ఒక స్త్రీగా తన పరమావధి ఏమిటి? తాను తన జీవితాన్ని ఎలా మలచుకోవాలి? చిన్ననాటి నుండి తండ్రి అని, సోదరుడని, భర్త అని, కొడుకులని ఎవరి పంచన ఉంటే వారి వ్యక్తిత్వపు ఆలోచనలే తనవా? లేదా తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలా? అనే ప్రశ్నలు ఎంతమంది మహిళలకు వస్తాయి. వచ్చినా తనకంటూ సాధికారతను సాధించడానికి ఎందరు స్త్రీలు ప్రయత్నాలు చేస్తున్నారు? అని అందరం తర్కించాల్సిన అంశం. ఇది సత్యం.
తరతరాలుగా స్త్రీ ఇలా ఉండాలి, అది చేయకూడదు, ఇది చూడకూడదు అని హద్దులు గీసి తన ఆలోచనలకూ, ఆచరణలకూ బంధాలు బిగించారు. వాటిని తొలగించి విశ్వంలోకి తొంగిచూసి తాను ఏది చేయాలో నిర్ణయాలు తీసుకునే అధికారం తనకే ఉంది అని చెప్పడమే కాక అందుకు చక్కని ఉదాహరణలుగా పురాణ స్త్రీలను, గారి చరిత్రలను ఆసరాగా తీసుకుని చక్కని కథలుగా అల్లి ప్రతి మహిళను చైతన్యపరచి, పరిమళించే విధంగా ఓల్గా వారి విముక్త కథలు కొనసాగుతాయి.
సీత మహా సాధ్వి, శక్తిమంతురాలు, రాముని పట్టమహిషి… ఇలా చెప్తూ పోతే తనకు లేని గుణగణాలు, నైపుణ్యాలు కానరావు. అటువంటి సీత జీవితంలో కూడా ఎన్నో జీవిత సత్యాలను తన అనుభవం ద్వారా తెలుసుకున్నట్లు చిత్రించిన విధానం ఎంతో గొప్పగా, మనసులను ఆట్టుకునే విధంగా ఉందని చెప్పవచ్చు. అంతేకాక రాక్షసులు అంటే వారి రూపం కానీ, గుణం కానీ వికారంగా ఉంటాయని ప్రజలందరి మనసులలో ముద్ర పడిపోయే విధంగా మనం ఎన్నో కథలు, కావ్యాలు, సినిమాలు చూసి రూఢి చేసుకున్నాం. కానీ విముక్త కథల్లో శూర్పణఖను చూపించిన విధానం ఎంత అద్భుతంగా ఉందో మాటల్లో చెప్పలేము. ఒక అలౌకిక ఆనందం చదువరులకు కలుగక మానదు. ఇలా ఆలోచన చేయగలగడం ఒక్క ఓల్గా గారికే సాధ్యం.
మొదటి కథగా ”సమాగమం” అనే పేరుతో సీత, శూర్పణఖను కలిసి స్నేహితురాలిగా మారిన విధానాన్ని చక్కగా వివరించారు. పుస్తకం చదివేవారికైనా, వినేవారికైనా సీతలాంటి ఒక పతివ్రతామ తల్లి, దేవతామూర్తి ఒక రాక్షస స్త్రీ అయిన శూర్పణఖను కలవడమేమిటి? అనే ప్రశ్న తలెత్తక మానదు. ఆ ఆలోచనే ఓ గొప్ప అనుభూతిని, ఉత్సుకతను కలిగిస్తుంది. సీత, శూర్పణఖను కలవడమే కాక శూర్పణఖతో చెప్పించిన మాటలు కేవలం సీతకు మాత్రమే అన్నట్లుగా కాక ప్రతి మహిళ మనసును తాకి ఆలోచించే విధంగా ఉంటాయి. రాక్షసులలో కూడా ఇన్ని సాధుగుణాలుంటాయా! అని అనిపిస్తుంది.నిజంగా శూర్పణఖ వ్యక్తిత్వాన్ని మలచిన విధం వర్ణనాతీతం. ఇద్దరు స్త్రీల మధ్య స్నేహం మనసు విప్పి మాట్లాడితే కలుగుతుంది. కానీ శత్రుత్వం పురుషుడి అధికార దాహం వల్ల కలుగుతుంది అని అర్థమవుతుంది. రాముడి వల్ల కురూపి అయిన శూర్పణఖ ఎంతో బాధపడి, బాధల్లోంచి తనకు కలిగిన ఆలోచనలను ఆచరణలో పెట్టిన విధానాన్ని ఎంతో అందంగా, అద్భుతమైన పదజాలంతో శూర్పణఖతో చెప్పించారు ఓల్గాగారు. దీంతో శూర్పణఖ యొక్క వ్యక్తిత్వం మనకు అవగతమవుతుంది. అంతేకాక శూర్పణఖ ఎంతో స్నేహపూర్వకంగా సీత విషయాలను, తన కోరికలను అడిగి తెలుసుకుంటుంది. రాజపత్నిగా సీత తన కుమారులను రాముడికి అప్పగించి తాను తన తల్లి భూదేవి వద్దకు వెళ్తాను అన్న మాటలకు శూర్పణఖ సీతతో ‘నీ తల్లి ఎక్కడ లేదని సీతా! అయితే నీ తల్లికి ఇంతకంటే సుందర రూపం మరెక్కడా లేదు’ అని తాను పెంచిన ఉద్యానవనాన్ని చూపిస్తూ అన్న మాటలు శూర్పణఖ యొక్క ఉన్నతమైన మూర్తిమత్వాన్ని మనకు తెలియపరుస్తాయి. సీతకు తాను పెంచిన ఉద్యానవనం పుట్టింటి ఆనందాన్ని కల్గిస్తుందని సాదరంగా ఆహ్వానించిన పద్ధతి శూర్పణఖను చదువరుల హృదయాలకు చేరువ చేస్తుంది. ఒక రాక్షస స్త్రీతో స్నేహం, సోదరి భావం, మాతృత్వం వంటి గుణాలను వెలికి తీయగల శక్తి కేవలం ఓల్గాగారి మేధస్సుకే సొంతం.
”మృణ్మయ నాదం” కథలో అహల్యను సీతకు మాత్రమే స్నేహితురాలిగా కాక మనకందరికీ కనువిప్పు కలిగించే ఒక గురుమూర్తిలాగా ఆవిర్భవింపచేశారు.
సమాజంలో ఏది సత్యం? ఏది అసత్యం అన్న విషయాన్ని అహల్యతో చాలా తేలిగ్గా వివరణ ఇప్పించారు. సత్యం అంటే ఏమిటి? అనే ప్రశ్నకు ”ఎవరికి ఏ జవాబైతే శాంతినిస్తుందో అదే సత్యం” అనే సమాధానాన్ని చెప్పించే విధానం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అంతేకాక మనం ఎవరికో ఒకరికి భార్యగా, తల్లిగా, కూతురిలాగా మాత్రమే కాక మనం మనలా బ్రతకాలి అని చెప్పించడంలో స్త్రీ సాధికారతను ఎంత బలంగా వక్కాణించారో అర్థం చేసుకోవచ్చు. సత్యం ఏంటో తెలుసుకున్నప్పుడు మనం మనకోసం బ్రతికినపుడు ఎటువంటి ఆటంకాలనైనా సునాయాసంగా దాటవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? ఇదే కదా సంతోషం అని తెలియచెప్పారు. రాముని మాట జవదాటని సీత, రాముడు ఓడిపోవడం ఇష్టపడని సీత మొట్టమొదటిసారి రాముని మాట కాదనడమే కాక, ఓడించి ఎంతో ధైర్యంగా చిరునవ్వుతో అన్నింటినీ పరిత్యజించి తన తల్లి ఒడిని చేరింది. సీత ఇలా ప్రవర్తించడానికి అహల్య మాటలు వేద మంత్రాల్లా పనిచేశాయి. అనాదిగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల పేరిట స్త్రీని ఎన్ని రకాలుగా అణచివేయవచ్చో మన ధర్మ శాస్త్రాలలో, వేదాలలో ఎన్నో అంశాలు చరిత్రలో లిఖించారు. కానీ ఎవరైనా సరే స్వతంత్రంగా తమ ఆలోచనలకు తగ్గట్లుగా ఎవరి కట్టుబాట్లకు లొంగకుండా బ్రతకాలి అని అహల్యతో చెప్పించి సమస్త మానవ లోకానికి అహల్యను ఒక మంచి స్నేహితురాలిని చేశారు రచయిత్రి ఓల్గా గారు.
”సైకత కుంభం” కథలో సీత, రేణుకాదేవిని కలవడం, రేణుకాదేవి తన అనుభవంలో తాను ఎదుర్కొన్న అనుభవాలనే పాఠాలుగా మలచుకుని తన ఆశ్రమంలో వారికి తెలియపరుస్తూ ఆర్య ధర్మాలను ధిక్కరించే సాటి మహిళగా ఎంతో
ఉన్నతమైన స్త్రీగా మనకు గోచరిస్తుంది. రేణుకాదేవి సీతతో ”విచారణకు తలొగ్గకు; భర్త, పిల్లలు అనే మమకారంతో మనమెవరమో తెలుసుకోలేకపోతున్నాము. బాధ్యత అనుకుని నిర్వర్తించి, ఆ తర్వాత ఎదురయ్యే వాటిని చాలా స్థిర, స్థిత మనస్తత్వాలతో స్వీకరించాలి” అని తన అనుభవంతో వివరించారు. తన పిల్లలే తన ప్రాణంగా భావించే సీతకి ఈ మాటలు పిల్లలను రామునికి అప్పగించే సమయంలో ఎంతో బలాన్ని ఇచ్చాయి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా స్థిరంగా ఉండాలని సమస్త మానవాళికి చాటి చెప్పారు ఓల్గా గారు. ఆర్య ధర్మాలను దిక్కరించి ఆ కాలంలోనే ఎంతో ధైర్యంగా ముందడుగు వేసిన వారిలా రేణుకాదేవిని తీర్చిదిద్దారు.
పాతివ్రత్యం, మాతృత్వం, ఏకాగ్రత ఈ మూడింటిలో ఏ చిన్న లోపమున్నా అనుమానాలకు, అవమానాలకు గురి కావలసి వస్తుందని రేణుకాదేవి ద్వారా తెలియపరచారు రచయిత్రి. బంధాలు, బంధుత్వాలు మనం ఏర్పరచుకున్నవే. వాటికన్నా ప్రకృతిని ప్రేమించడం, పూజించడం మన కర్తవ్యం, బాధ్యత అని ప్రకృతే మానవుల గురువు అని రేణుకాదేవితో పలికించారు రచయిత్రి. ఇది అక్షర సత్యం.
తల్లిగా సీతాదేవి తన పిల్లలను తీర్చిదిద్దడంలో ఎంత బాధ్యతగా వ్యవహరించిందో తన పిల్లలను రాముడికి అప్పగించి తాను తన తల్లి ఒడికి వెళ్ళే నిర్ణయం తీసుకోవడంలో రేణుకాదేవి మరియు అహల్య చెప్పిన మాటలు సీతకు ఎంతో మనోబలాన్ని చేకూర్చాయనడంలో అతిశయోక్తి లేదు.
ఊర్మిళ తన భర్తకు దూరమై పధ్నాలుగు సంవత్సరాలు తాను పడిన బాధ, బాధ వల్ల కలిగిన ఆగ్రహం, ఒంటరితనం వీటన్నింటినీ అధిగమించి తాను పొందిన తపశ్శక్తి తద్వారా కనుగొన్న సత్యాలను ”విముక్త” కథలో ఎంతో గొప్పగా వివరించారు. ”అధికారం తీసుకోవడం, ఇవ్వడం అనవసర ప్రయత్నాలు. మనతో మనమే యుద్ధం చేయాలి, మనకు ఏది ప్రశాంతతను ఇస్తుందో అదే స్వీకరించాలి. నాది అనుకుంటే దూరమైన ప్రతిసారీ బాధ తప్పదు కానీ, నాకు నేనే నాలో నేనే అనుకుంటే ఎంతో ప్రశాంతత” అని ఊర్మిళ సీతతో వనవాసానంతరం చెప్పిన ప్రతి అంశం ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయం. అందుకే రాముడు తన పిల్లలను స్వీకరించాక తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తన ఇష్టం, తనకు ఏది కావాలో అదే చేసి చూపించింది సీత, అదీ శాంతస్మిత వదనంతో. ఎంతో తపస్సు చేస్తే తప్ప అంతటి నిగ్రహం రాదు కానీ ఊర్మిళ మాటలతో సీత దాన్ని సాధించగలిగినట్లుగా ఓల్గాగారు ఎంతో చక్కగా వివరించారు. ఊర్మిళ చేత చెప్పించిన మాటలు ఎవరు చదివినా, విన్నా ఎంతో శక్తి వస్తుంది. ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోగల శక్తి లభిస్తుంది. ఇంతకంటే ఇంకా ఏమి కావాలి నేటి మహిళకి.
”బంధితుడు” కథలో సీత గొప్పతనం రాముడితో చెప్పించడం, సీత గురించి ఎవరు చెప్పినా కొంచెం తక్కువ చేసి చెప్పినట్లే అవుతుంది. కానీ రఘు వంశ తిలకుడైన రాముడే తనకు రక్ష సీత అని చెప్పడం, ఒప్పుకోవడం ఎంతో గొప్ప విషయం. ఆర్య ధర్మాలను, రఘువంశానికి, బాధ్యతలకు, బంధాలకు బద్దుడై అందుకు తనకు తాను ఎంత కష్టపెట్టుకున్నాడో తెలుపుతూ రాముడు బాధపడిన సందర్భాలను ఈ కథలో చాలా చక్కగా వివరించారు రచయిత్రి. ఈ భవ బంధాల నుండి పదమూడు సంవత్సరాలు విముక్తి కలిగించిందని, అందుకు కైకేయికి తను ఎంతో ఋణపడి ఉన్నానని తెలియపరిచాడు. ఇలా కైకేయిని కూడా ఉదాత్తురాలిగా రాముని నోట చెప్పించగలిగారు ఓల్గా గారు.
ఇలా రామాయణంలోని స్త్రీ పాత్రలకు జీవం పోసి నేటి కాలానికి అనువైన పరిస్థితులను కల్పించి పరిష్కార మార్గాలనూ చూపించారు. స్వార్థం లేకండా మనం అనే స్పృహతో బ్రతకాలి అని ఎంతో చక్కగా వివరించారు. మూల గ్రంథాలలోని పురాణ పాత్రలు సజీవాలుగా ఉంటూ నేటి సమాజంలోని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తూ ఆదర్శప్రాయంగా ఉంటాయనడానికి నిదర్శనంగా ”విముక్త కథలు” కనబడతాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ఈ కథల పుస్తకం మహిళా లోకానికే కాక సమస్త ప్రజానీకానికీ చక్కని మార్గాన్ని సూచించే స్నేహితులను సృష్టించింది. ఓల్గా గారి మేధస్సుకు మనస్ఫూర్తిగా శతకోటి వందనాలు.
లక్ష్యాలను ఛేదించడం, నిర్ణయాలు తీసుకోవడం, బాధ్యతలను నిర్వర్తించడం వంటి విషయాలలో ప్రతి మహిళ తన స్వశక్తితో, ఆలోచనలతో ముందుకు నడుస్తూ సాధికారతను నిరూపించుకోవాలని ఆశిద్దాం.