హైబర్నేషనా, హాలీడేనా, అదర్వైజ్‌ బిజీనా?”

పి.సత్యవతి
ఓపెన్‌ యూనివర్సిటీలు డైరెక్ట్‌గా డిగ్రీ పరీక్షలు రాయవచ్చన్నపుడు చాలామంది ఎంతో ఉత్సాహంతో రాయడానికొచ్చారు. అందులో వింతేమీ లేదు. ఆ వచ్చిన వాళ్ళల్లో చాలామంది మధ్య వయస్సు స్త్రీలు. అందులో చాలామంది గృహిణులు. అప్పటికి వాళ్ళు పరీక్ష హాలులో కాలు పెట్టి దశాబ్దాలై వుంటుంది. కొంత భయం కొంత నెర్వస్నెస్‌, ఒక కొత్త ఉత్సాహం కొంత తడబాటు, మూడు గంటల సేపు కదలకుండా కూర్చోడానికి కష్టంగా ఉండడం…అన్ని రకాల భావాలతో వాళ్ళు పేపర్లు తీసుకుని రాస్తున్నపుడు వాళ్ళకన్న చిన్న వాళ్ళైన ఇన్విజిలేటర్లు కొందరు వాళ్ళ మీద చతుర్లు వేసుకుని నవ్వుకోవడం…
”ఆ ఆంటీ నిలబడింది పేపర్‌ కావాల్ట”
”ఈ వమ్మకేంకావాలో చూడు” అనీ…
ఇన్విజిలేషన్‌ చేసినప్పుడల్లా చలంగారు గుర్తొచ్చేవారు నాకు…అయినా నేనంత కఠిన మనస్కురాల్ని కాదు కదా!! ఆ సంగతి మా విద్యార్థులకి తెలుసు… వాళ్లు పరీక్షకొచ్చే ముందు నేను రావాలని మా కాలేజీ పక్కనున్న ఆంజనేయస్వామికి మొక్కుకుని మొహాలనిండా తిరుచర్ణం పులుముకుని వచ్చేవాళ్ళు..
పరీక్ష అయ్యాక ఈ వయెజనుల్ని తీసుకుని వెళ్ళడానికి భర్తలు, కొడుకులు కొండొకచో కూతుళ్ళు వచ్చేవాళ్ళు. ఒకసారి ఇలా పహారా కాస్తున్నప్పుడొకావిడ దాదాపు అరవై ఏళ్ళావిడని చాలా దగ్గరగా చూశాను ఎలా రాస్తోందోనని. ఆవిడ మంచినీళ్ళడిగితే నేను తెచ్చుకున్నవి ఇవ్వడం మా పరిచయనికి నాంది.
”ఇంట్లో డిగ్రీలేని వాళ్ళెవరూ లేరు..నేనొక్కదాన్నే.. పంతొమ్మిది తొమ్ముదు లెంతంటే చెప్పలేరు మళ్ళీ.. అన్నింటికీ క్యాల్కులేటరు కావాలి…నేనూ ఆ రోజుల్లో ఎస్సెసెల్సీ చదివా” అందావిడ..ఆవిడ ఇంకో మాట కూడా అంది” క్రాప్‌ హాలిడే, టాక్స్‌ హాలిడే…అట్లా అంటారు కదా…నాకు నలభై సంవత్సరాల చదువు హాలిడే…”
ఈవిడకన్న కాస్త చిన్నావిడ” జంతువులు హైబర్నేషన్‌లోకి వెళ్ళినట్లు నేను కూడా ఒక ఇరవై ఏళ్లు హైబర్నేషన్లోకి పోయి ఇపుడు కాస్త వాతావరణం అనుకూలంగా ఉంటే ఇలా బయటికొచ్చా…రిస్వాన్‌ వింకిల్‌లాగా ఇరవై ఏళ్లు నిద్రపోయిలేస్తే అంతా కొత్తగా వుందిప్పుడు…”అంది
”అదేమిట్లేండి..మనమేం ఖాళీగా ఉన్నామా? ఎంత మల్టీ టాస్కింగ్‌ చేశాం… ఒక పనా రెండు పన్లా…” అంది ఇంకొకావిడ.” పొద్దున లేవగానే కాఫీ తాగుత పేపర్‌ చూడాలని నాకు చిన్నప్పట్నించీ ఆశ. ఇవ్వాళ్టీకికూడా తీరని కోరిక…ఇదుగో ఇప్పుడు ఈ పరీక్షలకి చదవడానికి ఎంత పొట్లాడాల్సోచ్చిందో” అంది మరొకావిడ…
ఈ మల్టీ టాస్కింగ్‌ అంతా ఇష్టంతోనో కష్టంతోనో చెయ్యక తప్పని పరిస్థితిని మార్చడానికి ఎంత ప్రయత్నం ఏ వైపునుంచి జరిగిందో జరుగుతుందో, తెలియనిదేమీ కాదు.
