డా.ఎ.సీతారత్నం
(అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ వుమెన్ వారి కథల పోటీలో బహుమతి పొందిన కథ)
”ఒసే, సుజాతా! లేవే, పాడు నిద్ర…” అని గట్టిగా లేపింది తల్లి. అతికష్టం మీద లేచింది.
”ఈ రోజైనా పనికిరావే. రెండిళ్లు అప్పచెప్తా…” అంది తల్లి.
”అబ్బా! నేను పాచిపని చేయను…” విసుగ్గా అంది.
”ఏటీ సేయకుండా నిన్ను పెంచ డానికి నీ తాత ఇచ్చిన ముల్లె లేద… నీ మొగుడు ఇచ్చిందీ లేదు…” అంది కోపంగా.
”నీకెందుకు నా సంగతి…”
”ఎందుకా? వారం రోజులయింది. ఏ పనీలేదు. కాస్త గంజివార్చి తినేసి తొంగుటున్నావు… నిన్నెవరు పెంచుతారను కొంటున్నావు… ఇంతకీ మొగుడు వదిలేసినట్టేనా!”
”ఆడు ఇంకోర్తిని తగులుకొన్నాడు. బేంక్‌లో స్వీపర్ అది. అదీ సీపురే అట్టుకొంటుంది. కానీ సిల్కుసీర కట్టుకొని స్టీలు కేరేజీ పట్టుకొని పొద్దున్నెళ్తే రాత్రి వస్తుంది…”
”పేమ, పేమ అని కట్టుకొన్నావు…”
”సైకిలు మీద దొరబాబులా నా వెంటబడితే నిజమే ననుకొన్నా…” అంది విచారంగా.
అప్పుడే ఇంటి ముందు బైక్ ఆగింది. ఎవరా అని చూస్తే షావుకారు. కాంట్రాక్టర్‌లకి ఫైనాన్స్ చేస్తాడు.
”అప్పారావుని పిలు…” అన్నాడు బండి దిగకుండా.
రాత్రంతా తాగి తాగి పడి ఉన్నాడు. లేపినా లేవడు. ఏటి ఇసయం బాబ! నేసెప్తాను…” అంది.
”చిన్న మేస్త్రీ పని ఉందిట. ఈ రోజు అయిపోవాలట.”
”చెప్తాను. వస్తాడులెండి కానీ మా సుజాతకి ఏటైనా పనిప్పించండి.”
”ముఠాకి పంపీ. మొగుడు దగ్గరకి పోదా?”
”ఆడు బాగా సూసుకోటం లేదు…”
”సర్లేగానీ, రేపు ఫస్టు బస్సుకి బయల్దేరితే ముఠాకి అప్పచెప్తా…” అని వెళ్లిపోయాడు.
”ఉన్న నాలుగు చీరల పట్టుకొని చిన్న బేగ్‌తో పొద్దున్నే బయల్దేరింది సుజాత. సాలూరు నుండీ విశాఖపట్నం పోయే బస్సు ఎక్కింది. షావుకారు టికెట్టు తీసాడు. ఊరు వదిలి వెళ్లిపోతుంటే దిగులుగా అన్పించింది. పుట్టిల్లూ, అత్తిల్లూ ఒకే ఊర్లో ఉన్నాయి. అందుకే 25 సంవత్సరాలు ఆ ఊర్లోనే ఉంది. ఎంతో ఇష్టపడి చేసుకొన్న మొగుడు వదిలేస్తాడని కలలో కూడా అనుకోలేదు. పుట్టిన బిడ్డ మూడు నెలలు బ్రతికిచచ్చి పోయాడు. పొట్ట మీద చారలు తప్ప నా బతుక్కి ఏవీ లేదనుకొంది విచారంగా. మనసు నిస్సత్తువ అవడం ఏంటో తెలుస్తోంది.
షావుకారు సుజాతని తీసుకువచ్చి మేస్త్రీకి అప్పచెప్పాడు. మేస్త్రీ నాగరాజు గుబురుమీసాలతో నల్లగా, మత్తుగా, కళ్లు ఎఱ్ఱగా భయం కొల్పేటట్లు ఉన్నాడు. మేస్త్రీ ముఖం చూడ్డానికే భయమేస్తోంది. మేస్త్రీ ఓసారి తల పంకించి ”సిన్నా…” అన్నాడు.
గబగబా సిన్నమ్మ వచ్చింది. షావుకారుని పలకరించింది. ”ఇదిగో సుజాతమ్మ మనసు మంచిది. కాస్త జాగర్తగా చూసుకో.” అని సిన్నమ్మకి చెప్పి ”నీతో కలిపి 20 మంది ఆడాళ్లు, 30 మంది మగాళ్లు న్నారు. భయమేం లేదు.” అని చెప్పి వెళ్ళిపోయాడు.
జ జ జ
ముఠాకొచ్చిన సుజాత అలవాటులేని పనికి అలసిపోతోంది. మేస్త్రీని చూస్తే భయం. సిన్నమ్మ మాత్రమే మాట్లాడుతుంది. ప్రతిరోజూ మస్చరు కొట్టించుకోవాలి. సుజాత అప్పుడప్పుడ మరిచిపోతే సిన్నమ్మ తిట్టి మళ్లీ వెళ్లి మస్చరు కొట్టిస్తోంది. ఎన్ని మస్చర్లయితే అన్ని రోజుల కూలీ ఇస్తారు. సాధారణంగా మేస్త్రీ దగ్గరే డబ్బు ఉంచుతారు. ఊరెళ్లేటపుడు లెక్కేసి ఇస్తాడు. రోజూ మెస్‌కి 25 ర|| విరుపుకొంటాడు. ఆదివారం 20 ర|| ఒక్కొక్కర తీసుకొంటారు. ఆదివారం నాడు ఎవరికి నచ్చినట్టు వారు తిరుగుతారు. కొందరు సినిమాకి, కొందరు బజారుకి, మరికొందరు బీచ్‌కి వెళ్తారు. సుజాతకి ఎవరితో స్నేహం కుదరలేదు. మడిచేలు పోయిన దగ్గర్నుండీ సుజాతకి దిగులు మొదలయ్యింది. తర్వాత మొగుడు వదిలేసాడు. నీళ్లలో చేపని వొడ్డున పడేసి బతకమన్నట్టుగా ఉంది. వ్యవసాయం బాగా వచ్చిన సుజాతకి ముఠాపని కష్టంగానే ఉంది.
ముఠాలో పెళ్లి కాని పిల్లలు 16-18 సంవత్సరాలవాళ్లే ఎక్కువ. పిల్లల్ని అమ్ముమ్మల దగ్గరా, బామ్మల దగ్గరా వదిలి వచ్చినవాళ్లూ ఉన్నారు. మొగుడు వదిలేసినవాళ్లూ ఆరుగురున్నారు. తనలా మొగుడ్ని వదిలేసినవాళ్లు ఎవరూ లేరు అనుకొంది భారంగా. పెళ్లికాని పిల్లల సందడీ, హుషారే వేరు. వాళ్లు సినిమాకి పోవడానికే చూస్తారు. కుదరకపోతే అంత్యాక్షరి ఆడతారు. వీధి చివర ఉన్న ఇంటికి వెళ్లి టి.వి. చూస్తారు. సిన్నమ్మకి తెలిసిందంటే మాత్రం పెద్దయుద్ధమే అవుతుంది. వాళ్లు.ఊలు చేసి మస్చరలు ఎక్కువ వేయించుకొంటారు.
రోజూ ఎనిమిది గంటలకి పని మొదలవుతుంది. ఆరుగంటలదాకా చేస్తారు. ఎనిమిది గంటలలోపు ఒక ‘టీ’ కాస్త గంజన్నం పెట్టిస్తుంది సిన్నమ్మ. ఆదివారం మాత్రం పొద్దున్న పుళిహోర, రాత్రి పలావ్ చేయిస్తుంది. మెస్ అంతా సిన్నమ్మ బాధ్యతే. వంటవాడి సాయంతో వండి వడ్డన చేస్తుంది. వడ్డనపుడు సిన్నమ్మ వెయ్యి కళ్లతో చూస్తుంది. ఆడాళ్ల వరుసలో అంత గొడవ ఉండదు. వడ్డన కూడా సులువే. వాళ్లే ఎవరో ఒకరు లేచి వడ్డించుకొంటారు. వంటతను మగాళ్లందరికీ వడ్డిస్తాడు. కానీ ఆదివారం చాలా గొడవ. పలావ్ నచ్చితే తువ్వాల్లోనో, కేరేజీలోనో దాచేస్తారు. సిన్నమ్మ కంటబడిందో రాక్షసంగా అరుస్తూ అదినేలనన్నా పోయిస్తుంది గానీ పట్టుకెళ్లనివ్వదు. ఆదివారం రాత్రి చాలా కష్టదినం. మగాళ్లంతా ఎంతో కొంత సారా తాగేస్తారు. ఇష్టమొచ్చినట్టు వాగుతూ, ఉమ్ముతూ చీదరగా ఉంటుంది వాతావరణం. ఆ వాతావరణానికి సిన్నమ్మ వెటుతనమే సరియైనదేమొ, అలాంటపుడు సిన్నమ్మని చూస్తే సుజాతకి ‘ఆడదేనా’ అన్పిస్తుంది. పచ్చిబూతులు మాట్లాడుతుంది. ఎంత సిన్నమ్మ కాపలా కాసినా ఏదో చికాకే. ఒకే హాల్లో ఆడాళ్లు ఒక పక్క మగాళ్లు ఒక పక్క పడుకొంటారు.
ఒక ఆదివారం ఎవడో బాగా తాగివచ్చి ఆడవాళ్లవైపు ఒకమ్మాయి మీద పడ్డాడు. ఆ అమ్మాయి కెవ్వుకెవ్వుమని కేకలు వేసింది. పక్కనున్న అమ్మాయి వీపు మీద చరిచి పక్కకి లాగేరు. గట్టిగా పట్టుకొని నాలుగు బాదారు. బయటకు తోసారు. సిన్నమ్మ వచ్చింది ”ఏంటి” అని విషయం తెలుసుకొని రౌద్రరూపం దాల్చింది. ”ఓర్ని వెధవ నాయలా..నీ పెళ్లాం దగ్గర ఈచేవ చూపించిరా…”అని బూతులు తిడుతూ వంటతని సాయంతో లాక్కెళ్ళి హాలు చివర ఒక చీరతో కిటికీకి అతని చెయ్యి కట్టి పెద్ద గొంతుతో తిడుతూనే వుంది. కొద్ది సేపయ్యక ఆడవాళ్ల వైపు వచ్చింది. సిన్నమ్మని చూడగానే ” ఆడి పని మేస్త్రికి చెప్పు. మేం వూరుకోం…” అని చుట్టూ చేరి ఆవేశ పడ్డారు. ఆ పిల్లల్ని చూసి కొంచెం ఆశ్చర్యంగా ‘గడుసోల్లేగానీ మేస్త్రి ఏటి చేస్తాడు. కిసుక్కున నవ్వుతాడు”. అని వెంటనే కోపంగా మొహం మాడ్చి ‘నాకు తెలుసు. ఏది మేస్త్రికి సెప్పాలో..మీరేం సెప్పక్కర్లేదు’ అంది గట్టిగా. సిన్నమ్మ గొంతు ‘స్థాయికి ఎవరైనా జడుస్తారు. అమాయిలంతా బిక్క చచ్చిపోయరు.
అపుడు సిన్నమ్మ వ్ళాని చూఅతూ ” అసలు సిలక్కట్టు కట్టి తొంగొలేలా? ఎన్నిసార్లు సెప్పాలి…” అంది కసిగా. అంతా కోపంగా వున్నారు.
”పడుకొనేటపుడు దేనికి?” అంది గభాల్న సుజాత.
”దేనికా? ప్రశ్నిస్తే కోపం సిన్నమ్మకి. కళ్లెర్రజేసి ‘నీ బంగారం ఎత్తుకు పోకుండా…’అని ఏటే కాపురం సెయ్యలేదా? అలా అడుగుతున్నావేం?’ అని సుజాత నోరు ఎత్తనియ్యలేదు.
వెంటనే ”తొడల మధ్య నుండీ గుండారంతా తీసి ఎనక్కి దోపండి…” అంది కర్కశంగా.
ఆ గొంతుకే భయం అందరికీ. అంతా గబగబా సిలక్కట్టు కట్టారు. పిక్కలు కనబడుతున్నాయి అసహ్యంగా అనుకొన్నారు. చూడీదార్ వేసుకొన్న ఒక్క అమాయి మాత్రం హమ్మయ్య! అని కొంచెం గర్వంగా అనుకొంది. తనకి సిలక్కట్టు బాధ లేదనుకొంది. అందరూ అయిష్టంగా అవమానంగా, బాధగా సిలక్కట్టు కట్టారు. సిన్నమ్మ వెనక్కి తిరగ్గానే మెటికలు విరిచారు కసిగా.
జ జ జ
ఒక రాత్రి 12 గంటలకి చూడీదారమ్మాయి వచ్చి సుజాతని లేపింది. ”O.T. చేస్తావా? లచ్చిగుంట కడుపునెప్పి అని తిరిగొచ్చేసింది. మేస్త్రీ బాబు ఎవర్నో ఒకర్ని తీసుకు రమ్మన్నాడు” అంది.
సుజాత ముఠాకి వచ్చి మూడునెలలు దాటినా ఎప్పుడ ంO.T. చెయ్యలేదు. సాధారణంగా O.T. చలాకీగా కావాలని తిరిగినవాళ్లకీ, వాళ్లకి నచ్చిన వాళ్లకే ఇస్తారు. గంటకి 20 ర|| ఇస్తారు. మూడు గంటలు ఇస్తారు. అందుకని అంతా వెళ్తారు. సుజాత ఎప్పుడూ అడగలేదు. ఎవ్వరూ ఇవ్వలేదు. తలుపు తట్టిన లచ్చిందేవిని వదలుకోవ డమెందుకని వెళ్లింది.
అక్కడ సిన్నమ్మ టీ కెటిల్ పట్టుకొని కూర్చుంది. ఈవిడకి నిద్రరాదా ఏంటన్పించింది సుజాతకి. ”సుజాతా, టీ తాగిపో. టైల్స్ మొయ్యల. టైల్ పగిలిందో మేస్త్రీ బాబుని పట్టలేం” అంది. టీ తాగిన సుజాతకి ‘మస్చర్ కొట్టించుకో’ అని చెప్పి ‘ఒరేయ్ నాక్కూడా మశ్చర్ కొట్టరా…’ అంది. అందరూ నవ్వేసారు. సిన్నమ్మ రోజూ అడుగుతూనే ఉంటుంది. మేస్త్రీనే అడుగు అంటారువాళ్లు. ఈ మధ్య సిన్నమ్మ తన మస్చర్లు తనే కొట్టుకొని లెక్కేసుకొంటోంది. ప్రతి వారం మేస్త్రీని అడుగుతుంది. నవ్వేసి ఇవ్వడు. పగలంతా తీరిక ఉండదు. రాత్రి తెలివి వుండదు… తాగుడు మైకానికి సిన్నమ్మనోరే బయట పడుతుంది గానీ పైసలు రాలలేదు.
సుజాత నిచ్చెన దగ్గరకి వచ్చేసరికి 15 టైల్స్ మొయ్యల. టైల్ ముక్కలయిందో డబ్బులు కటింగ్ అవుతాయి. జాగ్రత్తగా వెళ్లు… అన్నాడు. ”నేను అన్ని మొయ్యలేను… తగ్గించు అన్నా…” అంది. 10 టైల్స్ ఇచ్చి మేస్త్రీకి తెలిస్తే ఊరుకోడు. చూడీదారమ్మాయి చురుగ్గానే ఎక్కింది. భయపడుతూనే సుజాత ఆమె వెనక ఎక్కుతోంది. నిచ్చెన పూర్తిగా ఎక్కేసరికి అక్కడ ఉన్న మేస్త్రీ చేతులు గుండెకి తగిలాయి. పొరబాటేవెనని గబుక్కున తలెత్తింది. ‘ఏటే, రాయే…’ అని ఎవరికీ కనబడ్డం లేదనుకొన్నాడేమొ రొమ్ముని గట్టిగా గిల్లి వదిలాడు. హడలిపోయింది. కోపం. అసహ్యం.. నెప్పి.. ఆ తత్తరపాటుకి చేతిలో టైల్స్ కింద బడ్డాయి. పైనున్న అయిదూ పడి ముక్కలయ్యాయి. బిక్కచచ్చిపోయింది.
