కొండేపూడి నిర్మల
రావూరి భరద్వాజ తెలుసా మీకు!?
చాలామంచి రచయిత.దృశ్యాన్ని కళ్ళకు కట్టే కధనశైలి, చమత్కారం హాస్యం ఆయన శైలి. విజయనగర కాలనీలో వున్నప్పుడు మార్నింగ్‌వాక్ నుంచి మా ఇంటికి వస్తూ వుండేవారు. కప్పు కాఫీతో ఎన్నో కబుర్లు కలబోసుకునే వాళ్ళం. ఆయన చెప్పే అన్ని కబుర్ల కాంతమ్మ జ్ఞాపకాల దగ్గర ఆగిపోతుండేవి. గాలి బరువెక్కేది. ఒకసారి ఆయన చెప్పిన విషయం తల్చుకుంటే ఇప్పటికీ పొట్ట చెక్కలవుతుంది. తనకి పెళ్ళయిన కొత్తలో భార్యను ఒక ప్రశ్న అడిగాట్ట. రచయితగానేకాక సహృదయుడైన మగవాడిగా తన స్థానం ఆమె దగ్గర నిలబెట్టకోవాలనే ఆకాంక్ష ఆ ప్రశ్నలో వుందన్నమాట. సంభాషణ యధాతదంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ”కాంతం, ఇట్రా ఇక్కడ కూచో . అబ్బా పని ఎప్పుడూ వున్నదేగా, నాతో కాసేపు కబుర్లు చెప్పు” భరద్వాజ
”ఏం చెప్పాలయా” తడి చేతులు కొంగుతో తుడుచుకుంటూ కాంతం వచ్చింది.
”నేను అడిగే ప్రశ్నకి నిజం చెప్పాలి మరి!?”
”ముందరి కాళ్ళకి బంధమా ఏమిటి, అడుగు, అబద్దం ఎందుకు చెబుతాను.”
” నన్ను చూడకముందు నీకెవరైనా నచ్చారా?”
”సరిపోయింది పొద్దున్నే ఇంకెవరూ దొరకలేదా నీకు, పక్కకి తప్పుకో నాకు పనుంది.”
”కాదు కాంతం, కూచో ,నన్ను చూడకముందు కూడా పెళ్ళి చూపులు జరిగాయి కదా”
”అయితే…!?”
”అదేమరి…వాళ్ళలో ఎవరూ నచ్చలేదా?”
ఎవ్వరూ నచ్చలేదు. నువ్వే నచ్చావు సరేనా, తప్పుుకో ముందు, పొయ్యి మీద పాలు పెట్టి వచ్చాను.
”వెధవ పాలు పోతే పోనీ, సరిగ్గా గుర్తుచేసుకుని చెప్పు. కాకంటే ముందు నీకెవరూ నచ్చలేదా?
”…….”
”నేను రచయితనని నీకు తెలుసు అర్ధం చేసుకుంటాననీ తెలుసు. వూరికే అడుగుతున్నాను. ఫర్వాలేదు చెప్పు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఏవో చెబుత వుంటాకదా. నిన్ను వినకపోవడం అన్యా యం. అంచేత అడుగుతున్నానను.”
”నేను రచయితని కాదు గిచయితనీ కాదు. అంచేత నా దగ్గర అలాంటి కబుర్లేమీ లేవు సరేనా.”
” అలా అనకు చెప్పు. నాకంటే ముందు నీకు వచ్చిన పెళ్ళి సంబంధాలు గుర్తు చేసుకుని చెప్పు..”
”అమలాపురం నుంచి ఒక సంబంధం వచ్చింది. అది కుదరలేదు కదా. అయినా ఎందుకిప్పుడవన్నీ”
”అడిగినప్పుడు చెప్పొచ్చుగా”
”నచ్చిందండీ, సరేనా, అమలాపురం కుర్రాడు…”
”వెరిగుడ్, అదీ అలాగ…స్పోర్టివ్‌గా వుండాలి మరి…”
”రెండు బండ్ల మీద వచ్చారు పెళ్ళిచూపులకి, ఇరవై మందిట, అందరూ బీరకాయ పీచు చుట్టాలేనట,”
”ఓహో”
”పగలు టిఫీనీలు తిని బయల్దేరి మధ్యాహ్న భోజనాలకి దిగారు. మా పిన్నిగారింటో ఏర్పాటు చేశారు మా వాళ్ళు.”
” ఎందుకలాగ, ఓహో అతికితే కతకదంటార్లే ఔను.”
”భోజనాలు అయ్యేటప్పటికీ నాలుగయింది. ఎక్కడినుంచి మొదలైందో మబ్బులేని వాన, దడదడలాడించింది. బిలబిల్లాడుతూ అందరూ మా ఇంటి కొచ్చేశారు, గొడుగు లేసుకుని, పిన్నిగారిల్లు బాగా చిన్నది లెండి.”
”పెళ్ళి చూపులు అయ్యాయా లేదా?”
”ఇంకా అప్పటికి లేదు. సాయింత్రం ఆరింటివరకూ వర్జ్యం వుంది.నన్ను చూడకూడదన్నారు.”
”అదొక ఛాదస్తం”
”అబ్బో మా వాళ్ళకీ వుంది లెండి ఈ పైత్యం”
”సర్లే సర్లే చెప్పు”
”నన్ను తీసికెళ్ళి సామాన్ల గదిలో పడేశారు. పెళ్ళోరందరినీ చాపలేసి హాల్లో కూచోపెట్టారు. కరెంట్ లేదు. పెట్రో మాక్సు లైటే దిక్కు.”
”భలే వుందే”
”ఊ.. ఇంకా వుంది వినండి. పెద్ద వాళ్ళు చెప్పిన ముహూర్తందాకా ఆగలేక పెళ్ళికొడుకును చూపించాడానికి మా పిన్ని కూతురు ప్లాన్ చేసింది. ఎలాగోలా కష్టపడి ఒక కిటీకి రెక్క తెరిచింది. అది ఎప్పటినుంచో మూసివుంది కదా. కిర్రు మంటూ చప్పుడు…” పెద్దవాళ్ళొచ్చి తిట్టారు పాపం దాన్ని…నా కోసం అది తిట్లు తింది”
”చూళ్ళేదా అయితే”
”చూశాను. ఎవరి కబుర్లలో వాళ్ళు పడిపోయి కిటికీ రెక్క ముయ్యడం మర్చిపోయారు.పిన్ని కూతురు రాజ్యలక్ష్మి నా చెయ్యి పట్టుకుని కిటికీలోంచి చూపించింది.”
”కనిపించాడా?”
”నాబొంద కనిపించాడు. వెనక్కి తిరిగి వున్నాడు కదా వీపు ఒక్కటే చూశాను. ఉంగరాల జుట్టు, మెళ్ళో ఏదో తాయత్తు, నీలంగళ్ళు చొక్కా… అంతే యింకేమీ కనిపించలేదు. సరే ముహూర్తానికే చూడొచ్చులే అనుకుని వూరుకున్నాను.”
” ఒకె ఇదీ బానే వుంది”
”ఏమిటి బావుందీ? సాయంత్రానికీ కరెంటు లేదు. నన్ను చూడ్డమే.. ముఖ్యమనుకున్నారో ఏమొ నా మొహానికి ఎదురుగా పెట్రోమాక్సు లైటోకటి పెట్టారు. ఆ దీపానికి వెనకగా ఒక ఇరవై మొహాలు.
అందులో పెళ్ళికొడుకెవరో, కాని నా కొడుకెవరో ఎవరు చెబుతారు. అదిగో చిట్టీ ఆ తెల్ల చొక్కా అబ్బాయి పెళ్ళికొడుకు అన్నాడు మా మామయ్య. ఇందాకే కదా గళ్ళ చొక్కా అనుకున్నాను. ఇంతలోనే చొక్కాలెందుకబ్బా మార్చడం అనుకున్నా. చూద్దామా అంటే సిగ్గు, సరే చూశాననుకో బానే వున్నాడు కెంపులాగా… అయితే తెల్లచొక్కాధారులు ఇద్దరున్నారు మరి… ఇంకోసారి చూద్దామనుకునేలోగా పిల్లను లోపలికి తీస్కెళ్ళండి అన్నారు. అంతే తలొంచుకుని వచ్చేశాను.”
”అయ్యె”
”అదేమరి, కానీ అవాళ ఆగిపోయారు?”
”ఎందుకు? నువ్వు చూడ్డం కోసమేనా!?”
”సరేలెండి సంబరం . వానలో ఎక్కడికి పోతారు. కుంభవృష్టిలాగా కురిసింది. పొలో మంటూ రాత్రికి భోజనాలకి పిన్నిగారిల్లు, చలో మంటూ నిద్రపోవడానికి మా ఇల్లు. బళ్ళ మీద గొడుగుల్లోనూ మా వాళ్ళు మర్యాదలు..”
”పోనీ రాత్రికి మాట్లాడు కోవాల్సింది.”
”ఇంకా నయం. మీరైతే అలాగే చేసేవారేమొ.నేను నిప్పులాంటి పిల్లని.”
”అబ్బో”
”ఏం కాదా ఏమిటి? అతని బంధువుల మధ్య అతనూ, మా బంధువుల మధ్య సామాన్ల గదిలో నేనూ ఏమీ మాట్లాకోకుండానే నిద్రపోయం.”
”సరే తర్వాత”
”తర్వాతేముంది. తెల్లారు ఝమునే అబ్బాయికి ఒక వెండి చెంబు నిండా నీళ్ళిచ్చి, మా తమ్ముడ్ని తోడిచ్చి బయలుకి పంపారు. అతను బాగా మొహమాటస్థుడిలా వున్నాడు. బావమరిది అవసరం లేదన్నాడు. ఒక్కడే వెళ్ళాడు.
”మార్కులు బానే కొట్టాశాడుగా”
”ఔను కొట్టేశాడు”
”ఔనా చెప్పు అతన్ని నువ్వు బాగా ఇష్టపడ్డావా?”
”ఇష్ట పడ్డాను. కాని పెళ్ళికొడుకేడీ? పెళ్ళి కొడుకులేడు వెండి చెంబు లేదు.”
”చూశావా? రూపాన్ని చూసి మొసపోకూడదన్నమాట, అందరూ నాలాంటి సహృదయులుండరు మరి… ఇప్పుడేమనుకుంటావ్ నేనే నయం అనా…”
”హృదయనిదేముందిలెండి ఆ ఒక్క రోజూ తొందర పడకపోతే పెళ్ళి కుదిరిపోయేది కదా. ఏనే అతనిదాన్నయితే ఒక్క వెండి చెంబేమిడి? ఇంట్లో వున్న బెంబులన్నీ అతనివి కాదా! మహా దుడుకు మనిషి నన్నడిగితేనే సాయం చెయ్యనా? ఏ మాటకా మాటే అనుకోవాలి. ఆ ఉంగరాల జుట్ట, కోరమాసం…ఎక్కడున్నాడో ఏమిటో…? ప్చ్ ఇప్పుడు తల్చుకుని ఏం లాభం లెండి…”
– భరద్వాజ ఈ కధనం ముగించేలోపు మేమంతా నవ్వుల్తో గిలగిలా కొట్టుకుంట వుంటాం. (మతిమరుపుని సమర్ధించుకోవడం కోసం నా పైత్యం కూడా ఇందులో చేరి వుండచ్చు. ఏమీ అనుకోవద్దు) కాంతం భర్తే కాదు, మీ భర్తో నా భర్తో అయినా సరే, మరీ అంత సూటిగా అన్ని విషయాల మాట్లాడితే ఏమయిపోతారు చెప్పండి?
స్త్రీల హృదయం అగాధమని పురుషులే కనిపెట్టారుకదా! అప్పుడింక ఎలాగో అలాగ ఏదో ఒకటి కనిపెట్టడానికి డూకేస్తే ఏమవుతుంది? అంతదరీ లేకుండా నిట్టనిలువుగా చచ్చిపోతారు! ఈ మాట కూడా భరద్వాజే చెప్పారు.
పెళ్ళాం దగ్గర మీసం తిప్పి ”ఆవిడ నవ్వింది, ఈవిడ చూసింది” అంటూ గప్పాలు కొట్టే మగలోకంలో ఆడవాళ్ళ వ్యక్తీకరణ విద్యుత్ కంపన లాగే వుంటుంది.
ఒకానొక స్త్రీ భగవంతుడ్ని ఇలా కోరుకుందట, ”దేవుడా నా భర్తనుఅర్ధం చేసుకునే వివేకం ఇవ్వు. మూర్ఖత్వాన్ని భరించే సహనం యివ్వు, అజ్ఞానాన్ని క్షమించే దయగుణం ఇవ్వు
కానీ వాటికోసం మళ్ళీ కొత్త శక్తిని మాత్రం ఇవ్వకు. ఎందుకంటే ఆ బలంతో నేను అతన్ని ఏం చేస్తానో నాకేతెలీదు.” (ఇవాళ ఒక దినపత్రికలో వచ్చింది.)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags