బంగారు పుట్టలో చీమ
ఎవరిని ముందుగా కుట్టిందో గుర్తుండదు
ఏడో చేప ఎందుకెండలేదో
తార్కికంగా యోచించే ఓపిక అస్సలుండదు
లో ఓల్టేజి ఫ్యాను గాలి
వాయుగుండమవుతుందని
ఏ వాతావరణ కేంద్రమూ హెచ్చరించదు.
కార్టూన్ చిత్రాలమై వర్తించడమూ,
ప్రభ బండి ఊరేగింపుకి చిందులు తొక్కడమూ,
మనకూ వచ్చని,
చూసే మూడో వాడికి తప్ప మనకు తెలియనే తెలియదు.
ఇద్దరి అహాలు ఆక్టోపస్‌లై చేసే
పదహారు చేతుల బాక్సింగ్‌లో,
తలదూర్చే సాహసం ఏ రిఫరీకీ ఉండదు.
అప్రకటితమై ఉన్న అసంతృప్తుల సంపుటిని
ఆవిష్కరించడానికి ఇంతకు మించిన వేదిక దొరకదు
ఒకరి కంఠం –
ఆవేశపు బీటలిచ్చి జీర పోయినప్పుడు –
ఒకరి అసహనం –
ఖడ్గ తిక్కనై వీధిలోకి నిష్క్రమించినప్పుడు
ఒక అంకానికి అర్థరాహిత్యంగానే తెరపడుతుంది,
ఖాకీ కాపలా లేని కర్ఫ్యూ విధించబడుతుంది.
తెగేవరకూ లాగిన తాడులో
ఒకటీ అరా నూలు తెగక
తెగతెంపులు చేసుకునేంత తెంపు లేక
అల్లల్లాడుతుంది
తడిపి ఆరేసిన నీరుకావి ధోవతిపై
కాకి రెట్టేసినట్లు
మౌనం మరకలు మరకలుగా చిందుతుంది
జెండాలు నుదురు చిట్లింపులుగా
ఎజెండాలు పెదవి బిగింపులుగా సాగే
నిరసన ప్రదర్శన మొదలౌతుంది.
తమ విధేయుడు తరహా మొహాన్నతడు
ఆఫీసులోనే ఫైలు చేసి వచ్చేస్తాడు
చిరునవ్వుల్నీ, చిలిపితనాలనీ ఆమె
బూజుకర్రతో దులిపేస్తుంది.
సమస్యేమిటో, సామరస్యం కుదిర్చే పద్ధతేమిటో
తెలియని పాప మనసు
గ్లాసు క్రింద బోర్లించిన ఈగై గిజ గిజ లాడుతుంది.
మహావసరంగా మాటాడాల్సి వస్తే,
తలపై ఎనిమిది కుండలు నిలిపినంత
బ్యాలన్స్‌డ్‌గా ఉంటుంది.
రాత్రి అర్థనారీశ్వరత్వాన్ని
భీముడి చేతిలో జరాసంధుణ్ణి చేసి
మంచానికి ఉత్తర దక్షిణాలుగా అంటిస్తుంది.
నిశ్శబ్దపు నిడివిని కొలిచేందుకు
గడియారం వడ్రంగిపిట్ట విఫలయత్నం చేస్తుంది.
అహంకారాన్ని, ఆత్మాభిమానమనుకునే అచ్చు తప్పులో,
త్యాగాన్ని గుర్తించలేదనే అసంతృప్తి అంతర్వాహినికి,
సెల్ప్ పిటీ ఉప నదై చేరి మరింత డిప్రెస్ చేస్తుంది.
ప్రకృతీ, ప్రజలూ తుఫానుల్ని మరచి
గమనాన్ని సాగించేంత చిత్రంగానే,
మహానాయకునికి మనస్ఫూర్తిగా జోహార్లందించినట్లే
మరో నాయకునికీ మహా శ్రద్ధగా ‘జే కొట్టే’ సర్దుబాటులాగానే
అవసరాల వేడి
అసహనాన్ని – డీ – ఫ్రాస్ట్ చేయడం మొదలౌతుంది.
లాగి బిగించిన ముడేదో సడలి,
ముసి ముసి నవ్వు ముత్యాలై జారుతుంది
ఒత్తిడేదో తగ్గి ఆర్ద్రత పెరిగే సూచనగా
పాదరస మట్టం చప్పుడు కాకుండా
జారుతుంది.
క్రోధారుణ పత్రాన్నెవరో క్లోరినైజేషన్ చేసినట్లు
శ్వేతకపోతం రెక్కలు రెపరెపలాడతాయి.
ఆదర్శ దాపత్యపు అనివార్యపు థియరీ
అత్యవసరంగా ప్రతిపాదించబడుతుంది.
ఛీ-మొహం చూడనన్నంతటి ద్వేషాన్నీ,
థూ – నువ్వెంత పొమ్మన్నంత రోషాన్నీ
మొదలంటా తవ్విపోసి,
ఎప్పటికప్పుడు కొత్త ప్రమాణాలు అట్టహాసంగా
నాటుకునే
ఈ ‘రాజీ’ వన మహోత్సవాలు,
మానవోన్నతులమై చేసే మార్జాల దాంపత్యాలు