శైలజామిత్ర్రా
ఆ దృశ్యాన్ని మనసు ముంగిలిలోనే వుంచదలిచాను
ఏ కుంచె గీయలేని, గీయకూడని ఆ రక్తపాతాన్ని
చూడనీయకుండా…
నా బిడ్డను కడుపులోనే దాచివుంచాను…
ఆ మారణహోమాన్ని… గర్భశోకాన్ని
చూడలేక వినలేక, మరచిపోలేక…
నేను నేనుగానే వుండదలిచాను..
బతుకు నడిబజారులో షోకేసు బొమ్మలా నిలబడి
చాలీచాలని బట్టలతో మెతుకుకై పోరాటం సాగించేకన్నా
అమ్మాయి అని నేను పిలిపించుకోవాలనే ఆశను తుడిచివేసాను
ఆరేళ్ళనుండి ఆరవై ఏళ్ళవరకు
ఒక ఆనందపు పావుగా బిక్కుబిక్కుమని బతికేకన్నా
పిండ దశలోనే బ్రహ్మాండాన్ని కాదలిచాను
ప్రేమపేరుతో ప్రేతాత్మలై వెంబడిస్తూ…
పైశాచిక వృత్తులతో విగతజీవులయ్యేకన్నా
ప్రేమ పదాన్నే నా జీవితం నుండి తొలగించాలనుకుంటున్నాను
పెళ్ళి పేరుతో తాలాట్టుబొమ్మగా తలాడించేకన్నా
కన్యగానే తలెత్తుకు తిరగాలనుకుంటున్నాను…
సాఫ్ట్‌వేర్ భార్యగా ప్రింటింగ్ మెషీన్ అయ్యేకన్నా
హార్డ్‌వేర్ గుండెతో బతికే విధానాన్నే ఎంచుకుంటున్నాను
నిందల్నిమొస్తూ నివురుకప్పిన నిప్పులా బతికేకన్నా
మండుతున్న కాగడానై ఆ వెలుతురులోనే జీవించాలను కుంటున్నాను
అనువనపు చూపులమధ్య భార్యపదవి పొందేకన్నా
ఆవమానాల మధ్య పుట్టింటిలోనే వుండాలనుకుంటున్నాను
అవహేళనల మధ్య కోడలిగా మసిలేకన్నా
అవరోధాల్ని జయించి అబలను కానని తెలపాలనుకుంటున్నాను
అమ్మను అమ్మకానికి పెట్టేదశరాకుండా
అమ్ములపొదినై దూసుకుపోవాలనుకుంటున్నాను
అమ్మలో కూడా కల్తీ కనబడుతున్న ఈ రోజుల్లో
ఆడజన్మనే తిరగరాయలనుకుంటున్నాను…
బలిపీఠం
కొప్పూర్తి వసుంధర
అత్తవారింటి గుడినుండి
అమ్మవారు పుట్టింటి పూరిగుడిసెలోకి అడుగుపెట్టింది,
ఇక ”జాతరకు” అంకురార్పణ జరిగినట్లే,
పేడతో అలికిన పుట్టిల్లే అమ్మవారికి పసిడిమేడ,
చలిమిడి, పానకాలే అమ్మవారికి నైవేద్యాలు,
అమ్మవారికి ఆటవిడుపు పుట్టింటి పూరిగుడిసెలోను,
అమ్మవారు గణాచారిని పూనింది,
ఒక చేత వేపమండ, ఒక చేత కొరడా,
భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అమ్మవారి నోటినుండి
గ్రామపెద్దల రహస్యాలన్నీ గణాచారి కెరుకే,
అందుకేనేమొ లేతకోడిపెట్ట, కల్లుకుండ నైవేద్యాలు
వచ్చే ఏటికి బ్రతుకు బాగుంటే
అరటి పళ్ళ గెల మొక్కిందొక ఆడపడుచు,
కళ్యాణం చేయించమని కొత్తచీర మొక్కిందొక కన్నెపడుచు,
పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళడానికి మధ్య
అగ్నిప్రవేశం చేయలి కాబోలు,
”నిప్పుల గుండం” తొక్కి వెళుతోంది అమ్మవారు
ఊరంతా జాతర డప్పుల ప్రతిధ్వనులే,
ఆసాదుల కాలిగజ్జెల గలగలల్,
ముత్యాలమ్మ, పెద్దింట్లమ్మ, కొండాలమ్మ
ఏ పేరైతేనేంటి అమ్మవార్ల గుడులన్నీ ”బలపీఠాలే”
రాజునుండో, బంటునుండో మానాన్ని రక్షించుకొనే ప్రయత్నంలో
”శిలలా” స్థాణువై నిలిచిందొకామె,
భర్త అనుమానాన్ని మాపేందుకు అగ్నిగుండంలో దూకింది మరొకామె,
అత్త, ఆడపడుచుల ఆరళ్ళనుండి కాచుకొనేందుకు ఆత్మార్పణ కావించుకొన్నదొకామె,
జరిగే జాతర్లన్నంటిలో మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చేవి వారి వ్యథార్త గాథలే.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags