సి.సుజాతామూర్తి
మరణం పిలిచింది నన్ను నానావిధ భాషలతో
తరుణం రాలేదని నే నిరసించా నా పిలుపులు
అయినా అదనులేదని అరచిందది ఘోషలతో
జయనాదం చేయకు మరి తెరిచే ఉన్నవి తలుపులు”
(శ్రీ అబ్బూరి రామకృష్ణరావు)
బ్రిటిష్ రియలిటీషో స్టారయిన ‘జేడ్‌గూడి’ ఆదివారం 22నాడు ఉదయం నిద్రలోనే అంతిమ శ్వాస వీడింది. దంత వైద్యులదగ్గర నర్సుగా పనిచేసిన ఆమె, అంచెలంచెలుగా ఎదిగి టివీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఒక అందాల తారగా మీడియాలో ప్రచారం పొంది, లండన్‌లో జరిగిన ”బిగ్ బ్రదర్ రియల్టీషో”లో అవకాశం దక్కించుకుంది. ఆ సమయంలోనే మన బాలివుడ్ స్టారయిన శిల్పాశెట్టి కూడా పరిచయమైంది. కానీ జాతి వివక్షాహంకారంతో శిల్పాశెట్టిపై దుర్భాషలాడి, పలు విమర్శలకు గురి అయింది. తన తప్పిదాన్ని తెలుసుకుని శిల్పా శెట్టికి క్షమాపణ చెప్పి ఆమెకు చాలా సన్నిహితురాలైంది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. పోయిన ఏడాది ఇండియాలో జరిగిన ”బిగ్ బ్రదర్ రియల్టీషో”లో పాల్గొనడానికి జేడ్‌గూడీ ఇండియాకు వచ్చింది. ఆ సమయంలోనే తను అస్వస్థతకు గురి అయి, కాన్సరు బారిన పడినట్లు తెలుసుకుంది. ఆ షో వదిలి స్వదేశానికి వెళ్ళిన ‘జేడ్‌గూడి”, అది సర్వైకల్ కాన్సరనీ, చాలాచోట్ల అప్పటికే శరీరంలో వ్యాపించిందనీ, వైద్య నిపుణులు చెప్పినట్లు కొద్ది నెలలు మాత్రమే ఆమె జీవించగలదనీ, వెల్లడైంది. ముందు చాలా బాధపడినా అప్పకే తన ఇద్దరు పిల్లలు బాబీ, ఫ్రీడీలకోసం విస్తృతంగా పకడ్భందీగా ఆలోచించి భవిష్యత్తులో పిల్లలకు ఏ లోటు రాగూడదని పధకం ప్రకారం నిర్ణయం తీసుకుంది. తన సుఖ దు:ఖాలు, కాన్సరు వల్ల బాధలు అన్నిటినీ బహిర్గత పరిచేందుకు పుస్తకాలు రాసి, తుది శ్వాసవరకు చిత్రీకరించేందుకు మీడియా మీద ఆధారపడి, వాటి హక్కులను అమ్ముకుని పిల్లలకు భవిష్యతులో ఏ లోటు రాకూడదని ఒక నిధి ఏర్పాటు చేసింది. ఆ రాబడి కేవలం కుటుంబాలకే పరిమితం కాకుండా, పలు కాన్సరు ఆసుపత్రులకు కూడా దానం చేసింది. కాన్సరు బారిన పడిన విషయం తెలిసి కూడా జాక్‌ట్వీటు, తన అత్యంత ప్రియమిత్రుడ్ని పెళ్ళి చేసుకుంది. తను చనిపోయే చివరి రోజుల్లో తన కుటుంబంతోనే గడపాలని కోరుకుంది. అలాగే ఆమె తల్లి, భర్త సమక్షంలో తుది శ్వాస ప్రశాంతంగా నిద్రలో విడిచింది. ఈమె జీవితం ఎంత విమర్శనాత్మకమైనా, ఆఖరికి ఒక వీరవనితగా, మరణానికి భయపడకుండా, స్వదేశంలో మహిళలందరికీ కాన్సరుపట్ల అవగాహన పెంచిన ఒక మాతృమూర్తిగా అందర్నీవదిలి వెళ్ళిపోయింది. చాలా ధైర్యవంతురాలు, స్పూర్తిదాత అంటూ అందరి పొగడ్తలకు అర్హురాలైంది. సరిగ్గా మాతృమూర్తులదినం రోజు పిల్లలను అంతగా ప్రేమించే అమ్మ దూరమైంది. తలుపులు తెరిచి మరీ మరణాన్ని ఆహ్వానించిన ధైర్యశాలి ‘గూడీ’కి ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం.
శిల్పా శెట్టి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా జేడ్ గూడీ మామూలు మహిళగా కాన్సర్ తో మరణించి వుంటే ఇంత ప్రచారం వచ్చి ఉండేది కాదేమో! ఆమె వీర వనిత ఎలా అయిందో నాకిప్పటికీ అర్థం కాదు. మరణం త్వరలో తప్పదని తెలిసిన నాడు ఎవరైనా ఏమీ చేయలేరు.ఆ చిరాకులో, అభద్రతతో ఎదురింటి వాడితో ‘ఒక వారంలో నేను చచ్చిపోతాన్లే, సంతోషంగా ఉండు” అంటూ గొడవ పడిందని ఒక పత్రికలో చదివాను.
కేవలం తన పిల్లల ఆర్థిక భద్రత కోసం తన మరణాన్ని కూడా చిత్రీకరించేందుకు మీడియాను అనుమతించింది. ఒక సామాన్య మహిళ! అంతే! చిన్న వయసులో మరణించడం బాధాకరమైనా, మీడియా, పత్రికలు మాత్రం ఏదో గొప్ప సంఘ సంస్కర్తో, మానవతా వాదో పోయినట్లు అతిగా చిత్రీకరించింది.మదర్స్ డే రోజు పోవడం కాకతాళీయకమైనా, ప్రపంచంలోని తల్లులందరికీ ఆదర్శప్రాయమైన మహిళ ఆ రోజు మరణించినట్లు….మీడియా గమ్యం ఏమిటో అర్థం కావటం లేదు.
సుజాత గారు అన్నట్టు ఆమె ఒక సాదారణ మహిళే…..అంత కంటే గొప్పతనం ఆపాదించాల్సిన అవసరం లేదేమో……బహుసా చనిపోతుంది అన్న జాలితో, ఆమె ఎక్కువ మందికి తెలియటం వల్ల మీడియా ఎక్కువ ఫోకస్ ఇచ్చినట్టుంది.