చున్నీ నడుముకు చుట్టవే చెల్లెమ్మ … – పి. ప్రశాంతి

ఊర్మి నల్ల కలువ లాంటి ఆదివాసి పిల్ల. పన్నెండేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. ఆర్నెల్లు తిరక్కుండానే వేటకని అడవికెళ్ళిన తండ్రి ఇక తిరిగిరాలేదు, మళ్ళీ కనబడలేదు. చచ్చి పోయుంటాడని తేల్చేశారు ఊరోళ్ళంతా. మేనత్త చేరదీసి తన కొడుకుతో పాటే బడికి పంపుతోంది. విషజ్వరంతో భర్త చనిపోతే రెండో పెళ్ళి చేసుకున్న మేనత్త ఊర్మిని ప్రేమ గానే చూసేది. రెండేళ్ళు గడిచేసరికి ఊర్మి పెద్దదైంది. మరో ఆర్నెల్లో పదహారేళ్ళు వస్తాయనగా పదో తరగతి పరీక్షల ముందు బడికెళ్ళిన ఊర్మి తిరిగిరాలేదు. ఏమైందోనని భయపడ్తూ తెలిసినోళ్ళనందర్నీ అడిగింది, ఊర్మి కనపడిందాని. నాల్రోజుల తర్వాత మధ్యాహ్నం పూట జొన్న చేలో పిట్టల్ని తరుముతుంటే నక్కి నక్కి వచ్చింది ఊర్మి. కావలించుకుని ఏడుస్తున్న అత్తతో ధైర్యం తెచ్చుకుని ఆమె భర్త తన పట్ల ప్రవర్తించిన తీరుని, సంవత్సర కాలంగా తనని చంపేస్తానని భయపెట్టి రోజూ ఒళ్ళంతా తడమడాన్ని, బడికి దింపు తానంటూ బండిమీద వెనక కాదంటూ ముందు కూర్చోబెట్టుకుని చేసిన వెకిలి చేష్టలు, చివరిగా నాల్రోజుల క్రితం అర్థరాత్రి వెనకనించి పక్కలో చేరిన వైనం… అన్నీ చెప్తుంటే అనుమానపడ్డానంటూ ఏడ్చింది మేనత్త. ఇక ఇంటికి రానని, హాస్టల్లో చేరానని ఊర్మి చెప్తుంటే పిల్ల బ్రతుకు, తన కాపురం, రెండూ నిలబడ్డాయని ఊపిరి పీల్చుకుంది.

ఊర్మితో వచ్చిన ఆమె ఫ్రెండ్‌ పావని ఇదంతా నిశ్శబ్దంగా వింది. తిరిగి వెళ్ళేటపుడు ఊర్మి ధైర్యాన్ని మెచ్చుకుంటూ తన గురించి చెప్పింది. నాన్న ఎయిడ్స్‌తో చనిపోతే చిన్నాన్న తన తల్లితోపాటు తననీ ఇబ్బంది పెడుతోంటే తల్లికి మాత్రం చెప్పి రహస్యంగా హాస్టల్‌కి వచ్చేసిన విషయం చెప్పింది. ఒకరోజు చెప్పులు కుట్టే సూది చూపించి ‘కుట్టేస్తా’ అంటూ బెదిరించాడని చెప్తూ ఏడ్చేసింది.

ఇంకా తమలాగా ఇంట్లో వాళ్ళతోనే లైంగిక వేధింపులకు గురై, దగ్గరి బంధువులతోనే లైంగిక దాడుల్ని, అసభ్య ప్రవర్తనల్ని ఎదుర్కొన్న తోటి స్నేహితురాళ్ళ గురించి గుర్తు చేసుకున్నారు. శైలూది మరీ దారుణం… తండ్రీ, అన్నా వంతు లేసుకున్నట్లు మీదపడడం, బడి మాన్పించి గదిలో బంధించడం, ఉద్యోగమని చెప్పి తల్లిని పనిమనిషిగా దుబాయ్‌ పంపి మరీ వేధించిన విషయం చెప్పుకున్నారు. ఇంత కాకపోయినా, ఎవరికీ తెలియకుండా బాత్రూం గూట్లో సెల్‌ఫోన్‌ పెట్టి తను స్నానానికెళ్ళినప్పుడు రికార్డు చేయడం,

