స్త్రీల అంశాలను చర్చించడానికి, సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేసేందుకు, మహిళలకు అవసరమైన సమాచారాన్ని అందించడానికై ఉద్దేశించబడి ప్రారంభించిన భూమిక పత్రిక తన పరిధిన మరింత విస్తరించుకుని సమస్యలలో ఉన్న స్త్రీలకు స్వాంతన కల్పించేందుకు తగిన సలహా సహకారాలను అందించే ఉద్దేశ్యంతో 18004252908 టోల్ ఫ్రీ నంబర్‌తో హెల్ప్‌లైన్ ప్రారంభించబడింది. అంతేకాక సమస్యలతో వచ్చే స్త్రీలకు సహకారాన్నందించేందుకు హైదరాబాద్‌లో 4, కరీంనగర్, విజయవాడ, రాజమండ్రిలలో ఒక్కొక్క పోలీస్‌స్టేషన్‌లలో కౌన్సిలింగ్ సపోర్టును అందిస్తున్నాము. ఇందుకు గాను ప్రతి సెంటర్‌లో శిక్షణ పొందిన కౌన్సిలర్లు ఉన్నారు.
భూమిక సంస్థ ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న సమస్యలు, కౌన్సిలింగ్ చేయడంలో కౌన్సిలర్లు ఎదుర్కొంటున్న అంశాలపై సమాచారాన్ని అందిస్తూ వారికి అవసరమైన సామర్ధ్యాలను పెంచటానికి కౌన్సిలర్లు శిక్షణలు అందిస్తున్నాము. ఇందులో భాగంగా ఈ సంవత్సరం సంస్థ తరపున పనిచేస్తున్న కౌన్సిలర్లతో పాటు మహిళల అంశాలపై పనిచేస్తూ స్త్రీలకు సహాయ సహకారాలను అందిస్తూ ఉన్న సంస్థల ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి మూడవ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో భూమిక ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించబడింది. ఇందులో భూమిక సంస్థ నుండి 20 మంది కౌన్సిలర్లు, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ సంస్థ నుండి ఒకరు, సయోధ్య సపోర్ట్ సెంటర్ నుండి నలుగురు, స్వార్డ్ స్వచ్ఛంద సంస్థ నుండి ఇద్దరు కౌన్సిలర్లు, భువనగిరి సపోర్టు సెంటర్ నుండి ఒకరు హాజరయ్యారు.
భూమిక సంస్థలో కౌన్సిలర్ల అవసరాలను గుర్తించే వీలుగా నెలవారీ సమీక్షా సమావేశాలలో కౌన్సిలర్ల నుండి వెలిబుచ్చబడినవి మరియు వారు రోజువారీ చేస్తున్న పనిలో ఎదురవుతున్న సమస్యలపై మరింత సమగ్ర సమాచారం పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ఈ శిక్షణలో శిక్షణాంశాలను చేర్చడం జరిగింది. ఈ అంశాలపై శిక్షణనందించేందుకు ఆయా అంశాలలో నిష్ణాతులైన రిసోర్స్ పర్సన్‌లను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ అంశాలు వరుసగా కౌన్సిలింగ్ కాన్సెప్ట్, కౌన్సిలింగ్ టెక్నిక్‌లు, పద్ధతులు, కౌన్సిలింగ్ నైపుణ్యాలు, కౌన్సిలర్ యొక్క పాత్ర, కౌన్సిలింగ్ నిర్వహించేటపుడు చేయకూడనివి, తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలు వంటి విషయాలకు రిసోర్స్ పర్సన్‌గా ఆ డా||వింధ్య, ప్రొఫెసర్, టాటా ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుండి వచ్చారు.
యుక్త వయస్సును అర్థం చేసుకోవడం, తల్లితండ్రుల పాత్ర, వయస్సు, బాలబాలికలు జీవన గమ్యాలను నిర్దేశించుకునేలా కౌన్సిలర్లు వారిని ఎలా ఫెసిలిటేట్ చేయాలనే విషయాలతో పాటు ఆ వయసులో శారీరకంగా, హార్మోన్లపరంగా వచ్చే మార్పులను తెలుసుకోవడం వంటి విషయాలపై సోషల్ యాక్టివిస్ట్ దేవి అవగాహన కల్పించారు. రెండవరోజు మానసిక ఆరోగ్యం, కోపాన్ని నియంత్రించుకునే టెక్నిక్‌లు వంటి అంశాలపై డా.నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
మానసిక ఆరోగ్యం, అనారోగ్యం రకాలు, వ్యాధి నివారణ, చికిత్సా పద్ధతులు, ఆత్మహత్య చేసుకోవాలనిపించే మానసిక స్థితిని అర్థం చేసుకోవడం వంటి వాటికి చేపట్టవలసిన చర్యలపై సమగ్రంగా సమాచారాన్ని డా.సునీత అందించారు. మూడవరోజు ప్రస్తుతం అంతా ఇంటర్నెట్ మయమై, సోషల్ నెట్‌వర్క్‌లతో మునిగిపోతున్న ప్రజలకు అందులో ఉన్న ముప్పు, అందుకోసం అందుబాటులో ఉన్న న్యాయ సహాయ వ్యవస్థలు, చట్టం, అందుకు లోను కాకుండా ఉండేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమాచారాన్ని నల్సార్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డా||శాంతి అందించారు.
మధ్యాహ్నం సెషన్‌లో సైక్రియాట్రిస్ట్ డా.వీరేందర్ యుక్తవయసు బాలబాలికలు, మానసిక ఆందోళనలు, భయాలు, అపోహలు, యుక్త వయసు వారితో తల్లిదండ్రుల ప్రవర్తన, వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నప్పుడు వహించవలసిన జాగ్రత్తలు వంటి విషయాల గురించి వివరించారు.
శిక్షణా కార్యక్రమాన్ని భూమిక సంస్థ వ్యవస్థాపకురాలు కొండవీటి సత్యవతి ప్రారంభిస్తూ ఈ శిక్షణ ఏర్పాటు యొక్క ఉద్దేశ్యాన్ని వివరిస్తూ కౌన్సిలర్లు మహిళల సమస్యలను వింటూ కౌన్సిలింగ్ చేసే క్రమంలో కొన్నాళ్ళు రొటీన్‌గా మారిపోతారని, ప్రతిరోజూ ఆ దుఃఖపూరిత కథనాలను, స్త్రీల వ్యథలను వినీ వినీ అలసిపోయి వారి అంశాలను క్యాజువల్‌గా తీసుకునే అవకాశముందని అన్నారు. ఇందులో మనం పోలీసులతో కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో మన కౌన్సిలర్లు కూడా కొన్నాళ్ళకు పోలీసు భాష నేర్చుకుంటారని, మాట్లాడతారని, ఈ రోజుల్లో కౌన్సిలింగ్ అనేది ప్రతి ఒక్కరితో వింటున్నామని, ఈ పదం దుర్వినియోగం అవుతోందని అన్నారు. కౌన్సిలింగ్ సక్సెస్ రేటు 80 శాతం ఉందని చాలా గొప్పగా చెబుతున్నారని, అది ఎలా అంటే ఎలాగోలా కుటుంబాలను కలిపేస్తున్నామనే భావనలో ఉన్నారని అన్నారు. స్త్రీ చాలా హింసను ఎదుర్కొంటున్నా ఆమెను మళ్ళీ అదే పరిస్థితిలోకి పంపబడడం జరుగుతోందన్నారు. తర్వాత ఆ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మరచిపోతున్నామన్నారు. ఈ శిక్షణ ద్వారా కౌన్సిలింగ్ అంటే ఏంటి? అక్కడ ఏ ఏ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలనే విషయాలను వివరంగా తెలుసుకుందామని చెప్తూ రిసోర్స్ పర్సన్‌గా వచ్చిన ప్రొఫెసర్ వింధ్య గారిని ఆహ్వానించారు. ప్రొపెసర్ వింధ్య టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సైకాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
ప్రొ.వింధ్య సెషన్‌ను ప్రారంభిస్తూ కౌన్సిలర్లుగా మీరందరూ అప్‌డేట్ అవడానికి, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. కౌన్సిలింగ్ చేసేటపుడు జెండర్ సెన్సిటివ్ నైపుణ్యం కలిగి ఉండడం చాలా ముఖ్యమని, జెండర్ అంశాలపై మన ఎడ్యుకేషన్ కరిక్యులమ్‌లో ఫోకస్ లేదని అన్నారు. జెండర్ ఆధారిత హింస గురించి, జెండర్ అసమానతలు స్త్రీలను ఏ విధంగా అణచివేతకు గురిచేస్తున్నాయనే విషయాలను విద్యార్థులకు చెప్పరు, కనుక మన కౌన్సిలింగ్ ఆ ఉద్దేశ్యంలో ఉండేలా దృష్టి పెడుతున్నామని అన్నారు. ఈ విషయాలన్నీ మీకు కొత్త కాదని, కానీ మరోసారి పునరాలోచించుకోవడానికి ఉపయోగపడతాయని ఆమె అన్నారు. కాబట్టి అందరూ శిక్షణలో ఉత్సాహంగా పాల్గొనాలని, అప్పుడే నేర్చుకునే ప్రక్రియ సులువవుతుందని అన్నారు. కౌన్సిలింగ్ నైపుణ్యాలను అర్ధం చేసుకోవడానికి గాను శిక్షణలో పాల్గొన్న వారి నుండి ఇద్దరిని ఒకరు కౌన్సిలర్‌గా, మరొకరు సర్వైవర్‌గా పాత్రలు పోషిస్తూ రోల్ ప్లే చేయాల్సిందిగా కోరారు.
పార్టిసిపెంట్స్ నుండి వెన్నెల, అప్పాయమ్మ రోల్ ప్లే చేశారు. ఆ రోల్‌ప్లేలో తాము శ్రద్ధగా గమనించిన అంశాలను టీం అందరూ షేర్ చేశారు. ఈ రోల్ ప్లేలో కౌన్సిలర్‌గా పాత్ర పోషించిన మహిళ చాలా చక్కగా కౌన్సిలింగ్ నిర్వహించారని, సర్వైవర్‌ను చాలా కూల్‌గా, కామ్‌గా రిసీవ్ చేసుకున్నారని, ఆమె చెప్తున్న విషయాలను చాలా శ్రద్ధగా విన్నారని, దాంతోపాటు ఆమెకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, ధైర్యాన్ని అందించారని వారందరూ తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. తర్వాత ప్రొ.వింధ్య సర్వైవర్‌గా పాత్ర పోషించిన అప్పాయమ్మను ఆమె అభిప్రాయాన్ని చెప్పమని అడుగగా కౌన్సిలర్ శ్రద్ధగా విన్నందుకు తనకి చాలా నమ్మకం, భరోసా కలిగిందని అన్నారు.
ప్రొ.వింధ్య మాట్లాడుతూ – మన దగ్గరకు ఎన్నో ఇబ్బందులలో వచ్చే వ్యక్తులకు నమ్మకం ఇవ్వడం చాలా ముఖ్యమని, అలాగే సర్వైవర్ యొక్క పరిస్థితిని బట్టి మనం సూచించే విషయాల ప్రాధాన్యతా క్రమం చాలా అవసరమని అన్నారు. దెబ్బలతో ఇబ్బంది పడే వ్యక్తికి ముందు మెడికల్ ట్రీట్‌మెంట్ అవసరమని, ఆ విధంగా ప్రయారిటీస్‌ను గుర్తించగలగాలని అన్నారు. సర్వైవర్ తన సమస్యను వివరిస్తున్నప్పుడు కౌన్సిలర్ దృష్టి పూర్తిగా సర్వైవర్‌పైనే ఉండాలని, అది చాలా ముఖ్యమని చెప్తూ కౌన్సిలింగ్‌లో రెండు అంశాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలన్నారు.
1) ఎంఫతి: సర్వైవర్ సమస్యను మన సమస్యగా భావించడం.
2) సింపతి : జాలి పడడం.
ఇక్కడ మనం జాలిపడనక్కరలేదు. మన కౌన్సిలింగ్‌లో సింపతీ అక్కర్లేదు, వారి స మస్యను మన సమస్యగా భావించడం అవసరం, ఎంపతిలో వారిని నిందించడమనేది ఉండదు. ఇన్నాళ్ళు అతనితో ఎలా ఉన్నావు? ఎప్పుడో విడిపోవాల్సింది? అని మాట్లాడితే ఆమెను నిందించినట్లు చేసినట్లు అవుతుంది. కౌన్సిలింగ్ కోసం వచ్చిన సర్వైవర్‌ను వారు చెప్పిన విషయాలు గోప్యంగా ఉంచుతామనే నమ్మకాన్ని అందించాలి. ఆమె సమస్యను నిర్భయంగా చెప్పుకోవచ్చనే ధైర్యాన్ని ఇవ్వాలి. కౌన్సిలింగ్‌లో ఎంపతి (సహానుభూతి) ఒప్పుదల, నమ్మకం అనే అంశాలపై సంబంధం నిలబడుతుంది. కౌన్సిలింగ్‌లో ముఖ్యంగా సమస్య నుండి బయటపడడానికి కావలసిన సహాయాన్ని అందించడమే ముఖ్య ఉద్దేశ్యంగా ఉండాలి.
క్లారిటి ఆఫ్ థాట్ ః సమస్యలతో నిండి ఉన్న మనస్సుకు సమస్య పట్ల స్పష్టత ఉండదు. కౌన్సిలర్ ప్రాధాన్యతలను ఎంచుకోగలిగేలా స్పష్టతనివ్వాలి.
Decision making: సమస్యను ఎదుర్కోవడానికి ఉన్న అంశాలను గుర్తించి సరైన నిర్ణయం తీసుకునేలా ఆలోచన ఇవ్వాలి.
ఈ కౌన్సిలింగ్ ద్వారా సర్వైవర్‌కు మనసు తేలిక అవ్వాలి. భారం తీరినట్లు అన్పించాలి. ఏ ఏ సపోర్టు సిస్టమ్స్
ఉన్నాయనే భావన, భరోసా కల్గించడం చాలా అవసరం.
కౌన్సిలింగ్ నైపుణ్యాలు :
కౌన్సిలింగ్ అనేది ఒక నైపుణ్యం. నేర్చుకుంటే అలవడుతుంది. కౌన్సిలింగ్‌లో ముఖ్యమైన, అతి ప్రాధాన్యమైన విషయం వినే నైపుణ్యం ఉండడం. సర్వైవర్ చెప్పే మాటలను శ్రద్ధగా వినడం, ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. అంతేకాక శరీర భాష చాలా ముఖ్యం. మొఖంలో expressions ముఖ్యం.
Reflecting feelings: సర్వైవర్ చెప్తున్న విషయాలు, అందులోని తీవ్రతను అర్థం చేసుకుంటున్నామనే భావన కల్పించడం అవసరం. సర్వైవర్ సమస్య అంతా చెప్పాక ఆమె సమస్య మనకు అర్థమవుతోందని ఆమెకు అర్థమయ్యేలా చెప్పడం చాలా అవసరం. ఈ సందర్భంలో సర్వైవర్ తాను చెప్పింది అది కాదని చెప్పిందంటే మనం ఆమె చెప్పిన విషయాన్ని శ్రద్ధగా వినలేదని అర్థం.
లోతుగా సమాచారాన్ని పొందే నైపుణ్యం ః ప్రశ్నలు వేయడం ద్వారా లోతుగా సమాధానం పొందాలి. సమస్యపై స్పష్టత కోసం మధ్య మధ్యలో ప్రశ్నలు అడగాలి. సమస్య తీవ్రతను బట్టి తనకు పరిష్కారాలు అందించవచ్చు. సర్వైవర్ ఆత్మహత్య చేసుకునే రిస్కులో ఉన్నప్పుడు గోప్యత పాటించడం సరికాదు.
Open ended questions వేయడం ద్వారా సర్వైవర్ స్పష్టంగా తన సమస్యను చెప్పగలిగేలా, మాట్లాడగలిగేలా అవకాశమివ్వాలి. అంతేకానీ పోలీసుల్లాగా closed ended questions వేయకుండా వాళ్ళ సమస్యను వాళ్ళు ఫ్రీగా చెప్పుకునేలా ఉండాలి. ఎందుకు అనే ప్రశ్నలను వేయకూడదు.
కౌన్సిలర్ కౌన్సిలింగ్ చేసేటపుడు ఉపయోగించవలసిన కమ్యూనికేషన్ పద్ధతులు ః
1. స్పర్శ 2. కూర్చునే భంగిమ 3. చేతుల కదలికలు 4. కంటిచూపు 5. ముఖ కవళికలు
కంటిచూపు : కౌన్సిలర్ సర్వైవర్ వైపు చూడకుండా కళ్ళు దించుకుంటే కేసు వినడంలేదు, శ్రద్ధ లేదు, ఇష్టం లేదని అర్థం. కౌన్సిలర్ సర్వైవర్ వైపు చూస్తూ వినడం వలన సర్వైవర్‌కు భరోసా కలుగుతుంది.
ముఖ కవళికలు : ముఖంలో సున్నితత్వం, సహానుభూతి కన్పించాలి. సమస్యను సర్వైవర్ వైపు నుండి అర్థం చేసుకోవాలి.
చేతుల కదలికలు : చేతుల కదలికల ద్వారా అవతలివారు వింటున్నారనే భావన కల్పించాలి.
కూర్చునే భంగిమ : ముందుకు వంగి కూర్చోవడం వల్ల నువ్వు వినడానికి శ్రద్ధ చూపుతున్నావని అర్థం.
స్పర్శ : చాలా ముఖ్యం. పరామర్శలో ఒక్కోసారి మాటలుండవు. చేయి పట్టుకోవడం ద్వారా వారికి స్వాంతన కల్గించడం ఒక్కోసారి సర్వైవర్‌కు చాలా అవసరం.
సర్వైవర్‌కి కౌన్సిలర్ మాటల ద్వారా 7 శాతం నమ్మకం కల్గితే, శరీర కదలికలు, ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు, కూర్చునే భంగిమ, చేతుల కదలికల ద్వారా 55 శాతం నమ్మకం కలుగుతుందని, మన మాటలలోని తీవ్రతను బట్టి 38 శాతం నమ్మకం కలుగుతుందని సైంటిఫిక్‌గా రుజువైంది.
మనం ఎదుటివారి గొంతు, సౌండ్, శరీర కదలికలను బట్టి ఒక అభిప్రాయానికి వస్తాం. కనుక ఈ విషయాలపై కౌన్సిలర్ దృష్టి పెట్టాలి. పోలీస్‌స్టేషన్‌లో పనిచేసేవాళ్ళు మరీ ముఖ్యంగా వారికి, మనకు ఈ తేడా ఉండేలా చూసుకోవాలి. కౌన్సిలింగ్‌లో అధికారానికి చోటు లేదు. సర్వైవర్, కౌన్సిలర్ మధ్య సమ సంబంధం ఉండాలి. ఇద్దరూ సమానులే అనే భావన చాలా ముఖ్యం. అంతేకాక కూర్చున్నప్పుడు చేతులు కట్టుకుని కూర్చుంటే నువ్వు ఏం చెప్పినా నాకు ఎక్కదు అని అర్థం. అటెన్షన్‌లో ఉండాలి. లేకపోతే వీళ్ళకు చెప్తే వింటారో లేదో, ఉపయోగం ఉంటుందో లేదో అనే అపనమ్మకం సర్వైవర్‌కు వచ్చే అవకాశం ఉంది.
కౌన్సిలింగ్ చేసేటప్పుడు హింసకు గురైన వారిని నిందించడం, సర్దుకుపోవాలని సూచించడం, సర్వైవర్ చెప్పిన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం సాధారణంగా జరుగుతుంది. కానీ కౌన్సిలింగ్ జెండర్ సున్నితత్వంతో కూడినదై ఉండాలి. కానీ చాలాసార్లు జరిగిన హింసకు కారణం ఆ స్త్రీనే అనే భావన ఉంటుంది. పితృస్వామ్య భావజాలం కౌన్సిలింగ్ చేసేవారిలో ఉండకూడదు. సర్వైవర్‌కు
ఉన్న హక్కులు, అవకాశాలు, ప్రత్యామ్నాయాల గురించి వివరించాలి.
మనం కౌన్సిలర్‌గా ఆమెను ఫెసిలిటేట్ చెయ్యాలి తప్ప తన తరపున నిర్ణయంచేయరాదు.
హింస అనేది నిరంతరం స్త్రీలపై జరిగే ప్రక్రియ. ఇదొక మానసిక హింసగా అనేది అర్థం చేసుకోవాలి. కేసు గురించి అన్నీ స్పష్టంగా తెలుసుకున్నాకే ఆమె భర్తను పిలవాలి. ఇరువురితో కలిపి మీటింగ్ పెట్టడానికి ముందే మన మనసులో ఒక ఉద్దేశ్యం ఉండాలి. హింస జరగడం అనేది రాజీపడకూడని అంశంగా అర్థం చేసుకోవాలి.
కౌన్సిలింగ్‌లో పాటించవలసిన గైడ్‌లైన్స్ – ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినవి ః
సహానుభూతితో వినడం (Empathetic listening)
1 Non Judicial attitude
2 Privacy
3 Confidentiality
4 Link to other services
WHO వారు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను వివరిస్తూ ప్రొ.వింధ్య సెషన్‌ను ముగించారు.
తర్వాత యుక్తవయసు బాలబాలికలు మరియు యుక్త వయసును అర్థం చేసుకోవడం వంటి అంశాలపై వివరించడానికి రిసోర్స్ పర్సన్‌గా దేవి వ్యవహరించారు.
యుక్త వయసు అనేది ఒక కష్టతరమైన వయసు. పిల్లలతనంలోంచి పెద్దతనంలోకి మారే దశ. వారిలో పిల్లల లక్షణాలు, పెద్దలు చేసే పనులు చేయాలనే కుతూహలం, పెద్ద తనంలోకి మారే దశలో. పిల్లలు పెద్దలను ఎదిరించడం, పెద్దలు పిల్లల పట్ల ఆందోళన చెందడం చాలా సాధారణంగా జరిగే విషయం. యుక్తవయసు పిల్లల గురించి మనం మాట్లాడుతున్నామంటే వారి దృష్టి కోణం ఎలా ఉంటుంది అనేది చూడాలి. మీరు తీర్పు ఇచ్చేవారిలా ఉండొద్దు.
(Respect) గౌరవంకు, (Obedience) విధేయతకు మన పెద్దలకు ఉన్న తేడా తెలియదు. మేం చెప్పినదంతా పిల్లలు ఒప్పుకోవాలి, మాకే అంతా తెలుసు, పిల్లలు ఏమీ నిర్ణయించుకోలేని వాళ్ళు అనే ఆలోచనలో ఉంటాము. ఇంకోవైపు పిల్లలకు పెద్దవాళ్ళు పురాతనమైన
వాళ్ళుగా కన్పిస్తారు. శరీరంలో హార్మోన్లు 11 సం|| నుంచి పనిచేయడం ప్రారంభిస్తాయి. తమ అస్తిత్వం మరియు గుర్తింపును గురించిన ప్రశ్నలు వారిలో ఎక్కువగా ఉంటాయి. తమ శరీరం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.
కౌన్సిలర్లు యుక్తవయసు వారి భావాల పట్ల గౌరవం కలిగి ఉండాలి. పెద్దవారు తమ భర్తల పట్ల ఎంత సీరియస్‌గా ప్రేమను కలిగి ఉంటారో, వాళ్ళు కూడా తమ ప్రేమల పట్ల అంతే సీరియస్‌గా ఉంటారు. కానీ మనం వాళ్ళ ప్రేమను తీసి పడేస్తాం. యుక్తవయసు వారితో పనిచేసేటప్పుడు వారి కుటుంబ నేపథ్యం చూడాలి. ఒక వయసులో ఉన్న అమ్మాయి వయసులో తనకంటే పెద్ద వ్యక్తిని ఇష్టపడుతుంటే దానికి కారణం ఆమెకు ఇంట్లో fatherly figure లేకపోవడం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు. కాబట్టి వారి భావోద్వేగాలను కౌన్సిలర్లు అర్థం చేసుకుని గౌరవించాలి.
పెరుగుతున్న క్రమంలో మగపిల్లలకు వాళ్ళ శరీరాల పట్ల అనేక సందిగ్ధాలు ఉంటాయి. రిలేషన్స్ పట్ల అనుమానాలు ఉంటాయి. సెక్స్, ప్రేమ పట్ల చాలా స్పష్టమైన అభిప్రాయాలుంటాయి. కాబట్టి వారికి నీతులు చెప్పకుండా ఆ వయసులో వాళ్ళకుండే గందర గోళాలను కౌన్సిలర్లు అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉండాలి.
బాగా కట్టుబాట్లు ఉన్న మధ్యతరగతి, ఉన్నత తరగతి కుటుంబాలలో సెక్సువాలిటీని విపరీతంగా అణచివేస్తారు. దిగువ తరగతి కుటుంబాలలో ఆడపిల్లలపై లైంగిక దాడి జరిగితే పంచాయతీలలో పెడతారు లేదా బయటకు రానివ్వరు. అంతేకానీ ఎక్కడా ట్రామా కౌన్సిలింగ్ జరగడంలేదు. కౌన్సిలర్ కేసు తీవ్రతను బట్టి ఒకవేళ ఒప్పందాలతో కూడిన లైంగిక సంబందం అయినా కూడా తప్పనిసరిగా సైకాలజిస్టుకు రిఫర్ చేయాలి. అంతేకానీ మనం తీర్పులు ఇవ్వకూడదు. మోరల్ జడ్జిమెంట్స్ ఇవ్వకూడదు. టీనేజ్‌లో ఎక్కువ మందికి సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల అవగాహన లేదు. WHO ప్రకారం సెక్స్ ఎడ్యుకేషన్ తెలియని వాళ్ళు సెక్స్ సంబంధాలకు ఎక్కువగా వెళ్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు చాలా తక్కువమంది వెళ్తున్నారు. సమాజం పెళ్ళికి ముందు సెక్స్ సంబంధాల్లోకి వెళ్ళడాన్ని తప్పుగా చూడడం వల్ల కూడా ఆడపిల్లలు సంబంధాల నుండి బయటకు రావడానికి ఇష్టపడరు. సమాజం ఏదైతే నేర్పిస్తుందో అదే పాటిస్తుంటారు. యుక్తవయసు బాలబాలికలకు శీలం అంటే సెక్స్ కాదు, ప్రవర్తన అనే అవగాహన కల్పించాలి. నీతి బోధలు చేయడం మానేసి యుక్తవయసు పిల్లలను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి. శీలం యొక్క విలువ ఏ కాలంలోనూ ఒకే రకంగా ఉండదు.
ఆడ, మగ మధ్య సమానమైన సంబంధాలు లేని ఇప్పటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రేమలు, సంబంధాల వలన ఆడపిల్లలే ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇద్దరికీ శారీరక సంబంధం ఏర్పడక ముందు మన కౌన్సిలింగ్‌కు వస్తే మీ శరీరాన్ని మీరు గౌరవించుకోండి అని వారికి తెలియచెప్పాలి. ప్రేమ సంబంధాలు శారీరక సంబంధాలుగా మారడం ఎంత వరకు సరైనది, ఆ అమ్మాయి, అబ్బాయికి సెక్స్ గురించి ఏం జ్ఞానం ఉంది? ఆ వయసులో పిల్లలకు రంగుల కళ్ళద్దాలు ఉంటాయి. ఆకర్షణ, ఆరాధనా భావం ఉంటుంది. ఇలాంటి సంబంధాలలో సమాజం ఆడపిల్లనే తప్పుబడుతుంది. అవతలి వ్యక్తి కూడా ఎవరికీ ఈ విషయం చెప్పవద్దని, వారు నిన్నే తప్పుగా చూస్తారని భయపెడతాడు. దాంతో ఆడపిల్లలు అపరాధ భావంలోకి వెళ్ళిపోతారు. అలాంటి సందర్భాలలో కౌన్సిలర్‌గా మనం ఇందులో నీ తప్పు లేదు, నువ్వు చిన్నపిల్లవు, నిన్ను అతను అలా చేయడం అతనిదే తప్పు అని ధైర్యాన్ని ఇవ్వాలి. లేదా వారు జీవితాంతం ట్రామాకు గురవుతారు. కాబట్టి కౌన్సిలర్‌గా ధైర్యాన్ని అందించడం, అవగాహన కల్పించడం మన బాధ్యత.
ఆడపిల్లల మీద జరిగే లైంగిక దాడిలో తెలియని వ్యక్తులు 5 శాతం మాత్రమే కారణమైతే 95 శాతం తెలిసిన వ్యక్తులే లైంగిక దాడులకు, వేధింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి పిల్లలకు లైంగిక విషయాల పట్ల అవగాహన కల్పించడం పెద్దల బాధ్యత అని చెప్తూ దేవి సెషన్‌ను ముగించారు.
రెండవ రోజు సెషన్‌ను పూర్తిగా మానసిక భావోద్వేగాలు, మానసికాంశాలపైనే ఇద్దరు రిసోర్స్ పర్సన్సు శిక్షణను అందించారు.
మొదటి సెషన్‌ను సీనియర్ సైకాలజిస్ట్/సైక్రియాట్రిస్ట్ డా.నిరంజన్ రెడ్డి ప్రారంభిస్తూ కోపాన్ని నియంత్రించుకోవడం అనే అంశం గురించి తెలియచేశారు. ఒక మనిషి తనకు ఒక సమస్య ఉంది, నార్మల్‌గా లేను, తనలో లోపాలున్నాయి అనుకుంటే సమస్యను, లోపాలను జయిస్తాను అనే ఆలోచనను కౌన్సిలర్ వాళ్ళ మనసులో నాటాలి. కోపతాపాలు మనుష్యులకు ఎక్కువగా ఉంటాయి. కోపతోపాలను నార్మల్, అబ్‌నార్మల్ అని వాటి తీవ్రతను బట్టి చెప్పవచ్చు. పరిస్థితికి తగ్గట్లు ఎమోషన్ ఉంటే అది నార్మల్. సిట్యుయేషన్‌కు తగ్గట్టు ఎమోషన్ ఉంటే అదీ నార్మలే. కోపతాపాలు అసలు లేవంటే అది నార్మల్ కాదు. కోపతాపాలు మనసులో పెట్టుకొని ఎక్స్‌ప్రెస్ చేయకపోతే శరీరం తీవ్రంగా స్పందించి సైకోసొమాటిక్ వ్యాధులు, శారీరక వ్యాధులైన బిపి, తలనొప్పి, చర్మవ్యాధులు వస్తాయి.
ఒక మనిషి లోపాలను, తప్పులను ఎత్తి చూపడం వలన లాభం లేదు. వారి లోపల వ్యాకులత సృష్టించినట్లవుతుంది. వారిలో న్యూనతా భావాలను ఎక్కువ చేసిన వారిమి అవుతాము. కానీ మనిషిని పొగిడితే కోపం రాదు. విమర్శ వల్ల కోపం వస్తుంది. ఆయా వ్యక్తులకు ఈ విషయాలు వివరిస్తూ ఏ ఏ కారణాల వల్ల కోపం వస్తుందో చెప్తాం. కౌన్సిలింగ్ హ్యూమనిస్టిక్ ఫిలాసఫీ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషికి నిర్ణయించుకునే హక్కు, అధికారం ఉన్నాయి. అయితే కోపాగ్నికి సంబంధించిన కారణాలు తెలుసుకుని అతను/ఆమె ఆలోచనా విధానంలో మార్పు రావాలి. మన ఆలోచనలే అన్నింటికీ కారణం. ఆలోచనల్లో మార్పు వస్తే కోపతాపాలు రావు. భయాలు తగ్గుతాయి. కౌన్సిలింగ్‌కు వచ్చిన వ్యక్తులకు నీకు కోపం ఎప్పుడు వస్తుందో చెప్పమని అడిగినప్పుడు – నా మాట విననప్పుడు, నచ్చినవి జరగనప్పుడు, ఆశించినవి రానప్పుడు అని చెప్తే సద్విమర్శ వలన వచ్చే లాభనష్టాలు, కోపం వలన వచ్చే నష్టం గురించి చెప్పాలి. ఇక్కడ విమర్శ రెండు రకాలు – 1. పాజిటివ్ క్రిటిసిజమ్, 2. నెగిటివ్ క్రిటిసిజమ్.
1. పాజిటివ్ క్రిటిసిజమ్ ః వ్యక్తిలోని మంచిని ఎత్తి చూపడం వలన వారిలో మార్పునకు దోహదం చేసేది, మంచి గుణాలు గుర్తించేది.
2. నెగటివ్ క్రిటిసిజమ్ ః వ్యక్తి ప్రవర్తన, చేతి రాత, డ్రెస్సింగ్ బాగున్నా అవతలి వ్యక్తిని చెత్తగా ఉన్నావని విమర్శించడం. మనుష్యులు సాధారణంగా తప్పు పట్టినప్పుడు బాధపడతాం, పొగిడినప్పుడు సంతోషపడతాం. మన రిమోట్ మన చేతిలో లేదు. మన రిమోట్ పక్కవారి చేతిలో ఉంది. దాంతో మనం ప్రతిదానికీ బాధపడతాం, కానీ మన భావోద్వేగాలు మన కంట్రోల్‌లో ఉండాలి. పొగడ్తకి పొంగి విమర్శకి క్రుంగిపోకూడదని క్లయింట్‌కి అర్థం చేయించి వారి ఆలోచనా విధానంలో మార్పు తేవాలి. కోపం వచ్చినపుడు మన ఫీలింగ్స్‌పై నియంత్రణ కోల్పోతాం. అప్పుడు శ్వాస తీసుకొని వదలడంతో మార్పు వస్తుంది. వణుకు వస్తుంది. కౌన్సిలర్ క్లయింట్ కోపంతో ఉన్నప్పుడు వారి తత్వాన్ని అంచనా వేసుకోవడం ముఖ్యం. వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే మాట్లాడాలి. క్లయింట్ గొంతు స్థాయికి మన గొంతు స్థాయి ఉండాలి. కోపం వచ్చినప్పుడు మన లోపల జరిగే మార్పుల మీద దృష్టి పెట్టినపుడు మనకు కోపం తగ్గుతుంది-జోసఫ్ ఉల్ఫే. ఒక ఉద్రేకం ఉన్నప్పుడు ఆపోజిట్ ఉద్రేకం ఉండదు. సంతోషం ఉంటే బాధ ఉండదు. కాబట్టి కోపం తగ్గించడానికి కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్‌ను క్లయింట్‌కు వివరించాలి. ప్రతివారికీ వాళ్ళ సమస్యలను తగ్గించుకునే అవకాశం, హక్కు, సామర్ధ్యం ఉంటాయి. కానీ మనిషి కోపంతోఉన్నప్పుడు ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. కౌన్సిలర్ దగ్గరికి వస్తే పరిస్థితిని అర్థం చేయిస్తారు. వారి సమస్యను వారే పరిష్కరించుకునే శక్తి కలుగచేస్తుంది. క్లయింటుతో పరిచయం పెంచుకోవడం అవసరం. దీనికి ప్రైమరీ ఎంపతీ చాలా ముఖ్యం. వారికి ఎమోషనల్ సపోర్టునివ్వాలి. దానిద్వారా క్లయింట్‌కు తాను ఏమి చెప్పినా కౌన్సిలర్ అర్థం చేసుకుంటుందనే అవగాహన కలిగి ఉండడానికి అవకాశముంటుందని చెప్తూ నిరంజన్ రెడ్డి గారు సెషన్ ముగించారు.
తరువాతి సెషన్‌లో మానసిక, శారీరక ఆరోగ్యం గురించి తన సొంత అనుభవాన్ని వివరిస్తూ సెషన్‌ను ప్రారంభించారు డా.సునీత. సునీత సైక్రియాట్రిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడం అంటే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం. ఒక సర్వే ప్రకారం ప్రతి ఐదుగురిలో ఒకరికి మానసిక రుగ్మత ఉందని వెల్లడైందని చెప్పారు.
ప్రస్తుత కాలంలో ఇంటి పని, పిల్లల పోషణ, ఉద్యోగ నిర్వహణ స్త్రీల బాధ్యతగా మారింది. స్త్రీలు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. దీని ద్వారా స్త్రీల మనసు మీద ఒత్తిడి పడుతోంది. తద్వారా మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి మొదలైన వివక్ష స్కూలు, కాలేజీ వరకు కొనసాగి తర్వాత పనిచేసే చోటు వరకు కొనసాగుతుంది. దీనిద్వారా మానసిక రుగ్మతకు గురవుతున్నారు. మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే డిప్రెషన్, తీవ్ర అశాంతి, నిరాశకు లోనవడం వలన మానసిక అనారోగ్యం వస్తుంది. అదీకాక బ్రెయిన్‌లో న్యూరోమీటర్స్ సరిగ్గా పనిచేయక బ్రెయిన్‌లో రసాయనిక మార్పులు చోటు చేసుకోవడం వలన మానసిక రుగ్మత వస్తుంది. దీనిద్వారా మెదడు ఆరు విధులను సరిగ్గా నిర్వర్తించలేదు. అవి ఆలోచన, దృక్పథం, భావోద్వేగాలు, ప్రమాదాలు పసిగట్టడంలో జాప్యం, భౌతిక రూపంలో, ప్రవర్తనలో మార్పు.
మానసిక రుగ్మత లక్షణాలుగా వారి ఆలోచనా విధానంలో తేడాలు, ఏ విషయలోనూ శ్రద్ధ చూపలేకపోవడం, ఎక్కువగా నవ్వడం, ఎక్కువగా బాధపడడం మరియు నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటివి గమనించవచ్చు. మన దగ్గరకు వచ్చిన క్లయింట్‌లో ఈ లక్షణాలను గమనించినట్లయితే కౌన్సిలర్ సైక్రియాట్రిస్టుకు రిఫర్ చేయాలి. మనుషులలో ఒత్తిడి కారణంగా మానసిక రుగ్మత అనేది అరుదుగా వస్తుంది. ఈ రుగ్మతలు బాల్యంలో మొదలై టీనేజ్‌లో ఎక్కువవుతాయి. తాగుబోతు తండ్రులు, కుటుంబ హింస ఎక్కువగా ఉన్న కుటుంబాలలోని పిల్లలకు ఈ అనారోగ్యం వస్తుంది.
వివిధ రకాల మానసిక వ్యాధులు ః
1. డిప్రెషన్ ః ఒక్కొక్కసారి డిప్రెషన్ తీవ్రమై మానియక్‌గా మారవచ్చు. సైలెంట్‌గా ఉండి తమకు తామే హాని కలిగించుకోవచ్చు.
2. స్క్రిజోఫ్రేనియా ః ఈ వ్యాధిలో రోగిలో భ్రమలు కలుగుతాయి. ఇందులో 18 లక్షణాలుంటాయి. అసాధారణ ప్రవర్తన
ఉంటుంది.
3. Bipolar: రోగులు రెండు విరుద్ధమైన పరిస్థితుల్లో ఉంటారు. తీవ్రమైన బాధ, తీవ్రమైన సంతోషంలో ఉంటారు. ఈ స్థితిలోని వ్యక్తులు భార్యను చంపే పరిస్థితుల్లో ఉంటారు.
4. Panic Disorder: తీవ్రమైన యాంగ్జయిటీ, ఆవేదన స్త్రీలలో పానిక్ అటాక్స్‌కి కారణమవుతుంది.
5. ఆబ్సెసివ్ కంపల్సరీ డిసార్డర్ (OCD) ః ఒకే రకమైన ఆలోచనలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. చేసిందే పదే పదే చేయడం జరుగుతుంది. వీరు దీర్ఘకాలం మందులు వాడాల్సి ఉంటుంది.
6. తినడానికి సంబంధించిన సమస్యలు ః ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా స్వీట్స్ తింటుంటారు. ఫలితంగా యాంగ్జయిటీకి గురవుతారు.
7. వ్యసనాలు : త్రాగుడు, గుట్కా, డ్రగ్స్.. ఈ వ్యసనాల వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
వివిధ రకాల మానసిక రుగ్మతలు కలిగిన స్త్రీలు కౌన్సిలర్ దగ్గరికి వచ్చినపుడు జాగ్రత్తగా ఆలోచించి, వారి లక్షణాలను శ్రద్ధగా గమనించాలి. వారికి ట్రీట్‌మెంట్ ఇప్పించడం ద్వారా వ్యాధి నయమవుతుందని వారి కుటుంబ సభ్యులకు చెప్పాలి.
మానసిక రుగ్మత అనేది పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ వస్తాయి. మందులు తీసుకుని కౌన్సిలింగ్ సెషన్‌కి వెళ్తే నార్మల్ అవ్వచ్చు. అలాగే చికిత్స కూడా ఉంది.
మానసిక రుగ్మతలను నిరోధించడానికి/నివారించడానికి కొన్ని టెక్నిక్స్ ః
1. Problem solving Techniques
2. Life skill Approach
3. Destressing Exercise
4. Good inter person Relationship
5. Good Parenting Skills
మానసిక రుగ్మతలు కలిగిన రోగులు తమ దగ్గరకు వచ్చినపుడు కౌన్సిలర్లకు పై టెక్నిక్స్‌ను నేర్పించాలి. అంతేకాక సమస్యాత్మక అంశాలను గుర్తించి, సమస్యలను నివారించడానికి ఉన్న ప్రాథమిక అంశాలను గుర్తించాలి. సమస్యను త్వరగా గుర్తించి చికిత్సను అందించాలి. అలాగే కుటుంబ సభ్యుల అండదండలు చాలా అవసరం.
సమస్యా నివారణకు మార్గాలు ః
కుటుంబ అండ, కౌన్సిలింగ్, డి.అడిక్షన్, దీర్ఘకాలిక చికిత్సకు సంబంధించిన నియమాలకు కట్టుబడి ఉండడం, ఈ రోగులకు వివిధ రకాలైన రిహాబిలిటేషన్ పద్ధతులు, సౌకర్యాలు అందించడం ద్వారా చికిత్స అందించవచ్చు. చికిత్స మధ్యలో ఆపకూడదు. ఈ కేసులకు ఫాలో అప్ తప్పనిసరి.
ఈ కేసుల తాలూకు ప్రభావం కౌన్సిలర్ల యొక్క మానసిక స్థితిపై పడుతుంది. వారు డిప్రెషన్‌కు, నిరాశకు గురవ్వచ్చు కాబట్టి మెడిటేషన్, ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. చిన్న చిన్న రిక్రియేషన్ యాక్టివిటీస్ చేయాలి. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి అని చెప్తూ డా.సునీత ఆత్మహత్య అనే అంశం గురించి మాట్లాడుతూ
ఉద్దేశ్యపూర్వకంగా మనిషి తనను తాను అంతం చేసుకోవడాన్ని సూసైడ్ అనవచ్చు అన్నారు. 15-44 సంవత్సరాల వయసు వారిలో 45 శాతం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 45 శాతం మంది వయసు పైబడడం, కాన్సర్ డిటెక్ట్ కావడం వల్ల డిప్రెషన్‌తో చనిపోతున్నారు. ఈ కేసులు కౌన్సిలర్ దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. తగిన సలహాలు సూచనలు చేయాలి అని వివరిస్తూ సెప్టెంబరు 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినం అని చెప్పి డా.సునీత సెషన్‌ను ముగించారు.
మూడవరోజు ఉదయం సెషన్‌ను నల్సార్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డా.శాంతి ప్రారంభిస్తూ ప్రస్తుతం అంతా టెక్నాలజీ మయమైన సందర్భంలో చాలా నేరాలు కూడా పెరిగాయి. ఇంటర్నెట్ మోసాలు పెరిగాయి. మన ప్రమేయం లేకుండానే దోపిడీ జరిగిపోతోంది. ఎందుకు ఆడవాళ్ళ మీద ప్రపంచవ్యాప్తంగా నేరాలు జరుగుతున్నాయి. ప్రతి సమాజంలో ఆడవాళ్ళపై వివక్ష ఉంది. ఒక అమ్మాయి మీద జరిగే అత్యాచారాలు తమ ఆధిపత్యం నిరూపించుకోవడం కోసం జరుగుతున్నాయి. ఆమె తండ్రి, భర్త, కులం, సొసైటీని అవమానపరచడానికే ఆమెపై అత్యాచారం చేస్తారు. అబ్బాయిలను చంపుతారు, అమ్మాయిలను రేప్ చేస్తారు. స్త్రీలపై పలు ప్రాంతలలో రకరకాల రూపాలలో హింస జరుగుతూనే ఉంది. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ స్త్రీలపై జరిగే హింస, జరుగుతున్న మోసాలు రూపాలు మారుతూనే ఉన్నాయి. ఇందుకు గాను మన దేశంలో చాలా చట్టాలున్నప్పటికీ అమల్లో చాలా లోపాలున్నాయి. 2000 సం||లో మన దేశంలో ఐటి యాక్ట్ వచ్చింది. 2008లో కొన్ని సైబర్ క్రైమ్స్ జరిగాయి. ప్రస్తుతం వేలల్లో జరుగుతున్నాయి.
ఈ-మెయిల్ ద్వారా జరిగే మోసాలు, ఆన్‌లైన్ షాపింగ్‌ల ద్వారా జరిగే మోసాలను గురించి మాట్లాడుతూ ఇండియన్ పీనల్ కోడ్ లో చీటింగ్ కేసు బుక్ చేసుకోవచ్చు. మనిషి చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేయాలో తెలుసుకున్నంతగా చట్టాన్ని సద్వినియోగం చేసుకోవడానికి చూడట్లేదు. సైబర్ క్రైమ్‌లో అవతల ఎవరినైనా, దేన్నయినా పెట్టి మిమ్మల్ని మోసం చేయవచ్చు. పోలీసులకు కూడా వారిని పట్టుపకోవడం చాలా కష్టం. మనందరం సైబర్ మాయాజాలంలో పడి కొట్టుకుంటున్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నెట్ అనేది అమెరికా నుంచి రన్ అవుతుంది. Internet Corporation for Assigned names ద్వారా నిర్వహించబడుతుంది.
మోసగాళ్ళు మన లాప్‌ట్యాప్, మొబైల్ ఫోన్‌లలోకి వెళ్ళి ఏ సమాచారం అయినా తీసుకోవచ్చు. కొన్ని సాఫ్ట్‌వేర్‌ల ద్వారా సర్వర్‌కి లింక్ అయ్యి సమాచారాన్ని తీసుకుంటారు. రకరకాల వైరస్‌ల ద్వారా కంప్యూటర్‌లు పాడైపోతుంటాయి. కాబట్టి ఏదీ ఉచితంగా వస్తుందని డౌన్‌లోడ్ చేయకూడదు. అలాగే బ్యాంకు ఖాతాకి సంబంధించిన పాస్‌వర్డ్ తీసుకుని బ్యాంకు ఖాతాలలోని డబ్బును వారి అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు.
ప్రేమికులు సన్నిహితంగా ఉన్న వీడియోలు, భార్యాభర్తలు సన్నిహితంగా ఉన్న పడకగది దృశ్యాలనున వీడియో తీసుకున్న వాటిని తస్కరించి ఇంటర్‌నెట్‌లో పెట్టడం వంటివి జరుగుతున్నాయి. వినియోగదారులను చేసే మోసాలు కూడా చాలా పెరిగాయి. ఐటి యాక్ట్ ప్రకారం ఈ మోసాలపై ఛాలెంజ్ చేస్తూ కోర్టులో కేసు వేయవచ్చు. మన న్యాయ వ్వవస్థలో మన లాయర్లకు, జడ్జిలకు, ప్రాసిక్యూటర్లకు కూడా సైబర్ లా మీద అవగాహన లేదు.
వాయురిజం ః (సెక్సువల్) లైంగిక అవయవాలను ఇంకొకరికి ఉద్దేశ్యపూర్వకంగా చూపించడం ఒక అఫెన్స్.
సాఫ్ట్‌వేర్ ద్వారా మీ మొబైల్‌లోకి ఎంటర్ అయి డాటా మొత్తం తీసుకోవడం వంటివి. ఒకప్పుడు బాత్‌రూమ్ గోడల మీద అమ్మాయిల అసభ్య చిత్రాలు పెట్టేవారు. ఇప్పుడు అవే రూట్ మార్చి ఫేస్‌బుక్‌లో పెట్టడం వంటివి సైబర్ చట్టం సెక్షన్ 66 ద్వారా కేసులు బుక్ చేయవచ్చు.
1. ప్రస్తుతం మన డిజిటల్ సిగ్నేచర్‌ను హ్యాక్ చేయవచ్చు. ఫోర్జరీ చేయవచ్చు.
2. డేటాను దొంగిలించడం సైబర్ నేరంగా పరిగణించవచ్చు.
3. సైబర్ నేరాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయవచ్చు.
4. పోర్నోగ్రఫీ, ఛైల్డ్ ట్రాఫికింగ్, అడాప్షన్ కేసులు సైబర్ చట్టం కింద పెట్టవచ్చు.
ఈ విధంగా ప్రొ.శాంతి వివరించిన తర్వాత పార్టిసిపెంట్స్ వారి వారి సెంటర్స్‌కు వచ్చిన కేసులను చెప్పి వాటిపై సమాచారాన్ని తెలుసుకున్నారు.
మూడవరోజు మధ్యాహ్నం సెషన్‌ను యుక్తవయసు బాలబాలికల మానసికాంశాలు, భావోద్వేగ సమస్యలపై పనిచేస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్ డా.వీరేందర్ రిసోర్స్ పర్సన్‌గా వ్యవహరించారు.
యుక్తవయసు గురించి వివరిస్తూ ఈ వయసు అనేది తెలియని కొత్త ప్రపంచాన్ని టీనేజ్ పిల్లల జీవితాల్లోకి తీసుకెళ్తుందని చెప్పారు. కాబట్టి వారికి అంతా క్లిష్టంగా అనిపిస్తుందని, అందుకే ఈ వయసు చాలా భావోద్వేగాలతో నిండి ఉంటుందని చెప్తూ పార్టిసిపెంట్స్‌ను వారి వారి అనుభవాలను చెప్పమని కోరారు. పార్టిసిపెంట్స్ అందరూ తమ తమ అనుభవాలను తెలియచేశారు.
సైకాలజీలో వివిధ థెరపీలు ఉంటాయని డా.వీరేందర్ చెప్పారు. సైకాలజిస్టులు ఏ థెరపీ ద్వారా రోగులను సమస్యల నుంచి బయటకు తీసుకురావాలో ఆలోచించి ఆ థెరపీ ఇస్తారని చెప్పారు. టీనేజ్ పిల్లలు ప్రేమ సమస్యలను ఈ క్రింది విధంగా వ్యక్తీకరించవచ్చని చెప్పారు.
A – Acquiantance (పరిచయం)
B – Relationship (సంబంధం)
C – Continue Relationship (సంబంధాన్ని కొనసాగించటం)
D – Detorate (సంబంధాల క్షీణత)
T – Terminator (సంబంధాలను నిలివేయటం)
మామూలుగా టీనేజ్ పిల్లలు కలుసుకొని మాట్లాడుకుంటున్నప్పుడు మొదట ఎఫ్‌బి అకౌంట్స్, వాట్సప్ నంబర్స్, ఈ-మెయిల్ అడ్రస్ అడుగుతారు. నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు. Continue Relationship గిఫ్టులు ఇవ్వడం, కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడం, పార్టీలకు ఇన్వైట్ చేయడం చేస్తారు. పై పద్ధతిలోని ఎబిసి స్థాయికి వచ్చేసరికి రాబోయే పది సంవత్సరాల భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. వీరి సంబంధాలు కాలం, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. ఈ సంబంధాలకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. (మందులకు ఉన్నట్లే) ఇది వారికి చెప్పగలగాలి. అంతేకాని వారి పట్ల – బయస్‌గా ఉండకూడదు. జడ్జిమెంటల్‌గా ఉండకూడదు.
ఈనాటి పిల్లలు సంక్షోభంలో ఉన్నారు. వారికి విలువలు నేర్పాలి. నా మీద ‘బ్రాండ్ వేయడం, తిట్టడం, condemn చేయడం లేదు. క్రిటిసైజ్ చేయడం లేదు అని వారు మనల్ని నమ్మితే తిరిగి వస్తారు.
అమ్మాయి వెళ్ళిపోవడానికి కారణం. ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న ‘అమ్మాయికి పెళ్ళి చేస్తారనే భయం తల్లిదండ్రుల నుంచి
ఉంటుంది. ఎట్లయినా పెళ్ళి చేస్తారు అనే భయంతో పారిపోతారు. జీవితం గురించి ఆలోచించరు. ఆ particular situation నుంచి తప్పించుకోవడం వారి పని.
కాబట్టి కౌన్సిలర్స్ తల్లిదండ్రులకు చెప్పాలి. అమ్మాయికి ఈ పరిస్థితుల్లో పెళ్ళి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. వారిని క్రైసిస్ నుంచి బైటికి తీసుకురావాలి.
పిల్లలలో రవషబతీవస పవష్ట్రaఙఱశీబతీ,secured behaviour పిల్లలతో సరైన, భధ్రమైన ప్రవర్తన గురించి అర్థం చేయించాలి. తద్వారా పిల్లలు కౌన్సిలింగ్ తర్వాత తిరిగి వెళ్ళరు. ఎవిడెన్స్ చూపిస్తే నమ్ముతారు. ప్రవర్తన మార్చుకుంటారు.
బాగా చదువుకున్న పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో మనం అనుకున్నట్లు ఉండాలి, మన విలువలు నమ్మాలి, మనలాగా చదవాలి. ఈనే ప్రశ్న ఉదయిస్తుంది.
పిల్లలు పేరెంట్స్‌ను డౌట్స్ అడుగుతారు. వారు సమాధానం చెప్పారు. పైగా మాకే ప్రశ్నలు వేస్తారా? అని బెదిరిస్తారు. పిల్లలు భయపడి తల్లిదండ్రులతో మాట్లాడరు.
పిల్లలు చిన్నతనంలో – తమ స్కూలు విషయాలు తల్లితో చెప్పుకోవాలని సరదా పడతారు. ఆసక్తితో చెప్పాలని ప్రయత్నిస్తారు. తల్లులు వారి మాటలు పట్టించుకోకుండా ”స్కూలు డ్రెస్ మార్చుకో, పాలు తాగు, చదువుకో అని చెప్తుంటారు. తల్లికి తాము చెప్పే విషయాల పట్ల అనాసక్తతను గుర్తిస్తారు పిల్లలు. ఆ తర్వాత ఆ విషయాలు చెప్పే ప్రయత్నం చేయరు. పిల్లలకు 12, 13 సంవత్సరాల వయసు వచ్చేసరికి తల్లి పిల్లల ముభావాన్ని గుర్తిస్తుంది. స్కూలు విషయాలు అడగడం మొదలుపెడ్తుంది. ఇప్పుడు పిల్లలు టోటల్‌గా రివర్స్ అవుతారు. స్కూలు విషయాలు స్నేహితుల ముచ్చట్లు తల్లితో పంచుకోరు.
ప్రస్తుత కాలంలో పేరెంటింగ్ అనేది చాలా సమస్య, చాలా ఛాలెంజ్‌తో కూడుకున్నది. ఈ రోజుల్లో బాగా చదువుకున్నవారికి కూడా పేరెంటింగ్ తెలియదు. ఎందుకు కనాలి? ఏ విధంగా పెంచాలి? అనే విషయాలు తెలియకుండానే అపస్మారకంగా, ఏ విధమైన స్పృహ లేకుండా పిల్లల్ని కంటారు. అలాగే అపస్మారకంగా, ఏ విధమైన స్పృహ లేకుండా బ్రతుకుతున్నారు.
ఫెయిల్ కావడం ఒక ట్రబుల్. ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఇంకో ట్రబుల్. ఇదే డబుల్ ట్రబుల్.
మనం పిల్లలతో చాలా స్పష్టంగా మాట్లాడాలి. లేకుంటే అనవసరంగా జీవితం వృథా అవుతుంది. కుటుంబంలో అశాంతి, ఇబ్బందులు పోవాలంటే మన భాష, పదాలు ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండాలి. మన భాష, పదాలు మనల్ని ఇబ్బంది పెడతాయా? పదాలు మన సంబంధాలని మెరుగుపరుస్తాయా? అనే గ్రహింపు ఉండాలి. ఇంట్లో శాంతి మన మాటలమీదే ఆధారపడి ఉంటుంది. ఇబ్బందులు, గొడవలు వచ్చే అవకాశం ఉందంటే అసలు మాట్లాడకుండా ఉండడమే మంచిది.
టీనేజ్ పిల్లలలో ఆర్గ్యుమెంట్ జనరేట్ అవుతుంది – తమను ఇంట్లో నచ్చినట్లు చూడడం లేదని, నాకే తెలుసు అనే అజ్ఞానం, నాకు అన్నీ తెలుసు… నేను అన్నీ మేనేజ్ చేస్తా… అనే మొండితనం ఉంటుంది.
పిల్లలకు స్వేచ్ఛ, గౌరవం ఇవ్వాలి. తల్లులు పిల్లలకు ఒక విషయం చెప్పి, ఆ పని చేయమని ఐదుసార్లు చెప్పి ఆరవసారి చెయ్యవా? అని ఆగ్రహంగా అడిగితే, దున్నపోతా అని తిడితే –
పాత విలువలు-కొత్త విలువల మధ్య ఘర్షణలు, చోటు చేసుకున్నపుడు పిల్లలకు పెద్దవారిపట్ల తిరస్కార భావం ఉంటుంది. పాత విలువలు మారిపోతాయి. పిల్లల దృష్టిలో పాత విలువలకు స్థానం ఉండదు. పిల్లల దృష్టిలో తల్లిదండ్రులకు విలువలేదు ఎందుకు? మా పేరెంట్స్ నా మాట వినరని వారంటారు. ఇంకో పక్క తల్లిదండ్రులు పిల్లల స్నేహితులను, వారి పనులను తప్పుపడతారు.
పిల్లల ప్రపంచం – లేటెస్ట్ ఆల్బమ్స్, హిందీ సినిమాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్… ఇదంతా పేరెంట్స్‌కు తెలియదు. పిల్లలు పేరెంట్స్‌ను outdated batch చెప్తే అర్థంకాదు, చెప్పకుంటే చెప్పలేదు అంటారు అని పిల్లలు పెద్దవారి మీద ఫిర్యాదు చేస్తారు. ఒకప్పటి విలువలు ఇప్పుడు లేవు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే పేరెంట్స్‌కు పిల్లల పట్ల వ్యతిరేకత పోతుంది. పిల్లలు చెప్పినదానిలో పాయింట్ ఉందని ఆలోచిస్తారు. పిల్లలు చెప్పినదాన్ని ఖచ్చితంగా పేరెంట్స్ చర్చకు పెట్టాలి. మంచి వాతావరణం సృష్టించాలి. అలాగే వారు ఏది అడిగితే అది కొనివ్వరాదు.
ఒక తండ్రి రూ.70 వేలు పెట్టి తమ కొడుకును పదవతరగతిలో చేర్పించాడు. రూ.50 వేలు పెట్టి కూతురిని కాలేజీలో చేర్పించాడు. అతను చిరుద్యోగి, రూ.8 వేల జీతం. పిల్లలకు ఈ విషయం తెలియనివ్వలేదు. అలా చేయడం పొరపాటు. తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితిని పిల్లలకు చెప్పాలి. అంతేకానీ చదువే అన్నీ తెస్తుందని భావించకూడదు. పిల్లలకు సంతోషం, కష్టం, విషాదం నేర్పాలి. ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు తమ గ్రాండ్ పేరెంట్స్ చనిపోతే రావడం లేదు.
పిల్లలకు చదువేలోకం అని చెప్పరాదు. చదువే జీవిత పరమార్థం అని చెప్పకూడదు. ఆటపాటలు, సంతోషం, కష్టం, విషాదం అన్నింటిని నేర్పాలి. ఈ విషయాలను పిల్లల తల్లిందడ్రులకు చెప్పి అర్థమయ్యేలా చూడాలని వీరేందర్ గారు వివరించారు. వారికి సమస్యను అర్థం చేయించటం, దీనిలో నుండి బయట పడటానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను వివరించటం, సరియైన మార్గం ఎంచుకోటానికి కావాల్సిన ఆలోచనను అందించటం చేయాలి. అంతేగాని సమస్య మన చేతిలోకి తీసుకుని మార్చేయ్యాలి అనే ఆలోచన కౌన్సిలర్ చెయ్యకూడదు. దానిని దృష్టిలో ఉంచుకోవటం కౌన్సిలర్‌కు చాలా అవసరం. అని చెప్తూ సెషన్ ముగించారు.
తరువాత సత్యవతిగారు శిక్షణను ముగిస్తూ ఈ మూడు రోజులపాటు శిక్షణలో నేర్చుకున్న అంశాలు మన దగ్గరకు వచ్చే సర్వైవర్‌కు ఉపయోగపడేలా ఉన్నాయని, సర్వైవర్‌తో ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అనే అంశాలతో పాటు కౌన్సిలర్‌గా మనం ఎలా ఉండాలి? సమర్థవంతంగా సర్వైవర్‌కు సమస్యను ఎదుర్కొనే, సమస్య నుండి బయటపడేందుకు ఉన్న మార్గాలను వివరించాలి అని చెప్తారు. తర్వాత ప్రతి ఒక్కరు ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న విషయాలను, వారి అభిప్రాయాలను వెలిబుచ్చారు. గ్రామ్య, స్వార్డ్, సయోధ్య, సంస్థల నుండి పాల్గొన్న టీం మెంబర్స్ తమకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇకముందు కూడా జరిగే శిక్షణలలో అవకాశం కల్పించాలని కోరారు.
ఏ కేసయినా వాతావరణం కౌన్సిలర్ చేతిలో ఉండదు. ఇంట్లో వాతావరణం ప్రభావితం చేయకుండా ఒక గంట సెషన్‌లో క్లయింట్స్‌లో మార్పు రావాలని అనుకోకూడదు. Don’t involve too much. డిప్రెషన్, యాంగ్జయిటీ ఉన్నవాళ్ళను మీరు డీల్ చేయకండి. వారు కౌన్సిలింగ్‌ను రిసీవ్ చేసుకునే పద్ధతిలో ఉండరు. వారిని సైకాలజిస్ట్ దగ్గరికి పంపాలి. వచ్చిన వ్యక్తులు ఒక కేస్ సబ్జక్ట్ అంతవరకే. మీ చేతిని దాటాక – మీరు తాపత్రయపడడం వృధా. కౌన్సిలర్ చేతిలో మ్యాజిక్ స్టిక్ ఏమి లేదు.