మార్పు దిశగా అడుగేయాల్సింది నవతరమే – పి. ప్రశాంతి

పి.జి.చేస్తున్న శ్రావణికి 22 ఏళ్ళు నిండాయి. తన వయసే ఉన్న స్నేహితురాలు లావణ్యకి పెళ్ళి నిర్ణయమైంది. వారం రోజుల్లో పెళ్ళి. హైస్కూల్‌ నుంచి డిగ్రీ వరకు కలిసి చదువుకున్న స్నేహితులంతా పెళ్ళికి రెండు రోజులు ముందుగానే వెళ్ళాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఏడుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలు… కాలేజీలో చదువుతో పాటు ఆటపాటల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, ఇంకా ఏ కార్యక్రమం జరిగినా అందరినీ తలుపుకుంటూ చలాకీగా కలుపుకునే ఈ గ్యాంగ్‌ను అందరూ ముద్దుగా ‘డర్టీ డజన్‌’ అనేవారు. వీళ్ళల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా అందరూ ఒకటై ఆ కష్టాన్ని తీర్చేసేవారు. వారిళ్ళల్లో పెద్దవాళ్ళు కూడా అంత ఆదరంగానూ, ఎవరింట్లో ఏ ఫంక్షన్‌ జరిగినా అందరూ వెళ్ళేవారు, కలిసిమెలిసి పనులు చేసుకునేవారు.

22,23 ఏళ్ళ వయసున్న ఈ స్నేహితులంతా రాబోయే ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. మొదటిసారి ఓటెయ్యబోతున్న వీళ్ళందరూ ఎప్పుడు మాట్లాడుకున్నా వాళ్ళ సంభాషణలో రాజకీయ నాయకుల చర్చ వస్తోంది. ప్రజాస్వామ్యానికి విలువిచ్చే వారికే ఓటెయ్యాలని, అటువంటి నాయకులెవరూ తమ నియోజకవర్గం నుంచి పోటీలో లేకుంటే ‘నోటా’ వెయ్యాలే కానీ ఓటు మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నారు. వారి వారి కుటుంబాలలో 18 ఏళ్ళు నిండిన చెల్లెళ్ళు,తమ్ముళ్ళందరినీ వెంటబెట్టి తీసుకెళ్ళి ఓటరుగా నమోదు చేయించారు. వాళ్ళందరికీ కూడా ఈ రాజ్యాంగపు హక్కు గురించి, ఓటరుగా బాధ్యత గురించి, ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ప్రమాదం గురించి, ప్రశ్నించేవారికి పొంచి ఉన్న అభద్రత గురించి వివరిస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న ఇతర స్నేహితులు, కాలేజీలో జూనియర్లు ఎంతోమంది ఇటువంటి చర్చల్లో వీరితో పాల్గొనాలని ఉత్సాహపడుతున్నారు. ఈ గ్యాంగ్‌ నుంచి రాబోయే కాలంలో కనీసం ఇద్దరు, ముగ్గురైనా క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని అందరికీ గట్టి నమ్మకం.

పెళ్ళికి ఇక మూడు రోజులే

ఉంది. పి.జి.లో చేరిన, ఉద్యోగాల్లో కుదురుకున్న, పోటీ పరీక్షలకు తయారవుతున్న ‘డర్టీ డజన్‌’ మిత్రులంతా మర్నాడు పొద్దున్నే రైలులో బయలుదేరి లావణ్య పెళ్ళి జరగబోతున్న వాళ్ళ తాతగారి ఊరు చేరుకోవడానికి ప్లాన్‌ చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం గౌతమీ ఘాట్‌లో కలుసుకుని లావణ్యకి గిఫ్ట్‌ కొనడానికి వెళ్ళాలనుకున్నారు. సాయంత్రం ఐదయ్యింది. రాధిక, నవ్య, కిషోర్‌ చేరుకున్నారు. కబుర్లాడుకుంటుండగా సిద్ధు వచ్చాడు. వస్తూనే ‘నా మొదటి ఓటు రమణ గారికి వెయ్యబోతున్నా’ అన్నాడు. ‘ఏంటీ…రాస్కెల్‌ రమణకి నువ్వు ఓటేస్తావా?’ అని ముగ్గురూ ఒకేసారి అన్నారు. ‘రేయ్‌, ఏదో తెలియని వయసులో రాస్కెల్‌ రమణ అంటే చెల్లింది కానీ ఇప్పుడలా అంటే నేనే ఊర్కోనురా. మా కులపోడు రమణ ఒక్కడే పోటీలో ఉన్నాడు. గెలిపించుకోవడం నా బాధ్యత. ప్రమీలకి, వేణుకి కూడా వాళ్ళ ఓటుతో పాటు వాళ్ళిళ్ళల్లో అందరి ఓట్లూ రమణకే పడాలని చెప్తాను’ అన్నాడు సిద్ధు. అప్పుడే వచ్చిన ప్రమీల ‘నా ఓటు రమణకి కాదు, ఏ సమస్య తీర్చాలన్నా, నిధులు పార్టీ ఇస్తుందనో, ప్రభుత్వం నుండి రావాలనో ఎదురు చూడాల్సిన అవసరం లేని అమ్మాజక్కకే నా ఓటు’ అంది. ‘అంటే వాళ్ళ డబ్బుకి నువ్వు అమ్ముడు పోయావా?’ అంది నవ్య. వ్యాపారంలో ఒకరికొకరు ఆసరాగా ఉంటేనే నిలబడగలిగేది. మా ఫ్యామిలీ బిజినెస్‌ అమ్మాజక్క వాళ్ళ వ్యాపారాలతో ముడిపడుంది. అయినా డబ్బుంటేనే కదా పేదోళ్ళ కష్టాలు తీర్చగలిగేది, అందుకే…’ అంటుండగానే పవన్‌ కల్పించుకుని ‘నేను ప్రమీలను సమర్ధిస్తున్నాను. ఈ రోజుల్లో డబ్బు లేనోడు గెలిచినా చేయగలిగిందేమీ లేదు, పక్కన కూర్చోటం తప్ప’ అన్నాడు. ‘హు… డబ్బున్నోళ్ళందరూ ఓటేసినా మా కులపోళ్ళ ముందు ఓడిపోవాల్సిందే, మా కట్టుబడి అలాంటిది, కాదా నవ్యా…’

ఉక్రోషంగా లేచి నిలబడ్డాడు శ్రీధర్‌. మెచ్చుకోలుగా హైఫై ఇచ్చాడు సిద్ధు.

ఇదంతా చూస్తున్న శ్రావణి ‘ఫ్రెండ్స్‌… సారీ నేను వెళ్ళిపోతున్నాను. రేపటి మన ప్రయాణం గురించి ఏదైనా నిర్ణయించుకుంటే ఫోన్‌ చేయండి’ అంటూ స్కూటర్‌ కీస్‌ చేతిలోకి తీసుకుని వెళ్ళబోయింది. రాధిక, నవాజ్‌, శిరీష అడ్డంపడి ‘పారిపోడం సరికాదు. నీ ఆలోచన చెప్పు’ అన్నారు. ‘ఇంకా కులం, వర్గం… ఇన్నాళ్ళూ ఇవేగా పార్టీలని, ప్రభుత్వాలని నడిపిస్తున్నది. దీన్ని అడ్డుకోవాలనేగా ఇన్నేళ్ళుగా మనం మాట్లాడుకున్నది. ప్రజాస్వామ్యం అంటే అపహాస్యంగా ఉందా మీక్కూడా’ అంటూ విరుచుకుపడ్డాడు నవాజ్‌.

‘కరెక్ట్‌ నవాజ్‌’. శ్రావణి తీవ్రమైన స్వరంతో తీక్షణంగా అంది – ఏడెనిమిదేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. ఎన్నో వేదికల మీద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’, ‘ఓటు విలువ’, ‘ఓటరు బాధ్యత’ గురించి మాట్లాడిందంతా ప్రైజులు కొట్టేయడానికేనా! అసలు ఓటేసే టైం వచ్చేసరికి అతి సామాన్య, నిరుపేద, నిరక్షరాస్య ఓటరులాగే మీరూ మాట్లాడ్తుంటే ఇక మన జనరేషన్‌లో వచ్చిన మేధో మార్పు ఏంటన్నట్టు! ఆదర్శాలు, సిద్ధాంతాలు వేదికలమీద మాట్లాడేందుకేనా? కుల,వర్గ, మత రాజకీయాలు ఇంకెన్నాళ్ళు మోద్దాం? కనీసం మన జనరేషన్‌, మన తర్వాతి జనరేషన్‌ అయినా వీటినుండి బయటపడకపోతే మన దేశాన్ని, దేశ గౌరవాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ కర్తలని, అసలు భారత జాతినే ప్రపంచ చరిత్రలో అవమానంపాలు చేసిన వాళ్ళమవుతాం. ప్రపంచ పటంలో లంచగొండితనం, నేర రాజకీయాలకు మాత్రమే గుర్తింపవుతాం. ఇప్పటికే వెనక్కి నడుస్తున్న మన దేశ ప్రగతిని మరింత వెనక్కి గుంజుదామా? విద్యావంతులం అంటున్న మనలాంటి నవతరం కూడా మన ప్రతిష్టని మరింత దిగజార్చుకుందామా?? మరి మార్పు ఎక్కడ, ఎప్పుడు, ఎవ్వరితో మొదలవ్వాలి???

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.