జీవితానుభవాలు ప్రేమ్‌చంద్‌ జీవిత చరిత్ర

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌.శాంతసుందరి
(గత సంచిక తరువాయి)
నా కథల అనువాదం మరో భాషలో వస్తే ఆయన చాలా సంతోషించేవారు. కానీ, మా ఇద్దర్నీ కథలు ఇవ్వమని అడిగినప్పుడు మాత్రం మాకు అంత బాగా అనిపించేది కాదు. ఒక్కోసారి కథ ప్లాటు కోసం ఆలోచిస్తూ ఉంటే నాకు నిద్ర పట్టేది కాదు. అప్పుడాయన, ”ఎందుకిలా లేని కష్టాన్ని కొని తెచ్చుకున్నావు? హాయిగా ఉండేదానివి, ఇప్పుడు అనవసరంగా ఇదో జంజాటాన్ని తగిలించుకున్నావు!” అనేవారు. ”ఏం, మీరు మాత్రం జంజాటాన్ని తగిలించుకోలేదా? నేనైనా అప్పుడప్పుడ రాస్తాను. మీకు అదే వృత్తి అయిపోయిందే!” అనేదాన్ని.
”అయితే నేనేం చేస్తే నువ్వూ అదే చేస్తావా?” అనేవారు.
‘నాయిష్టం! నాకు కూడా తప్పటం లేదు. మనసులోని భావాలని మాటల్లో పెట్టాల్సిందేగా?” అనేదాన్ని.
భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఎవరికీ తెలీదు. ఈ రోజు ఆయనే ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. చదవటం రాయటం ఆయన ఒక పనిలాగే చేసేవారు. నేను ఈ పుస్తకం రాయలని రాయటం లేదు. మనశ్శాంతి పొందేందుకు ఇది ఒక మార్గం, అంతే. దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చి నాకు దిగులు పుట్టిస్తాయి. కానీ నా మనసు నా మాట వినదు! పాత విషయల గురించి ఆలోచిస్తే నన్ను మత్తులాంటిది కమ్ముకుంటుంది. కానీ ఆ మత్తు ఉత్సాహాన్నివ్వదు, మనసు విలవిలలాడుతుంది. కానీ వాటి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతాను!
1913 ప్రాంతాల్లో
కాన్పరునించి గణేశ్‌ శంకర్‌ విద్యార్థి ‘ప్రతాప్‌’ అనే పత్రికని ప్రచురించేవారు. ఆయన మావారిని వ్యాసం రాసిమ్మని అడిగారు. ఈయన రాసి పంపారు. కాన్పరులో ఏదో పని పడితే ఒకసారి అక్కడికి వెళ్లారు. ‘ప్రతాప్‌’ ఆఫీసుకి కూడా వెళ్లారు. అక్కడికెళ్లి చూసేసరికి గణేశ్‌ శంకర్‌ విద్యార్థి ఒక్కరే మొత్తం పని చేస్తూ కనిపించారు. అక్కణ్ణించి ఇంటికొచ్చాక, ”విద్యార్థి గారు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఆఫీసు పనంతా తన నెత్తి మీద వేసుకున్నారు. ఇటువంటి వాళ్లే దేశానికి అవసరం. వీళ్లే తమ జీవితాలని సార్థకం చేసుకోగలుగు తారు. ఈయన తప్పకుండా గొప్ప పేరు సంపాదించుకుంటాడని ఆశిస్తున్నాను. తనకాళ్లమీద నిలబడ్డ వాడికే దేవుడు కూడా సాయం చేస్తాడు. నాకు కూడా ఈ ఉద్యోగాన్ని వదిలేసి, ఎక్కడైనా ఏకాంతంగా కూర్చుని, సాహిత్య సేవ చెయ్యలని అనిపిస్తోంది. కానీ ఏం చెయ్యను? నా దురదృష్టం కొద్దీ నా దగ్గర కాస్తంత భూమికూడా లేదు. నా దగ్గర ఒకటీ అర ఎకరం ఉంటే, పొట్ట పోసు కునేందు కావల్సినంత మాత్రం సంపాదించు కుని, కూర్చుని సాహిత్యసేవ చేసేవాడిని,” అన్నారు నాతో.
”అంత మాత్రం భూమిలో మీరేం బంగారం పండించేస్తారా? పైగా మీరు విద్యార్థిగారిలా కాదు. ఒక రెండు నెలలు ఉద్యోగం మానేసి కూర్చున్నారంటే గోలగోల పెట్టెయ్యర! ఎనిమిదేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఏడాదికి వంద రూపాయలు వెనకేసినా ఈపాటికి మీ దగ్గర ఎనిమిది వందల రూపాయలుండేవి. ఏవేవో ఊహల్లో తేలిపోవటం వేరు. పని సవ్యంగా చెయ్యటం వేరు. ఉద్యోగం చేస్తున్నా ఖర్చులకి చూసుకోవాల్సి వస్తూ౦టే, ఇక ఇరవైనాలుగ్గంటల సాహిత్యసేవ చేస్తూ కూర్చుంటే ఇల్లు గడిచేది ఎలా?” అన్నాను.
”డెప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ పని మానేస్తే ఏమైనా తేడా వచ్చిందా? ఏ పనైనా ఆగిపోయిందా? ఇప్పుడు కూడా అలాగే గడిచిపోతుంది. ఏదో ఒకటి దొరక్కపోదు.” అన్నారు.
మళ్లీ తనే, ”లేదు లేవోయ్‌! రెండు పూటల భోజనం అవసరమే. అంతకన్నా ఎక్కువ మనకెందుకు?” అన్నారు.
”సరే, మీకు ఏమీ అక్కర్లేదు, కానీ మిగిలిన బాధ్యతలో? వాటినేం చేస్తారు? ఇంతకుముందే సగం జీతం తీసుకుంటూ ఆరు నెలలు సెలవు పెట్టారు. చాలా కష్టం మీద అవసరాలు తీరేవి. నేను పుట్టింట్లోను, మీరు కాన్పరులోనూ ఉండేవాళ్లం. పిన్నీ, చిన్నబ్బాయీ ఉండేవాళ్లు. అప్పుడు కూడా డబ్బు బొటాబొటిగా సరిపోయేది. మీరే చెప్పారు కదా, పాలు తోడేసుకుని మజ్జిగ చేసుకునే వాడినని. పనివాడిని పెట్టుకునే స్తోమత లేదు. విద్యార్థి గారి విషయం చెప్పకండి, ఆయనకీ మీకు పోలికేమిటి? ఆయన నెత్తి మీద బాధ్యతలేవీ లేవు. ఆయన తండ్రి బతికున్నారు. అన్నయ్య ఉన్నారు. వాళ్లు తప్పకుండా ఆయనకి సాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ అందరి బాధ్యతా మీ నెత్తినే! మీరు ఆయనతో పోటీ పడటం అనవసరం. మీ పనేదో మీరు చేసుకోండి!” అన్నాను.
ఆయన ఉన్నట్టుండి ఏదో విచారంలో మునిగిపోయారు. మరిచిపోయిందేదో గుర్తొచ్చినట్టుంది, అనిపించింది నాకు.
ఆయనకి ఎప్పుడూ సాహిత్యసేవ చెయ్యలనే తపన ఉండేది. మందుకోసం మా ఊరినించి రోజూ కాశీకి వెళ్లేవారు. సరిగ్గా మిట్టమధ్యాహ్నం పన్నెండుగంటలకి, మంచి ఎండలో ఇంటికొచ్చేవారు. ఆ విషయం నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి, ”పైగా ఇంత చాకిరీ చేస్తున్నా మీమీద ఎవరికీ జాలిలేదు, మందు తెచ్చి పెడతామని కూడా ఎవరూ అనరు. తిండిదగ్గర ఏమీ తగ్గించటానికి వీల్లేదు. అందరికీ తిండి పెట్టటం కూడా మీ బాధ్యతే, మరిచిపోయారా అవన్నీ?” అన్నాను.
”అబ్బ, పోనిస్తూ!” అన్నారు.
”కాకపోతే మరేమిటి?” అన్నాను.
”సర్లే, చూద్దాం. నా ఈ కోరిక ఏదో ఒక రోజున తీరక పోదు,” అన్నారు.
”ముందు వీళ్లందర్నీ గట్టెక్కించండి!” అన్నాను.
ఆయన గురించిన జ్ఞాపకాలని నెమరేసుకుంటంటే నా మనసులో ఇంకా కుతహలం తలెత్తుతనే ఉంటుంది.
జూలై ఆరంభంలో ఒంట్లో బాగాలేక పోయినా ఆయన స్కూలుకి వెళ్లారు. ఆయన్ని చూస్తే పని చెయ్యటానికే పుట్టారేమొ, అనిపించేది. అప్పుడప్పుడూ ఆయన మీద కోపం కూడా వచ్చేది. ఇంట్లో అందరు ఆయన్ని ఎంత విసిగించినా, ఆయన పట్టించుకునేవారు కాదు. అన్ని కష్టాలనీ నవ్వుతూ భరించేవారు. ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఆయన గొప్పతనం అర్థమవుతుంది. చెడ్డవాళ్లతో కూడా ఆయన మంచిగా ఉండేవారు. ఒక మనిషి బతికి ఉండగా అతన్ని అర్థం చేసుకోలేక పోవటం అనేది భారతదేశం ప్రత్యేకత అనిపిస్తుంది. ఏదైనా అందకుండా పోయిన తరవాతే దాని విలువ తెలిసేది. నేను ముందే ఆయన్ని అర్థం చేసుకుని ఉంటే, ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఆయన్ని విమర్శించి ఉండేదాన్ని కాదు. ఈ విషయలన్నీ ఒకటొకటిగా అర్థమవుతున్న కొద్దీ, నా మనసుని ఎవరో కత్తితో ముక్కలు ముక్కలుగా నరుకుతున్నంత బాధ కలుగుతోంది. నేను అదే మనిషిని. అన్నీ అలాగే ఉన్నాయి. కానీ పశ్చాత్తాప పడటం మాత్రమే మిగిలింది నాకు.
బస్తీ, 1914
ఒకసారి ఏం జరిగిందంటే, గుమ్మం దగ్గర మా ఆయన మొదటి భార్య తమ్ముడు కూర్చునున్నాడు. ఆయన అతనితో మాట్లాడుతున్నారు. అతనేమొ ఆయనతో తన అక్క గురించి మాట్లాడుతున్నాడు. అతను విచారంగా ఉన్నాడు. అప్పుడే రెండేళ్ల మా అమ్మాయి గునగున నడుస్తూ గుమ్మం దగ్గరికెళ్లింది. నేను దానికోసం అటువైపు నడిచాను. తీరా చూసేసరికి అది ఆయన బావమరిది ఒళ్లో కూర్చుని ఉంది. అతను చాలా ప్రేమగా దాన్ని ముద్దు చేస్తున్నాడు. అంతలో అతను బాధగా, ”మనమందరం కలిసిమెలిసి ఉంటే మా అక్కయ్య ఈ పిల్లని ముద్దుచేసేది కదా!” అన్నాడు. మా ఆయన ఏమీ జవాబు చెప్పలేదు. అతను మాత్రం తన అక్క గురించి చాలానే మాట్లాడాడు. నేను ఓరగా నిలుచుని వాళ్ల మాటలన్నీ విన్నాను. వింటుంటే నా ఒంట్లో రక్తం వేడెక్క సాగింది. ఆ తరవాత అతను వెళ్లిపోయాడు. మా ఆయన పిల్లని ఎత్తుకుని ఇంట్లోకొచ్చారు. ఆరోజే మొదటిసారి నాకు ఆయన మొదటి భార్య బతికే ఉందని తెలిసింది. ఆవిడ పోయిందని చెప్పి నన్ను ఇంతకాలం మొసం చేస్తూ వచ్చారని అర్థమైంది.
”ఎవరా వచ్చి వెళ్లింది?” అని అడిగాను.
”ఎవరో తెలిసినాయన,” అన్నారు.
”మీరు అబద్ధాలు చెపుతారని ఎన్నడూ అనుకోలేదు!” అన్నాను.
”ఎవరైనా బతికి ఉన్నారని మనం అనుకుంటేనే వాళ్లు బతికి ఉన్నట్టు లెక్క. చనిపోయరనుకుంటే, ఇక వాళ్లు చనిపోయిన వారితో సమానమే,” అన్నారు.
”నేను మీరన్న దాన్ని ఒప్పుకోను. దయ చేసి ఆవిణ్ణి తీసుకురండి!” అన్నాను.
”నేను వెళ్లి తీసుకురాను,” అన్నారు.
”ఎందుకెళ్లరు? మీకు ఆమెతో పెళ్లయింది! తమాషా అనుకుంటున్నారా?”
”నేను చేసుకోలేదా పెళ్లి. మా నాన్న చేశాడు!”
”మీ అమ్మ పోయక మీ నాన్న చేసుకున్న రెండో పెళ్లాం బాధ్యతని మెడకి తగిలించుకుని తిరుగుతున్నారు. ఆవిడ గారి బాధ్యత మీదే కాని, మీ మొదటి పెళ్లాం బాధ్యత మీది కాదా? ఇదేం బాగాలేదు!”
”బాగున్నా లేకపోయినా, నేనామెని తీసుకురాను.”
”ఏమిటిది? ఒక మనిషి జీవితాన్ని మట్టిపాలు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు?”
”హక్కుల, అవీ ఏం లేవులే!”
”ఏం గొప్పగా చెప్పారు? ఇదేనా హిందూ సంస్కృతంటే?”
”ఆ వెధవ ఇటువైపు రావటం కాదు కానీ, నీ చేత నానా మాటల అనిపించు కోవలసి వస్తోంది!”
నేను కాస్త మెత్తబడ్డాను. కోపంతో ఏమీ సాధించలేనని అనిపించింది. ప్రేమగా ఆయనతో, ”మీరు వెళ్లి ఆవిణ్ణి తీసుకురండి. ఆవిడ బాధ్యత పూర్తిగా నాదే!” అన్నాను.
”నీతో పోట్లాడుతుంది.”
”ఇంట్లో విషయలేవీ మీకు చెప్పనట్టే, ఆవిడ గురించి కూడా మీతో ఒక్క మాట మాట్లాడను. ఆవిడ సంతోషంగా ఉండేట్టు చూసుకుంటాను. మేమిద్దరం హాయిగా కలిసిమెలిసి ఉంటాం.”
”అవును, మీరిద్దర హాయిగానే ఉంటారు, మధ్యలో నాకే ఇబ్బంది!”
”దేవుడి మీదొట్టు, నిజంగా ఆ విషయం మీతో ఎప్పుడ మాట్లాడను.”
”సరేలే, నీ ఇష్టం, నేనేమీ చెప్పను.”
నేను ఇక ఆ తరవాత ఏమీ మాట్లాడలేదు. ఆమెకి ఉత్తరం రాశాను. ‘ప్రియమైన అక్కయ్య’ అని సంబోధిస్తూ, ఆవిడని రమ్మని పిలిచాను. నాలుగో రోజు నా ఉత్తరానికి జవాబొచ్చింది. ఆయన వచ్చి తీసుకొస్తే వస్తాననీ, నన్ను చాలా చూడాలని ఉందనీ, ఆయన్ని పంపమనీ రాసిందావిడ.
నేనా ఉత్తరం ఆయనకిచ్చాను. ”రాకపోతే నేనేం చెయ్యలి?” అన్నారు.
ఆ తరవాత నేను తరచు ఆవిడకి ఉత్తరాలు రాసేదాన్ని. ఆవిడ ఉత్తరాలని కైథీలిపిలో రాసేది. వాటిని నేను మా ఆయనకిచ్చేసేదాన్ని.
బస్తీలో ఉన్నప్పుడే 1914లో ఆయన ప్రైవేటుగా ఎమ్‌.ఏ. పాసయరు. చదువుకునే రోజుల్లో ఆయన తల దగ్గరే అగ్గిపెట్టే, లాంతర, పుస్తకాల ఉండేవి. నేను పక్కమీదినించే ఆయన్ని కేకేసి నిద్రలేపేదాన్ని. తెల్లారగట్ట ఐదుగంటల వరకూ చదువుకుని, ఆ తరవాత కాలకృత్యాలు తీర్చుకుని, ఏదుంటే అది తినేవారు. రోజూ ఆయన కార్యక్రమం ఇదే. ఆ తరవాత ఆరయేసరికి తన గదిలోకెళ్లి కథల, వ్యాసాల రాసుకునేవారు. అలా తొమ్మిది గంటల వరకూ రాసుకుంటూ కూర్చునేవారు. తొమ్మిదయేసరికి స్నానం, భోజనం ముగించి స్కూలుకెళ్లేవారు. బస్తీలో స్కూలుకి ఇక్కా (ఒంటి గుర్రబ్బండి) మీదే వెళ్లేవారు. కానీ వచ్చేప్పుడు మాత్రం నడిచి వచ్చేవారు. రోజూ బండివాడికివ్వటానికి రెండణాలు నాదగ్గర తీసుకునేవారు. వచ్చేప్పుడు కూరల అవీ తనే కొనుక్కుని వచ్చేవారు. ఇంటికొచ్చేసరికి మూడున్నరో, నాలుగో అయేది. ఇంటికి రాగానే టిఫిన్‌ తిని, నాతో ఒక అరగంటసేపు కబుర్లు చెప్పేవారు. ఆ తరవాత ఆరునించి ఎనిమిది దాకా మళ్లీ సాహిత్య సేవ చేసేవారు.
మహోబాలో ఉన్నప్పుడే ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఇన్ని ఇబ్బందులున్నా ఆయన సెకెండ్‌ క్లాస్‌లో పాసయారు. ఏ పనిలోనైనా ఓటమిని అంగీకరించటం ఆయన నేర్చుకోనేలేదు. ఇంటి దగ్గరున్నప్పుడు మా అమ్మాయిని ఆడిస్తూ ఉండేవారు. పక్కింట్లో ఉన్న వాళ్లని కలవటానికి ఎప్పుడైనా వెళ్తే పాపని ఎత్తుకుని తనతో తీసుకెళ్లేవారు. పిల్లలంటే ఆయనకి ఎంతో ప్రేమ. సాయంకాలం అయేసరికి ఆయన అలిసిపోయి ఇంటికొచ్చేవారు. నేను కాళ్లు పడతానంటే ఒద్దనేవారు. ఆయనకి అలాంటివన్నీ అసలు నచ్చేవి కావు. ఒక్కోసారి నేను బలవంతంగా కాళ్లు పడతానని మొండికేస్తే, చేసేదేమీలేక పట్టించుకునేవారు. ఆడవాళ్ల చేత సేవలు చేయించుకోవటం ఆయనకి నచ్చేది కాదు. హుక్కాలో పొగాకు దట్టిస్తానన్నా ఒప్పుకునేవారు కాదు. నౌకర్‌ ఇంట్లో గుమ్మం దగ్గర కూర్చుని ఉన్నా ఆయనే లోపలికి వచ్చి నీళ్లు తీసుకుని తాగేవారు. తన ధోవతీ, బనీను కూడా తనే ఉతుక్కునేవారు. నౌకరు ఖాళీగా కూర్చుని ఉండేవాడు. నాకు ఒక్కోసారి ఆయన చేసే ఈ పనులని చూస్తే చిర్రెత్తుకొచ్చేది. ఇంట్లో నౌకరు ఉన్న దెందుకు? అని పోట్లాడేదాన్ని. ”ఎవరి పనులు వాళ్లు చేసుకోవటమే న్యాయం. ఇవాళ నౌకరున్నాడు, రేపు ఉండక పోవచ్చు. అదీగాక నేను కూడా ఐదు రూపాయల జీతానికి పని చెయ్యలేద!” అని అనేవారు.
”అప్పుడు నేను మీరలా పని చెయ్యటం చడలేదుగా!” అనేదాన్ని.
‘నువ్వు చూడనంత మాత్రాన ఏమయింది? నేను ఆ అవస్థలన్నీ పడ్డాను. అందుకే మనిషి తన అవసరాలు తీర్చు కోవటానికి స్వయంగా పూనుకోవాలి.”
జులై, 1915
ఆ తరవాత అక్కడ ఉండగానే ఆయనకి జీర్ణకోశ వ్యాధి పట్టుకుంది. ఆ కారణం చెప్పి ఆయన అక్కణ్ణించి బదిలీ చేయించుకున్నారు. ఏదైనా మంచి ఊరికి బదిలీ చేస్తారనుకుంటే, నేపాల్‌ కొండలోయల్లో, ఏదో ఒక మారుమూల ఊళ్లో తీసుకెళ్లి పడేశారు. అక్కడ కూడా అజీర్తితో బాధపడుతూ ఉండేవారు. అక్కడ ఒక ఆరునెలలున్నతరవాత మా నాన్న తన దగ్గరకి రమ్మని ఉత్తరం రాశాడు. నెల రోజులు అలహాబాద్‌లో ఉండి, వైద్యం చేయించుకున్నారు. నేను కూడా ఆయన వెంటే ఉన్నాను. అక్కడ ఆరోగ్యం కోలు కోకుండానే మళ్లీ నేపాల్‌కి వెళ్లిపోతానన్నారు. నేను పుట్టింట్లో ఉండిపోయాను. ఆయన వెళుతంటే మా నాన్న, ”చూడు, బాబూ! ఇంకొన్నాళ్లు వైద్యం చేయించుకో. మళ్లీ సెలవు పెట్టు,” అన్నాడు.
మా నాన్న మాట విని ఆయన ఆరునెలలు సెలవు పెట్టారు. సగం జీతమే ఇచ్చేవారు, పాతిక రూపాయలు. వాటిలో పది రపాయలు పిన్నికి ఇచ్చేవారు. పదిహేను రూపాయలు తమ్ముడికి ఇచ్చేవారు. అతను ఝాన్సీలో స్కూల్లో చదివేవాడు. తన ఖర్చులకి ఆయనకి డబ్బెక్కణ్ణించి వచ్చేదో తెలీదు. బహుశా వ్యాసాలు రాస్తే వచ్చే డబ్బుతో గడిచి పోయేదేవె! కాన్పర్‌లోనూ, లక్నోలోనూ కూడా వైద్యం చేయించు కోసాగారు.
నేను ఇంకా పుట్టింట్లోనే ఉన్నాను. డిసెంబరులో ఆయన మళ్లీ వచ్చి, నన్ను తనతో పంపించమని మా నాన్నని అడిగారు. ”అమ్మాయి పుట్టింట్లో సుఖంగా ఉంది, మీ కొచ్చేది సగం జీతం, అలాంటప్పుడు తనని కూడా తీసుకెళ్తే ఇద్దర ఇబ్బంది పడతారు. అయినా మీరు కూడా లక్నోలో కొన్నాళ్లూ, కాన్పరులో కొన్నాళ్లూ ఉంటున్నారు కదా!” అన్నాడు నాన్న.
ఇక ఆయన ఏమీ ఎదురు చెప్పకుండా వెళ్లిపోయరు.
మళ్లీ ఏప్రిల్‌లో వచ్చి నన్ను పంపమని అడిగారు. నాన్న కూడా మళ్లీ అదే జవాబు చెప్పాడు. చివరికి ఒక మనిషిని పంపి, సంపాదన ఎక్కువ లేనివాడు, జబ్బుతో బాధపడేవా్డు, పెళ్లాం పిల్లల్ని తన దగ్గరికి పంపమని అడక్కూడదా? అని అడిగించారు.
మా నాన్న ఆ మనిషితో, కావాలంటే తన పెళ్లాన్నీ, పిల్లనీ వచ్చి తీసుకెళ్లమను, తనకే మాత్రం అభ్యంతరం లేదని అతని మంచికే చెప్పాననీ, అన్నాడు.
ఏప్రిల్‌లో నన్ను వెంటబెట్టుకుని లమహీకి వచ్చారాయన. ఆ తరవాత రెండు నెలలు అక్కడే ఉన్నాం. రోజూ కాలినడకన పట్నం వెళ్లి డాక్టర్‌ దగ్గర మందు తీసుకునేవారు. పెసరపప్పు ఆయనకోసం పథ్యంగా వండేది పిన్ని, కానీ అందులో పోపులో మాత్రం కారం వేసేది. మలబద్ధకం రోజురోజుకీ పెద్ద సమస్యగా మారటం మొదలుపెట్టింది. ఎప్పుడ సుఖవిరోచనం అవటంలేదని అంట ఉండేవారు.
రెండు నెలల తరవాత మళ్లీ బస్తీకి వెళ్లారు. మళ్లీ రోగం తిరగబెట్టింది. పదిహేనురోజులుండి మళ్లీ వచ్చేశారు. మరోసారి బదిలీకి అర్జీ పెట్టుకున్నారు. అయినా పై ఆఫీసరు వినిపించుకోలేదు. అలహాబాదుకి వెళ్లి డైరెక్టర్‌ని కలిశారు. బస్తీ నీళ్లు తనకు పడటం లేదని ఆయనకి చెప్పారు.
”నీకు మహోబా నీళ్లు పడవు, బస్తీ నీళ్లు పడవు, మరి నిన్నెక్కడికి పంప మంటావో చెప్పు! స్కూల్‌ టీచర్‌ పని చేస్తావా? ఒక ఖాళీ ఉంది. నలభై రూపా యలు జీతం. వెళ్తావా?” అన్నాడు ఆఫీసర్‌.
ఇంటికెళ్లి ఉత్తరం రాస్తానని ఆయనకి చెప్పి వచ్చేశారు. ఆయన రాగానే, ”ఏమయింది?” అని అడిగాను.
”ఏమవుతుందోయ్‌, ఏమీలేదు! దౌర్భాగ్యుడు, విసుక్కున్నాడు! ‘ఏ నరకానికి పంపించమంటావు?’ అంటూ, ‘నలభై రూపాయలు జీతం వచ్చే స్కూల్‌ టీచర్‌ పని చేస్తావా?’ అని అడిగాడు,” అన్నారు.
”మీరేం జవాబు చెప్పి వచ్చారు?”
”నేనింకా ఏమీ అనలేదు. నువ్వేం చెబితే అది చేస్తాను.” దిగులు కూడా వేసింది. ”టీచర్‌ పని చేస్తే తప్పేమిటి?” అన్నాను.
”నీకు తెలుసుగా, జీతం నలభై రూపాయలే ఇస్తారు.”
”తెలుసు. నలభై రూపాయలొస్తాయి. అయితే ఏమయింది?”
”మన ఖర్చులెలా తీరతాయి?”
”చూద్దాం. ఏదో ఒకలాగ తీరతాయి. ఖర్చులకి డబ్బు చాలదని ప్రాణాలు పోగొట్టుకోలేం కదా?”
”అంతా కలిపి మొత్తం వందరూపాయలు నెలకి సంపాదిస్తున్నాను. అయినా సరిపోవటం లేదు,” అన్నారు.
”దానికేముంది? వెయ్యిరూపాయలు సంపాదించినా ఖర్చులకి సరిపోదు! పది రూపాయలు సంపాదించే మనిషి కూడా బతుకుతనే ఉన్నాడుగా?”
”నాకు తెలీదు. నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను.”
”నేన సిద్ధమే. ఏం ఫరవాలేదు.”
”ఇప్పుడున్న పరిస్థితిలోనే అందరు నన్ను డబ్బుకోసం వేధిస్తున్నారు!”
”మీ అమాయకత్వం చూసే! మీరు ఎంత అవస్థ పడుతున్నారో చూస్తూనే ఉన్నా, మందు మాకూ ఏమైనా వేసుకుంటున్నారా అని అడిగేవాళ్లు లేరు. వాళ్లకి మాత్రం అన్నీ అమర్చిపెట్టాలి. ఇదేం న్యాయం?” అన్నాను.
”సరే నీ ఇష్టం. నేను దరఖాస్తు పెట్టుకుంటాను,” అన్నారు.
ఆయన ఆర్జీకి అంగీకారం తెలుపుతూ ఉత్తరం వచ్చింది. మేం ఆరోజుల్లో బెనారెస్‌లో ఉన్నాం. ఉత్తరం చూసుకుని, ”పద, మళ్లీ బస్తీకే వేశారు!” అన్నారాయన.
”పోన్లెండి, టూర్ల అవీ ఉండవు కనీసం,” అన్నాను.
జూలై ఎనిమిదో తారీఖున మేం బస్తీ చేరుకున్నాం. మేమిద్దరం, మా అమ్మాయ్, ఆయన తమ్ముడు, అందరం వెళ్లాం. పాత బస్తీలో అద్దెకి ఒక ఇల్లు తీసుకున్నాం. వెళ్లగానే మా బావగారింట్లో దిగాం. ఆయన అక్కడ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేసేవారు. మా ఆయన, మరిదీ, కలిసి అద్దె ఇంటిని శుభ్రం చేశారు.
ఒకరోజు ఏం జరిగిందంటే, మా ఆయన కూరల, చేపల, తమలపాకుల అవీ తెచ్చేందుకు బజారు కెళ్లారు. అక్కడ ఈయనకి పండిత్‌ మన్నన్‌ ద్వివేదీ కలిశారు. ఆయన్ని వెంట తీసుకొచ్చారు. లోపలికొచ్చి నాతో, ”పండిట్‌జీ వచ్చారు, వారికి తాంబూలం పట్రా,” అని తనే తమల పాకుల్ని కడిగి పళ్లెంలో పెట్టి తెచ్చి నాకిచ్చారు. నేను కిళ్లీ తయరుచేశాక లోపలికొచ్చి తీసుకెళ్లి ఆయన తనే ఇచ్చారు. పండిట్‌జీ కాసేపు ఆ మాటా ఈ మాట చెప్పి వెళ్లిపోయరు.
తరవాత ఆయన ఇంట్లోకొచ్చి, ”ఇవాళ చేపలు కొంటూ౦డగా దారిలో ఈయన తగిలాడు. బలే సరదా ఐన మనిషి. చురుకైనవాడు కూడాను,” అన్నారు.
”నేను మీకెన్నో సార్లు చెప్పాను బజారు పనులకి మీరు వెళ్లద్దు, ఎవరినైనా పంపించమని. కానీ మీరు వినిపించు కోరాయె!” అన్నాను.
”నా పనులు నేను చేసుకోవటం నాకేమీ అవవనం అనిపించదు. మన పనులు మనం చేసుకోవటం నేరమా? పైగా నన్ను నేను కూలివాడిననే అనుకుంటాగా!” అన్నారు.
”అయితే మీరు పారతో పనులు చెయ్యకూడద?” అన్నాను.
”పారతో పని చెయ్యకపోవచ్చు కానీ, కలంతో చేస్తున్నాగా?” అన్నారు.
”మీరు పొలంలో కూలీపని చేస్తూ ఉంటే నేనక్కడికి మీ కోసం రొట్టెలు చేసి పట్టుకొచ్చేదాన్ని!” అన్నాను.
”పోన్లే బైటికి తెచ్చివ్వకపోయినా ఇంట్లో నువ్వే చేసిస్తున్నావుగా? మరి నా బజారు పనులు చెయ్యటానికి నౌకరుని పెట్టుకుంటే అప్పుడిక నీకోసం వంటమనిషి కూడా అవసరమౌతుందే!”
”వంటమనిషీ లేదు గింటమనిషీ లేదు. మీరు ఎటువంటి పరిస్థితిలో ఐనా సర్దుకు పోతే, నేను ఈ మాత్రం చెయ్యలేనా?”
అక్కడ వచ్చే నలభై రూపాయల జీతంలో ఎప్పటిలాగే పిన్నికి పది రూపా యలు పంపేవారు. మిగతా డబ్బులో మా ముగ్గురి అవసరాల తీర్చుకోవటానికి ప్రయత్నించేవాళ్లం. (ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.