సరిహద్దుల్లో… -శ్రీకాంత్‌ భక్షి

ఆగస్ట్‌ 14… నిజానికి మన దేశంలో దేశ భక్తి ఉప్పొంగేది ఆ ఒక్క రోజే. అదేంటి దేశ భక్తి పొంగాల్సింది ఆగస్ట్‌ 15న కదా అనుకుంటున్నారా? నిజమే కానీ సోషల్‌ మీడియా పుణ్యమా అని… ముందురోజు తెల్లారగానే… ప్రతి ఒక్కరూ అడ్వాన్స్‌డ్‌ ఇండిపెండెన్స్‌ డే గ్రీటింగ్స్‌ చెప్పేస్తారు. నిజానికి ఇండిపెండెన్స్‌ డే అని చాలా మందికి గుర్తొచ్చేది కూడా అప్పుడే. ఆ ఒక్క రోజు మన స్వాతంత్య్ర వీరులు గుర్తొస్తారు. వారి త్యాగాలు స్మరిస్తాం. దేశభక్తి గీతాలు రింగ్‌ టోన్‌లుగా పెట్టుకుంటాం. మువ్వన్నెల జెండా డీపీగా మార్చుకుంటాం. ఆ రెండ్రోజులూ సోషల్‌ మీడియాలో నిండిపోయే దేశ భక్తి వారం దాటితే ఎక్కడికి పోతుందో, ఏమైపోతుందో ఎవరికీ తెలియదు. ఇది సామాన్యులకే కాదు… సోకాల్డ్‌ మీడియాది కూడా ఇదే దారి. కానీ ఏడాదిలో 365 రోజులూ, రోజూ 24 గంటలూ…దేశభక్తిని గుండె నిండా కప్పుకుని… అనుక్షణం దేశం కోసం పోరాడే లక్షలాది మంది ఉన్నారన్న విషయం కూడా మనెవరికీ గుర్తుండదు. వాళ్ళే మన సైనికులు.

మన సైన్యమే… మన ధైర్యం. ఈ రోజు మనమంతా ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే… దానికి కారణం సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా కాపలా కాసే సైన్యమే. సరిహద్దులు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది కాశ్మీర్‌ బోర్డరే. కొండ కోనల్లో పాక్‌ సైన్యాన్ని నిలువరించే వీర జవాన్లే గుర్తొస్తారు. కార్గిల్‌ యుద్ధం తర్వాత… సియాచిన్‌ వంటి మంచు కొండల్లో మన సైనికుల కష్టం కూడా తెలిసొచ్చింది. కానీ సరిహద్దులంటే కాశ్మీర్‌ ఒక్కటే కాదు. మన దేశానికి 14 రాష్ట్రాలు దేశ సరిహద్దులుగా ఉన్నాయన్న విషయం చాలా మందికి గుర్తుకు రాదు. అంతే సరిహద్దు అనగానే మంచు పూల కాశ్మీరం తప్ప మండుటెండల రాజస్థాన్‌, ఈశాన్య రాష్ట్రాల్లో నీటి మధ్య బంగ్లా సరిహద్దులు ఎవరికీ తెలియవు. అంతెందుకు… వాఘా బోర్డర్‌ అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ వాఘా అనేది పాకిస్థాన్‌ వైపు భూభాగమని… మన దేశంలో ఉన్న భూభాగం పేరు అట్టారి అని కూడా చాలా మందికి తెలియదు. మన సైన్యం 14 రాష్ట్రాల సరిహద్దుల్లో అటు కొండలపై, ఇటు అడవుల్లో, ఉప్పు సముద్రాల్లో…ఎముకలు కొరికే మంచు పర్వతాల్లో, నిప్పులు కక్కే ఎడారుల్లో, మింగేసే సాగర జలాల్లో, నిత్యం పహారా కాస్తూనే ఉంటారు. మన దేహం మీద మనకు ఎలాంటి అవగాహన ఉందో… మన దేశం మీద కూడా అంతే అవగాహన అవసరం. అలాగని ప్రతి ఒక్కరూ సరిహద్దుల్లోకి వెళ్ళి చూడటం కుదరని పని. కానీ ఆ సాహసం చేశారు… జర్నలిస్ట్‌ రెహనా.

పాత్రికేయం చాలా కష్టమైన వృత్తి. అంతకు వంద రెట్ల కష్టం సైన్యంలో ఉంటుంది. మనకు ఏడాదికోసారి స్వాతంత్య్ర దినోత్సవం రోజునో, ఎప్పుడో యుద్ధాలు వచ్చినప్పుడో సైనికుల కష్టాలు తెలిసొస్తాయి. కానీ మన కోసం, దేశం కోసం ప్రాణాలకు కూడా లెక్కచేయని లక్షలాది మంది సైన్యం నిత్య జీవన పోరాటాన్ని కళ్ళకు కట్టినట్లుగా రచయిత రాసుకొచ్చారు. మన దేశంలోని అన్ని సరిహద్దుల్లో ఆర్మీ క్యాంపులకు వెళ్ళడం సామాన్యులకు సాధ్యం కాదు. కానీ దేశంలో తీర్థయాత్ర చేసినట్లు… సరిహద్దుల్లో రచయిత సాహస యాత్రే చేశారు. ప్రాణాలకు తెగించి… వేల కిలోమీటర్లు ప్రయాణించి… వారిలో ఒకరిగా మారి… సరిహద్దు భారతాన్ని మన కళ్ళముందుంచారు. సరిహద్దుల్లో సైనికులనే కాదు… అక్కడి గ్రామాల ప్రజలను, అక్కడి సంస్కృతిని కూడా మనకు పరిచయం చేశారు. నిజానికి మనలో ఏ ఒక్కరం కూడా రెహనా తిరిగినన్ని ప్రదేశాలు తిరగడం అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని సరిహద్దుల్లో తన సాహసానికి అక్షర రూపమిచ్చారు రెహనా. ఈ ప్రయాణం ప్రమాదకరం అని ఎందుకు చెప్పాలంటే… యుద్ధాలు వచ్చినప్పుడే మన సరిహద్దుల్లో కాల్పులు జరుగుతాయని మనం అనుకుంటాం. కానీ కాశ్మీర్‌ సరిహద్దుల్లో నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కాల్పుల మోతలో సరిహద్దులు దద్దరిల్లుతూనే ఉంటాయి. అక్కడి గ్రామస్తులు బతుకు మీద ఆశతో నిత్యం చావు భయంతోనే బతుకుతారు. ఏ క్షణం ఏ మోర్టార్‌ వచ్చి ప్రాణం తీస్తుందో అన్న భయం వాళ్ళను నిత్యం వెన్నాడుతున్నా, వాళ్ళింకా అక్కడే ఎందుకు ఉంటారన్నది తెలియాలంటే ఈ పుస్తకం తప్పక చదవాల్సిందే.

సరిహద్దుల్లో సైనికుల జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు రెహనా. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో హిందూ మహా సముద్ర జలాల మధ్యన ఉండే ఆర్మీ పోస్ట్‌లో పహరాకు వెళ్తే, నెల రోజులపాటు… నడి సంద్రం మధ్యనే ఉండి కాపలా కాయాలన్నది మనలో చాలామందికి తెలియదు. యుద్ధాలు వచ్చినప్పుడే సైన్యానికి పని అనుకునే చాలా మందికి తెలియని ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో రాసుకొచ్చారు రెహనా. చిన్న ఉదాహరణ…1999 కార్గిల్‌ యుద్ధం ముగిసిపోయిన తర్వాత అప్పటి ప్రధాని వాజ్‌పేయ్‌ లక్షలాదిగా భారత సైన్యాన్ని కాశ్మీర్‌ సరిహద్దుల్లో మోహరించారు. 1948 మాదిరిగా భారత్‌ మరోసారి దాడి చేస్తుందేమో అని పాక్‌ ఐదు నెలలకు పైగా కంటిమీద కునుకు లేకుండా గడిపింది. అమెరికా, చైనా … ఇలా అంతర్జాతీయ దౌత్యంతో బయటపడాలని పాకులాడింది. ఆ ఐదు నెలల కాలంలో సరిహద్దుల్లో జరిగిన చెదురు మదురు ఘటనల్లో రెండు వేల మంది చనిపోయారు. కానీ ఇది చాలామందికి తెలియదు. ఈ సంఖ్య కార్గిల్‌లో చనిపోయిన సైనికుల అధికారిక సంఖ్య కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. అప్పుడే కాదు.. ఇప్పుడు కూడా నిత్యం మన సరిహద్దులు రావణ కాష్టంలా రగులుతూనే ఉంటాయి. శతృసేనలు ఒక్కటే కాదు… ఉగ్ర మూకలు, అసాంఘిక శక్తులు నిత్యం చొరబాట్లకు ప్రయత్నిస్తూనే ఉంటాయి. కాశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రమూకలు…పంజాబ్‌ సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల ముఠాలు… బంగ్లా సరిహద్దుల్లో రోహింగ్యాలు, ఇతర శరణార్థులు…అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం సరిహద్దుల్లో చైనా సేనలు… నిత్యం, అనుక్షణం మన దేశాన్ని కబళించేందుకు పొంచి ఉంటాయి. ఒక్క క్షణం అప్రమత్తంగా ఉన్నా, మన భూభాగాన్ని వాళ్ళకు వదులుకోవాల్సిందే. ఏడు దశాబ్దాలుగా… దేశాన్ని దేశంలా పటిష్టంగా కాపాడుతున్న వీర జవాన్లకు ఎన్ని సెల్యూట్‌లు చేసినా సరిపోదు.

ఏటా జనవరి 26న… వాఘా బోర్డర్లో జరిగే బీటింగ్‌ రిట్రీట్‌ కార్యక్రమాన్ని మీడియా ఛానెళ్ళు ప్రముఖంగా ప్రసారం చేస్తాయి. కానీ చాలామందికి తెలియని విషయమేమిటంటే… అక్కడ ఆ కార్యక్రమం ప్రతిరోజూ సాయంత్రం రివాజుగా జరుగుతుంటుందని. అంతేకాదు.. వాఘా అన్నది పాకిస్థాన్‌ సరిహద్దు.భారత్‌ భూభాగం వైపు ఉన్న సరిహద్దు…అట్టారి. అంటే మనం దాన్ని అట్టారి బోర్డర్‌ అని పిలవాలి. కానీ వాఘా బోర్డర్‌ అని పిలుస్తున్నాం. పాకిస్థానీయులు కూడా దాన్ని అలాగే పిలుస్తారు. ఇలాంటి ఎన్నో విషయాలు మనకు ఈ పుస్తకంలో కనిపిస్తాయి.

సరిహద్దులు అనగానే మనకి సైన్యమే గుర్తొస్తుంది తప్ప అక్కడి గ్రామాల్లో నివసించే స్థానికుల దైన్యం ఎవరికీ తెలియదు. కన్న భూమి మీద మమకారాన్ని వదులుకోలేక, ప్రాణాలను కూడా లెక్కచేయకుండా అక్కడే సరిహద్దుల్లోనే చావో, బతుకో అని అనుక్షణం భయంతోనే కాలం గడిపే సరిహద్దు గ్రామస్తుల జీవనాన్ని కూడా ఈ పుస్తకం విపులంగా పరిచయం చేసింది.

మనలో చాలా మందికి సరిహద్దుల్లో సైన్యం తుపాకీలు గురిపెట్టి ఖాళీగా కూర్చుంటుందన్న అపోహలున్నాయి. కానీ కంటికి రెప్పలున్నాయన్న సంగతి కూడా మర్చిపోయి, ఆకలిదప్పుల్ని ఆమడదూరలో వదిలేసి, రేయింబవళ్ళు… నిశీధిలో కూడా నిర్భయంగా, నిశ్చలంగా యుద్ధం చేసే సైనికుల కష్టాన్ని మాత్రం ఎవరూ గుర్తించరు. వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో ఎన్నో వైవిధ్యాలు. ఒకచోట ఎడారుల్లో… మరోచోట కొండా కోనల్లో… ఇంకో చోట మంచు పర్వతాల్లో…ఒకవైపు ఉప్పు ఎడారుల్లో… మరోవైపు కారడవిలో…. ఇంకోవైపు సాగర జలాల్లో… ఎక్కడ బాధ్యతలప్పగిస్తే… అక్కడ విధులు నిర్వహించాల్సిందే. సరిహద్దుల్లో సైన్యం కష్టాలు అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో వస్తూనే ఉంటాయి. వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తాం. ఎప్పుడో యుద్ధాలు వచ్చినప్పుడు మాత్రమే వీర సైనికుల కష్టాన్ని పేపర్లు, టీవీల్లో చూసి శభాష్‌ అనుకుంటాం. కానీ దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, కుటుంబాలకు దూరంగా, గుండె చప్పుడు తప్ప మరేమీ వినిపించని నిశీధి రాత్రుల్లో మన సైనికులు పడే కష్టాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించిన పుస్తకం… సరిహద్దుల్లో. భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం… సరిహద్దుల్లో. నిజమైన దేశ భక్తిని మనకు తెలియచెప్పే పుస్తకం…సరిహద్దుల్లో.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.