మన ఆంధ్రలోని యూనివర్సిటీలు ఈ సౌకర్యం ఇవ్వకముందు ఇల్లు వదిలి పదిరోజులు బయటి రాష్ట్రాలకి వెళ్ళి పరీక్ష రాసే వీలులేక చదువు ప్రసక్తి మర్చిపోయిన వాళ్ళున్నారు. డిగ్రీతోనే చదువు రాదని మనకి తెలుసు. కానీ ఒక ఉద్దేశం లేకుండా జ్ఞానం పెంచుకునే అవకాశాలు వత్రం ఎక్కడివి…? ఎవరో ఒక వట కాయిన్‌ చేశారొకసారి…”సుఖమరిగి” అని అంటే దేనికోసమైనా పోరాడాలంటే కొన్ని సుఖాలని ఒదులుకోవాలి. అవి ఒదులుకోలేని వాళ్ళకి ఈ మాట వర్తిస్తుందని…చదువూ, జ్ఞానం… గాలి పీల్చుకునే స్వతంత్రం ఇవి వదులు కోవడం, ఎవరికీ సుఖం కాదేమొ. ఇది కేవలం ”గృహశాంతి” చెయ్యడానికేనేమొ కదా… వెయ్యి త్యాగాలు చేసైనా ఒక గృహాన్ని శాంతి సౌభాగ్యాలతో వెలిగించాలి కదా??
”మా ఆవిడకి చాలా బద్ధకమండీ… పేపర్‌ కూడా చదవదు.” అన్నాడొకా యన…వాళ్ళింటికి వెళ్ళినపుడు..అట్లా అనేసి, నా కోసం కాఫీ పెట్టుకు రమ్మన్నాడు. అంతలోనే ఆవిడ కొడుకొచ్చాడు. వాడు హోంవర్క్‌ సాయం చెయ్యమన్నాడు. ఆవిడ కాఫీ తెచ్చింది, వెంటనే హోమ్‌ వర్క్‌ చూసింది..
ఒక కాలంలో పత్రికలు స్త్రీల రచనలకు ఎర్ర తివాచీలు పరిచాయి. అప్పుడు వెల్లువెత్తిన కలాలలో చాలావరకూ మిత విద్యావంతులైన గృహిణులవే అని మర్చిపోకూడదు. అవి గొప్ప సాహితీ విలువలతో కూడిన అమొఘ రచనలు కాకపోవచ్చు.. కానీ వాళ్ళ ఉత్సాహానికీ వాళ్ళకి లభించిన ప్రోత్సాహానికీ నిదర్శనాలు, అవి ఆర్థికంగా కూడా ఉపయెగంగా ఉండడంతో నిరుత్సాహపరచడం తగ్గింది,… సెకండ్‌ ఇన్నింగ్స్‌ మంచిదే…కానీ చాలాకాలం హాలిడే తీసుకున్న మెదడు, తీసుకోక ముందున్నంత చురుకుగా పనిచేస్తుందా అందరికీ? ఏ కొందరికో తప్పా?
జీవితంలో ‘ప్రైమ్‌టైమ్‌”గా భావించే వయసు ”అదర్వైజ్‌ బిజీ”గా గడపవలసి రావడంలో కుటుంబ బాధ్యత ఎంత? అది వేసిన భారమెంత? పంచుకున్న భారమెంత? ఆ భారాలన్నీ మొస్తూనే తమ వ్యాపకాలను, అభిరుచులను కాపాడుకునేందుకు మన గృహశాంతికామినులకు వారి వారి సహచరు లిస్తున్న సహకారమెంత? అందుకే మై డియర్‌ శాంతికామినుల, కొండంత గృహశాంతి, భూదేవంత సహన వైశాల్యమ్‌, చాలా బోలెడు మంచి పేరూ కన్న కాస్తంత నాణ్యమైన స్వంత సమయం మిన్న అని ఇప్పటికైనా గొంతు పెట్టుకుని అరవండి…

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.