స్త్రీవాదంపై బహుముఖ అధ్యయనం

అబ్బూరి ఛాయాదేవి
స్త్రీవాద ఉద్యమం మన రాష్ట్రంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ ప్రారంభమైనప్పటి నుంచీ స్త్రీల జీవితాలనూ, కొంతవరకు రాజకీయలనూ ప్రభావితం చేస్తున్నప్పటికీ, స్త్రీవాదం పట్లా, స్త్రీల చరిత్ర పట్లా, స్త్రీల అవసరాల పట్లా సరియైన అవగాహన లేదు చాలామందికి. పైగా ఎంతో మందికి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఈ సందర్భం లో, అన్వేషి రిసెర్చి సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌ ‘స్త్రీవాద రాజకీయలు-వర్తమాన చర్చలు’ అనే పరిశోధనాత్మక గ్రంథాన్ని రమా మెల్కోటె, కె. సజయ గార్ల సంపాదకత్వంలో వెలువరించడం అభినందనీయం, ఆహ్వానించదగిన విషయం.
అన్వేషి సభ్యులు తెలుగులో రాసిన కొన్ని వ్యాసాలతో పాటు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మహిళలు – స్త్రీవాద అధ్యయనంలోనూ, ఉద్యమ నిర్వహణలోనూ నిష్ణాతులైన మహిళలు వివిధ కోణాల నుంచి రాసిన ఆంగ్ల వ్యాసాలకు అన్వేషి సభ్యులు చేసిన అనువాదాలను చేర్చి ఒక సంకలనంగా తీసుకువచ్చారు. ఒక సమగ్ర చారిత్రక నేపథ్యాన్ని సమకూర్చిన సంపాదకుల వ్యాసం కాక, ఇంకా పద మూడు వ్యాసాలున్నాయి ఇందులో. జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ జెండర్‌ రాజకీయాల గురించీ, స్త్రీల భూమి హక్కుల గురించీ, ప్రపంచీకరణ నేపథ్యంలో జీవనాధారాలకై స్త్రీల పోరాటాల గురించీ, స్త్రీల ఆరోగ్యసమస్యల గురించీ, కొన్ని విలక్షణమైన దక్షిణ భారత సినిమాలలో చూపించిన జాతీయతలో స్త్రీల చిత్రణ గురించీ చారిత్రక, ఆర్థిక, సామాజిక, కౌటుంబిక, సాంస్కృతిక సంబంధిత వ్యాసాలున్నాయి ఈ సంకలనంలో.
భారతదేశంలో స్త్రీల సమస్యలపై జరిగే చర్చలనూ, ప్రభుత్వ విధానాలనూ సదవగాహన చేసుకోవడానికి, సంఘ సంస్కరణ ఉద్యమం గురించీ, జాతీయెద్యమం గురించీ, వర్తమాన స్త్రీల ఉద్యమాల గురించీ సమగ్రంగానూ, సంక్షిప్తంగానూ సంపాదకులు రమా మెల్కోటె, కె. సజయ రాసిన ‘స్త్రీల ఉద్యమం – వర్తమాన చర్చలు’ అనే వ్యాసం ఈ గ్రంథంలో మొదటిది. ఐక్యరాజ్యసమితి ఆదేశం మేరకు భారతదేశం 1974లో నియమించిన కమిటీ స్త్రీల హోదాపై సమర్పించిన నివేదిక ”ఒక పునాదిరాయిగా అధ్యయన సంస్థల స్థాపనకు, స్త్రీల అధ్యయనాలకు తోడ్పడింది.” ”స్త్రీల ఉద్యమాలను ప్రధాన స్రవంతి (main stream) రాజకీయలలో భాగంగా చేయాలనే వాదన అతిసమస్యాత్మకమైనది. ప్రధాన స్రవంతి అనేది రాజకీయలు కుల మత దురహంకారాలతో నియంత్రించ బడినప్పుడు, ఆ రాజకీయలను ఎదిరించడమే స్త్రీవాదం, స్త్రీవాద రాజకీయల కర్తవ్యం.” అంటారు ఈ వ్యాసరచయిత్రులు.
వీణా మజుందార్‌, ఇందు అగ్ని హోత్రి కలిసి రాసిన వ్యాసం ‘మారుతున్న రాజకీయ భాష్యం’ (అనువాదం : ఎస్‌. జయ). ”మారిన ప్రాపంచిక సందర్భంలో మారని సమస్యలు” అంటూ మొదలుపెట్టి, విస్తరిస్తున్న హింస గురించీ, వరకట్న వ్యతిరేక ఆందోళన గురించీ, ‘అమ్నియె సెంటెసిస్‌, సెక్స్‌ సెలెక్షన్‌’ గురించీ, జాతీయ జనాభా విధానం, మత దురహంకారం, మతతత్త్ వాదాల, కేసుల గురించీ వివరించారు. కులమతాలకు సంబంధించిన స్త్రీల సమస్యల విషయంలో సైద్ధాంతిక విభేదాలు, దృక్పథాలు వేరయినప్పటికీ ఐక్యంగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు” అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
‘స్త్రీల ప్రశ్నపై జాతీయవాద పరిష్కరణ’ గురించి. పార్థా ఛటర్జీ రాసిన వ్యాసం (అనువాదం : కోదండరామ్‌)లో బెంగాలీ స్త్రీల నేపథ్యాన్ని తీసుకుని, ఆధునిక స్త్రీల స్థితిగతుల్ని చర్చించారు. సంస్కర ణోద్యమం, జాతీయెద్యమం ప్రభావాల వల్ల కొందరు స్త్రీలు ఆధునికతని సాధించి నప్పటికీ, ఒక ”కొత్త తరహా పితృస్వామ్యానికి” ఎలా లోనయరో వివరించారు. కులమతాలకు చెందిన స్త్రీల హక్కుల గురించి ఉద్యమాలు కృషి చేయడమే కాకుండా, ”జాతీయవాదం పెంపొందించిన ఇంటా/బయట ఆత్మిక/భౌతిక/స్త్రీత్వం/పురుషత్వం అనే విభజనను కూడా అధిగమించాలి” అని సూచించారు.
దేశవిభజన కాలంలో వివిధ మతాలకు చెందిన స్త్రీలు ”లోతైన మానసిక, శారీరక హింసలను” అనుభవించాలని ఉదాహరణపూర్వకంగా వివరించారు ఊర్వశి బుటాలియ ‘మరుగునపడిన చరిత్రలు’ అనే వ్యాసంలో (అనువాదం : కె. సజయ).
‘కుటుంబ హింస చర్చలు – చట్టంలో ఇమడని స్త్రీల జీవితాలు – నేపథ్యం’ గురించి వసుధ నాగరాజ్‌, ఎ. సునీత కలిసి రాసిన వ్యాసంలో ”స్త్రీల పౌరసత్వాన్ని ఒక వాస్తవంగా తీసుకుని వారెదుర్కునే సమస్యల్ని హక్కుల ఉల్లంఘనలుగా చూసే అవగాహన నుండి స్త్రీల సమాన పౌరసత్వానికి గల అవకాశాలే మాత్రమున్నాయనే వైపు ప్రశ్నలు వెళ్తున్నాయి” అనే కోణం నుంచి అనేక వాస్తవాల్ని విపులంగా విశ్లేషించారు. ”చట్టం పనిచేసినా చేయకపోయినా, స్త్రీలు మాత్రం తమ పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటారు” అంటూ ఆశాపూరితంగా ముగించారు.
‘జెండర్‌ రాజకీయాలు’ చర్చించిన వ్యాసం వందనా సోనాల్కర్‌ రాసినది (అనువాదం : కె. సజయ, కె. ప్రసాద్‌). స్త్రీవాద ఉద్యమాలలో కృషి చేస్తున్నవారు ”ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది” అనీ, ”మన మధ్య చీలికలు వస్తాయని మనం గుర్తించటం అవసరం” అనీ, ”ఈ చీలికలను అధిగమించడానికి మనం కులం, పితృస్వామ్యం వంటి సామాజిక శక్తులపైన బాహాటంగా స్పష్టమైన పోరాటాన్ని నిర్వహించవలసి వుంటుంది. దీన్ని మన ఎజండాలో చేర్చుకుందాం” అన్నారు.
ఇదే అంశాన్ని మరింత లోతుగా, గోగు శ్యామల ‘అంటబడని జండర్‌’ అనే వ్యాసంలో దళితస్త్రీల సమస్యల గురించీ, వారి పోరాటాల గురించీ వివరించి, ”దళిత కుటుంబాల జీవితం భూమి, వ్యవసాయ పంటల నైపుణ్యం, పశుసంతతి నైపుణ్యం, తోళ్ళ నైపుణ్యం చుట్టూ ఉంటుంది” కనుక, ”పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా, నాగరికతను కాపాడుకోవాలన్నా భూమి మీద నైపుణ్యం ఉన్నవారిని తప్పనిసరిగా” కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందని స్పష్టం చేశారు.
‘లౌకికవాదంలో స్త్రీల ఉద్యమం ఎజండాను తిరిగి నిర్వచించుకోవాలి’ అనే విషయం గురించి, ముఖ్యంగా ఉద్యమాలనూ, చట్టాలనూ విశ్లేషిస్తూ ఫ్లేవియ ఎగ్నేస్‌ రాసిన వ్యాసానికి ఎస్‌. జయ అనువాదం చేశారు. ఆమె కూడా ఉద్యమంలో ”స్త్రీల భిన్నత్వాన్ని గుర్తిస్తున్నటువంటి మరింత సంక్లిష్టమైన వ్యూహం అవసరం” అన్నారు.
దేశాభివృద్ధిలో ‘జెండర్‌’కి ఉండ వలసిన, గుణాత్మకంగా పెరగవలసిన ప్రాధాన్యాన్ని గురించి ‘జెండర్‌, అభివృద్ధి, స్త్రీల ఉద్యమాలు – వర్తమాన చరిత్రలో సమస్యలు’ అనే వ్యాసాన్ని రాసినది మేరీజాన్‌ (అనువాదం : శ్యామసుందరి). అభివృద్ధిని అర్థశాస్త్రరీత్యానే కాకుండా, ”అభివృద్ధి సిద్ధాంతాలతో స్త్రీవాద ధోరణుల్ని జతపరచడం ద్వారా విశాలం చేయాలి. ”జెండర్‌”ను కేవలం అలవాటుగా ఉచ్చరించే జపంగా కాకుండా ఒక విశాలమైన, చైతన్యవంతమైన సామాజిక వ్యవస్థ నిర్మాణానికి అనువుగా మలచుకోవాలి. అందుకు ఒక సాధనంగా వాడుకోవాలి” అని బలంగా ప్రతిపాదించారు.
మరో కోణం నుంచి బీనా అగర్వాల్‌, ”…స్త్రీలకు భూమి మీద, భూ ఆధారిత జీవనాధారాల మీద స్వతంత్ర హక్కులు వుండటం అనే అంశాన్ని పునఃపరిశీలించవలసిన అవసరం ఉంది…ఉత్పత్తి సామర్థ్యం పెరగాలంటే జెండర్‌ అవగాహన, సమాన భాగస్వామ్యం అనే దిశగా ఆలోచించి నిర్ణయలు తీసుకోవాలి…అవరోధాలను సంపూర్తిగా తుడిచివేయల్సి వుంటుంది” అని వివరిస్తూ, ”స్త్రీలు సంఘాలుగా ఏర్పడటం అనే ప్రాధాన్యతను, తద్వారా మరింత కార్యాచరణను ఎలా రూపొందించు కుంటున్నారనే” విషయన్ని చర్చించారు – ‘భూమి, జీవనాధారాలపై జెండర్‌ అవగాహన’ అనే వ్యాసంలో (అనువాదం : కె. సజయ).
ఇదే విషయంపై దృష్టిని కేంద్రీకరిస్తూ, ‘స్త్రీల భూమి హక్కుల పోరాటాలు సంధిస్తున్న ప్రశ్నలు’ అనే వ్యాసం రాశారు కె. సజయ. ”వ్యవసాయ భూముల హక్కుల్లో జెండర్‌ వివక్ష బలంగా ఉండటం వల్ల, వాటి మీద జీవనోపాధికి ఆధారపడిన లక్షలాది మంది రైతు కూలీ స్త్రీలు చాలా విధాలుగా నష్టపోవడమే కాక, దుర్భరమైన దారిద్య్రంలోకి నెట్టివేయబడుతున్నారు” అని చెబుతూ, ”భూమి అంటే కేవలం ఆర్థిక వనరే కాదు, స్త్రీల జీవితంతో ముడిపడి వున్న సాంస్కృతిక అంశం” అనే విషయాన్ని స్పష్టం చేశారు సజయ.
ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీల బతుకుతెరువు గురించి చర్చిస్తూ, కె. లలిత స్త్రీల స్వయం సహాయక బృందాల స్వరూపాన్నీ, వాటిలోని సమస్యల్నీ వివరించి, వీరికి ”రాజకీయ భాగస్వామ్యం” ఎంతవరకు ఉంది అని ప్రశ్నిస్తూ, సాధికారతని సాధించేందుకు కొన్ని పరిష్కార వర్గాల్ని సూచించారు ‘బతుకుతెరువు : ప్రపంచీకరణ, స్త్రీలు’ అనే వ్యాసంలో.
ఈ సంకలనంలోని మిగిలిన రెండు వ్యాసాల భిన్నకోణాల నుంచి చర్చించిన అంశాల గురించి – 1) స్త్రీల ఆరోగ్య సమస్యలు, 2) సినిమాలలో మత సంఘర్షణల, స్త్రీపురుష సంబంధాల చిత్రణ.
గృహిణులు మొదలుకొని శ్రామిక స్త్రీల వరకూ అన్ని రంగాలలోని స్త్రీలలో ఎంతోమంది వెన్నునొప్పితో ఏయే కారణాల వల్ల బాధపడతారో, దానికి నివారణోపాయం ఏమిటో, దానికి వైద్యం ఏమిటో అందరికీ అర్థమయేటట్లుగా డా. వీణా శత్రుఘ్న, నిర్మల సౌందరరాజన్‌, పి. సుందరయ్య, లీలా రామన్‌ గార్లు రాసిన వ్యాసం ‘వెన్నునొప్పి – స్త్రీత్వపుబాధ’ (అనువాదం : సరయు కళ్యాణి.
ఆఖరి వ్యాసం తేజస్విని నిరంజన రాసిన ‘కొత్తరపు దాల్చిన జాతీయవాదం – స్త్రీవాదం, వర్తమాన దక్షిణ భారత సినిమా’ (అనువాదం : కె. సజయ). స్వాతంత్య్రా నంతరం కులమతాలకు అతీతమైన కాల్పనిక ప్రేమపై ఆధారపడిన ఒక నూతన జాతీ యతావాదం సినిమాల ద్వారా ప్రాచుర్యం పొందుతోంది అంటారు ఈ వ్యాస రచయిత్రి. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘గీతాంజలి’, ‘రోజా’, ‘బొంబాయి’ అనే మూడు సినిమాల ఈ నూతన జాతీయ తావాదాన్ని ”ఆమొదయెగ్యంగా” ప్రదర్శించిన తీరునీ, అందులో ఆధునిక స్త్రీని రూపొందించిన తీరునీ సునిశితంగా విశ్లేషించడం జరిగింది ఈ వ్యాసంలో. ”మణిరత్నం సినిమాలు రేకెత్తించే ప్రశ్నలు స్త్రీవాద రాజకీయల్ని పునరాలోచించాల్సిన అవసరాన్ని గుర్తిస్తే, దైనందిన జీవితాన్ని, రాజకీయల్ని ప్రభావితం చేసే జాతీయ వాదం, మానవతావాదం, లౌకిక వాదం అనే అంశాలతో ప్రారంభించాల్సి ఉంటుంది” అంటారు తేజస్విని నిరంజన.
మొదటే చెప్పినట్లుగా, ఇది పరిశోధనాత్మక, విశ్లేషణాత్మక వ్యాసాలతో కూడిన సంకలనం. ప్రతి వ్యాసం చివరనా, ఆ వ్యాస రచనకి దోహదపడిన ఆంగ్ల రచనల లిస్టు ఇవ్వబడింది. వర్తమాన స్త్రీవాద రాజకీయలపై మరింత చర్చ జరగడానికీ, ఉద్యమాలు ముందుకి పోవడానికీ స్పూర్తిని కలిగిస్తుంది ఈ గ్రంథం. ప్రొఫెసర్‌ కాత్యాయనీ విద్మహే అన్నట్లుగా (పుస్తకం వెనక), ”విశ్వవిద్యాలయ విద్యార్థులకు, పరిశోధకులకు, ప్రత్యేకించి మహిళా అధ్యయనాల పట్ల ఆసక్తి కలవారికి ప్రాథమిక పాఠ్యగ్రంథంగా ఇది ఉపకరిస్తుంది.
‘స్త్రీవాద రాజకీయలు : వర్తమాన చర్చలు’.
సంపాదకులు : రమా మెల్కోటె, కె. సజయ.
ప్రచురణ : అన్వేషి రిసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఉమెన్స్‌ స్టడీస్‌ (2008. 367 పేజీలు.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.