శిలాలోలిత
జీవితం క్షణికం.స్ఫటికం. ప్రవాహరూపం. నిరంతరం చింతనామయలోకం .క్షణభంగురమైన జీవితాన్ని శాశ్వతత్వం చేసేవి కళలే. ఆ కళల్లో కవిత్వమూ, సంగీతమూ, సాహిత్యం కలగలిసి నిలిస్తే, కలనేతై బతుకును మలిస్తే, రెక్క ముడవని రాగాన్ని ఆలపిస్తూ, జలపాత గీతమై, సాహితీసీమలో చిరస్థాయిగా నిలిచిన, మానవ హారంలోని ముత్యం ఆదూరి సత్యవతీదేవి.
మనిషెంత సున్నితవె, కవిత్వమూ అంతే. సరళమైన, తేలికైన, దూదిపింజలకంటే మృదువైన, చల్లని పిల్లగాలుల్లా, ప్రకృతిలో మమేకమై పో్తూ, తా్ను ఒక పూలరెమ్మై మనముందుంటారు ఆదూరి సత్యవతిగారు.
వీరి కవిత్వంలో రెండు విరుద్ధమైన అంశాలు కన్పించాయి. పూర్తిగా వ్యతిరేకమైనవి. ఒకదానికొకటి పొంతన లేనివి.
ప్రతిక్షణమూ జీవించాలన్న తీవ్రమైన ఆకాంక్ష. అత్యంత సున్నితమైన, భావోద్వేగపరమైన అక్షరాల సంచలనం.
మరోవైపు జీవితం అశాశ్వతం. మరణం అనివార్యం. మృత్యువు ఎక్కడో లేదుమనతోనే, మనలోనే మన నీడలోనే చిరకాలంగా నివసిస్తున్న నేస్తం, ఎప్పుడో గబుక్కున ఒళ్ళోకి లాగేసుకుంటుంది, మళ్ళీ కొత్త చిగురు తొడుక్కుని, కొత్త చొక్క తొడుక్కున్నంత తేలిగ్గా వచ్చేస్తాను సుమా
! అనే ధీమా, నిర్ణయ ప్రకటన. మృత్యువుకి ఎదురెళ్ళి నిలిచి, ఆహ్వానించే తెగువ.
ఈ రెండు ఆమె సాహిత్యంలో కనబడి విస్మయ పరిచింది. చిరుగాలికే కంపించి తొణికలాడే శరీరంతో ఒక వైపు, ఎంతటి చల్లని మృత్యువునైనా ఎదుర్కొనే తెగువ మరోవైపు. ఇది ఆమె సాధించిన స్థిత ప్రజ్ఞతకు నిదర్శనం. ఆమె సాధించిన పరిణితే, ఆమె కవిత్వానికి బలాన్నిచ్చింది. ‘జిడ్డు కృష్ణమూర్తి’ ఫిలాసఫీలా ప్రతిక్షణంలోన జీవించి శాశ్వతత్వాన్ని సాధించుకున్నారు.
సత్యవతీదేవిగారి పుస్తక సభలో, మాట్లాడుతున్నప్పుడు ఆమె సహచరుడి కంటి సరస్సులో తొణికిసలాడుతున్న నీటి చెమ్మను చూసి, ఆ ప్రవాహంలో ఆమె జీవించే వుంది కదా అన్పించింది.
నిజానికి అంత చేరువై జీవించిన వ్యక్తిని కోల్పోయిన దు:ఖం సామాన్యం కాదు. కానీ దాన్ని అధిగమించి, ఆమె తొడుక్కున్న సాహిత్యాన్ని తిరిగి పునర్ముద్రించే బాధ్యతను చేపట్టి, ఆ అక్షరాలలో ఆమె అంతరంగాన్ని సజీవం చేసే ప్రయత్నం నిజంగా ఎంతైనా కొనియాడదగింది.
అందుకే, ఒకోసారి అన్పిస్తూ వుంటుంది. ఈనేల ఎంత నిజమొ, ఈ ఆకాశం ఎంత నిజమొ, ఈ నీరు ఎంత నిజమొ, ఈ సాహిత్యం కూడా ప్రకృతితో పాటు నిలిచే నిజమే సుమా అని.
అనుభతించనిదేదీ కవిత్వం కాదు. ఆ సాంద్రతను బట్టి కవిత్వ గాఢత పెరుగుతూ వుంటుంది. నిజానికి అనుభూతి కవిత్వమంటూ ప్రత్యేకంగా, విడిగా వుండదు. అనుభూతి జీవులు వ్యక్తీకరించే, అక్షరీకరించే అక్షరాల సైన్యమే సాహిత్యం.
ఐతే, సత్యవతిగారి కవిత్వ ప్రస్థానానికి ముందు, చేరాగారు భావించినట్లు లలితమైన పాటల రచనలనుంచి, కవిత్వదిశగా ప్రయణం మార్చుకున్న క్రమంలో చిక్కదనాన్ని భావగాడతను పెంచుకున్నారు.
రాగలీనమైనప్పుడే పాటగా మారగలరు. కవిత్వ పంక్తులవెంట ప్రయణించే క్రమంలో తానే కవిత్వమై జీవించడంవల్ల, ‘రెక్కముడవని రాగ’మవగలిగింది. కొత్త కొత్త పదబంధాలతో, అవి రంగు రంగుల అర్ధాల దుస్తుల్ని ధరించేట్లుగా చేయగలగడంలో నైపుణ్యాన్ని చూపించారు. కవికీ పాఠకులకూ మధ్యన కన్పించకుండా వుండే సన్నటిపొరను చేధించి పాఠకుల హృదయంతర్భాగాల్లో స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. పాదరసంలా కవిత్వాన్ని ఒడిసిపట్టు కొని, కన్పిస్తూ, కన్పించకుండా, అరిచేతిలో వున్నట్లే వుండి, పట్టుకోబోతే లోతైన, నిగఢమైన అర్ధాల ముఖాల్ని గభాల్న తొడుక్కుని పారిపోతున్న చిక్కటి కవిత్వధారలామెవి.
వస్తు వైవిధ్యం, గాఢమైన హృదయానుభతి, భావపరిణితిని సాధించిన పద ప్రయెగాలు, ప్రకృతిపట్ల మొహపరవశత్వం, మృత్యువు పట్ల ప్రేమొద్వేగాలు, జనన మరణాల చిట్టాను ఔపోసన పట్టిన వేదాంత తత్వాలు, మానవత్వమే మనిషితత్వం, కావాలన్న తీవ్రానురక్తి, సంప్రదాయాల పేరిట స్త్రీలపై జరుగుతున్న అమానవీయ విలువల పట్ల వ్యతిరేకత, స్త్రీలు నిశ్శబ్ద బలిపీఠాలౌతున్న వాస్తవాల చిత్రీకరణలు, ప్రేమెక్కటే మనుషుల మధ్యన స్నేహ వారధుల్ని నిర్మించగలదన్న నమ్మకం, వెరశి సత్యవతిగారి కవిత్వ౦ ఆమె వ్యక్తిత్వంలా మన ముందు నిలిచింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags