డా. వాసిరెడ్డి సీతాదేవి
(సుపస్రిద్ద రచయత్రి వాసిరెడ్డి సీతాదేవిగారు ఏపిల్ర్ 07 నాడు దివంగతులయ్యరు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ…. )
విజయవాడ వెళ్ళే ఎక్స్‌ప్రెస్ బస్ కదలడానికి సిద్ధంగా వుంది.
ఆదరా బాదరాగా చంద్రం లోపలకు – గేటులో నిల్చున్న వాళ్ళను తోసుకుంటూ ఎక్కాడు.
బస్సంతా ఫుల్‌గా కనిపించింది. జేబులో నుంచి టికెట్ తీసి తన రిజర్వేషన్ నంబరు చూసుకున్నాడు. ముగ్గురు కూర్చునే సీటులో తన సీటు వున్నది. దగ్గిరకు వెళ్ళి నిల్చున్నాడు. ముగ్గురు కూర్చునే సీటులో ఇద్దరు – ఒక ఆడా, ఒక మగా కూర్చుని వున్నారు. చివర్లో కొంచెం చోటు వున్నది. దాదాపు మొత్తం సీటును ఆక్యుపై చేసుకున్న వాళ్ళిద్దర్నీ మార్చి మార్చి చూశాడు చంద్రం.
సన్నగా, తెల్లగా, నాజూకుగా వున్న స్త్రీ కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తున్నది. ఆమె వాలకం చూస్తే ఆమె, ఆ పక్కనే కూర్చునివున్న లావుపాటి నల్లటి బట్టతల ఆసామికీ ఏమీ కానట్టే అన్పించింది చంద్రానికి. చంద్రం సీటు చివర్లో వున్న ఆ కొద్ది స్థలంలో ఒదిగి కూర్చోడానికి ప్రయత్నించాడు. అయినా అతని సగం శరీరం బయటికే వుండిపోయింది. కిటికీ దగ్గరగా వున్న స్త్రీ మరికొంచెం కిటికీ దగ్గరకు జరిగింది. ప్రక్కనవున్న అతనితో చిన్నగా ఏదో అన్నది. స్తూలకాయుడు కొంచెం సర్దుకొని కూర్చోగలిగాడు.
కిటికీ పక్కగా కూర్చున్న ఆమె పేరు రేఖ. రేఖలాగే సన్నగా పొడవుగా వుంటుంది. ఆ లావాటి పెద్దమనిషి ఆమె భర్త, పేరు సుందర్రావు. సుందర్రావు నల్లగా వున్నా పెళ్లినాటికి అంత లావుగా వుండేవాడు కాడు. బట్టతలకూడా లేదు. వివాహం అయి పదేళ్ళు అయింది. ఒకే కొడుకు. వాడికి ఐదేళ్ళు. రేఖ తల్లిదండ్రుల దగ్గిరవుండి చదువు కుంటున్నాడు.
సుందర్రావు కష్టజీవి. పెళ్ళినాటికి పెద్దగా లేదు. క్రమంగా కాంట్రాక్టులు చేసి బాగా సంపాదించాడు. ఎండనక వాననక స్వయంగా నిల్చుని పనులు చేయిస్తాడు. ఈ మధ్య కాలంలో మరీ లావు అయ్యాడు. నలుపురంగు నిగనిగ లాడుతోంది. బట్టతల కూడా వచ్చింది. రేఖ పెద్దగా అతని రూపాన్ని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఇద్దరూ పిల్లవాడిని చడడానికి హైదరాబాదునుంచి బయలుదేరారు. భర్త టాక్సీలో వెళ్దాం అన్నాడు. కాని ఆమే ”ఐదు గంటల ప్రయాణం. ఎందుకు దండుగ. బస్‌లో పోదాం!” అన్నది. కొడుకుని తీసుకొచ్చి పబ్లిక్ స్కూల్లో చేర్పించడానికి బయలుదేరారు. ముందు తనకు టైం లేదన్నాడు. తీరా భార్య బయలుదేరేసరికి తన బయలుదేరాడు.
రేఖ బయటకు చూస్తూ కూర్చుంది. అయినా తమ సీట్లో కూర్చున్న ఆ యువకుడు తననూ, తన భర్తన మార్చి మార్చి చూస్తున్నట్టు అన్పించింది. రేఖ తలతిప్పి చూసింది. ఆ యువకుడు ఇబ్బందిగా ముఖంపెట్టి రేఖ ముఖంలోకి చూశాడు.
సుందర్రావు సీటు వెనక్కు వాలి నిద్రపోతున్నాడు. అటూ ఇటూ ఊగు తున్నాడు. అతని తల తనకు తగలకుండా జాగ్రత్తపడుతూ కూర్చున్నాడు చంద్రం. రేఖ భర్తను చూసింది. నోరు తెరిచి నిద్రపోతున్నాడు. గురకకూడా పెడు తున్నాడు. రేఖ ఆ యువకుడు చూడకుండా చిన్నగా మొచేత్తో భర్తను పొడిచింది. సుందర్రావు ఉలిక్కిపడి లేచి భార్యకేసి చూశాడు.
‘సరిగ్గా కూర్చోండి! బస్ కదిలిందో లేదో పట్టపగలు నిద్రేమిటి?’ చిన్నగా అన్నది.
చంద్రానికి ఆ మాటలు విన్పిం చాయి. ముసి ముసిగా నవ్వుకున్నాడు.
‘వెధవ అలవాటు. బస్‌లో కూర్చున్నా కారులో కూర్చున్నా నిద్ర ముంచుకొస్తుంది’ అన్నాడు, గొంతు మడతల్లో పట్టిన చమటను అరచేత్తో తుడుచుకుంటూ.
రేఖ వినిపించుకోనట్టు కిటికీలో నుంచి బయటికి చూడసాగింది.
రేఖ తల్లిదండ్రులకు ఒకే కూతురు. ఇద్దరు మగపిల్లలు. తండ్రి బడిపంతులు. రేఖ పది పాసు అయింది. సుందర్రావు వాళ్ళకు దూరపు బంధువు. అప్పుడప్పుడు రేఖ అన్నయ్యకోసం వస్తూ వుండేవాడు. ఆమెకు వివాహం గురించి ప్రత్యేకమైన ఆలోచనలే లేవు. కలలు కనడం కూడా లేదు. తండ్రి ‘సుందర్రావును చేసుకోవడం ఇష్టమేనా’ అని అడిగినప్పుడు తల ఊపేసింది. ఎవరో ఒకర్ని పెళ్ళిచేసుకోవాలని మాత్రమే ఆమెకు తెలుసు. అంతకంటే ప్రత్యేక అభిప్రాయాలు ఏమీ లేవు.
సుందర్రావుకు రేఖ అంటే ప్రాణం. రెండు మూడు సంవత్సరాలు ఆర్థికంగా స్థిరపడడానికి రాత్రింబవళ్ళు కృషి చేశాడు.
బస్ సిటీ లిమిట్స్ దాటింది. స్పీడ్ పెంచాడు డ్రైవర్. మళ్ళీ నిద్రలోపడ్డ సుంద ర్రావు. తల గడియారంలోని పెండ్యులం లాగా ఊగసాగింది. గురక బస్ శబ్దంలో కలిసిపోయినా పక్కసీట్ల వాళ్ళకు విన్పిస్తున్నది. రేఖ తలతిప్పి చూసింది. చంద్రం ఇబ్బందిగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె భర్తను చూసింది. నోరు తెరిచి గురక పెడుతున్న అతని ముఖంమీద, మెడ మీద చమట చుక్కలు వున్నయ్. రేఖకు భర్త ఒక ఎలుగుబంటిలా కన్పించాడు మొదటిసారిగా.
ముందు సీటులో ఐదేళ్ళ కుర్రవాడు లేచి నిల్చున్నాడు. వెనక్కు తిరిగి మొకాళ్ళ మీద కూర్చుని సీటుపై నుంచి గురక పెడుతున్న సుందర్రావును సంతోషంగా చూస్తున్నాడు. రేఖ పిల్లవాడి ముఖంలోకి చూసింది ఒకసారి. తన కొడుకుని జూకు తీసుకెళ్ళింది. వాడు కటకటాల వెనక వున్న జంతువుల్ని అచ్చం ఇలాగే చూశాడు.
రేఖకు ఏదోగా అనిపించింది. బస్‌లో వున్నవాళ్ళంతా తమకేసే చూస్తున్నారని పించింది.
సుందర్రావు తల చంద్రం తలకు తగిలింది. చంద్రం తృళ్ళిపడ్డాడు. ఎదురు సీటు కుర్రవాడు చప్పట్లుకొట్టి కిలకిలా నవ్వాడు. రేఖకు బస్తో సహా భూమిలోకి కృంగిపోతే బాగుండును అనిపించింది.
చంద్రం తలకు తన తల ఢీ ఇచ్చేసరికి తృళ్ళిపడి లేచి సర్దుకొని కూర్చున్నాడు సుందర్రావు. ”సారీ!” అన్నాడు చంద్రాన్ని చూస్త. చంద్రం చిరునవ్వు నవ్వాడు రేఖను చూస్తూ.
”మీరు ఇలా కూర్చోండి” అంటూ రేఖ లేచింది. సుందర్రావు కిటికీ పక్కగా కూర్చున్నాడు.
చంద్రం రేఖకు కళ్ళతోనే ధన్య వాదాలు తెలుపుకున్నాడు. అలా సీటు మారుస్తున్నప్పుడు రేఖ వెనక సీట్లో కూర్చున్న వాళ్లందర్నీ పరికించి చూసింది. ఎవరి గొడవలో వాళ్లున్నారు. రిలీఫ్‌గా నిట్టూర్చింది.
బస్ నార్కెట్‌పల్లిలో ఆగింది. సుందర్రావు ఆరడజను అరటిపళ్ళు కొన్నాడు. రెండు పళ్ళు తుంచి భార్యకు ఇవ్వబోయడు. ‘వద్దు!’ అన్నది రేఖ.
”తీసుకోండి!” చంద్రానికి ఇవ్వబోయాడు.
”వద్దండీ!” అంటనే మొహమాటపడుతూ రేఖ మీదుగా చెయ్యి చాచి ఒక పండు మాత్రం అందుకున్నాడు.
‘కాఫీ తాగుతావా?’
‘వద్దు!’ విసుగ్గా చిన్నగా అన్నది రేఖ.
చంద్రం పండు తినలేదు. కాళ్ళ దగ్గిరగా వున్న బుట్టలో పెట్టాడు.
సుందర్రావు ఐదు పళ్ళూ ఒకదానితర్వాత ఒకటి తింటూవుంటే రేఖకు కడుపులో దేవినట్టు అయింది.
రేఖ కొంచెం కుదుటపడ్డది. తను ఇద్దరి మధ్య కూర్చున్నది. బస్‌లో వాళ్లు తనను సుందర్రావు భార్య అనుకోరు. తన పక్కనవున్న యువకుడి భార్య అనుకుంటారు.
ఛ! ఏమిటి తను ఇలా ఆలోచిస్తున్నది?
‘మీ పేరు?’ అడిగాడు సుందర్రావు చంద్రాన్ని.
చంద్రం పేరు చెప్పాడు.
సుందర్రావు సంచిలోనుంచి పాన్ డబ్బా తీశాడు. కట్టిన పాన్లు పదిదాకా వున్నాయ్. ఒకటి చంద్రానికి అందించాడు. చంద్రం అందుకొని నోట్లో వేసుకున్నాడు. రేఖకు అందించబోయడు. ‘వద్దు’ – చాలా విసుగ్గా అన్నది. సుందర్రావ్ పాన్ వేసుకొని జర్దాకూడా వేసుకున్నాడు. ‘మీకు జర్దా కావాలా?’ చంద్రాన్ని అడిగాడు.
”వద్దండీ! నాకు తమలపాకుల అలవాటుకూడా లేదు. బోర్‌గా వుంది. అందుకే తీసుకున్నాను. మీరు బాగా నిద్రపోయారు.”
”అవును! నిద్రపట్టింది. నిద్రపడితే చాలు – వెధవ చమట ఒకటి!” అంటూ జేబులోనుంచి ఇంత లావు కర్చీపు తీసి ముఖమూ, మెడా తుడుచుకున్నాడు.
”ఎంత చమట పట్టిందో చూడు?” అంటూ తడిసిన రుమాలు భార్యకు చూపించాడు. ఆమె అటుకేసి చూడలేదు. చూపులు కిందకు దించుకుంది.
‘నెలలో ఇరవైరోజులు ప్రయాణం లోనే వుంటాను. అందుకే ప్రయాణం చేసేటప్పుడు నిద్ర అలవాటయింది.’
”మీరు ఏం చేస్తారు? అభ్యంతరం లేకపోతే…” చంద్రం సుందర్‌రావుతో సంభాషణ పెంచుతున్నాడు.
రేఖ వాళ్ళిద్దరి మాటలు విననట్టే కూర్చుంది.
‘చిన్న చిన్న రోడ్లు కాంట్రాక్టు చేస్తాను.’
”అంటే బాగా సంపాదిస్తారన్న మాట!”
”ఆ- ఏదో తమ దయ…”
వెధవ వినయం! మధ్యలో అతని దయ ఏమిటి? మనసులోనే విసుక్కుంది రేఖ.
సుందర్రావు కిటికీలోంచి వంగి జర్దా వేసుకున్న పాన్ తాలకు ఉమ్మి ఉమ్మూడు. అలా ఉమ్ముతున్నప్పుడ తీగలా సాగి కొద్దిగా అతని గడ్డం మీద నుంచి షర్టు మీద పడింది. కర్చీపుతో తుడుచుకున్నాడు. రేఖకు భర్తమీద కోపం వచ్చేస్తున్నది. అసహ్యం వేస్తున్నది. అక్కడినుంచి దూరంగా అతనికి చాలా దూరంగా పారిపోవాలనిపించింది.
‘ఏమిటి మాట్లాడటంలేదు? తలనొప్పి గా వున్నదా? సూర్యాపేటలో కాఫీ తాగుదాం!’ అన్నాడు సుందర్రావు భార్యనుద్దేశించి. ఆమె ఉలకలేదు. పలకలేదు. చంద్రం ఆమె భావాలను అర్థం చేసుకుంటున్నట్టు మధ్య మధ్య ఆమెకేసి జాలిగా చూస్తున్నాడు. రేఖ ఇబ్బందిగా కదిలింది.
”ఇప్పుడు బిజినెస్ పనిమీద వెళ్తున్నారా?” చంద్రం అడిగాడు.
‘లేదు. అత్తగారింటికి వెళ్తున్నాను. మా బాబు అక్కడే వున్నాడు….’
తను మధ్య వుండగా ఇద్దరూ చెరొకవైపునుంచి మాట్లాడుత వుంటే రేఖకు చిర్రెత్తుకొచ్చింది. అసహనంగా లేచి నిల్చుంది.
‘ఏమిటి? ఏం కావాలి?’ భర్త మృదు వుగా అడిగాడు.
”మీరు ఇలా కూర్చుని మాట్లాడు కోండి.”
రేఖ మళ్ళీ కిటికీ దగ్గర కూర్చుంది. బయటికి చూస్తూ కూర్చుంది. కిటికీకి అతుక్కుపోయినట్టు కూర్చుంది.
బస్ వేగంగా పోతున్నది.
సుందర్రావు మళ్ళీ నిద్రకు పడ్డాడు. ఈసారి శబ్దం కొత్తగా విన్పించి తలతిప్పి చూసింది. నోరు మూసుకొని వున్నది. ముక్కోళ్లు మాత్రం కదులుతున్నయ్. నోరు తెరిచినప్పుడు వచ్చిన గురక శబ్దానికీ, ఈ శబ్దానికీ ఎంతో తేడా వుంది.
ముందు సీటు కుర్రాడు మళ్ళీ లేచి వెనకకు తిరిగి మొకాళ్ళమీద కూర్చుని సుందర్రావును ఆనందంగా చూడసాగాడు.
రేఖ సిగ్గుతో తనలోకి తను ముడుచు కొని పోసాగింది.
తను పది సంవత్సరాలు ఈ భర్తతోనా కాపరం చేసింది?
రోజు రాత్రిళ్ళు తన పక్కన పడుకొని గురక పెడ్తూనే వున్నాడు. కాని తనెప్పుడ ఆ గురకను ప్రత్యేకంగా పట్టించుకోలేదు. భర్తను వింతగా చూడలేదు. తన భర్త ఇంత ఘోరంగా వుంటాడనే భావం కూడా ఏనాడూ కలగలేదు.
ఆ యువకుడు ఏమను కుంటున్నాడో? తమ ఇద్దరి దాంపత్యాన్ని గురించి ఆలోచిస్తూ నవ్వుకుంటున్నాడేమొ?
రేఖ మెడ నొప్పి పుట్టినా కిటికీనుంచి తల తిప్పకుండా కూర్చుంది.
సూర్యాపేటలో బస్ ఆగింది.
అందరూ దిగుతున్నారు.
‘రేఖా! దిగు, కాఫీ తాగుదాం!’ అన్నాడు సుందర్రావు.
రేఖకు అతనితో కాఫీ హోటల్లోకి వెళ్ళాలని లేదు. ”మీరు తాగండి. నాకు అక్కర్లేదు.” అన్నది.
”ఇక్కడకు తీసుకొస్తాను. ఇడ్లీకూడా తెస్తాను.”
‘ఏమీ వద్దంటుంటే!’ తీవ్రంగా వున్నది రేఖ కంఠం.
ఓ క్షణం రేఖ ముఖంలోకి చిత్రంగా చూసి కిందకు దిగాడు సుంద ర్రావు. రేఖ రిలీఫ్‌గా గాలి పీల్చుకుంది.
ముందు సీట్లో కూర్చున్న వాళ్ళను అంతవరకూ రేఖ గమనించలేదు. అతను ఏదో అంటున్నాడు. అతను అందంగా వున్నాడు. ఆమె ఓ మొస్తరుగా వున్నది. ‘ఎందుకండీ బస్లోకూడా సతాయిస్తారు’ అంటున్నది ఏడుపు గొంతుతో.
‘నీ ముఖం చూడాలంటేనే అసహ్యం. పిల్లల కోసం… తప్పక…’
‘నాకు తలనొప్పిగా వుంది. దయ చేసి ఒక కప్పు కాఫీ, ఒక యాస్ప్రిన్ ఇప్పించండి.’ కణతలు నొక్కుకుంటూ అన్నది. అతను నవ్వాడు. క్రూరంగా నవ్వాడు. సంతృప్తిగా నవ్వాడు. రేఖ అతన్నే చూస్తూ వుండిపోయింది. అతను కొడుకుని తీసుకొని బస్ దిగాడు. ఆమె కళ్ళు తుడుచుకుంది. రేఖకు ఆమెమీద జాలి వేసింది. తన దగ్గిరవున్న శారిడాన్ ఇవ్వాలనుకుంది.
తను ఆమెను చూసి జాలిపడే స్థితిలో వున్నదా? ఆమె భర్త అందంగా వున్నాడు. అదృష్టవంతురాలు. అలాంటి భర్త కోపగించుకుంటే మాత్రం ఏం?
దూరం నుంచి ఒక చేత్తో ఇడ్లీ ప్లేటు, మరో చేత్తో కాఫీ గ్లాసూ పట్టుకొని వస్తున్న భర్తను చూస్తుంటే రేఖకు బస్నుంచి దూకి పారిపోవాలనిపించింది. హే భగవాన్! ఈ అవతారంతో ఇంకెంత కాలం? బుద్ధి వచ్చింది. తను మరెక్కడికీ బయటికి వెళ్ళదు. దూరంగా నిల్చుని చంద్రం సిగరెట్ తాగుతూ తననే చూడటం గమనించి రేఖ ముఖం తిప్పుకుంది.
‘వద్దని చెప్పలేదూ?’ కస్సున లేచింది భర్త మీద.
‘ఇంకా మూడు గంటలు ప్రయాణం చెయ్యలి. పొద్దుటనగా టిఫిన్ చేశావు. తీసుకో!’ ప్రేమగా అన్నాడు ఇడ్లీప్లేటు అందిస్తూ.
‘నాకు వద్దంటుంటే? అవతల పారేయ్!’ విసుక్కుంది రేఖ.
”నామీద కోపం వచ్చిందా?”
ముందు సీటులోవున్న ఆవిడ వెనక్కు తిరిగి సీటు పైనుంచి ఇద్దర్నీ మార్చి మార్చి చూసింది.
”అక్కర్లేదంటుంటే విన్పించడంలా?” రేఖ విసుగ్గా ముఖం తిప్పుకుంది.
సుందర్రావు బిక్క మొహంవేసి వెనక్కు తిరిగి రెండు చేతుల్తో రెండూ పట్టుకొని కాఫీ హోటల్‌కేసి నడుస్తుంటే, రేఖకు ఎలుగుబంటు వెనక కాళ్ళమీద వెళ్తున్నట్టు అన్పించింది.
అప్రయత్నంగా దూరంగా నిల్చున్న చంద్రంకేసి చూసింది. అతను వెళ్తున్న సుందర్రావును చూస్తున్నాడు. రేఖ శిరస్సు సిగ్గుతో వాలిపోయింది.
‘అదేమిటమ్మూ! ఆయన పాపం, ప్రేమగా తినమంటూ వుంటే…’
రేఖ గిర్రున తలతిప్పి చూసింది.
ముందు సీట్లోవున్న యువతి అంటోంది – ”భర్త దొరుకుతాడు అందరికీ! కానీ ప్రేమించే భర్త దొరకడం అదృష్టం. ఆ అదృష్టం మీలాంటి కొందరికే లభిస్తుంది.”
రేఖ కళ్ళు పెద్దవిచేసి ఆ యువతి ముఖంలోకి చూసింది.
సమాధానం ఎలా చెప్పాలో తెలియలేదు.
