ఆమె ఇల్లు (ఇటీవల మరణించిన కవనశర్మగారికి భూమిక నివాళి) -కవనశర్మ కథ

పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది. ఉద్యోగం సమస్య తీరిన కొద్ది రోజులకు ఆమె ఉండడానికి ఇల్లు వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఉద్యోగాలకి దరఖాస్తులు పెడ్తుంటే ”నీకీ వయస్సులో ఉద్యోగం ఎందుకట?” అని అడిగాడు భర్త రామారావు. ”సుఖంగా ఉండాల్సిన వయసులో ఎందుకమ్మా ఈ అర్థం లేని పనులు” అని నొచ్చుకుంటూ అడిగాడు కొడుకు నారాయణ.

”అక్కయ్యా! ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకెందుకు. వచ్చి నాతో ఉండు, నీకేదైనా మనస్సు నొప్పి కలిగితే” అని ఉత్తరం వ్రాసాడు తమ్ముడు కృష్ణ.

అప్పుడు కమలం అందరికీ ఒకటే సమాధానం చెప్పింది. ”నాకు తోచడం లేదు. ఎప్పుడు విసుగు వస్తే అప్పుడు మానేస్తాను” అని.

ఈవిడగారు అడిగింది కదాని ఈ వయస్సులో ఈవిడకి ఉద్యోగం ఎవరిస్తారని అందరూ ధీమాగా ఉండి గట్టిగా అడ్డుపడలేదు. మన దేశంలో ఓ సౌభాగ్యం ఉంది పనిచేయడానికి, ముఖ్యంగా కష్టపడి ఏ పనైనా చేయడానికి సిద్ధపడేవారికి ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు. సాధారణంగా చూపు అన్ని వైపులకి ప్రసరించని వారికే ఉద్యోగాలు దొరకడం కష్టం అవుతుంది. కమల తనదైన డబ్బు సంపాదించుకోవాలన్న గట్టి పట్టుదల ఏర్పరచుకొన్నాక ఉద్యోగం పెద్ద కష్టం లేకుండానే దొరికింది.

ఉద్యోగం దొరికిన కొన్నాళ్ళకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే, ఇరుకుదైనా సరే అద్దెకు సంపాదించుకోవాలనుకుంది. ఇల్లు చూడమని తెలిసినవాళ్ళని అడిగితే సహాయం చెయ్యకపోగా నోట్లో గడ్డి పెడ్తారని తెలుసు కనుక తనే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

కాని ఇల్లు దొరకడం ఉద్యోగం దొరకడమంత సులభంగా లేదు.

”మీరెంతమంది ఉంటారు?”

”నేనొక్కత్తినే!”

”మీ వారూ, పిల్లలూ ఈ ఊళ్ళో ఉండరా?”

”మావారుంటారు. పిల్లలు పెళ్ళిళ్ళయి దూరంగా ఉన్నారు.”

”మీ వారు మిమ్మల్ని విడిచిపెట్టారా? లేక విడాకులిచ్చారా?”

”లేదు”

”మీవారేం చేస్తూ ఉంటారు?”

కమల చెప్పింది.

”అంత పెద్ద ఉద్యోగస్థుడి భార్య అయిన మీరు ఇంత చిన్న ఇంట్లో ఉండగలరా!”

”అనే అనుకుంటున్నాను.”

”మీ వారు వస్తూ పోతూ ఉంటారా?”

”తెలియదు” అని చెప్పింది కమల ఆలోచించి.

”మీ ఇద్దరూ దెబ్బలాడుకున్నారా?”

”లేదు”

”మీకు స్వంత ఇల్లుందా?”

”లేదు”

”మీరో అద్దె ఇంట్లోను, మీ ఆయనో అద్దె ఇంట్లోను ఉంటారా?”

”కాదు. నేను అద్దె ఇంట్లోను, ఆయన తన స్వంత ఇంట్లోను ఉంటాము.”

”ఆయన స్వంత ఇల్లు మీది కాదా!?” ఇంటావిడలు ఆశ్చర్యంగా అడగసాగారు.

”కాదుట”

”ఎవరన్నారు?”

”ఆయనే పెళ్ళయినప్పటినుంచి అంటున్నారు. అద్దె ఇల్లయినా, స్వంత ఇల్లయినా… అది ఆయన్దేనట. ఇంతకూ ఈ ఇల్లు మీదా? మీ ఆయనదా? ఈ ఇల్లు అద్దెకివ్వగలిగిన అధికారం మీకుందా?” కమల ప్రతి ఇంటావిడను అడిగింది. ఇంతకాలం వాళ్ళు ఆ ఇళ్ళు వాళ్ళవేననుకుంటున్నారు కానీ ఆ ఇళ్ళు అద్దెకివ్వగల అధికారం నిజంగా వాళ్ళకి లేదు, వాళ్ళ భర్తలకుంది.

ఆ ప్రశ్నలు వాళ్ళనిబ్బంది పెడ్తే కమల ధోరణి వాళ్ళని భయపెట్టింది. ఆమె మరీ బరితెగించిన ఆడదేమో అన్న అనుమానం పట్టుకొంది. కమల వితంతువైనా, భర్తచే పరిత్యజించబడినదైనా కాస్త వాళ్ళకి జాలి ఉండునేమో కానీ ఆమె రెండూ కాదు. పండంటి కాపురం కాదనుకొని వచ్చిన స్త్రీ. చూడ్డానికి మంచిదాన్లా ఉన్నా, పెద్దదాన్లానే ఉన్నా… తమ కాపురాలకి ప్రమాదం రావచ్చునని స్త్రీలు అనుకొంటే, తమ ఇంటి ఆడవారిమీద ఆమె ప్రభావం పడ్తే పరిణామాలు ఎలా

ఉంటాయోనని ఆ ఇళ్ళ యజమానులు భయపడ్డారు. అందుకని వాళ్ళెవరూ ఆమెకు ఇల్లు ఇవ్వలేదు.

ఆఖరికి కమల వయస్సే ఉన్న ఒక అవివాహిత స్త్రీ, కమల ఆఫీసులోనే పనిచేస్తున్న ఆవిడ తన తండ్రి తనకి వదిలిపోయిన చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది, కంపెనీకోసం. ఆ మర్నాడు కమల ఆఫీసుకి సెలవుపెట్టి బ్యాంకుకి వెళ్ళింది. బ్యాంకులో ఆమె తండ్రి పోతూ పోతూ ఆమె పేర్న వేసిన పదివేల రూపాయలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఉన్నాయి. దానిమీద అయిదువేలు అప్పు తీసుకుని ఇంటికి కావలసిన వస్తువులు ఒక మంచం, పరుపు, స్టౌ, పప్పులు, ఉప్పులు మొదలైనవి కొని పెట్టుకుంది.

ఆ పైన తన భర్త ఇంటికి వెళ్ళింది. అప్పుడు భర్త ఇంట్లో ఉండడని ఆమెకి తెలుసు. తనతో కొని తెచ్చుకున్న పెట్టెలో తన బట్టలు నాలుగూ సర్దుకుంది.

”మీరు నన్ను ఏలుకోవడానికి గాను మా పుట్టింటివారు మీకు పెట్టిన లంచాలు, మంచాలు, కంచాలు మీకే మీ ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్తున్నాను. ఇన్నాళ్ళు మీరు నన్ను పోషించారు. నేను చాకిరీ చేశాను. రెండింటికీ చెల్లు. ఇందులో నా అడ్రస్‌ ఇస్తున్నాను. ఆ ఇల్లు అద్దెది. కానీ అది ‘నా’ అద్దె ఇల్లు. మీకెప్పుడైనా రావాలనిపిస్తే రండి. వచ్చినప్పుడు తినాలనిపిస్తే నా వంట తినండి. నా ఇంట పడుకోవాలనిపిస్తే పడుకోండి. ఇదే నా ఇంటికి మీకు నా ఆహ్వానం”

అని భర్తకో చీటీ వ్రాసిపెట్టి, పెట్టె పుచ్చుకుని బయటకు వచ్చి ఇల్లు తాళం వేసి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది. ఆవిడ అడగనే అడిగింది.

”ఊరు వెళ్తున్నారా?” అని.

”లేదు. నా ఇంటికి వెళ్తున్నాను” అని కమల చెప్పింది. ఆవిడ అయోమయంగా చూసింది. ఇవాళ కాకపోయినా రేపైనా అందరికీ తెలిసేదే కదా అని కమల తను వేరే ఇల్లు చూసుకొని వెళ్ళిపోతున్నట్లు చెప్పింది ఆవిడతో. ఆవిడ నోరు తెరిచి వింది.

కమల భర్త ఇంటికి వచ్చి కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు. ముందు ఆ ఉత్తరం అర్థం కాలేదు. అర్థమయ్యాక కమల తెగువకి ఆశ్చర్యం, కోపం కలిగాయి. ఆ కోపంలో కమల చేసిన తెలివితక్కువ పని గురించి ఆమె తమ్ముడికి, తన సంతానానికి ఉత్తరాలు రాసి పడేశాడు.

ఉత్తరం అందగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకు వచ్చాడు. చిరునామా తీసుకున్నాడు. కమల ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఆదివారం అవటం వల్ల ఆమె ఇంట్లోనే ఉంది.

”రారా!” అంటూ తమ్ముడిని ఆపేక్షగా పిలిచింది. అతడ్ని ఉన్న ఒక్క కుర్చీలో కూర్చోబెట్టి తను మంచం మీద కూర్చుంది. తమ్ముడి కుటుంబం యోగక్షేమాలు అడిగింది. అక్క అడిగిన ప్రశ్నలకి ముక్తసరిగా సమాధానం చెప్పి, అక్కతో,

”నువ్వు చేసిన పనేం బాగాలేదక్కా. బావగారు ముక్కోపే. అందరికీ తెలిసిన విషయమేగా. కోపంగా ఏదన్నా అన్నారనుకో ముప్ఫై ఏళ్ళు సర్దుకొన్నదానివి. నీకేం కొత్త కాదుకదా! అయినా బావకి దూరంగా కొన్నాళ్ళుందాం అని నువ్వనుకుంటే వచ్చి నాదగ్గరుండరాదా? లేక నీ కొడుకు దగ్గరకు వెళ్ళరాదా? నువ్వొచ్చి ఉంటానంటే వద్దనే వాళ్ళెవరు? ఆఖరికి బావగారు కూడా నువ్వలా చెప్పా పెట్టకుండా వచ్చేసినందుకు బాధపడ్తున్నారు. కానీ నువ్వు వెనక్కి వెళ్తే ఆదరించరా? వద్దంటారా? అది నీ ఇల్లు కాదా! అంతింటికి యజమానురాలివి ఈ దోసెడు కొంపలో ఎలా ఇరికావు! ఎందుకు ఇరికావు!” అన్నాడు. ఆ మాటల్లో అక్క చేసిన మూర్ఖపు పని పట్ల విసుగున్నా అక్కపట్ల అనురాగం ఉంది. అక్క సుఖంగా ఉండాలనే ఆకాంక్ష ఉంది.

కమల తాపీగా జవాబు చెప్పింది.

”అది నా ఇల్లు కాదా అని అడిగావు. అది నా ఇల్లు కాదు. ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆ ఇల్లు, మా ఆయన పెంచుకుంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ ఆపేక్షగానే చూసుకొంటారు. నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన ఆయనకులాగా మాకు ఇంటిమీద హక్కులుండవు. మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము. అంతే!”

”ఎందుకక్కా అంత నిష్టూరంగా మాట్లాడతావు. పోనీ ఏదో విషయంలో బావగారి వల్ల నీ మనసుకి నొప్పి కలిగింది. ఆ నొప్పి తగ్గేవరకు వచ్చి నాతో ఉండు. మనసు కుదుటపడ్డాక వెళ్ళిపోదూగాని” అన్నాడు తమ్ముడు.

”నేను ఆపేక్ష తక్కువై మీ బావగారి ఇల్లు విడిచిపెడ్తే ఆపేక్షగా చూసుకునే పుట్టింటికి పరిగెత్తే దానిని. ఆపేక్షకి ఏమీ లోటు లేదు నాకాయన దగ్గర. అట్లాగే నీ ఇల్లూ నాది కాదు కనక రాను” అంది.

”అది నాన్నగారు కట్టిన ఇల్లు. అందులో ఉండటానికి నాకెంత హక్కుందో నీకూ అంతే ఉంది. వచ్చి చూడు” అన్నాడు తమ్ముడు నిజాయితీగా.

”ఇది ఉండటానికి ఉండే హక్కులు గురించిన సమస్య కాదు. మీ బావగారు కూడా ఉండమంటున్నారు కాని పొమ్మనడం లేదు కదా! అసలు విషయం ఏమిటంటే నా తండ్రి కట్టించిన ఇల్లూ నాది కాదు, మా మావగారు కట్టించిన ఇల్లూ నాది కాదు. ఆఖరికి నా భర్త కట్టిన ఇల్లూ నాది కాదు. ఈ విషయం మీరందరూ తలో విధంగా నాకు తెలియజేసారు” అంది ఏ ఉద్రేకం చూపించకుండా. ఆమె ఎంతో మధనపడి ఆలోచించి తీసుకొన్న నిర్ణయం తనింట్లో తను ఉండటం. ”నేనందుకని మీ ఇళ్ళల్లో ఉండను” అని పూర్తిచేసింది.

”నేనెలా తెలియజేశాను?” అని ఆశ్చర్యంగా అడిగాడు తమ్ముడు.

”ఎందుకులే అదంతా ఇప్పుడు”

”ఫరవాలేదు చెప్పు” అన్నాడు కృష్ణ.

”నీకు గుర్తుండి ఉంటుంది. నాకు పెళ్ళయ్యేసరికి నాకు పద్దెనిమిదేళ్ళు, నీకు పదిహేనేళ్ళు. నాకు పెళ్ళయ్యేవరకు ”పాత న్యూస్‌ పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బు మనిద్దరికీ అమ్మ చెరిసగం ఇచ్చేది. ప్రతి తల్లికీ తమ ఇంట్లో కూతురికి, కొడుక్కి సమమైన స్థానం కల్పించాలని ఉంటుంది కదా. అందుకే నా పెళ్ళయిన వేసవికాలం నేను పుట్టింటికి వచ్చినపుడు అమ్మిన పాత న్యూస్‌ పేపర్ల డబ్బు అమ్మ చెరిసమానంగా ఇవ్వబోయింది. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా?” కమల కృష్ణ ముఖంలోకి చూస్తూ ఆగింది.

కృష్ణకి గుర్తు వచ్చింది. కమల పెళ్ళయిన ఆరు నెలలకి పుట్టింటికి వచ్చింది. అప్పుడు వాళ్ళింట్లో ఉన్న పాత న్యూస్‌ పేపర్లు అమ్మటం జరిగింది. కృష్ణ తండ్రి పిల్లలకి పాకెట్‌మనీ ఇచ్చేవాడు కాదు. అందుకని పాత న్యూస్‌ పేపర్లు, సీసాలు అమ్మితే వచ్చిన డబ్బుని తల్లి పిల్లలకి స్వంత ఖర్చులకని పంచి ఇచ్చేది. ఆ రోజు కోసం కృష్ణ ఆతృతగా ఎదురు చూసేవాడు. ఆ రోజుల్లో పేపర్లు అమ్మితే అయిదో పదో వచ్చేది. కానీ అదే ఎక్కువ డబ్బు. వయస్సు కూడా చిన్నది అవడంచేత అవసరాలు తక్కువ. కమల పెళ్ళయి వెళ్ళిపోయిన మూడు నెలల తర్వాత ఓసారి పేపర్లు అమ్మి వచ్చిన డబ్బుని తల్లి పూర్తిగా కొడుక్కి ఇచ్చింది. ఆ విధంగా ఆసారి, కృష్ణ ఆ డబ్బుని పెళ్ళయి వెళ్ళిపోయిన కమలతో పంచుకోలేదు. అది కమల హక్కుని కోల్పోవడం చేత అని అనుకొన్నాడు. ఊళ్ళో లేకపోవడం చేత అని అనుకోలేదు.

రెండోసారి అమ్మినప్పుడు కమల ఉంది కానీ తల్లి రెండో విధంగా ఆలోచించి కమలకి వాటా ఇవ్వబోయింది. అప్పుడు కృష్ణ ”అక్కకి కావలసిన డబ్బు ఇవ్వడానికి బావ ఉన్నాడు కదా! పైగా అక్క పెట్లో బోలెడు డబ్బుంది చూసాను” అన్నాడు.

”నా దగ్గరున్న డబ్బు ప్రసక్తి ఎందుకు? ఇందులో నాకు వాటా ఇన్నాళ్ళు ఉంది కదా! ఇప్పుడెందుకు లేకుండా పోయింది?” అని కమల ఆశ్చర్యంగా అడిగింది.

కృష్ణ టపీమని జవాబు చెప్పాడు.

”ఆడపిల్లకి పెళ్ళవగానే అత్తవారింట్లో హక్కులేర్పడ్తాయి. పుట్టింట్లో పోతాయి. ఏదో ఒక ఇంటి సంపదలోనే వాటా వస్తుంది. అవ్వా బువ్వా కూడా ఎలా వస్తాయి? పెళ్ళయిన మీ ఆడపడుచులకి మీ ఆయన్తో సమానంగా వాటా మీ మావగారిస్తారా? ఇస్తే నువ్వు ఊరుకుంటావా?”

”రెండ్రూపాయలకెన్ని మాటలన్నావురా! రేపు నీ ఇంటికి నన్ను రావద్దంటావురా!” అంది కమల బాధగా.

”అదేంటక్కా! తర్కిస్తే జవాబు చెప్పాను కానీ నీకీ ఇంట్లో ఎప్పుడూ స్థానముంటుంది. పుట్టింట్లో ఆడపిల్లకి హక్కులూ ఉండవు. అప్పులూ ఉండవు. ముద్దూ ముచ్చటకి ఎప్పుడూ లోటు ఉండదు” అన్నాడు నొచ్చుకుంటూ కృష్ణ. కమల మాట్లాడకుండా ఊరుకుంది అప్పుడు.

కమలకి పుట్టింట్లో నిజానికి ఎప్పుడూ ఏ లోటూ జరగలేదు. కమలనీనాడు బాధిస్తున్నది తనకి హక్కుగా ఏదీ రాకపోవటం. అన్నీ బహుమానాలుగానే రావటం. బహుమానాలు అవతలి వాళ్ళు ఆపేక్షతో పెట్టే భిక్షలు. కృష్ణకా సంఘటన గుర్తువచ్చినట్లు గమనించిన కమల కృష్ణతో నెమ్మదిగా ఇలా అంది.

”ఆ రోజు నా పెట్టెలో డబ్బు చూసావు. అదెంతుందో తెల్సా. తిరిగి వెళ్ళడానికి రైలు ఖర్చులకి, రిక్షా ఖర్చులకి సరిగ్గా సరిపోయే అంత. మీ బావగారు అంతా లెక్కకట్టి అణాపైసలతో ఇచ్చారు నా చేతికి నేను ఇబ్బంది పడకూడదని”.

”నువ్వు వెనక్కి వెళ్ళడానికి ఎప్పుడూ నాన్నగారు డబ్బిచ్చేవారు కదా! నేనే వచ్చి రైలెక్కించేవాడిని కదా! బావగారిచ్చిన డబ్బు నువ్వు స్వంత ఖర్చులకి వాడుకోవచ్చు కదా!”

”ఆయన రైలు కిచ్చిన డబ్బుని స్వంత ఖర్చులకి నేనెప్పుడూ వాడుకోలేదు. అది వెనక్కిచ్చేసేదాన్ని. ఒక్కొక్కసారి ఆయన నీ దగ్గరే ఉంచి ఇంటి ఖర్చులు పెట్టు అనేవారు. ఎప్పుడైనా ప్రేమ పొంగుకు వస్తే నన్నే ఉంచుకోమనేవారు”.

”బావగారు మంచివారని నువ్వూ ఒప్పుకొంటున్నావు కదా!”

”అది మంచికి నువ్విచ్చే నిర్వచనం మీదుంటుంది. నేను కోరుకొనే స్వేచ్ఛని బట్టి ఉంటుంది. ఆయన ఇచ్చింది నేను తీసుకొంటున్నంత కాలం ఏ సమస్యా ఉండదు. నేను నాకింత కావాలని అడిగి అది ఆయన ఇవ్వకపోతే సమస్యలు మొదలవుతాయి”.

”అన్నీ ఆయన అమరుస్తుంటే నీకు ఇంకా డబ్బెందుకు?” ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ.

”నువ్విక్కడ రెండు రోజులుండు. నీ జేబులోని డబ్బు నాకివ్వు. నీ అవసరాలు గమనించి నేనే నీకు అన్నీ అమరుస్తాను. ఆ స్వర్గం అనుభవిస్తే కానీ అర్థం కాదు”.

”నువ్వు లేని సమయంలో నాకు కాఫీ తాగాలనిపిస్తే?”

”ఆయన లేని సమయంలో నాకనిపిస్తే?”

”ఇంట్లోనే ఉంటావు కదా కలుపుకొంటావు”

”ఇప్పుడు నువ్వూ ఇంట్లోనే కదా ఉండబోతున్నది. కలుపుకుంటావు. ఎంత జాగ్రత్తగా కలుపుకుంటావంటే పాలవాడు పోసిన పాలన్నీ అవసరాలకి సరిపడేలాగా జాగ్రత్తగా కలుపుకుంటావు. నేను ఆఫీసునుంచి వచ్చి ఓ కప్పు కాఫీ కోరవచ్చునన్న స్పృహతో కలుపుకుంటావు. పాలు వలకకుండా కలుపుకొంటావు! కొలిచి కలుపుకొంటావు!”

కమల మాటలకి కృష్ణ అప్రతిభుడయ్యాడు.

”అదంతా ఎందుకుగాని పద మనింటికి పోదాం” అన్నాడు.

”అది మన ఇల్లు కాదురా! అది నీ ఇల్లు. అక్కడ నేను అతిధిని. మీ బావగారింట్లో దాసిని. అది మన ఇల్లు అని నువ్వు అన్నా మీ ఆవిడ ఒప్పుకోదు. నాన్నగారి విల్లులో నాకు కూడా భాగం ఎందుకు రాయలేదని అడిగిన రోజున నాన్నగారే స్వయంగా ఒప్పుకోలేదు” అంది కమల. అందులో కోపం లేదు, సత్యాన్ని వ్యక్తం చేస్తున్న దృఢత్వమే కానీ.

కమల తండ్రి స్వయంకృషితో పైకి వచ్చాడు. కూతురికి పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పెళ్ళి చేసాడు. కొడుక్కి పెద్ద చదువు చెప్పించాడు. మిగిలిన కొద్ది డబ్బుతో ఇల్లు కట్టి పింఛన్‌తో బతుకు వెళ్ళదీసాడు. కొద్ది సంవత్సరాలకి పోతాడనగా ఆయన విల్లు వ్రాసాడు. అది తన స్వంత దస్తూరితో పూర్తి ఆరోగ్యంతో ఎవరి ప్రోద్భలమూ లేకుండా వ్రాసాడు. అది తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూతురికి, కొడుక్కి, భార్యకి చదివి వినిపించాడు.

కమలకి అప్పటికి పెళ్ళయి పాతిక సంవత్సరాలయింది. ప్రపంచం కొద్దిగా బోధపడింది. అందువల్ల కమల ధైర్యంగా తండ్రిని, ”నాన్నగారూ! మీ స్వార్జితంలో మీ కూతురినైన నాకు వాటా లేదా?” అని అడిగింది.

కమల ప్రశ్నకి తండ్రి ఆశ్చర్యపోయాడు. ఆయన కమల ఈ ప్రశ్న అడుగుతుందని ఊహించలేదు. కానీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉందని గ్రహించాడు. ”చూడు తల్లీ! తమ్ముడికి నీకంటే ఎక్కువ చదువు చెప్పించాను నిజమే! కానీ నీ పెళ్ళికి, పురుళ్ళకి, పుణ్యాలకి ఖర్చు పెట్టిందేమీ తక్కువ కాదు. అందుచేత వాడి చదువుకైన ఖర్చుకీ, నీ మీద అయిన ఖర్చులకి ఒక విధంగా చెల్లు” అని జవాబు చెప్తుండగా కమల

”నా పెళ్ళిలో నా మీద పెట్టిన ఖర్చు నాకర్ధమవుతోంది. నా భర్తకిచ్చిన బహుమానాలు కూడా నా మీద పెట్టిన ఖర్చుగానే లెక్క కట్టడం అన్యాయం” అంది.

”నీ కుటుంబానికే ఇచ్చాం కదమ్మా! కోడలికి పెట్టిన నగలు తమ్ముడికిచ్చినట్లు కాదా?” అని అడిగాడు తండ్రి.

”తమ్ముడి విషయంలో అది రైటే అనుకొంటాను. మరదలి వస్తువుల మీద తమ్ముడికి ఆచరణలో అధికారం ఉంది. కానీ నా భర్తకి మీరిచ్చిన వస్తువులపై ఆచరణలో నాకధికారం లేదు. ఆస్తులు, డబ్బు ఎప్పుడూ పురుషులనుండీ పురుషులకి వెళ్తాయి. అంటే మీ నుంచి మీ కొడుక్కీ, అల్లుడికీ వెళ్ళగా పేరుకి నాకు వెళ్ళినట్లుగా లెక్క వేస్తున్నారు” అని జవాబు చెప్పింది కమల. ఆమెకెక్కడో తనూ, తన భర్త ఒకటే అని అందరూ భావించటం భర్తేమో తనూ, ఆయన వేరన్నట్లు పాతిక సంవత్సరాలుగా ప్రవర్తిస్తూ రావటం ఎక్కడో అన్యాయం అనిపిస్తోందీ మధ్య. ఆమె మాటలకి సమాధానం అక్కడే నిలబడి ఉన్న మరదలు నుంచీ వచ్చింది.

”మీ మావగారి ఆస్తిలో మీ వారు మీ ఆడబడుచులకి వాటా ఇచ్చారా? లేదే! నా అన్నదమ్ములు నాకిచ్చారా? మా తండ్రి ఆస్తిలో నాకు వాటా లేదే! స్త్రీకి భర్త ద్వారా మావగారి ఆస్తిలో వాటా రావడమే పద్ధతి”. మరదలికి కమల జవాబు చెప్పలేదు. ఆమె తన మావగారు పోయినపుడు తన ఆడబడుచులకి కూడా తన భర్తతో సమానంగా వాటా రావాలని కానీ, రాకూడదని కానీ అనుకోలేదు. ఎంతసేపూ అది వాళ్ళ కుటుంబ విషయం అనుకొంది. తన భర్త, తన ఆడబడుచులు, మరుదులు తననెప్పడూ పరాయిదానికిందే చూసారు. అందుకని కమలని వాళ్ళు అభిప్రాయం అడగనూ లేదు, ఆమె చెప్పనూ లేదు.

”వదినగారూ! మీరు కోరినదీ ధర్మమే! మీ వాటా ఇక్కడ మీరు తీసుకుని, అక్కడ మీ ఆడబడుచులకీ, వాళ్ళ వాటా వాళ్ళకిప్పించేయండి” అంది మళ్ళీ మరదలే.

కమల మరదలి తెలివికి విస్తుపోయింది. తనిక్కడ తీసుకోగలిగినదానికంటే అక్కడ పోగొట్టుకునేదే ఎక్కువ. ఆ విషయం తెలిసే మరదలు ఆ మాట అంది. ఆ రోజున మరదలికి కమల సమాధానం చెప్పలేకపోయింది.

”పైగా నేను, మీ అమ్మ శేషజీవితాలు తమ్ముడి దగ్గరే గడుపుతాం కదా! వాడికి వాడి భార్యకి మాకు సేవ చేయక తప్పదు కదా. ఈ రోజులో డబ్బుకంటే ప్రియమైంది సర్వీస్‌. మేము వాడికి క్యాష్‌లో ఇస్తాం. వాడు నాకు కైండ్‌లో రీ పే చేస్తాడు” అన్నాడు తండ్రి.

ఆ పైన ఆమె అడిగిందనో లేక ముందరే అనుకున్నాడో కానీ ఆమె తండ్రి ఆమె వెళ్ళేలోపల ఓ పదివేల రూపాయలు ఆమె పేరుమీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసాడు. ఆ తర్వాత ఏడాదికి ఆయన పోయాడు.

కృష్ణకి తండ్రి విల్లు విషయంలో ఆ రోజు జరిగిన చర్చంతా గుర్తుకువచ్చింది.

”అంచేత అది నా ఇల్లు కానీ నీ ఇల్లు కాదంటావు. బాగానే ఉంది. పోనీ బావగారి ఇల్లు నీ ఇల్లే కదా. అక్కడే ఉండు. ఇక్కడెందుకు?” అన్నాడు కృష్ణ.

”అది నా ఇల్లు కూడా అని వచ్చి మీ బావగార్ని అనమను. ఇల్లు తుడవడానికి, ముగ్గులు పెట్టడానికి, తోరణాలు కట్టడానికి, భర్త శ్రేయస్సు కోరి పూజలు, పునస్కారాలు చేయడానికి కాక నా మాట చెల్లే నా ఇల్లని, నాకిష్టమైతే నా వాళ్ళు వచ్చిపోయే హక్కులు నాకా ఇంట్లో ఉన్నాయని మీ బావగార్ని చెప్పమను. తక్షణం వెళ్తాను. పోతే నన్ను కన్న తండ్రి కట్టిన ఇల్లు నాది కాదు అన్న విషయం నిర్ద్వందంగా ఆనాడే తేలిపోయింది. అది తిరగతోడవద్దు” అంది కమల.

కృష్ణ అక్కడే భోంచేసి, బావగారైన రామారావు దగ్గరకు వెళ్ళి తన రాయబారం విఫలమైనదని చెప్పాడు. రామారావు వెంటనే వెళ్ళలేదు కమల ఇంటికి. తన భార్య విడిగా ఉండటం గురించి అందరూ అడుగుతుంటే అవమానం అయిపోతోందని ఓ పది రోజుల తర్వాత రామారావు కమల ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి

”ఇంటికి రా!” అన్నాడు.

”ఎవరింటికి?” అని అడిగింది కమల.

”మనింటికి” అన్నాడు రామారావు.

”అది మన ఇల్లు అన్న విషయం మీ నోటివెంట మొదటిసారి వింటున్నాను” అంది కమల.

”ఎప్పుడు కాదన్నాను?”

”లక్షసార్లు” కమల ఒక్కొక్క సందర్భం చెప్పుకు వచ్చింది.

రామారావు కమల పుట్టింటికి వచ్చినప్పుడల్లా ”మీ ఇంట్లో అట్లాగేమో కానీ…” అంటూ ఉంటాడు. అట్లాగే కమలను వేరుచేస్తూ ”మా ఇంట్లో అట్లా కాదు” అంటూ ఉంటాయి. ఎన్నాళ్ళయినా ‘మీ’, ‘మా’లు పోయి మన అన్నమాట ఏర్పడలేదు. ఏదన్నా భేదాభిప్రాయం వ్యక్తం చేస్తే ”ఇది నా ఇల్లు. నా ఇంట్లో నా మాటే నెగ్గాలి” అనేవాడు.

”నా పుట్టింట్లో ఇది నా ఇల్లంటారు. మీరు కాదంటారు. మీరేమో నా పుట్టింటి గురించి ఎప్పుడు మాట్లాడినా ‘మీ ఇల్లు’ ‘మీ ఇల్లు’ అంటూ ఉంటారు. వాళ్ళేమో అది నాది కాదంటారు. ఈ రెండింటిలో ఏది నా ఇల్లు?” అని అడిగింది కమల ఓ రోజు.

”ఆడవాళ్ళకేంటి. అన్నీ వాళ్ళ ఇళ్ళే” అంటూ రామారావు దాన్ని హాస్యంలోకి దింపి కొట్టి పారేశాడు.

ఎప్పుడైనా కమల అత్తగారు వస్తే ఆవిడ, రామారావు కలిసి కమలని పరాయిదానిగా చూస్తూ ప్రవర్తించేవారు. వాళ్ళ ఆస్తి విషయాలు తలుపులు వేసుకుని కమల వినకూడనట్లు మాట్లాడుకునేవారు. ఆవిడా తనలాంటి కోడలే కదా! ఆవిడ ఎట్లా ఇంట్లోది అయింది తను ఎట్లా పరాయిదైంది? బహుశ తన కొడుకుకి తను ఇంట్లోది, తన కోడలు పరాయిది అవుతుందేమో! అట్లా కానీకూడదు అనుకొంది కమల. అందుకని ఆమె కొడుకుని, కోడలుకు దూరం చెయ్యాలని ప్రయత్నించలేదు, తను దగ్గరవ్వాలనీ ప్రయత్నించలేదు.

కానీ ఒక్కసారి మాత్రం భర్తతో కూతురి గురించి పోట్లాడింది.

”అది కూడా మీకు పుట్టిందే. మీ సంపాదనంలో దానికీ భాగం ఉంది. రెండిళ్ళలో ఒక ఇల్లు దాని పేర్న పెట్టండి” అంటూ.

దానికి కారణం కమల తన తండ్రి పోయాక కొన్నాళ్ళు తల్లిని తన దగ్గర ఉంచుకొందామనుకొంది. భర్త ఒప్పుకోలేదు.

”మీ తమ్ముడిదే బాధ్యత” అన్నాడు.

”బాధ్యతలు వేరు, ఆపేక్షలు వేరు” అంది కమల.

”మా అమ్మ మన బాధ్యత, మీ అమ్మ కాదు” అన్నాడు రామారావు.

”బాధ్యతలు మనవి, అధికారాలు మీవి! బావుంది!”

”ఇది మీ ఇల్లు. ఆవిడ మీ అమ్మ. ఆవిడ బాధ్యత మీ బాధ్యత” అంది కమల.

”ఇక్కడ నీకే బాధ్యతా లేకపోతే మీ ఇంటికే పో ఇక్కడ నువ్వేం ఉండనక్కర్లేదు” అన్నాడు రామారావు కోపంగా, పని చెయ్యని పనిమనిషిని పనిలోనుంచి మాన్పించే ధోరణిలో.

కమల అప్పుడు ఏమీ మాట్లాడలేదు.

కానీ కూతురు విషయం వచ్చేసరికి తన కూతురు తన అల్లుడి వల్ల అటువంటి అవమానం పొందరాదని, ఆర్థికంగా భర్తమీద ఆధారపడే భార్యని భర్త గౌరవంగా చూడకపోవడానికే ఎక్కువ అవకాశం ఉందని ఆమె నమ్మి కూతురికి కొడుకుతో సమంగా వాటా పెట్టమంది. అప్పుడు కొడుకు పోట్లాడాడు. కోడలు,

”ప్రపంచంలో ఇదెక్కడైనా ఉందా! ముసలితనంలో మీ ఇద్దర్నీ చూసుకొనేది మేమా? తనా?” అని అడిగింది.

కమల కోడలికేసి జాలిగా చూసింది. ఆ పైన నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది.

”మగవాళ్ళు చాలా తెలివైనవాళ్ళు. అందుకనే ఇన్ని యుగాలుగా మనమీద పెత్తనం చెలాయిస్తున్నారు. మనని మచ్చిక చేసుకున్నారు. ఇంత గడ్డి పడేస్తే చాకిరీ చేసే ఎద్దుకీ, మనకీ పెద్ద తేడా లేదు. కొత్త బానిసని లొంగతీసుకోవడానికి పాత బానిసల్ని వాడటం ఓ టెక్నిక్‌. ఇంటికి కొత్తగా వచ్చిన కోడల్ని అత్తా, ఆడపడుచులూ కలిసి వంచుతారు. తర్వాత ఆ ఇంటి కోడలు ఆడపడుచుల్ని ఆస్తి విషయంలో వంచిస్తుంది. ఇదంతా మగవాడు తన స్వార్థంతో మనచేత చేయిస్తున్నదే. దొంగలూ దొంగలూ ఊళ్ళు పంచుకున్నట్లు మగవాళ్ళు ఆస్తులు పంచుకుంటారు. నా భర్త, మరుదులు నా ఆడబడుచులకి వాటా పెట్టని రోజున అందులో నా స్వార్థమూ ఉందనుకొని నేను నోరెత్తలేదు. నా తండ్రి నన్ను పరాయిదానిలా లెక్కవేసిన రోజున బాధపడ్డాను. ఈ రోజు నా కూతురి కోసం నోరు విప్పాను. నువ్వు అడ్డుపడ్తున్నావు ఇప్పుడు. ఇలా మనం ఒకళ్ళ

కళ్ళు మరొకళ్ళం పొడుచుకుంటూ ఉంటాం. ఈ ఇంటికి నువ్వూ, నేనూ, నా పుట్టింటికి నా తల్లీ, మరదలు, నా అల్లుడింటికి నా కూతురూ… ఏ హక్కులు లేని నౌకర్లం. ఎక్కడో నూటికి ఒకటీ అరా అదృష్టవంతురాలు ఉండవచ్చు. లేరనను. కానీ మనలో చాలామందికి అత్తిల్లూ మనది కాదు, పుట్టిల్లూ మనది కాదు.”

కానీ కమల ఆ రోజు కూడా భర్త ఇంటినుంచి బైటికి వెళ్ళిపోదాం అనుకోలేదు.

లోకంమీద ఉన్నదే కదా అని సర్దుకుంది.

ఒకరోజున కమల తమ్ముడి కుటుంబం ఆ ఊరు వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది. కమల కాఫీ డికాక్షన్‌ తీసి వాళ్ళకోసం ఎదురు చూడసాగింది. అప్పుడు రామారావు ఆఫీసునుంచి వచ్చాడు. కమలకి కాఫీ పొడి విషయం గుర్తుకువచ్చింది. ”కాఫీ పొడి అయిపోయింది. రేపటికి కూడా లేదు. తీసుకువచ్చారా?” అని అడిగింది కమల.

”ఇవాళ ఆఫీసుకెళ్తుంటే రేపటిదాకా వస్తుంది అన్నావు కదా! రేపు తేవచ్చునని తీసుకురాలేదు” అన్నాడు రామారావు.

”మీరు ఆఫీసుకి వెళ్ళాక మా తమ్ముడి కుటుంబం వస్తున్నట్లు ఉత్తరం వచ్చింది. అందుకని ఉన్న పొడితో డికాక్షన్‌ వేశాను. వాళ్ళు రావాల్సిన టైమైంది. వాళ్ళు రాగానే ఒకేసారి అందరికీ కాఫీ కలుపుతాను” అంది కమల.

కృష్ణ కుటుంబం అరగంట గడిచినా రాలేదు.

”నాకు కాఫీ ఇయ్యి. చచ్చినట్టు వెళ్ళి మళ్ళీ కాఫీపొడి తీసుకురావాలి కదా!” అని ట్రాఫిక్‌్‌లో మళ్ళీ డ్రైవ్‌ చేయాల్సి వచ్చిన విసుగు వ్యక్తపరుస్తూ అన్నాడు రామారావు.

కమల కాఫీ ఇచ్చింది. రామారావు బయటికి వెళ్ళి కాఫీపొడి తెచ్చాడు. కృష్ణ కుటుంబం ప్రయాణం మానుకొన్నారు, వాళ్ళు రాలేదు.

మర్నాడు పొద్దున్న కమల పాత డికాక్షన్‌ పారబోసి మళ్ళీ తాజాగా డికాక్షన్‌ తీసింది. కమల, రామారావు కాఫీ రోజుకి కొద్దిసార్లే తాగుతారు. కానీ అది తాజాగా, స్ట్రాంగ్‌గా ఉండాలి. రామారావు అడగనే అడిగాడు,

”నిన్నటి డికాక్షన్‌తో చేశావా” అని.

”కాదండీ అది పనిమనిషికి ఇచ్చేశాను” అంది.

”మర్చిపోయి అడిగాను. నువ్వు దానాల్లో కర్ణుడిని, శిబిని మించినదానివి” అన్నాడు రామారావు వెటకారంగా. అందులో అతను క్రితం రోజు కాఫీ పొడికి మళ్ళీ బయటికి వెళ్ళాల్సి రావటం వల్ల జనించిన కోపం ఉంది.

”మీరు మరి తాగరు కదండీ” అంది కమల.

”నువ్వు తాగొచ్చుగా. రానివాళ్ళు మీ వాళ్ళు కదా! వస్తున్నట్లు రాసినవాళ్ళు మానుకుంటే ఆ విషయం తెలియజేయవచ్చు కదా. అయినా వాళ్ళు వచ్చారో లేదో చూసుకుని డికాక్షన్‌ వేయవచ్చు కదా! ఇక్కడ ఎవరూ డబ్బులు కుప్పలు పోసుకుని కూర్చోలేదు. సంసారపు బుద్ధులు బొత్తిగా లేవు నీకు. ఒక్క రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది. సంపాదన ఎంత కష్టమో” అంటూ రామారావు ఉపన్యాసం ఇచ్చాడు.

కమల ఆ మాటలకి చాలా బాధపడింది. ఆ రోజున, ఆ వయసులో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చాక రామారావు ఇంకోలా సాధించడం మొదలుపెట్టాడు.

”ఉద్యోగస్థురాలివి కదా!” ”పెద్ద ఆఫీసరువి” ”మొగుడొకడున్నాడనే విషయం గుర్తుండడం లేదు. ఆలస్యంగా వస్తే అడిగేవాడెవడు, అడ్డేవాడెవడు”. కమలకి సమాధానం చెప్పకుండా ఊరుకోవడం తెలుసు.

రామారావు అక్కగారు వస్తున్నట్లు ఉత్తరం వచ్చిందా తర్వాత. ”నాకు కుదరదు. నువ్వు పర్మిషన్‌ తీసుకుని త్వరగా ఇంటికి వచ్చేయి. మా అక్క వచ్చేసరికి కాస్త ఇంట్లో ఉండు” అని రామారావు ఆఫీసుకు వెళ్తూ కమలతో చెప్పాడు వాళ్ళ అక్క వస్తానన్న రోజున. ఆమె వచ్చే రైలు మధ్యాహ్నం మూడింటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి నాలుగు అవుతుంది.

రామారావు ఆఫీసుకి వెళ్ళాక కమల గబగబా తయారై తన ఉద్యోగానికి బయల్దేరింది. బయల్దేర్తూ ఎందుకైనా మంచిదని ఇంటి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది. మధ్యాహ్నం మూడింటికే పర్మిషన్‌ తీసుకొని ఇంటికి బయల్దేరింది. దారిలో ఆమె ఎక్కిన రిక్షా తిరగబడి కాలుకి బాగా దెబ్బ తగిలింది. రోడ్డుమీది జనం ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్‌ అవలేదని నిర్ధారణ చేసి కాలుకి కట్టుకట్టి పంపించారు. అప్పటికి అయిదు దాటింది. ఆమె కొంచెం కంగారుపడినా పక్కింట్లో తాళం చెవి ఇచ్చి వచ్చినందుకు ధైర్యం తెచ్చుకుంది. మరో రిక్షాలో రిక్షా అతని సహాయంతో ఎక్కి ఇంటికి వచ్చింది. రిక్షా అతనే సాయంచేసి దింపాడు. అతనికి డబ్బులిచ్చి నెమ్మదిగా కమల లోపలికి నడిచింది, కట్టు చీరచాటునుంది. అది రామారావుకి కనిపించలేదు. ఆమె ఇంట్లోకి అడుగుపెడ్తుండగా రామారావు, ”వస్తున్నావా పెళ్ళి నడకలు నడుచుకుంటూ నెమ్మదిగా! ఆలస్యంగా వస్తే ఇంటికి వచ్చినవాళ్ళే చచ్చినట్లు అన్నీ చేసుకుంటారని నీ ఉద్దేశ్యం” అన్నాడు.

రామారావు మాటలని పట్టించుకోకుండా, ”వదినగారూ! మీకు పట్టింటావిడ తాళం చెవులివ్వలేదా?” అంటూ వదినగార్ని కమల పలకరించింది. ఆవిడ జవాబు చెప్పలేదు. అప్పుడు,

”దార్లో….” అంటూ భర్తకి సంజాయిషీ ఇవ్వబోయింది.

”స్నేహితులు తగిలారు అంతేగా! రోజూ కంటే ముందు రమ్మంటే ఆలస్యంగా వచ్చావు. నీకు నా మాటంటే లెక్కలేదు. నా మాటంటే లెక్క లేకపోతే నా ఇంట్లో ఉండక్కర్లేదు. వేరే ఇల్లు చూసుకు పో! ఇక్కడ నాతో కాపురం చెయ్యదలచుకుంటే వళ్ళు దగ్గర పెట్టుకుని కాపురం చెయ్యి” అని రామారావు కమలని దులిపేశాడు.

రామారావుకి కోపం రావటం కమల అర్థం చేసుకోగలదు. కానీ రామారావు కనీసం ఆలస్యం ఎందుకైంది అని అడుగుతాడనుకొంది. తనకి దెబ్బ తగిలి కట్టు కట్టించుకొని వచ్చిన విషయం తెలుసుకొని అయ్యో పాపం అంటాడనుకొంది. ఆమె పుండుకి కారం రాసినట్టయ్యాయి అతని మాటలు.

ఆ మర్నాటికి రామారావు బుర్రలోకి ఆ క్రితం రోజు కమలకి దెబ్బ తగిలిన సమాచారం ఇంకింది. తప్పు చేసినట్లు అర్థమయింది. కానీ ”హాయిగా ఇంట్లో కూర్చోలేక వీథులట్టుకొని తిరిగితే దెబ్బలూ తగుల్తాయి, మానభంగాలు జరుగుతాయి” అన్నాడు. రామారావుకి ఆ పరిస్థితుల్లో ఏమనాలో తెలియలేదు. కనీసం ఏమనకూడదో తెలిసి ఉండాల్సింది. దాంతో కమల మనసు పూర్తిగా విరిగిపోయి ఇల్లు వెతుక్కొని అతనింట్లోంచి బయటపడింది.

కమల భర్త ఇంట్లోంచి బయటకి వెళ్ళిన నెల రోజులకి తల్లిని ఒప్పించి తీసుకు వెళ్ళడానికి కొడుకు నారాయణ వచ్చాడు.

”అమ్మా పోనీ వచ్చి నా దగ్గర ఉండు” అన్నాడు.

”నీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది. ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పద్ధతి నాకు పడదు. నీది కంపెనీ

ఉద్యోగం. నువ్వూ, నీ భార్యా పార్టీలకు వెళ్తారు, పార్టీలిస్తారు. అవంటే నాకు పడదు. అవి మానమంటే మీరు మానలేరు. నా కోసం మీ పద్ధతులు మార్చుకోలేరు కదా” అంది కమల.

”అమ్మా! నాన్న ఇంట్లో నా భార్యకు కానీ, నాకు కానీ పూర్తి స్వేచ్ఛ ఉందా? ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉండాలన్నా ఇద్దరూ కొద్దిగా అయినా సర్దుకోక తప్పదు కదా!” అన్నాడు నారాయణ.

”కావచ్చు. కానీ నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు” అంది కమల.

”అమ్మా మగవాడు డబ్బుకి బానిస, ఆడది మగవాడికి బానిస. భార్య భర్తకి బానిస, భర్త మొత్తం కుటుంబానికి బానిస. పూర్తి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు. పరిమితుల్ని గుర్తించటమే స్వేచ్ఛ అంటారు” అన్నాడు నారాయణ.

”నాకు పెద్ద విషయాలు అర్థం కావురా నారాయణా! వ్యవస్థ మారితేనే గాని మారనివి కొన్ని ఉన్నాయి నిజమే. కానీ కొన్ని వ్యక్తులు మారటం ద్వారా మారగలిగినవి ఉన్నాయి. అలా వాళ్ళు మారితే మరికొందరి జీవితాలు రవ్వంత సుఖమవుతాయి. మగవాళ్ళు మాటల్లో, ప్రవర్తనలో కొంత అహంకారాన్ని వదులుకుంటే, స్త్రీలకి ఓ మనస్సుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లెలు పూస్తాయి. పూర్వం మనువు ”నస్త్రీ స్వాతంత్య్రమర్హతి” అన్నది ఈ రోజున న స్త్రీ గృహం అర్హతి అయింది. చిన్నప్పుడు తండ్రి ఇంట్లోను, మధ్యవయస్సులో భర్త ఇంట్లోను, ముసలితనంలో కొడుకు ఇంట్లోను ఉంటూ వారి ఇష్టాలను గమనించుకుంటూ తనకంటూ కొన్ని ఉన్నాయని మర్చిపోయి మనుగడ సాగించాల్సి వస్తోంది. అందరిచేత ఇది నీ ఇల్లు కాదు, ఇది నీది కాదు అనిపించుకుంటూ బతకాల్సి వస్తోంది. నా ఇల్లు ఏది అనేదానికి సమాధానం వెతుక్కుంటున్నాను” అంది కమల.

”ఇది నీ ఇల్లా అమ్మా?” నారాయణ అడిగాడు.

”అవును. ఇక్కడ నా మాట చెల్లుతుంది” అంది కమల.

”ముసలితనంలో ఏం చేస్తావు? అప్పుడైనా నా దగ్గరికి రావా?”

”నీ ముసలితనంలో నువ్వేం చేస్తావు? అదే నేను చేస్తాను. ముసలితనం అనేది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా వస్తుంది కదా! మరి మగవాళ్ళకి ‘ఇది నా ఇల్లు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే ఫో’ అని భార్యతో కానీ, పిల్లల్తో కానీ అనగలిగిన ధీమా దేనివల్ల వస్తోంది? అది దేనివల్ల స్త్రీకి లేదు? అంతేకాదు. అటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తే అది నిన్నూ, మావయ్యనీ, నాన్నగార్ని ఎందుకిబ్బంది పెడ్తోంది?”

కమల వేసిన ప్రశ్నకి నారాయణ సమాధానం చెప్పలేకపోయాడు.

”అసలు ఆమె ఇల్లు ఏది?” అన్న ప్రశ్న అతన్ని అతనింటిదాకా వెంటాడింది.

Share
This entry was posted in దారి దీపాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.