”పోన్లే, పైకిరా. నీ మస్చరలు తగ్గించనులే. రద్దులో రాస్తాను. రా…” అన్నాడు మేస్త్రీ గొప్పగా.
”ఏం అక్కర్లేదు” అంది చడీ దారమ్మాయి.
సుజాత అంతా చూస్తూనే ఉంది. ఆ పిల్లపట్ల జాలేసింది. O.T.కి రాత్రి రాకూడ దనుకొంది. ఆ అమ్మాయి కళ్లు తిరిగాయని వెళ్లిపోయింది. సుజాత మరో రెండు గంటలు చేసింది. కానీ చాలా తక్కువ మొస్తోందనీ.. రేపటి నుండీ రావద్దని చెప్పారు.
జ జ జ
చూడీదారమ్మాయి ఏడుస్తోంది. ”ఏటయిందీ?” అడిగింది సుజాత.
సిన్నమ్మ నానాయగీ చేసి పన్లో నుండీ తీయించేసింది.
”ఏం?”
”మేస్త్రీ ఎనక ఇది పడిందట…”
”ఛీ, ఆడే దీన్ని సంపేస్తున్నా డనుకో…”
”అది అందరికీ తెలుసు. ఏం చెయ్యలేకే.. మగాళ్లంతా పళ్లికిలించి మేస్త్రీకి రెండో కీప్ అంటున్నారు. దీన్ని” అంది ఆ అమ్మాయి నేస్తం.
”ఇదేవన్నాయం. సిన్నమ్మ అసలు ఆడదేనా?” అంది సుజాత.
అప్పుడే సిన్నమ్మ వచ్చింది. ‘మీటింగ్ ఎట్టారా?” అంది.
”ఇదేవన్నా పద్ధతేనా! నోరుంది కదా అని పడిపోతున్నావు. చూడూ, మేస్త్రీ T.V. స్విచ్చి నువ్వు నొక్కితేనే” అది నా T.V.యే భద్రంగా ఎయ్యలని నిన్ను ముట్టనివ్వడు. దాని ఒళ్లు దానిదికాదా! ఆడు ఎక్కడబడితే అక్కడ నొక్కేయడానికి. దాన్ని సిగ్గుతో చితికిబోయేలా చేస్తున్నాడు. ఆవేశంగా అడిగింది సుజాత.
ఆ మాటలకి సిన్నమ్మ కొద్దిగా గొంతు స్థాయి తగ్గించి – ”ఇది వగలు పోయిందో! ఆడు ఇకటాలు ఆడాడో! దాని ఇంటికాడ అది ఉంటే మంచిది” అంది.
ఆ మాటకి చూడీదారమ్మాయి ”ఇంటికిపోయి సత్తుబొచ్చెలు నాకావాలి. ఏటుందని. పనులా దొరకవు. అమ్మ పాచిపనికి ఎళ్తే నాన్న కల్లుపాకకి పోతాడు…” నిస్సహాయంగా దుఃఖిస్తోంది. రెండు నిముషాల్లో తేరుకొని ”ఆడు తప్పుచేస్తే నన్ను తిడతారేం? ఆడ్ని నిలదీయలి గానీ…” అంది కోపంగా.
”మేస్త్రీని అనే దమ్ము లేకే నా బతుకు ఇలా ఉంది” అని గొణుక్కొంది. తర్వాత ”తెలిసినాళ్లింట్లో పెడతా. 1000 రూ ఇస్తారు. అన్నీ చూసుకొంటారు. కావాలంటే తీసుకు వెళ్తా” అంది సిన్నమ్మ.
”పెనం మీంచి పొయ్యి మీదకా”.
”ఛా, ఆడావిడ ఒక్కర్తే ఉంది. మొగుడు డబ్బు కోసం దేశాలట్టేడు. అక్కడే భయం ఉండదు…” అంది సిన్నమ్మ.
సిన్నమ్మతో వెళ్లడం మంచిదా, కాదా అని తర్జన బర్జన పడి నలుగురు అమ్మాయిలు కలసి చూడీదారవ్మయితో కలసి ఆ ఇల్లు చూడడానికి వెళ్లారు.
ఆదివారం సుజాత ఒక్కర్తీ నాలుగుగంటలకి ఎగ్ నూడిల్స్ కొనుక్కొని – రూమ్‌కి వచ్చింది. ఏదో చెప్పడానికి వచ్చిన సిన్నమ్మని చూసుకోకుండా గుద్దేసింది. సిన్నమ్మ చేతిలో సంచీ కిందపడి వస్తువులు వెదజల్లుకుపోయయి. గబుక్కున తియ్యబోయిన సుజాతని వద్దు, వద్దు నేనే తీసుకొంటానని కంగారు పడింది. ఒక్క సెకనులో సిన్నమ్మ కంగారుకి కారణం తెలిసింది. అరడజను నిరోధ్‌లున్నాయి. అవి సుజాత చేతిలో నుండీ తీసుకొంట ”ఏటిసెయ్యను. సారాతాగి ఆడు ఎప్పుడు మీద పడతాడో తెలీదు. ఆడు పదిమంది కాడికి పోయేవాడు. ఏ జబ్బు వస్తుందోనని.. నేనే కాస్త జార్తపడతా” అంది. ముఖంలో ధీమా లేదన్పించింది.
సిన్నమ్మ ”మీ అయ్య కబురు పెట్టాడు. నా గదిలోకి రా, కాసేపు కూర్చో” అంది.
చాలా భయంగా నిల్చుంది తప్ప ఆమె వెనక అడుగువెయ్యలేదు. అది చూసి –
”నేను మొరటుదాన్నే. నాకు తెలుసు. మొరటువేషంలో బతుకుతున్నా. తీసేద్దామంటే… ఇక్కడ మానలేను…” అని దీర్ఘంగా నిట్టర్చింది.
”నేను చూడీదార్ అమ్మాయిలాగే 18 ఏళ్ల క్రితం ఉండేదాన్ని. అపుడు మేస్త్రీ నాలాగే కూలీ. ఒక ఆదివారం తలనెప్పిగా ఉందని ఎక్కడకీ కదలకుండా గదిలో పడుకొన్నా. ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో తెలీదుగానీ.. ఇనపబస్తా లాగ మీద పడి.. నా గుండారు ఎప్పుడు లాగాడో చేతులు నొకిపెట్టి… రెండు క్షణాల్లో నా జీవితం నాశనం చేసాడు. సారాకంపు తప్ప ఏమీ తెలీదు. ఏటయిపోతుందో, ఎవరికి సెప్పాలో తెలీదు. చెబితే ‘ఛీ’ అంటారేవె భయం. అయ్యకి తెలిస్తే చీరేస్తాడు. అందుకే – సంతలో పుస్తెలు కొని మెడలో వేసుకొని మేస్త్రీ పెండ్లమయిపోయ. కాదులే. కీప్‌నయిపోయ. మీరంతా అలాగే అంటారుగా. మొరటువేషం వేసుకొని పెద్దనోరుతో వాడివెంటే ఉన్నాను. వాడి మొదటి పెళ్లాం పల్లెలో ఉంది. బతుకింతే” అంది బరువుగా. కళ్లల్లో తడి. ”ఈనాటి దాకా ఎవరికీ సెప్పలేదే…” అంటూ కళ్లొత్తుకుంది.
”మొరటుబతుకు… వెడుబతుకు,మాటేంటి గానీ… నీ అయ్య రమ్మన్నాడు. నీ మొగుడు ఇడాకులకి కేసేసాడుట.”
”ఊ, విడాకులిచ్చేస్తాడు. నేవెళ్లను.”
”అదేదీ, అలా అనుకోరాదు. వెళ్లు” అంది.
జ జ జ
సుజాతకి విడాకులు ఇచ్చాడు. దానికోసం సుజాత లేచిపోయిందన్నారు. అంతేకాదు. మొగుడుకి పెద్ద జబ్బున్నట్టు సర్టిఫికెట్ పుట్టించారు. ఆ జబ్బుతో మన వాడు ఏవీ చెయ్యలేడు కనుక భరణం ఇవ్వలేడు. నేయం, ధర్మం లేవు లోకంలో అనుకొంది. తండ్రి కులపెద్దలకి చెప్పి డబ్బు లాగాలను కొన్నాడు. కానీ సుజాత వొప్పుకోలేదు. పదవ ఏటనే సెలక్కాయలు ఏరి డబ్బు తెచ్చాను. నాటి నుండీ ఇక్కడున్నా అక్కడున్నా పనిచేస్తున్నా. ఇప్పుడు ఆడ్ని దేబిరించడం దేనికి? అంది.
ఆ మాటకి తండ్రికి కోపం వచ్చింది. ”ఎవడి మాటా వినవు కాబట్టే మొగుడొది లేసాడు” అని తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టాడు. ఇద్దరికీ గొడవ అయింది. అయితే బంధాలన్నీ పోయయని సిన్నమ్మ దగ్గరకి బయల్దేరింది.
సిన్నమ్మలా మొరటుగానే ఉండా లనుకొంది. అంతలోనే సిన్నమ్మ మేస్త్రీకాడ మొరటుగా ఉండాలి. ఉండాల్సిన కాడ మొరటుగా ఉండక ఆడాళ్ల దగ్గరే మొరటు తనం చూపిస్తోంది. సిన్నమ్మకి చెప్పాలనుకొని వచ్చింది.
సుజాత వచ్చేసరికి చూడీదార మ్మాయి సిన్నమ్మ గదిలోనే ఉంది. ”అదేటీ…” అంది ఆశ్చర్యంగా. ”ఇది ఆడ మేస్త్రీ అయిపోయిందట… ఇక్కడున్న ఆడపిల్లల్ని పట్టుకుపోతుందిట. మేస్త్రీకి తెలిస్తే మక్కలిరగదీస్తాడు. దీనికేటి భయం తెలీట్లేదు” అంది సిన్నమ్మ.
సిన్నమ్మ ముఖంలో నవ్వే వుండదు. చిరాకు తప్ప. సీరియస్‌గా ఉంటుంది. అయినా సుజాత తెగించి ”అసలు నువ్వు మాత్రం మేస్త్రీ కాడ మెస్ ఎందుకు నడపాల.మస్చరు డబ్బు ఇవ్వడు నీకు. దానికాడకుపోయి మెస్ నడుపు. సాయం చేసినట్టయినా ఉంటుంది. నే్ను, నువ్వూ మెస్ నడుపుదాం..”
”సాయం ఎందుకు? మస్చరు లెక్కేసి డబ్బులిస్తా..” అంది ్చూడీదారమ్మాయి.
”ఈ ఊర్లో మేస్త్రీ బతకనిస్తాడా?” అని.
సిన్నమ్మ వాళ్ల ఆలోచనకే అదిరి పోతోంది.
”హైదరాబాద్‌లో పని దొరికింది. ఎవ్వరికీ తెల్దు…” అంది చూడీదారమ్మాయి.
సిన్నమ్మ అటూ ఇటుగా ఉంది. మిగతా ఆడపిల్లలు గబగబా వచ్చి బలవంతాన బ్రతిమలాడి వొప్పించేసారు. ”ఈ జీవితానికి ఇంతలా ఆప్యాయంగా పిలిసిన వాళ్లెవరున్నారని…” సిన్నమ్మ మొరటువేషం తీసి పారేసి బోరున ఏడ్చి గుండె బరువు దింపుకొని వాళ్లతో బయల్దేరుతూ… సంతలో కొనివేసుకొన్న పుస్తెలు తీసి పారేసింది ధీ్మాగా.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags