేవాడు. దాని సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించేవాడు కాదు. ఈ పని కుదరదు అని ఎవరైనా చెబితే వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేసేవాడు. ఒకరోజు దర్బారులోని మంత్రిని తనకు కెంపురంగు పిల్లి కావాలని అడిగాడు వీరసింహుడు. తన పదవి ఊడుతుందేమోనన్న భయంతో ఒక పిల్లికి ఆ రంగు వేయించుకుని తీసుకొచ్చాడు మంత్రి. రాజు, మంత్రిని మెచ్చుకున్నాడు. ఒకరోజు తనకు మామిడిపళ్ళు తెప్పించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. వానాకాలంలో మామిడి పండ్లు ఎక్కడినుంచి వస్తాయి. కానీ తెల్లవారేసరికి అవి తేలేకపోతే ఇక ఇంట్లో ఉండాల్సిందే అనుకుంటూ తలపట్టుకున్నాడు మంత్రి. విషయం తెలుసుకున్న ఆయన చిన్న కొడుకు నాన్నా మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఎలాగోలా మామిడి పండ్లు తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చి వస్తాను అని చెప్పాడు.
ఆ బాలుడు రాజు దగ్గరికి వెళ్ళి ”రాజా! మీ కోసం మామిడిపండ్లు తీసుకురావడానికి వెళ్ళిన మా నాన్నగారికి వడదెబ్బ తగిలింది. అందుకే విశ్రాంతి తీసుకుంటున్నారు” అని చెప్పాడు. నువ్వు చెప్పింది అబద్ధం, వర్షాకాలంలో వడదెబ్బ తగలడమేమిటి అని గద్దించాడు రాజు. అప్పుడు ఆ బాలుడు వర్షాకాలంలో వడదెబ్బ తగలడం అసాధ్యమైతే ఎండాకాలంలో కాసే మామిడి పండ్లు ఈ కాలంలో దొరకడమూ అసాధ్యమే కదా! మరి మీ కోసం ఎవరైనా వాటిని ఎలా తీసుకురాగలరు అన్నాడు వినయంగా. నీ సమాధానం నన్ను ఆలోచింపజేసింది. చిన్నవాడివైనా ధైర్యంగా, తెలివిగా సమాధానం చెప్పావు అని మెచ్చుకోవడమే కాకుండా ఆ బాలుడికి బోలెడు బహుమతులు ఇచ్చి పంపించాడు రాజు.