మహిళా ట్రాన్స్‌జెండర్‌ సమూహాల మానిఫెస్టో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికలు – 2018 సందర్భంగా…

 

అన్ని రాజకీయ పార్టీల నుంచి సమగ్రమైన మహిళా హక్కులు, సాధికారత,

జండర్‌ విధానపరమైన అంశాలను డిమాండ్‌ చేస్తూ విడుదల చేస్తున్న

మహిళా, ట్రాన్స్‌జెండర్ల ఐక్య కార్యాచరణ

ప్రచురణ: వివిధ మహిళా, ట్రాన్స్‌జండర్‌ సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు

నేపథ్యం:

సమాజంలోని అన్ని సమూహాల ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ఆకాంక్షలకు దర్పణం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర

ఉద్యమం. దళితులు, బహుజనులు, ముస్లింలు, స్త్రీలతో సహా అనేక సమూహాలు, వర్గాలు ఒక్క తాటిపైకొచ్చి నడిచిన ప్రజా ఉద్యమంతో ఎదురు చూసిన తెలంగాణ రాష్ట్రం తొలిపొద్దై పొడిచింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం – గ్రామీణ, పట్టణ ప్రాంతాల స్త్రీలను, వృత్తి ఉత్పత్తి వర్గాలకు చెందిన పేద, మధ్య తరగతి స్త్రీలను ఒకే వేదిక మీదికి తెచ్చినటువంటిది ఈ ఉద్యమం. తరతరాలుగా తమపై ఉన్నటువంటి, జరుగుతున్నటువంటి నిర్బంధం, ఆధిపత్యం తెలంగాణా రాష్ట్ర సాధనతో అంతమవుతుందనే ఆకాంక్షతో అన్ని వర్గాల స్త్రీలు ఉద్యమంతో మమేకమయ్యారు. నిజానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య, లౌకిక దృక్పథంతో లిఖించబడిన మన భారత రాజ్యాంగంలోనే ఈ ఆకాంక్షకు మూలాలు ఉన్నాయి. కుల, మత, ప్రాంత, లింగ వ్యత్యాసం లేకుండా ప్రాథమిక హక్కులను, పౌరహక్కులను (అధ్యాయం 3) రాజ్యాంగం భారత ప్రజలకు అందించింది. ఈ హక్కులను పరిరక్షించే బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15(2) కుల, మత, లింగ, పుట్టుక – వివక్షతను తిరస్కరిస్తుంది. ఆర్టికల్‌ 17 అంటరానితనాన్ని (అది ఏ రూపంలో ఉన్నా సరే) నిషేధించింది.

కానీ వాస్తవంలో ఈ హక్కులు పూర్తిగా అమలు కావటం లేదు. అనేక సందర్భాలలో ప్రజల హక్కులు కాలరాయబడుతున్నాయి. గత ఐదు దశాబ్దాలుగా ఈ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలో వివిధ ప్రజా ఉద్యమాలు దేశవ్యాప్తంగా రూపుదిద్దుకున్నాయి. ఈ ఉద్యమాల ఫలితంగా దళిత, ఆదివాసీ, ముస్లిం, ఇతర మైనారిటీ స్త్రీలు రాజ్యాంగ సవరణలని, కొత్త చట్టాలని సాధించుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి 73, 74 రాజ్యాంగ సవరణలతో 1993లో స్థానిక స్వపరిపాలనా సంస్థల్లో (పంచాయితీ రాజ్‌ వ్యవస్థ) మూడవ వంతు స్థానాల్లో స్త్రీలకు వచ్చిన రిజర్వేషన్లు. చట్టరూపం దాల్చిన ఆహార హక్కు, విద్యా హక్కు, సమాచార హక్కు, గృహ హింస చట్టం మొదలైనవి కూడా ప్రజా ఉద్యమాల ద్వారా సాధించుకున్నవే. వీటన్నింటినీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం చేసిన రాజ్యాంగ సవరణలుగా చూడాలి. 1970 దశకం నుంచి వచ్చినటువంటి స్త్రీల ఉద్యమాలు – రాజ్యం, రాజకీయ వ్యవస్థ, రాజ్యాధికారం, స్త్రీల హక్కులపై మౌలికమైన ప్రశ్నలను లేవనెత్తాయి. వివిధ ఉద్యమాలు స్త్రీల అస్తిత్వాన్ని, అవగాహనను మరింత బలపరిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఒక బలమైన మహిళా పునాదిని అందచేశాయి. తెలంగాణా రాష్ట్ర సాధనలో స్త్రీల పాత్ర అద్భుతమైంది, గర్వించదగింది. అయితే, నాలుగున్నరేళ్ళ క్రితం ఏర్పడిన ఈ తెలంగాణా రాష్ట్రంలో స్త్రీల పరిస్థితి ఏ విధంగా ఉంది? తమ ఆకాంక్షలను, ఆశయాలను తీర్చడానికి, రాజ్యాంగ రీత్యా తమకున్నటువంటి హక్కులను వినియోగించడానికి కావలసిన వ్యవస్థను తెలంగాణ రాష్ట్రం స్థాపించగలగాలని తెలంగాణ స్త్రీలు బలంగా కోరుకున్నారు. ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో స్త్రీల పాత్రను మరింత బలపరిచే విధంగా వ్యవస్థ రూపొందాలనుకున్నారు. ఆకాంక్షలను, ఆశయాలను సాధించుకునే వ్యవస్థ తప్పనిసరిగా వస్తుందనే ఆశ, రాజ్యాంగ నైతికతను బలపరిచే వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతుందనే ఆశించారు. కానీ, అనేక అంశాల్లో ఆశాభంగమే మిగిలింది. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మంత్రివర్గంలోనే మహిళలకు స్థానం లేకుండానే నాలుగున్నరేళ్ళ పాలన నడిచింది. మాట్లాడే హక్కు, నిరశన తెలియచేసే హక్కు లేకుండా పోవడమే కాకుండా, గొంతు విప్పుతున్న ప్రజలపై క్రూరమైన చట్టాలను ప్రయోగించడం కూడా జరుగుతోంది.

అందుకే.. తెలంగాణ రాష్ట్రంలో ఈ 2018లో ముందస్తుగా రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళిత, ఆదివాసీ, ముస్లిం, ట్రాన్స్‌జెండర్‌, ఇతర మైనారిటీ తదితర అనేక అస్థిత్వాలకు చెందిన మహిళలందరం ఈ సామాజిక పరిణామంలో సమస్త రంగాల్లో మా భాగస్వామ్యాన్ని, ఆశయాలను, ఆకాంక్షలను, హక్కులను, డిమాండ్లను, నిర్ణయాధికారాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూ, అన్ని రాజకీయ పార్టీలకు ఈ అంశాలను తమ ప్రణాళికల్లో పొందుపరచమని డిమాండ్‌ చేస్తున్నాం.

1. రాజకీయ ప్రాతినిధ్యం ః అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో కనీసం 33% కంటే మించి అన్ని సామాజిక వర్గాల మహిళలకు ప్రాతినిధ్యం ఉండేలా టికెట్లు తప్పనిసరిగా కేటాయించాలి. ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా గానీ మంత్రివర్గ కేబినెట్‌లో 33% కంటే మించిన ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలి.

2. విద్య ః సామాజిక మార్పులో విద్య కీలకాంశమనేది విస్పష్టం. ఈ విద్య ప్రాంత, కుల, మత, లింగ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అసమానత వివక్షలను రూపుమాపేదిగా ఉండాలి. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, సమానత్వ ప్రాతిపదికగా కొనసాగాలి. అన్ని వర్గాల బాలికలు, యువతులు, మహిళలు అన్ని స్థాయిల్లోనూ స్వేచ్ఛగా ఉచిత విద్యావకాశాలు ఉపయోగించుకునేలా ”కామన్‌ స్కూల్‌” విద్యా విధానం ఉండాలి. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఒకే విధమైన పాఠ్యాంశాలు, కరిక్యులం, బోధనా విధానం ఉండేలా చూడాలి. ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో 10-12% కేటాయించాలి.

దళిత, ఆదివాసీ, ముస్లిం, ఇతర మైనారిటీ వర్గాల బాలికలకు అత్యాధునిక విద్యా ప్రమాణాలు, వసతులతో కూడిన విద్యాసంస్థలను స్థానికంగానే నెలకొల్పాలి. అలానే అవసరమయినచోట, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలలో రక్షణతో కూడిన రెసిడెన్షియల్‌ విద్యాసంస్థలను నెలకొల్పాలి. వివిధ కారణాల వల్ల చదువుకు దూరమయిన ఆడపిల్లలకు ఏ అడ్డంకులు లేకుండా తిరిగి పాఠశాలల్లో కొనసాగే విధంగా వ్యవస్థను రూపొందించాలి. వీరి విద్యకు ప్రత్యేక అవసరాలు నెలకొల్పుతూనే ప్రధాన స్రవంతి ”కామన్‌ స్కూల్‌” విద్యావ్యవస్థలోకి ప్రవేశించే విధంగా విధానాన్ని రూపొందించాలి. ఇందులో భాగంగా మహిళలు, ఎస్‌.సి, ఎస్‌.టి, ఆదివాసీ, ముస్లిం, ట్రాన్స్‌జండర్‌ ఇతర మైనారిటీలు సమాజంలో భాగమనే భావన పెరిగే విధంగా ప్రస్తుత దృక్కోణంలో మార్పు వచ్చేలా సిలబస్‌లో మార్పులు చేయాలి. దీనికై సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలతో కూడిన మానిటరింగ్‌ కమిటీని నియమించాలి. అన్ని సబ్జెక్ట్‌లలోనూ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ జరగాలి. స్కూల్‌ అడ్మిషన్స్‌ అప్లికేషన్స్‌లో ఆడ, మగ అనే కాలం మాత్రమే కాకుండా ఇతరులు/ట్రాన్స్‌జండర్‌ అనే కాలం కూడా ఉండాలి.

ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరచి, విద్యాప్రమాణాలను మెరుగుపరచాలి. మరుగుదొడ్లను నిర్మించి వాటికి అవసరమైన నీటి మౌలిక వసతులను తప్పనిసరిగా కల్పించాలి. వాటి నిర్వహణకు అవసరమైన నిధులను అందించాలి. మరుగుదొడ్ల వ్యవస్థ పాఠశాల రూపకల్పన, నిర్వహణలో భాగమై ఉండాలి తప్పించి, అది కులవ్యవస్థలో అట్టడుగు వర్గాలు మాత్రమే చేయవలసిన హీనమైనపనిగా చూడకూడదు. శుచి, శుభ్రత అనేది మరుగుదొడ్లను ఉపయోగించిన ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియవచ్చేలా, నిర్వహణలో ప్రధాన ఉపాధ్యాయుల దగ్గరి నుంచి విద్యార్థుల వరకూ తప్పనిసరిగా శుభ్రం చేయాలి అనే ఆలోచనను విస్తరింపచేయాలి. ఇది కేవలం పాఠశాలలకే పరిమితం కాకుండా, అన్ని రంగాల కార్యాలయాల్లో కూడా వర్తింపచేసే విధంగా చూడాలి. దీనికి ఎట్టి మినహాయింపులు ఉండరాదు.

ఉర్దూ భాషను రెండో భాషగా ప్రకటించి అన్ని పాఠశాలల్లో ఆప్షనల్‌ అంశంగా ప్రవేశపెట్టాలి. హైస్కూల్‌ వరకూ

ఉర్దూ మీడియం స్కూళ్ళను అవసరమయిన చోట ఏర్పాటు చేయాలి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి పాఠశాలకు (ప్రభుత్వ, ప్రయివేటు అనే భేదం లేకుండా) తప్పనిసరిగా అవసరమయిన అన్ని సౌకర్యాలతో ఆటస్థలాలు ఉండాలి. అవి కేవలం మగపిల్లలకి మాత్రమే కాకుండా ఆడపిల్లలకి నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్కూల్‌ హెల్త్‌ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. దాన్ని వెంటనే పునఃప్రారంభించాలి. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో బాధ్యతాయుతంగా ఛైల్డ్‌ హెల్త్‌ రికార్డులను నిర్వహించాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య వ్యవస్థ సమన్వయంతో పనిచేసేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. చిన్నవయసులోనే ఆరోగ్య నిర్వహణను సరిచేస్తే భవిష్యత్తులో సంపూర్ణ ఆరోగ్యం ఉండేలా పునాది పడుతుంది. పిల్లలకు ముఖ్యంగా ఆడపిల్లల ఆరోగ్యంలో ఇది చాలా కీలకమైన అంశం. యుక్తవయస్సులో వచ్చే మార్పుల గురించి టీచర్స్‌, పేరెంట్స్‌కి జండర్‌ సెన్సిటైజేషన్‌ వర్క్‌షాప్స్‌ నిరంతరం నిర్వహించాలి. అన్ని ప్రాంతాల్లో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులందరికీ సురక్షితమైన ప్రభుత్వ రవాణా అందుబాటులో ఉండాలి.

ప్రతి మండల స్థాయిలో ఇంటర్‌, డిగ్రీ, వృత్తివిద్య, నర్సింగ్‌, టీచర్‌ ట్రైనింగ్‌ మహిళా కళాశాలలను నెలకొల్పి, తగినంత సిబ్బందిని నియమించాలి. ప్రతి జిల్లా ప్రధాన కేంద్రాలలో పి.జి కళాశాలలను స్థానిక యూనివర్శిటీలకు అనుబంధంగా ఏర్పాటు చేయాలి. వాటికి అనుబంధంగా వసతి గృహాలు ఏర్పాటు చేయాలి. పి.జి. వరకు వచ్చిన దళిత, ఆదివాసీ, ముస్లిం, ఇతర మైనారిటీ విద్యార్థినులకు యూనివర్శిటీ స్థాయిలో ప్రత్యేక వసతులు, కంప్యూటర్‌, ఇంగ్లీష్‌ భాష నేర్చుకునే విధంగా, శ్రద్ధగా చదువు పూర్తిచేసుకునే పరిస్థితులు, వసతులు కల్పించాలి. మహిళా యూనివర్శిటీని తక్షణమే కార్యరూపంలోకి తీసుకురావాలి. స్కాలర్‌షిప్‌ల విషయంలో ఆలస్యం కాకుండా నిర్ణీత సమయానికి అందేలా, అవకతవకలు జరగని విధంగా వ్యవస్థను రూపొందించాలి. పాఠశాల నుంచి యూనివర్శిటీ వరకూ విద్యార్థినులు వేధింపులకు, అత్యాచారాలకు గురి కాకుండా సంస్థాగత చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యలను పట్టించుకోవడానికి, పరిష్కరించుకోవడానికి 2013 నిర్భయ చట్టం ప్రకారం ప్రతి పాఠశాల, కాలేజి, యూనివర్సిటీల ప్రత్యేక సెల్స్‌ ఏర్పాటు చేయాలి. తెలంగాణ దళిత, బహుజన, ఆదివాసీ ముస్లిం మైనారిటీ కళలని, కళారూపాలని, భాషారీతులని పొందుపరిచి, డాక్యుమెంట్‌ చేసి, వాటి గురించిన జ్ఞాన సంపదని పెంపొందించి వృద్ధి చేయాలి. మ్యూజియంలు ఏర్పాటు చేయాలి. ఆయా సంస్థలలో కళాపోషకులకు, కళాపోషణే వారసత్వంగా, సంస్కృతిగా, ఉపాధి హక్కుగా కలిగిన మహిళా కళాకారులకు భాగస్వామ్యాన్ని, ముఖ్యపాత్రను కల్పించాలి.

సాంస్కృతిక, చిత్ర పరిశ్రమ, కళా రంగాల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా ఆడపిల్లలకు ప్రత్యేక శిక్షణ అందించేలా పాఠశాలల్లో, కాలేజీలలో థియేటర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల రూపకల్పన జరగాలి. ఉన్నత విద్యలో వీటి కోసం ప్రత్యేక కళాశాలలు ఏర్పాటు చేయాలి. అవకాశాలు కల్పించే నెపంతో విచ్చలవిడి లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీ జరగకుండా పటిష్టమైన వ్యవస్థాగత చర్యలు తీసుకోవాలి.

పిల్లల ఆహార భద్రత కోసం ఏర్పడిన ఐ.సి.డి.ఎస్‌. పథకాన్ని, బడిపిల్లల మధ్యాహ్న భోజన పథకాన్ని పోషకాహారంతో, పరిశుభ్రతతో మరింత సమర్దవంతంగా, జవాబుదారీతనంగా అమలు చేయాలి. పిల్లలకు ఇచ్చే ఆహారంలో స్థానికంగా పండే పంటలు, కూరగాయలు, ఆకుకూరలు, పోషకాహారం కోసం తృణధాన్యాలను, నాణ్యమైన ధాన్యాన్ని వాడాలి. మంచినీరు అందుబాటులో ఉంచాలి. అంగన్‌వాడీ సెంటర్లలో, పాఠశాలల్లో అన్ని వసతులతో కూడిన వంటగదులు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో గానీ, పట్టణ, నగర ప్రాంతాల్లో గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్రీకృతం చేయటం గానీ, ప్రయివేటు పరం చేయడం గానీ చేయకూడదు. పిల్లలకు అప్పుడే వండిన వేడి ఆహారాన్ని మాత్రమే అందించాలి. ప్రభుత్వ పాఠశాలలకు అనుబంధంగా ప్రీ ప్రైమరీ సెక్షన్‌ను ప్రారంభించాలి. అంగన్‌వాడీ సెంటర్‌లను ప్రాథమిక పాఠశాలలకు అనుబంధంగా మార్చాలి. సంబంధిత విభాగాల మధ్య అనుసంధానం ఉండాలి. ప్రీ ప్రైమరీ టీచర్‌ సిబ్బందిని పెంచాలి. కస్తూర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్‌ పాఠశాలల వ్యవస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులను పర్మనెంట్‌ చేయాలి.

అవసరమైన వసతులను కల్పించడం ద్వారా బాలికల విద్యను వికాసవంతం చేయాలి. జీరో డ్రాపవుట్‌ స్థితిని చేరుకోవటానికి చర్యలు తీసుకోవాలి. బాల్య వివాహాలను అరికట్టాలి.

3. ప్రజారోగ్యం – వైద్యం ః ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో 10% కేటాయించాలి. ఆరోగ్యం అందరికీ ప్రాథమిక హక్కు. అవసరమైన వారందరికీ వైద్యం అందుబాటులో ఉండేలా సంస్థాగతమైన మార్పులను చేయాలి. ప్రభుత్వ వైద్య విధానాన్ని పటిష్టపరచాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలి. పౌష్టికాహారం, మంచినీటి సరఫరా, పారిశుధ్య, ప్రజా ఆరోగ్య (పబ్లిక్‌ హెల్త్‌) నిర్వహణలో అతి కీలకమైన అంశాలుగా గుర్తించి, వీటికి సంబంధించిన అన్ని విభాగాలను అనుసంధానించేలా ఒక నోడల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవల నాణ్యత పెంచడం కోసం ఆరోగ్య బడ్జెట్‌లో 60%కు పైగా నిధులు కేటాయించాలి. వికలాంగ మహిళలు, ట్రాన్స్‌జండర్‌ వ్యక్తుల పట్ల వివక్ష చూపరాదు. వారికి కావాల్సిన వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలి. పిల్లలు, వికలాంగులు, వృద్ధులు, నిరాదరణకు గురయిన వ్యక్తులు, బుద్ధిమాంద్యం, మానసిక వైకల్యం కలిగిన వారికి ఖచ్చితంగా పౌష్టికాహారాన్ని, అవసరమైన వైద్యాన్ని అందించేలా విధానాలను రూపొందించాలి.

పడిపోతున్న లింగ నిష్పత్తికి కారణమవుతున్న అంశాలపై దృష్టి సారించి, మార్పు కోసం ఆచరణాత్మకంగా కృషి చేయాలి. మాతృమరణాలు, శిశు మరణాలకు దారితీస్తున్న పరిస్థితుల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావటానికి చర్యలు తీసుకోవాలి. భ్రూణ హత్యలకు దారితీసే సామాజిక వివక్షమీద దృష్టి సారించాలి. 1994 పిసిపిఎన్‌డిటి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి.

ప్రత్యేక అవసరాలున్న వికలాంగ స్త్రీలకు, బాలికలకు వారి అవసరాలకు తగ్గట్లుగా అందుబాటులో వైద్య సదుపాయాలు కల్పించాలి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వైద్య సిబ్బందికి ఈ విషయాలలో ప్రత్యేక శిక్షణలు అందించాలి. అది నిరంతరం జరగాలి.

ట్రాన్స్‌జండర్‌ మహిళలకు వారి అవసరాలకు తగ్గట్టుగా అన్ని ఆస్పత్రులలోనూ వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. ఏ రకమైన వివక్ష ఉండరాదు. దీనికోసం నిపుణత్వాన్ని పెంచే విధంగా వైద్య విధానంలో విధాన నిర్ణయాన్ని తీసుకోవాలి. వైద్యవిద్యలోనే ట్రాన్స్‌జండర్‌ వ్యక్తుల గురించి అవగాహన పెంచేలా అధ్యయనం, పరిశోధన జరిగేలా విధాన నిర్ణయం తీసుకోవాలి. అందుకోసం స్పెషలైజేషన్‌ కోర్సులను తీసుకురావాలి. వీరి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కోసం సిబ్బందికి నిరంతర శిక్షణా కార్యక్రమాలు ఈ కమ్యూనిటీకి చెందిన వారితోనే ఇప్పించాలి. హార్మోనల్‌ ట్రీట్‌మెంట్‌కి అవసరమైన వసతులు ఏర్పరచాలి. కాస్మోటిక్‌ సర్జరీలు చేయించుకోవడానికి అవసరమైన ఆర్థిక వనరులను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. లింగమార్పిడి శస్త్ర చికిత్సలకు ప్రభుత్వమే ఆర్థిక సహాయాన్ని అందించాలి. ఈ క్రమంలో వీరికి అవసరమైన మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్‌ సహాయాన్ని అందజేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి.

4. హింసకు వ్యతిరేకంగా ః స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసలను ఎదుర్కోవాలంటే మార్గం అన్నిరంగాల్లో స్త్రీల ప్రాతినిధ్యాన్ని పెంచడం అనేది చాలా ముఖ్యమైన విషయం. విద్య, ఆరోగ్యం, జీవిత భీమా, బ్యాంకింగ్‌, పోలీస్‌, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్‌ఫోర్స్‌, నావికా, నటన, ఇతర రంగాల్లో రాణించే విధంగా కచ్చితమైన విధానాన్ని రూపొందించాలి.

ఉన్నత కొలువుల నుండి గుమాస్తా కొలువులదాకా యాభై శాతం మహిళలకే ఇవ్వాలి. వీటికి అవసరమైన బడ్జెట్‌ను కేటాయించి ప్రణాళికాబద్ధంగా ఆచరణతో తెలంగాణా కోణంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది.

అన్ని పాఠశాలల్లో, హాస్టళ్ళలో విద్యార్థినులపై పురుష ఉపాధ్యాయులు, వార్డెన్లు, ఇతర పనివాళ్ళు లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడకుండా పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆడపిల్లలకు స్వీయరక్షణ విధానాలను నిరంతర ట్రైనింగ్‌ ద్వారా నేర్పించాలి. ఆడపిల్లలకు శారీరక, మానసిక దారుఢ్యం పెరిగేలా పాఠశాల స్థాయి నుంచే ట్రైనింగ్‌లను తప్పనిసరి చేయాలి. జండర్‌ సమానత్వంపై అవగాహన పెరిగేలా సిలబస్‌ రూపకల్పన ఉండాలి. స్త్రీలపై, ఆడపిల్లలపై, ట్రాన్స్‌జండర్స్‌పై హింసను నివారించే చర్యలు చేపట్టాలి. అన్ని ప్రదేశాలలో హింసను అరికట్టడానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. దాని అమలుకు నిధులు కేటాయించాలి.

తెలంగాణలో స్త్రీలు, ఆడపిల్లలు, ట్రాన్స్‌జండర్‌ వ్యక్తుల రక్షణకై చేపట్టాల్సిన చర్యలు ః

గ్రామాలు, పట్టణాలు, నగరాలతో సహా స్త్రీలకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా ప్రజారవాణా వ్యవస్థను ఏర్పరచాలి. ప్రమాదంలో ఉన్న స్త్రీలు, ఆడపిల్లలను, ట్రాన్స్‌జండర్లను రక్షించే విధంగా 108 లాంటి సర్వీసులను ప్రత్యేకంగా పెట్టాలి. లైంగిక హింసలకు గురయిన వారిపట్ల పోలీసులు, వైద్య సిబ్బంది వ్యవహరించే విధానం మానవీయంగా ఉండాలే కానీ మరింత అవమానపరిచే విధంగా ఉండకూడదు. అలా వ్యవహరించేవారిని తక్షణమే శిక్షించే విధంగా చట్టం రావాలి.

పోలీసు, మిలటరీ, పారా మిలటరీ వ్యవస్థలు లైంగిక అత్యాచారాలకు పాల్పడకుండా, తక్షణమే చట్టపరమైన మార్పులు తీసుకురావాలి. అత్యాచార సంఘటనలను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలను, సంఘాలను పోలీసులు టార్గెట్‌ చేసి, క్రూరమైన ఉపా, పి.డి చట్టాలను పెట్టి వేధించడాన్ని మాని వారిని ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పరిగణించాలి. ప్రజలను అణిచివేయడానికి ఉపయోగించే చట్టాలను రద్దు చేయాలి. స్త్రీలపై పెరుగుతున్న దాడులను అరికట్టడానికి తగిన రక్షణ చర్యలు, సత్వర పరిష్కార మార్గాలు చేపట్టాలి కానీ, స్త్రీలు పరిమిత సమయాల్లోనే బయటకు రావాలనే సంకుచిత ధోరణిని విడనాడాలి. అలాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చే వ్యక్తులు, సంస్థలు వారు ఎంతటి ఉన్నత, అధికార స్థాయిలో ఉన్నా కానీ తక్షణమే వారిని అరెస్ట్‌ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిర్దేశించిన నిర్ణీత సమయానికే ఛార్జిషీట్లు/ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలి. నిందితులవైపు నుంచి స్త్రీలకు, ట్రాన్స్‌జండర్స్‌కు వచ్చే బెదిరింపులు, వేధింపుల మీద పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సందర్భాలలో నిందితులకు బెయిల్‌ లాంటివి మంజూరు చేయకూడదు. కోర్టులలో విచారణ సత్వరమే జరగాలి. సంవత్సరాల తరబడి నాన్చకూడదు. సందర్బాన్ని బట్టి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలి. మహిళా న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్‌ల సంఖ్యను పెంచాలి. న్యాయమూర్తులకు కూడా బాధిత స్త్రీలతో, ట్రాన్స్‌జండర్‌ వ్యక్తులతో వ్యవహరించాల్సిన ప్రొసీజర్స్‌పై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. న్యాయమూర్తులు, లాయర్లు, ప్రాసిక్యూటర్లు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ పేరుతో అతిక్రమించకూడని అంశాల గురించి బహిరంగంగా ప్రతి కోర్టులోనూ వివరంగా ప్రదర్శించే విధంగా ఏర్పాట్లు చేయాలి.

బాధిత స్త్రీలకు, ట్రాన్స్‌జెండర్లకు అవసరమైన న్యాయ, శారీరక, మానసిక వైద్య సహాయం ప్రభుత్వమే అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ అవకాశం లేకపోతే ప్రయివేటు ఆస్పత్రులకు పంపించి వైద్యం చేయించాలి. మానసికంగా కోలుకునేందుకు అవసరమైన వైద్య పరివేక్షణను అందుబాటులో ఉంచాలి. వీటితోపాటు కోర్టులో కేసు నడుస్తున్నంత కాలం బాధితులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలి. బాధితులు పిల్లలైన పక్షంలో మరిన్ని రక్షణ వ్యవస్థలను కల్పించాలి. ఎన్‌ఆర్‌ఐ వివాహాలలో తలెత్తుతున్న అనేక సమస్యల నివారణకు చర్యలు తీసుకోవాలి. ప్రసార సాధనాల్లో బాధిత స్త్రీలు, పిల్లలు, ట్రాన్స్‌జండర్స్‌ హక్కులకు భంగం కలిగే విధంగా, వారిని గుర్తించే విధంగా పదే పదే చూపించకూడదని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం ఇవ్వాలి. వీటిని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రకటనల్లో, సీరియల్స్‌లో స్త్రీలను, పిల్లలను, ట్రాన్స్‌జెండర్స్‌ను కించపరిచే విధంగా, హింసను ప్రేరేపించే విధంగా చూపించడాన్ని ఆపివేయాలి. ఇన్ని రకాలైన పాలనా చర్యలు చేపట్టాలంటే ప్రభుత్వం దీనికోసం ఒక ప్రత్యేక రిడ్రెసల్‌ సిస్టమ్‌ని ఏర్పాటు చేసి పైన చెప్పిన విషయాలన్నీ దీని పరిధిలోకి తీసుకురావడం ద్వారా మాత్రమే పాలనాపరమైన జాప్యాలను లేకుండా చేసి సత్వర న్యాయాన్ని అందించడం సాధ్యమవుతుంది.

5. మద్య నియంత్రణ ః సమాజంలో హింసకు ముఖ్య కారణాల్లో ఒకటి మద్యపానమని గుర్తించాలి. మద్యం నుండి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ప్రధానమనే మైండ్‌సెట్‌ నుండి ప్రభుత్వం బయటపడాలి. గ్రామంలో మద్యం సరఫరా లేకుండా చేయాలి. మద్యం దుకాణాల సంఖ్య పూర్తిగా తగ్గించి వేయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపే మద్య విక్రయం జరపాలి. ఆ తర్వాత దుకాణాలను మూసివేయాలి. సామాజిక భద్రతలో భాగంగా మద్యనియంత్రణపై అంచల వారీగా కేంద్రీకరించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రహదారులపై 500 మీటర్లలోపు ఉన్న అమ్మకపు దుకాణాలను ఎత్తివేయాలి. బస్టాపులు, గుడులు, బడులు, నాలుగురోడ్ల కూడళ్ళు, జనసమ్మర్దం ఉన్న ప్రదేశాలలో నిబంధనలకు వ్యతరేకంగా ఉన్న మద్యం దుకాణాలను రద్దు చేయాలి. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూసే ధోరణిని విడనాడాలి. యువతను, కుటుంబాలను, ఆరోగ్యాలను ధ్వంసం చేస్తున్న మద్యం మత్తు నుండి బయటకు తీసుకురావడానికి డి-ఎడిక్షన్‌ సెంటర్లను మండల స్థాయిలో ఏర్పాటు చేయాలి. ప్రజల్ని చైతన్యం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. అందుకు తగిన బడ్జెట్‌ను కేటాయించి ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి. మాదక ద్రవ్యాలను నిషేధించాలి.

6. వ్యవసాయం ః వ్యవసాయ సంక్షోభాన్ని అరికట్టాలి. వ్యవసాయంలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తించడం ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. ఏడాది పొడుగునా గ్రామీణ వ్యవసాయ రంగ మహిళలకు ఉపాధి లభించేలా విధాన నిర్ణయాలు, పథకాలు చేపట్టాలి. మహిళలను రైతులుగా గుర్తిస్తూ గుర్తింపు కార్డులు ఇవ్వాలి. మహిళా రైతులకు వ్యవసాయ పథకాలు, సేవల అందుబాటుకు చర్యలు తీసుకోవాలి. మహిళా సాగుదారులను గుర్తించాలి. వారి పేర్లను, పహాని/సాగు రికార్డులలో నమోదు చేయాలి. భూమి అభివృద్ధికి మద్దతుతో సహా మహిళలకి స్పష్టమైన భూమి హక్కులు ఉండాలి. మహిళలకు ఇచ్చిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజా ప్రయోజనం పేరుతో తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే అంతకంటే ముందే ఆ భూమితో సమానమైన భూమిని నిర్వాసితులకు అందచేయాలి. అసైన్‌మెంట్‌ భూమి లబ్దిదారులైన ఎస్‌.సి, ఎస్‌.టి మహిళలకు ప్రత్యేక వ్యవసాయ మద్దతు ఇవ్వాలి. ఒంటరి మహిళా రైతులకు, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలకు ప్రత్యేక మద్దతు ఇవ్వాలి.

ఆదివాసీ ప్రాంతాలలో మహిళల భూమి హక్కులు చాలా ముఖ్యమైనవి. అటవీ హక్కుల చట్టంలో భాగంగా స్త్రీల వ్యక్తిగత, ఉమ్మడి, సాముదాయిక హక్కులను గుర్తించాలి. వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో మంజూరు చేయాలి. అటవీ హక్కుల చట్టం కింద సాముదాయిక హక్కులలో స్త్రీల నిత్యజీవితావసరాలకు, జీవనాధార హక్కులకు భద్రత కల్పించే సాగు చేయని ఆహారం, పండ్లు, నీరు, పశుగ్రాసము, వంట చెరకు, అటవీ ఉత్పత్తుల సేకరణకి ప్రాధాన్యతనివ్వాలి. ఆదివాసేతరులు ఆక్రమించుకున్న ఆదివాసుల భూములను తిరిగి వారికి చెందేటట్లు తీసుకునే చర్యలలో మహిళల భూములు తిరిగి ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన కేసులను నిర్దిష్ట కాలపరిమితిలో వేగంగా పరిష్కరించడానికి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి. పోలవరం లాంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరిగినప్పుడు ముంపు ప్రాంతాలలో నిర్వాసితులైన మహిళల సమస్యలను, అవసరాలను ప్రత్యేకంగా గుర్తించాలి. 2013 చట్టం ప్రకారం వారికి నష్టపరిహారం ఇవ్వాలి. అటవీ నివాసుల స్థానిక ఆహార ఉత్పత్తి వ్యవస్థలైన పోడు వ్యవసాయాన్ని పటిష్టవంతం చేయాలి. పోడు భూములలో పండ్ల చెట్లు, మందు మొక్కలు వంటివి ప్రోత్సహించాలి. ఆదివాసుల పోడు భూములలో బలవంతంగా పోలీసు నిర్బంధంతో ‘హరితహారం’ పథకం కింద వాణిజ్య మొక్కలు నాటటం వల్ల వారి హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. గ్రామ సభలు, అటవీ హక్కుల కమిటీలలో మహిళల పాత్ర, నిర్ణయాధికార హక్కులను, ప్రత్యేకించి అటవీ పరిపాలన, అటవేతర అవసరాలకు కాంపా (జూవీూూ) నిధుల మళ్ళింపు విషయంలోనూ బలోపేతం చేయాలి.

ప్రయివేటు యాజమాన్యంలోని భూములపై మహిళల హక్కులను నమోదు చేయాలి. వర్షాధారిత వ్యవసాయానికి ప్రభుత్వ విధానాన్ని తయారుచేసి, పెట్టుబడులను సమకూర్చటం, ఆహార పంటలకు, తృణధాన్య పంటలకు ప్రాధాన్యతనివ్వాలి. తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతను తృణధాన్యాల తట్ట (మిల్లెట్‌ బౌల్‌) గా మార్చాలి. సామాజిక భద్రత చర్యలు, అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం, 2008 ప్రకారం మహిళా వ్యవసాయ కూలీలను, స్వయం ఉపాధి పొందుతున్న మహిళా రైతుల గణాంకాలు సేకరించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రతి జిల్లాలోనూ వెల్ఫేర్‌ బోర్డులను ఏర్పాటు చేయాలి. మహిళా రైతు సంఘాలు, సహకార సంఘాలు ఏర్పరచి, బలోపేతం చేయాలి. ఇవి దీర్ఘకాలం పాటు స్వతంత్రంగా పని చేయడానికి వీలుగా సహకార సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణలు ఏర్పాటు చేయాలి.

7. అసంఘటిత రంగంః పట్టణ ఉపాధి, వలసలు-గృహ కార్మికులు, నిరాశ్రయులు ః ఉపాధి కోసం, వివిధ కారణాలచేత కుటుంబాలను, ఆవాసాలను వదిలి వలస వచ్చిన వివిధ సమూహాలకు చెందిన మహిళలకు కనీస సదుపాయాలతో షెల్టర్‌ హోమ్స్‌ నిర్మించాలి. ఉపాధి భద్రత కల్పించాలి. అసంఘటిత రంగ మహిళా కార్మికులకు సామాజిక భద్రతా పథకాలన్నీ అమలు చేయాలి. తెలంగాణ అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డుని (వెల్ఫేర్‌ బోర్డు) ఏర్పాటు చేయాలి. ట్రాన్స్‌జండర్స్‌, గృహ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, ఇంకా ఇతర అసంఘటిత రంగ మహిళా కార్మికులందరికీ దీనిలో ప్రాతినిధ్యం ఉండాలి.

తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా 8 లక్షల మంది మహిళలు గృహ కార్మికులుగా ఉన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పట్టణాలకు, నగరాలకు మహిళా కార్మికులు వలసలు చాలా అత్యధిక సంఖ్యలో ఉంటున్నాయి. ఇందులో అత్యధికంగా దళిత, ఆదివాసీ, బలహీన వర్గాల నుంచి వచ్చిన మహిళలే ఉన్నారు. వారి రక్షణ కోసం ఒక సమగ్ర చట్టాన్ని తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో చాలామంది నిరుపేదలు, చదువులేని వారు, కాబట్టి వారికి పట్టణ లేబర్‌ మార్కెట్‌ గురించి తెలియదు. ఇంటి పనికి విలువ చాలా తక్కువ. అతి తక్కువ జీతాలు, క్రమబద్దీకరణ లేదు. సవ్యంగా లేని పని సమయాలు, పరిస్థితులు, హింస, నిందారోపణలు, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, అక్రమ రవాణాదారుల/ప్లేస్‌మెంట్‌ ఏజన్సీల దోపిడీ, మోసాలు, బలవంతపు సంక్షేమ చర్యల కొరత, జీవితంలో ఎదుగు బొదుగుకు ఏ మార్గాలు లేకపోవడం, గృహ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, 2011లో భారత ప్రభుత్వం అనుకూలంగా ఓటేసిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ – ఐఎల్‌ఓ) కన్వెన్షన్‌లోని 189లోని మార్గదర్శకాలను అమలుపరచాలి. కనీస వేతన సవరణ చట్టానికి (1948) విస్తృత ప్రచారం కల్పించాలి. వీరికి నెలకు రోజుకి 8 గంటల పనికి రూ.10,000 కనీస వేతనంగా చెల్లించాలి. బలవంతపు పనిని వెంటనే ఆపివేయాలి. (ఐ.ఎల్‌.ఓ కన్‌వెన్షన్‌ సి-189) బాలలతో పనిచేయించకుండా పటిష్టమైన నియంత్రణ ఉండాలి.

8. విదేశాలకు వెళ్ళే వలస కార్మికులు ః జీవనాధారం కోసం గల్ఫ్‌ లాంటి దేశాలకు కూడా అసంఘటిత రంగ మహిళల వలస చాలా పెరుగుతోంది. సరైన సమాచారం, చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోకుండా మధ్య దళారుల చేతిలో ఎంతోమంది మోసపోతున్నారు. గల్ఫ్‌తో సహా 17 ఇ.సి.ఆర్‌ (ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ రిక్వయిర్డ్‌) దేశాలలో 60 లక్షల మంది భారతీయ వలస కార్మికులు పనిచేస్తున్నట్లు ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో మన తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులు 10 లక్షల మంది ఉన్నట్లు ఒక అంచనా. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ పాత నగరం నుండి గల్ఫ్‌కు వలసలు ఎక్కువగా ఉన్నాయి. వలస కార్మికుల కుటుంబాల సమస్యలపై అధ్యయనాలు జరగాలి. ఇమిగ్రేషన్‌ చట్టం 1983 ప్రకారం, విదేశీ వలసలను నియంత్రించాలి. అక్రమ వలసలను నియంత్రించాలి. ఇందుకు అవసరమైన చట్టబద్ధమైన చర్యలన్నింటినీ ప్రభుత్వం తీసుకోవాలి. ప్రవాస సంక్షేమ మంత్రిత్వ శాఖను తప్పక ఏర్పాటు చేయాలి. ఆ మంత్రిత్వ శాఖ ప్రవాసీల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం 100 కోట్ల చొప్పున అయిదేళ్ళలో 500 కోట్లు కేటాయించాలి. ఇప్పటివరకూ రాష్ట్రం నుంచి విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్‌ వలస వెళ్ళిన కార్మికులందరి (స్త్రీలు, పురుషులు) వివరాలను సేకరించడానికి ప్రభుత్వం, సమగ్రమైన సర్వే నిర్వహించాలి. వలస వెళ్ళిన రాష్ట్ర కార్మికులు ఏడాదికి 400 మంది వివిధ కారణాల చేత చనిపోతున్నారు. వీరిలో కొందరికి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అలాగే రోజుకొక్క మృతదేహం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకి వస్తోంది. ఈ మృతదేహాలను తీసుకెళ్ళడానికి ఏర్‌ కార్గో, శంషాబాద్‌ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగడానికి మృతుల బంధువులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరికోసం ఏర్‌ కార్గోలో ఒక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలి. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించడానికి ఉచిత అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలి. చనిపోయిన వ్యక్తి కుటుంబాలకు కనీసం రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. వలస కార్మికుల ఆరోగ్య సమస్యల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ట్రాఫికింగ్‌ ఉచ్చులో చిక్కుకోకుండా, ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా, హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌ బారిన పడకుండా తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలి. కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సూరెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలి. వివిధ కేసులలో విదేశీ జైళ్ళలో మగ్గుతున్న ప్రవాసీ కార్మికులకు ఉచిత న్యాయ సహాయం అందించాలి. వలస వెళ్ళాలనుకునే వారికోసం సమగ్రమైన, చట్టపరమైన వివరాలను అందించేందుకు జిల్లా కలెక్టరేట్‌ కేంద్రాలలో, రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మధ్య దళారుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో విదేశీ వలసలపై అధ్యయన కేంద్రాలను నెలకొల్పాలి.

9. పర్యావరణం-సహజవనరులు ః తెలంగాణా ప్రధానంగా పుష్కలమైన సహజ వనరులు, అడవులు, నదీపరివాహక ప్రాంతాలుగా విలసిల్లుతున్న నేపధ్యంలో ఇప్పుడు జరగబోయే అభివృద్ది వీటి ఉనికికే భంగం కలిగించకుండా చూసుకునే బాధ్యత ప్రస్తుత ప్రభుత్వాలది మరియు ప్రజలదీనూ. ఇప్పటిదాకా మనం చూసిన, చూస్తున్న చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని అదే తప్పును మనం తెలంగాణలో పునరావృతం కాకుండా చూడాలి. కార్పొరేట్‌ సంస్థలకు, మైనింగ్‌ సంస్థలకు, ఫార్మాస్యూటికల్‌ కంపెనీలకు, విదేశీ పెట్టుబడులకు, కాంట్రాక్టర్లకు ఎర్ర తివాచీ పరిచే సంస్కృతికి చరమగీతం పాడాలి.

తెలంగాణాలో ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌ ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో, ఎంతగా ప్రజల జీవితాన్ని, పర్యావరణాన్ని అతలాకుతలం చేసిందో తెలిసిన విషయమే. ఉత్తర తెలంగాణాలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం ప్రాంతంలో బొగ్గు తదితర ఖనిజాల కోసం 350 కిలోమీటర్ల మేర మైనింగ్‌ జరుగుతోంది. దీనిపట్ల సమగ్ర అధ్యయనం చేసి ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌కు స్వస్తి పలికి నాశనమయిన పర్యావరణాన్ని పునరుజ్జీవింపచేయాలి. అయితే ఇంతకంటే ఎక్కువ స్థాయిలో క్వారీల రూపంలో ప్రతి కొండని, గుట్టని కంకర కోసం, గ్రానైట్‌ కోసం, రోడ్లు, ఇళ్ళ నిర్మాణం కోసం జరుగుతున్న విధ్వంసం తెలంగాణా అంతటా విస్తరించి ఉంది. ఇది మైనింగ్‌ నిబంధనల పరిధిలో లేదని మైనింగ్‌ మరియు జియాలజీ డిపార్ట్‌మెంట్‌ చెప్తోంది. దాంతో ఇంతకాలం యధేచ్ఛగా ఏ అదుపూ లేకుండా గుట్టలు, కొండల హననం కొనసాగుతోంది. కోట్ల సంవత్సరాల

నుంచి వస్తున్న సహజ సంపద ఈ రకంగా దోపిడీ విధ్వంసాలకు గురవుతూ మరెన్నటికీ వాటిని పునఃసృష్టించలేమనే విషయాన్ని గుర్తించి వాటిని కాపాడుకోవడానికి నడుం బిగించాలి. వీటిని ఆపడం కోసం ప్రస్తుత ప్రభుత్వం ఒక విధాన నిర్ణయాన్ని ప్రకటించాలి. గుట్టలే లేకపోతే నీటి వనరులు కూడా అంతరించిపోతాయనే విషయాన్ని ప్రజల్లో బలంగా పాతుకుపోయేలా చర్యలు చేపడుతూ, వీటి పరిరక్షణ బాధ్యతను పంచాయితీలకు, పౌర సమాజానికి అప్పచెప్పాలి. ప్రజా పర్యావరణ హిత అభివృద్ధి దిశగా బాటలు వేయాలి. తెలంగాణ అంటే సహజ సంపదగా, సహజత్వానికి దగ్గరగా ఉండే సంస్కృతిగా ప్రపంచానికి తెలియచెప్పాలి.

10. కులాంతర, మతాంతర వివాహాల ప్రత్యేక రక్షణ చట్టం ః కులాంతర, మతాంతర వివాహాలలో పితృస్వామ్య, కుల, మత పరమైన ఆధిపత్య హింసలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. తెలంగాణలో కులాంతర వివాహాలు చేసుకున్న యువతీ, యువకుల మీద పితృస్వామ్య ఆధిపత్య కుటుంబ వ్యవస్థ చేస్తోన్న హత్యోన్మాద దాడులు పెరుగుతున్నాయి. ఈ హత్యోన్మాదులకు రాజకీయ అధికార వ్యవస్థను అడ్డుపెట్టుకుని నిందితులు చెలరేగిపోతున్నారు. వీరిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. వివాహ విషయమై మేజర్లయిన యువతీ యువకుల నిర్ణయాన్ని గౌరవిస్తూ వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది.

11. పెద్దల సంరక్షణ లేని పిల్లలు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ట్రాన్స్‌జండర్‌ వ్యక్తులకు సామాజిక భద్రత ః వివిధ సామాజిక అసమానతలు, హత్యా రాజకీయాలు, కుటుంబ హింసలతో పాటు ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిరాశ్రయులవుతున్న వివిధ సమూహాల నుంచి పిల్లలు పెద్దల సంరక్షణ లేని ప్రమాదకర పరిస్థితుల్లో బతకాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. బాలకార్మికులుగా మారుతున్నారు. హైదరాబాద్‌ వంటి నగరాల్లోనే రోడ్లమీద బతుకుతున్న బాలబాలికల సంఖ్య ముప్ఫైవేలకు పైగానే ఉందని ఈ మధ్య ఒక సర్వేలో బయటకు వచ్చింది. పెద్దల సంరక్షణ లేని పిల్లలందరికీ ఉచిత విద్య, నివాసం, ఆహార భద్రతలను హక్కులుగా సమకూరుస్తూ ఒక విధాన నిర్ణయాన్ని తీసుకురావాలి. స్వతంత్ర పౌరులుగా ఎదిగేందుకు అన్నిరకాల మద్దతు వ్యవస్థలను, ఆర్థిక వ్యవస్థలో సహా ఏర్పాటు చేయాలి. వారిపట్ల సమాజంలో నెలకొన్న అసమానత, అవమానకర ధోరణులలో మార్పు తీసుకురావటానికి చైతన్యపరచడానికి నిరంతరం అవగాహన కార్యక్రమాలు తీసుకురావాలి.

ఆధునిక సమాజంలో స్వతంత్ర (ఒంటరి) మహిళ అనే దృక్పథం అనివార్యంగా ఉనికిలోకి వచ్చింది. ఒంటరి మహిళలను ప్రత్యేకంగా నిర్వచించాలి. స్త్రీలు భర్తనుంచి విడిపోయినా, భర్త చనిపోయినా, ఏ కారణం చేతనైనా పెళ్ళి కాకపోయినా, విడాకులు లేకుండానే విడిగా ఉంటున్నా జోగిని, బసివిని వంటి మహిళలందర్నీ ఒంటరి మహిళలుగా గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డులను జారీ చేయాలి. తెలంగాణ గ్రామాల్లో వీరి సంఖ్య చాలా ఎక్కువ స్థాయిలో ఉండడానికి గల కారణాలను విశ్లేషించడానికి ప్రత్యేక పరిశోధనా అధ్యయనాలు చేపట్టాలి. వీరికి ఈ కింది వసతులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. వివిధ కారణాల చేత కుటుంబ భారాన్ని, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్న వారి బాధ్యతను మోస్తున్న మహిళలందరికీ 25 రోజుల కనీస వేతన మొత్తాన్ని పెన్షన్‌గా అందించాలి. నివాస వసతి, విద్య, వైద్య, ఆహారంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను వర్తింపచేయాలి. స్వతంత్ర మహిళలకు ఆమె నైపుణ్యం, వృత్తిని ప్రాతిపదికగా చేసి 5 ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమిని దాని సాగుకు అవసరమైన వ్యవస్థాగత మద్దతులను, రుణ సదుపాయాన్ని కల్పించాలి. గుడి పరిధిలోని దేవుని భూములను జోగినీ మహిళల పేరున పట్టా చేయాలి. బాణామతి, చేతబడుల పేరిట జరిగే వేధింపులు, దాడులు, తద్వారా చావులకు గురవుతున్న నేపధ్యంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం, పని స్థలాల్లో స్త్రీలపై వేధింపుల చట్టం పరిధిలోకి వీరిని చేర్చాలి.

శారీరక, మానసిక వికలాంగులైన మహిళల సామాజిక భద్రత, ఆరోగ్యం, విద్య, నివాసం విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వివక్ష ఉండరాదు. వారి వికలత్వ శాతాన్ని బట్టి వారికి పింఛను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీరికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని ప్రకటించాలి. అన్ని పథకాలలో వీరికి ప్రాధాన్యతనివ్వాలి. పాఠశాలలో, కార్యాలయాలు, సినిమా హాళ్ళు, సూపర్‌ మార్కెట్లు, ఇతర ప్రదేశాలలో వీరి రాకపోకలకు అనుగుణమైన నిర్మాణాత్మకమైన మార్పులు చేపట్టాలి. మెట్ల స్థానంలో ర్యాంపులను ఏర్పాటు చేయాలి. బహిరంగ ప్రదేశాలలో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. రోడ్లమీద నడవడానికి వీలుగా గ్రామ, పట్టణ, నగర ప్లానింగ్‌లు జరగాలి. ఆసుపత్రులలో ప్రత్యేక ఆరోగ్య వైద్య సదుపాయాలు ఉండాలి.

ట్రాన్స్‌జండర్‌ సమూహాలు అత్యంత దారుణమైన సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారు. విద్యావకాశాలు లేవు. బతుకుతెరువు కోసం భిక్షాటన, పడుపు వృత్తి తప్ప మరో ఉపాధి అవకాశం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వీరిమీద అసాంఘిక శక్తుల దాడులు నిత్యకృత్యం. వీరిని ఒంటరి మహిళలుగా గుర్తించి అన్ని సామాజిక పథకాలలో ప్రాధాన్యత కల్పించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్లు ఏర్పాటు చేయాలి. వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలి. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేయడానికి అన్ని మాధ్యమాలలో కార్యక్రమాలు రూపొందించాలి. వీరిపై అవమానకరంగా ప్రసారమవుతున్న కార్యక్రమాలను రద్దు చేయాలి. ట్రాన్స్‌జండర్‌ వ్యక్తుల పట్ల అవమానకరంగా, హింసాత్మకంగా దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. రాజకీయ ప్రతినిధులుగా అవకాశం కల్పించాలి.

12. మహిళా చేనేత రంగం ః వ్యవసాయం తర్వాత అత్యధికంగా మహిళలు పాల్గొంటున్న రంగం చేనేత. తెలంగాణ విషయంలో ఈ సంఖ్య మరీ ఎక్కువ. ఈ రంగంలో ఉత్పత్తి పెంచుకోవాలన్నా, మార్కెట్‌ని నిలుపుకోవాలన్నా తద్వారా లభించే జీవనోపాధిని కోల్పోకుండా ఉండాలన్నా, ఆత్మహత్యలు జరగకుండా ఉండాలన్నా ఈ కింది సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రధాన నేతదారుగా మహిళ ఉన్న కుటుంబాలలో మగ్గాలన్నీ కూడా మహిళల పేరుమీదే రిజిస్టర్‌ అయి ఉండాలి. ఒక కుటుంబంలో పురుషుడు, మహిళ ఇద్దరూ నేతదారులైనప్పుడు చేనేత సహకార సంఘాల్లో ప్రాథమిక సభ్యత్వం మహిళలదే అయి ఉండాలి. మగ్గాలు లేని మహిళకు, మగ్గాలు కొనుక్కోవడానికి ఆర్థిక సహాయం అందించాలి. పొదుపు, భీమా ఇతరత్రా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరుమీదే జరగాలి. ప్రస్తుతం ప్రాథమిక చేనేత సహకార సంఘాల చేతుల్లో ఉన్న యార్న్‌ డిపోల బాధ్యతలను గ్రామాలలో ఉన్న మహిళా గ్రూపులకు అప్పగించాలి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా చేనేత కార్మికులకు అన్ని ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేయాలి.

13. మహిళా జర్నలిస్టుల స్థితిగతులు ః ఇటీవల మీడియాలో కనబడుతున్న మహిళల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తున్నా మొత్తం జర్నలిస్టులలో ఆ సంఖ్య కనీసం 10 శాతం కూడా లేని విషయం వాస్తవం. ఇందులో కూడా ప్రింట్‌ మీడియాలో కన్నా ఎలక్ట్రానిక్‌ మీడియాలోకి వస్తున్న వారి సంఖ్య కొంచెం ఎక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం. ఏళ్ళ తరబడి పనిచేసినా నామమాత్రపు వేతన పెంపు కూడా లేకుండా, పదోన్నతులు లేకుండా యధాస్థితిలోనే ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఈ కింది సూచనలను ప్రభుత్వ విధాన నిర్ణయం చేయాలి. మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలి. మహిళా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్‌ సదుపాయాన్ని కల్పించాలి. ప్రెస్‌ అకాడమీలోనూ, జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సంఘాల్లోనూ మహిళా జర్నలిస్టులకు యాభై శాతం పదవులు కేటాయించాలి. బడ్జెట్‌ కూడా యాభై శాతం వీరికే చెందేలా ఏర్పాటు చేయాలి. భార్యాభర్తలు ఇరువురూ మీడియాలో ఉన్నట్లయితే ఇళ్ళ స్థలాలను భార్య పేరుమీదే ఇవ్వాలి. మహిళా జర్నలిస్టులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగుల్లాగే 58-60 సంవత్సరాల వరకూ ఉద్యోగంలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలి. రాత్రి సమయాల్లో ముఖ్యంగా 9 గంటల తర్వాత విధులకు హాజరు కావాలన్నా, విధులు ముగించుకొని గమ్యస్థానాలు చేరాలన్నా కానీ యాజమాన్యాలు వాహన సదుపాయాన్ని, భద్రతను కల్పించేలా ఆదేశాలు జారీచేయాలి. విధి నిర్వహణలో మహిళా జర్నలిస్టులు ప్రమాదానికి గురైతే సదరు ఉద్యోగికి, వారి కుటుంబానికి అవసరమైన ఆర్ధిక సహాయ సహకారాలను అందించాలి. అన్ని ఆఫీసుల్లోనూ లైంగిక వేధింపుల నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి. మహిళా జర్నలిస్టుల గురించి ఇతరులు, తోటి ఉద్యోగులు చులకనగా మాట్లాడే ధోరణిని నివారించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేక ఆరోగ్య కార్డులను జారీ చేయాలి. హైదరాబాద్‌లో వీరికి ఒక ప్రత్యేక ప్రెస్‌ క్లబ్‌ (ఢిల్లీలో లాగా) నగరం నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఏర్పాటు చేయాలి. అవసరమైన వసతులను, సౌకర్యాలతో పాటు రిఫరెన్స్‌ లైబ్రరీని ఏర్పాటు చేయాలి.

14. తెలంగాణాలో చారిత్రాత్మక మహిళలు ః

కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న వీరవనితలు సమ్మక్క సారక్కలు; కాకతీయుల సామ్రాజ్యంలోని రాణి రుద్రమ్మ; బోద్‌ సంస్థానపు రాణి శీలం జానుబాయి; వనపర్తి సంస్థానం రాణి శంకరమ్మ; ప్రముఖ ఉర్దూ రచయిత్రి, కళాపోషకురాలు మహాలఖాబాయి చాందా; షుగ్రా హుమాయూన్‌ మీర్జా (1882-1958); జిలానీ బాను (1936); వాజిదా తబస్సుమ్‌; నేను హైదరాబాద్‌ వాసిని అని సగర్వంగా చాటిన సరోజిని నాయుడు (1873-1949); అదే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న ఆమె కుమార్తె డా.పద్మజా నాయుడు (1900-1975) ఐఎన్‌సి సభ్యురాలు (ఉస్మానియా యూనివర్శిటీ సెనేట్‌ మెంబర్‌); తెలంగాణా సాయుధ పోరాటంలో పౌరుష ధీశాలి చిట్యాల ఐలమ్మ; జమాలున్నీజా బాజీ; రజియా బేగం; మల్లుస్వరాజ్యం; ప్రమీలాతాయి; బ్రిజ్‌రాణిగౌర్‌; జీనత్‌ సాజిద; దూడల సాలమ్మ; కొమురం సోంబాయి; తెలంగాణ రాష్ట్ర తొలి దశ పోరాటంలో నాయకత్వం వహించిన టి.ఎన్‌.సదాలక్ష్మి; సుమిత్రాదేవి; సంగెం లక్ష్మీబాయి; ఈశ్వరీబాయి (శాసనసభ్యులు); మసూమా బేగం (ఎ.ఐ.డబ్ల్యూ.సి ప్రెసిడెంట్‌ 1962-1964); హైదరాబాద్‌లో స్త్రీ, శిశు ఆరోగ్యం కోసం, విద్య కోసం శ్రమించిన దుర్రే షావర్‌; నిలోఫర్‌; డా.ప్రేమా మసిలామణి నాయుడు (విక్టోరియా జనానా ఆసుపత్రి); డా.మెర్సిలిన్‌ లీమా (1899-1984); డా. శాంతాబాయి కిర్లోస్కర్‌; డా.రత్నాబాయి; డా.లోకాబాయి; ప్రముఖ కళా పోషకురాలు చిందు ఎల్లమ్మ; రాణి కుముదినీ దేవి (ఎమ్‌ఎల్‌సి – మేయర్‌, హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌); ఎల్లాప్రగడ సీతాకుమారి; వనజా అయ్యంగార్‌ (ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గణిత శాస్త్రవేత్త)ల చరిత్రలు కనుమరుగయ్యాయి. చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా వీరి గురించి అధ్యయనం చేసే అకాడమీని ఏర్పాటు చేయాలి. ఈ అకాడమీలో బహుజన స్త్రీ భాగస్వామ్యం విధిగా ఉండాలి. వీరి జీవిత చరిత్రలు రాయాలి. రాబోయే తరాలకు, ముఖ్యంగా విశ్యవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలి. వీరి పేర్లను హాస్పిటల్స్‌కు పెట్టాలి, వీరి పేర్లతో పురస్కారాలు, పార్కులు, విగ్రహాలను స్థాపించాలి.

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.