ప్రియమైన కె.వరలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? చాలా కాలమైంది మిమ్మల్ని చూసి. మీ స్వచ్ఛమైన చిరునవ్వు నాకిష్టం. మిమ్మల్ని తొలిసారిగా చూసింది రాజమండ్రి తెలుగు యూనివర్శిటీ సెమినార్‌లో 90’ల్లో అనుకుంటా. గీతను కూడా అప్పుడే చూశాను. డిగ్రీ చదువు తోందప్పుడు. ఎంత అందంగా, నిర్మలంగా ఉన్నారు అనుకున్నాను మిమ్మల్ని చూసి. అప్పటికే రచయిత్రిగా నలుగురికీ పరిచయమైపోయిన కాలమది. బేతవోలు రామ బ్రహ్మంగారు, చేరా మాష్టారు లాంటి ఎందరో పాల్గొన్న సెమినార్ అది. మీ రచనలు నన్ను మీకు దగ్గరగా చేశాయి. మీ సాహిత్యాభిలాష పెరగడానికి లైబ్రరీలే ప్రధాన కారణమని చెబ్తుండేవారు. జగ్గంపేటలోనే పుట్టి, పెరిగి, జీవిస్తున్న మీరు, మీ జ్ఞాపకాలు, అనుభావాలు అన్నీ ఆ ఊరిచుట్టూ అల్లుకొనే ఉన్నాయి. ఒకసారి మీరు నాతో అన్నారు. ఎలిమెంటరీ స్కూలు రోజుల్లో కూడా ఇంటర్వెల్‌లో స్కూలు లైబ్రరీలో కూర్చుని చదువుకునేవారు. మీ ఇంటి దగ్గర్లోనే పెట్టిన లైబ్రరీలో అది మూసేంతవరకూ చదువు తుండే వారని పిల్లల కథలతో మొదలుపెట్టిన ఆ లైబ్రరీ అరుగే ప్రపంచాన్ని మీ ముందుకు తెచ్చింది. చదువుకోకపోయినా కథలు వినడం అమ్మకిష్టమని ఆమె కోసం శరత్, ఠాగూర్ రచనలు చదివి వినిపించేవారు. ఠాగూర్‌వి అమ్మకి నచ్చేవి కాదన్నారు. యద్ధనపూడిలా నువ్వు కూడా రాయొచ్చు కదమ్మా భలే వినాలన్పిస్తాయని అనేవారన్నారు. ఎస్సెస్సెల్సీ వరకూ చదివి పెళ్ళయి పోవడంతో ఆగిన చదువుకు ఎం.ఎ. తెలుగు వరకూ కొనసాగించడం మీ విద్యాతృష్ణకు నిదర్శనం. 8వ తరగతిలోనే ‘కథరానికథ’ రాసిన మీ మొదటి ప్రచురణ. నవలిక, కాలమ్స్, కవితలకంటే కథా రచనే మీకిష్టం. స్కూలు డేస్‌లో బహుమతిగా పుస్తకాలొస్తే ‘పాలగుమ్మి పద్మరాజు’ కథలు, రంగ నాయకమ్మ రచనలు, కాళీపట్నం రచనలు చదివిన తర్వాత అవి మీమీద చాలా ప్రభావాన్ని చూపించాయన్నారు. ‘గాలివాన’కంటే ‘పడవ ప్రయాణం ఇష్టం’ కదా మీకు. రచయితల పట్ల గౌరవం, ఆరాధన ఉండేదన్నారు. ‘అంపశయ్య నవీన్’ రాసిన ‘ముళ్ళపొదలు’ బాగా నచ్చి ఉత్తరం రాసారొకసారి. నవీన్‌గారు సహృదయంతో సెలెక్టెడ్ బుక్స్, తప్పక చదవాల్సిన పుస్తకాల పేర్లతో సలహాలిచ్చేవారు. తద్వారా, ఆ ప్రోత్సాహంతో నాలెడ్జి పెరిగిందనీ, జ్ఞానతృష్ణ కలిగిందని అన్నారొకసారి గుర్తుందా? వరలక్ష్మిగారూ! మీర్రాసిన వాటిల్లో ‘మట్టిబంగారం’ బాగా ఇష్టం కదూ మీకు. అవునూ! గుంటూరు అరసం వాళ్ళు ప్రతి ఏటా ప్రచురిస్తున్న వాటిల్లో భాగంగా ఈ ఏడు మీరు రాసే కథలతో వేస్తున్నారని విని, ఒక మిత్రురాలిగా సంతోషించాను. ఆ కథల్ని సెలక్ట్ చేసింది పి.సత్యవతి గారని తెలిసి మంచి కథలే చేసుంటారనిపించింది.
స్త్రీవాదమింకా మీకు అర్థంకాని దశలోనే మీ అమ్మాయి కె.గీత కవిత్వం వ్రాయడం చూసి ఎంతో మురిపెంగా
ఉండేదన్నారు. ‘ఋతువునైన వేళ’ – ఆ రోజుల్లో ఎంతో సెన్సేషన్ కలిగించిన కవిత. ‘నీలిమేఘాల్లో’ మీరు రాసిన ‘ఆమె’ కవిత కూడా ‘రంగయితేనేం, మంగయితేనేం’ చాలా మంచి కవిత – అదే టైటిల్‌తో కవిత్వ పుస్తకం కూడా వేశారు కదూ!
మీ కథలు వివిధ పత్రికల్లో 140కి పైగానే వచ్చుంటాయి. 41 నవలికలు, కవితలు, వ్యాసాలు, నాటికలు, కాలమ్స్ రాశారు, రాస్తున్నారు. ‘జీవరాగం’, ‘మట్టి-బంగారం’, ‘అతడు-నేను’, ‘క్షతగాత్ర’, ‘పిట్టగూళ్ళు’ కథాసంపుటాలు. వివిధ సంకలనాల్లో కవితలు, కథలు ఉన్నాయి. సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, చాసో స్ఫూర్తి, విమలా శాంతి, సహృదయ, హసన్ ఫాతిమా, రంజనీ, అజో-విభో అవార్డ్, ఆటా-తానా అవార్డ్, రంగవల్లి, పులికంటి, ఆర్.ఎస్.కృష్ణమూర్తి, తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం, అమృతలత అవార్డు లాంటివెన్నో మీ సాహితీ రచనకు గౌరవాల్లాంటివి. ఇప్పుడు ‘జ్ఞాపకాలు’ పేరిట ‘విహంగ’ వెబ్ మ్యాగజైన్‌లో కాలమ్ రాస్తున్నారు. అంతకుముందు ‘జీవనయానం’ పేరుతో ఆత్మకథలా విహంగతోనే కాలమ్ రాసారు. అప్పుడు పతంజలి శాస్త్రి గారు పుస్తక రూపంలో తప్పక తీసుకురండన్నారు. నిజానికి రావాల్సిన పుస్తకమది. స్త్రీలు రాసిన ఆత్మకథలు చాలా తక్కువ. ప్రచురణ గురించి ఆలోచిస్తారు కదా! మీరు రాసిన కవితల్లో మంచానపడ్డ వ్యక్తికి, కుడిచెయ్యి, ఎడమచెయ్యి తేడా మర్చిపోయి సేవ చేస్తున్నదాన్నంటూ ఓ కవిత రాసారప్పట్లో. చాలాకాలం నన్ను వెంటాడిందా కవిత. మనం ‘భూమిక’ సత్య మిత్రులందరం కలిసి తిరిగిన టూర్లవల్ల సాన్నిహిత్యం బాగా పెరిగింది. మరొక లోకాన్ని కోల్పోయి బ్రతికేస్తున్న మీరు, ఎందరెందరో స్నేహితుల్తో, రచయిత్రులతో ఆనందంగా గడిపారు. మనం బాగా దగ్గరయింది కూడా ఆ సందర్భాల్లోనే. అలాగే ‘అస్మిత’ తరుపున ‘మద్రాసు’లో సెమినార్లకి వెళ్ళామందరం. ఆ రోజులు మళ్ళీ పుడితే బాగుండు. పాపికొండలు, ప్రళయ కావేరీ, మూమెండర్ ఫారెస్ట్, తలకోన, పిఠాపురం, వైజాగ్ జైలు… ఇలా ఎన్నెన్నింటిలో మన అనుభూతుల్లో పంచుకున్నాం.
సాహిత్యం మిమ్మల్ని మనిషిగా మిగిల్చింది. మీకొక ఊరట, స్వాంతన. స్వయంగా స్కూలు పెట్టాక, ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవించే క్రమంలో హెరాస్‌మెంట్, కష్టాల కడగండ్లు, ఈర్ష్యాసూయలు వీటన్నింటిని మీ వ్యక్తిత్వంతో అధిగమిస్తూ, ముగ్గురు పిల్లల్ని ఒక దరికి చేర్చి, మీకు మిగుల్చుకున్న క్షణాల్లో రచయిత్రిగా మళ్ళీ మళ్ళీ పుడుతూ, జీవిస్తున్నారు. శరీర గాయాలెన్ని ఎదురైనా, విల్‌పవర్‌తో ఎదుర్కొన్న మీ తీరు నాకిష్టం. మీ చుట్టూ ఉన్న ఎందరెందరి జీవితాలో మీ పరిశీలనలో కథలయ్యాయి. ‘దుర్గ’ జీవితానుభవాలే ‘ఖాళీసంచులు’ కథ. జీవితంలోని ముడి సరుకులే మీ కథావస్తువులవలడం మీ ప్రత్యేకత. అందుకే మీరంటే నాకిష్టం. ఉండనా మరి.