తల్లిదండ్రులకి అనుమానమొచ్చి అడిగినప్పుడు మభ్యపెట్టి, తనెంత మంచివాడో చెప్పమని, లేకపోతే జస్ట్‌ సెల్‌ఫోన్‌ తనది కాదనుకుంటే చాలని, తన ఫ్రెండ్సే అంతా చూసుకుంటారని ధమ్కీ ఇచ్చి బావ తననెలా లొంగ దీసుకున్నాడో తేజ చెప్పడాన్ని గుర్తు చేసుకున్నారు. సల్మా తమ ఉమ్మడి కుటుంబంలో తాను ఎటువంటి అభ్యంతరకర పరిస్థితుల్ని ఎదుర్కొన్నదీ, మను మేనమామతో ఫేస్‌ చేసిన అనుభవాలు మాట్లాడుకున్నారు.

సడన్‌గా ఇద్దరికీ ఒక అనుమాన మొచ్చి ఆగిపోయి ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు. ఏంటి, తమ చుట్టూ

ఉన్న ఆడపిల్లలంతా ఇలా ఏదో ఒకటి, ఎప్పుడో అప్పుడు ఎదుర్కొన్న వారేనా? లేక అలా ఎదుర్కొన్న వాళ్ళే తమ దోస్తులయ్యారా అని అనుమానపడ్డారు. అంతలోనే తమ ఫోరమ్‌ సమావేశంలో ‘అక్క’ చెప్పిన లెక్కలు గుర్తొచ్చాయి. సుమారు 37.5 కోట్ల మంది మైనర్‌ పిల్లలున్న మన దేశంలో, దాదాపు 65% మంది అమ్మాయిలు ఏదో ఒక రూపంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని, వాళ్ళల్లో ఎక్కువమంది కుటుంబ సభ్యులు, బంధువుల నుంచే ఎదుర్కొంటున్నారని, ప్రపంచంలో ప్రతి నలుగురు అమ్మాయిల్లో ఒకరు లైంగిక వేధింపులకి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టిందని చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. కానీ మన దేశంలో 70% పైగా లైంగిక వేధింపుల కేసులు నమోదు కాకుండానే పోతున్నాయి. అహింస, ఓర్పు, ఆధ్యాత్మికతలకు పెట్టింది పేరైన భారతదేశపు అసలు రూపం ‘ఇదని’, స్త్రీని దేవతగా పూజించే దేశంగా చెప్పుకునే చోట ఆడపిల్లకి రక్షణ లేదని, తమ లైంగికతపై తమకి హక్కు కానీ, స్వేచ్ఛ కానీ లేదని… ఈ పరిస్థితుల్లో తమ తరం నిలదొక్కుకోవాలని, ఎదుర్కోవాలని, నిర్భయంగా నిజాలు మాట్లాడాలని, నిశ్శబ్దాన్ని ఛేదించడమే కాక అవసరమైతే భద్రకాళిగా మారాలని నిర్ణయించుకున్న తమ తోటివారు గుర్తొచ్చి ఎదను కప్పుకొన్న చున్నీలు తీసి నడుముకు బిగించి ముందుకు సాగారు.

మదిలో ప్రశ్నలు మాత్రం కందిరీగల్లా రొదపెడ్తున్నాయి. మగపిల్లలు కూడా లైంగిక దాడికి గురవుతున్నారట, అదీ ఆడపిల్లలకంటే ఒకింత ఎక్కువగా… మరి వాటి గురించి మాట్లాడ్డానికి, నిశ్శబ్దాన్ని ఛేదించడానికి వారు సిద్ధంగా లేరా? తల్లిదండ్రులు నిజాన్ని స్వీకరించలేక పోతున్నారా? పురుషాహంకారం, పితృస్వామ్య భావజాలం కట్టుకున్న అద్దాల మేడ కుప్పకూలిపోతోందా??? ఏమో!!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.