అంతలో కొడుకుని వెంటబెట్టుకొని ఆమె భర్త వచ్చాడు.
”కాఫీ ఏదీ?” భార్య అడిగింది.
”నీ మొహానికి నేను బస్ దగ్గరకు కాఫీ మొసుకురావాలా? ఇంటికెళ్ళాక తాగొచ్చులే. ఇంకా రెండు గంటలేగా?” అన్నాడు ఆమె భర్త.
ఆమె కిక్కురుమనలేదు.
రేఖకు జాలివేసింది. అతను కొండచిలవలా కన్పించాడు రేఖ కళ్ళకు.
ఇప్పుడు ఆమె కళ్ళకు అతను అందంగా కన్పించటంలేదు. తనే అయితే? ఇలాంటి వాడితో ఒక్కరోజుకూడా కాపరం చేసేది కాదు. ఇంత క్రూయల్టీయా?
దూరంగా సుందర్రావు వస్తూ కన్పించాడు. అతని ముఖం చిన్నబుచ్చుకొని వున్నాడు. భర్తనే చూస్తూ వున్నది రేఖ. సుందర్రావు దగ్గరగా వచ్చాడు. ఆ ముఖంలో ఎంతో అలసట కన్పించింది.
పాపం! రాత్రింబవళ్ళు కష్టపడతాడు- ఎవరికోసం? భార్య కోసం! బిడ్డ కోసం! ఒక్కనాడూ తనను నొప్పించేలా ప్రవర్తించలేదు. అమృతహృదయుడు! అమాయకుడు!
మనిషికి కావల్సింది హృదయ సౌందర్యం! హృదయ సౌందర్యంలేని బాహ్య సౌందర్యం ఎందుకు? కోసుకు తినడానికా? బాహ్య సౌందర్యం హృదయ సౌందర్యం లోపించినప్పుడు, అది వికృతంగా కన్పిస్తుంది.
భర్త దగ్గరగా వచ్చాడు. అతన్ని చూస్తుంటే రేఖకు జాలివేసింది. తనమీద తనకే అసహ్యం వేసింది.
”చూడండీ, ఒక సోడా పిలవండి. అర్థరూపాయికి పల్లీలు తీసుకురండి” అన్నది.
సుందర్రావు భార్య ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం ప్రశాంతంగా వున్నది.
బస్ కదిలింది. రేఖ పల్లీలు తింటూ కూర్చుంది. పక్కన కూర్చున్న చంద్రం కేసి చూడలేదు.
సుందర్రావు పాన్ తీశాడు. భార్యకు అందించాడు. ఆమె తీసుకుంది. సుందర్రావు చంద్రానికి కూడా పాన్ ఇచ్చాడు.
బస్ వేగంగా పోతున్నది.
సుందర్రావు నిద్రలోకి జారి పోయాడు.
గురక పెడుతున్నాడు.
రేఖ అతని ముఖంలోకి చూసింది.
ఆ ముఖంలో పది సంవత్సరాల తాలకు కఠిన పరిశ్రమవల్ల కలిగిన అలసట కనిపిస్తున్నది. అలా నిద్రపోతున్న సుందర్రావు ముఖంలో పసివాడి అమాయకత్వం కన్పించింది.
రేఖ కళ్ళముందు కొడుకు కన్పించాడు.
భర్త గురక విన్పిస్తున్నది.
రేఖకు ఇప్పుడు ఆ గురక అసహ్యాన్ని కలిగించడం లేదు. ఎవరైనా చూస్తున్నారనే సిగ్గుకూడా కలగడంలేదు.
నిర్లిప్తంగా బస్ కిటికీలోనుంచి బయటికి చూస్తూ కూర్చుంది.
(డా|| వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
2001-2003 మధ్య కాలంలో సీతాదేవిగారి ఇంటి వెనుకనే (బేగంపేట – ప్రకాష్ నగర్) ఉండేవాడ్ని. నా రచనలను చదివి వారి అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయమన్నప్పుడు, ఏనాడూ విసుక్కోకుండా, ఓపిగ్గా చదివి, విపులంగా సమీక్షించిన విధానం నేనెప్పటికీ మరువలేను. తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా మహిళా రచయితలలో – వారు నిజంగా వటవృక్షమే…! వారి రచనల నీడలో ఎంతసేపయినా సేద తీరవచ్చు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తూ…!!
ఇమ సాఇసౌమ్యస్రీ కసపకసైఇ ప్రియన్కసైకుమార3 సైఇకుమర అఉగ14