వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన లక్ష్మీ! ఎలా ఉన్నావ్‌? కె.బి.లక్ష్మిగానే నువ్వందరికీ చిరపరిచయం. నీలోని స్నేహశీలతే చాలామంది మిత్రుల్ని నీ దరి చేర్చింది. నిన్ను నేను మొదట ఎక్కడ చూశానో చెప్పనా! తెలంగాణా సారస్వత పరిషత్‌ (ఒకప్పుడది ఆంధ్ర సారస్వత పరిషత్‌)లో జి.వి.సుబ్రహ్మణ్యంగారు, కె.కె.ఆర్‌ గార్ల సభలో నువ్వున్నావు పొడుగాటి వాల్జడలో మల్లెల్ని తలనిండా తురుముకొని. ఈమెకు పూలంటే మహా ఇష్టమనుకుంటా అని నవ్వొచ్చిందప్పుడు. అది మొదలు నువ్వెప్పుడు కనబడ్డా, కలిసినా పూల పరిమళం తర్వాతే నీ చిరునవ్వు నడిచొస్తుండేది.

లక్ష్మీ! నీక్కూడా మొదట్నుంచీ లేఖా సాహిత్యమంటే ఇష్టం కదూ! ‘నీ తోటలోని అడుగులు నావి’ కథంతా

ఉత్తరాలతో నడిచింది. కొన్ని కథల్ని కూడా ఉత్తరాల్తో ముగించావు, ‘మనసున మనసైన’ లాంటివి. స్కూలు రోజుల్లోనే హాస్య కథలు ఎక్కువ రాస్తుండేదానివి. తొమ్మిదో క్లాసులోనే ‘అభయ’ అనే నవల రాసావు. డిటెక్టివ్‌ కథలు, కవితలు, నాటకాలు రాసావు. కాలేజీలో కవిసమ్మేళనాల్లో పాల్గొన్నావు. ఐ.వి.ఎస్‌. అచ్యుతవల్లి రచనలపై పి.హెచ్‌.డి. చేసావు. 1973లో ఆకాశవాణి అనౌన్సర్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి మంచి బ్రాడ్‌కాస్టర్‌వి అయ్యావు. పాత్రికేయురాలిగా చాలా పత్రికలకు రచనలు చేస్తూ, ‘విపుల’ పత్రిక సంపాదకురాలిగా పదవీ విరమణ కూడా చేసేసావు. కవితా సంపుటాలు రెండు ‘గమనం’, ‘వీక్షణం’ (2006), కథల సంపుటలు రెండు ప్రచురించావు. తొలి కథానికా సంపుటి ‘మనసున మనసై’, ‘జూకామణి’. మంచి వక్త, వ్యాఖ్యాత, అనుకరణ కళాకారిణిగా పేరు తెచ్చుకున్నావు. ముఖ్యంగా తెలంగాణా మాండలికంలో అద్భుతంగా, సహజంగా మాట్లాడగలిగే దానివి. నీ రచనల గురించి నువ్వే అన్న మాటలు గుర్తొస్తున్నాయి. ”నేను అనుభవించిన జీవన పార్శ్వాలను, మానవ సంబంధాల మహత్తును, జీవన సౌందర్యాన్ని చెప్పాలని అనుకుంటాను. సంప్రదాయంలో అందం ఉంది. అభ్యుదయంలో ఆలోచన ఉంది. ఈ రెండింటినీ మేళవించడంలో జీవన స్వారస్యం ఉంది. జీవితం యాంత్రికం, రాక్షసం అయిపోకుండా స్నేహశీలతలో ఆర్ద్రత నింపుకున్న నాడే మనుగడకు సార్థకత. నా రచనలు చెప్పేవి ఇవే!” అని రచనోద్దేశ్యాన్ని గురించి చక్కగా చెప్పావు.

ప్రవీణ్‌, సమీరలు ఎలా ఉన్నారు? నీ మనసున మనసై నిలిచిన నీ సహచరుడు కామేష్‌ జ్ఞాపకం, అతని నిష్క్రమణం తర్వాత అతని కొరకు పూలూ, చిరునవ్వును వీడని నువ్వంటే నాకిష్టం.

లక్ష్మీ! తిలక్‌ ‘పోస్ట్‌మాన్‌’ ఉత్తరం నీకు చాలా ఇష్టం కదూ! అందుకే అద్భుతమైన ఆర్టికల్‌ రాసావు. ‘గణేశ్వరరావు’ గారు కూడా ఎంతో ఇష్టపడి, ఒక్క లక్ష్మి తప్ప తిలక్‌ గురించి ఇంకెవరు రాయగలరు? అని నీకు కితాబును ఇచ్చేసారు. నీ క్లాస్‌మేట్‌, మంచి స్నేహితుడైన సుధామ గారు కూడా నీ గురించి చాలా బాగా రాసారొకచోట. ఆగస్టు పదిహేనున పుట్టావని నిన్ను స్వాతంత్య్ర లక్ష్మి అని కూడా అనొచ్చన్నారు చమత్కారంగా.

హిందీలో విశారద, రష్యన్‌ భాషలో సీనియర్‌ డిప్లమా, జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషనే కాకుండా, న్యూఢిల్లీ ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ నుంచి క్రియేటివ్‌ రైటింగ్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ కోర్సు చేసావు. బైబిల్‌ కోర్సు కూడా చేసావు. వయోధిక పాత్రికేయ సంస్థ కార్యవర్గ సభ్యురాలిగా నీ సేవలందిస్తున్నావు. ప్రెస్‌క్లబ్‌లో శాశ్వత సభ్యురాలివి. వెటరన్‌ జర్నలిస్ట్‌ సంఘంలో ఏకైక మహిళా జర్నలిస్టుగా గుర్తింపు పొందడం నాకు సంతోషాన్ని కలిగించింది. నంది అవార్డు కమిటీ సభ్యురాలిగా కూడా వ్యవహరించావు. కాలమిస్ట్‌గా కూడా మంచి గుర్తింపును పొందావు.

జ్యేష్ట లిటరరీ అవార్డు, తెలుగు యూనివర్శిటీ పురస్కారం, దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ పురస్కారం, తురగా కృష్ణమోహన్‌ అవార్డు, కమలాకర్‌ మెమోరియల్‌, ప్రజ్ఞాభారతి, యువకళావాహిని, వంశీ ఇంటర్నేషనల్‌, నర్ల జర్నలిజం, కృష్ణశాస్త్రి, వసుమతి మాధవ, ముదిమాణిక్యం, యద్ధనపూడి, పి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయశాస్త్రి, సుశీలా నారాయణరెడ్డి, ఉంగుటూరి శ్రీలక్ష్మి, ‘నార్ల’ అవార్డు… ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి కదూ, నువ్వు పొందిన గౌరవాలు. ఓపెన్‌ యూనివర్శిటీలో డిగ్రీ విద్యార్థులకు జర్నలిజంలో అకడమిక్‌ కౌన్సిలర్‌గా చెబ్తున్నావు.

నీకున్న స్నేహాభిలాష వల్లే ఇంటికి కూడా ‘స్నేహనికుంజ్‌’ అని పేరుపెట్టుకున్నావు. మునిమాణిక్యం, సి.పి.బ్రౌన్‌, తిలక్‌లపై మోనోగ్రాఫ్‌లతో రాసావు. నువ్వు రాసిన ‘మనసున మనసై’లోని కథలన్నీ హిందీ, కన్నడ, తమిళ, ఆంగ్ల భాషలోకి అనుసృజన చేయబడ్డాయి. 2004లో అనుకుంటా నువ్వు మలేషియా ప్రభుత్వ ఆహ్వానంపై ‘కంట్రీగెస్ట్‌’గా పర్యటించడం, అంతర్జాతీయ జర్నలిస్టుల సెమినార్‌లో అభినందనలు పొందడం గుర్తొస్తే తృప్తిగా అన్పిస్తుంది. అలాగే ‘చైనా’ కూడా వెళ్ళొచ్చావొకసారి. ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, కలకత్తా వంటి నగరాల్లో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటూ ప్రశంసలందుకున్నావ్‌. యువభారతి సంస్థ ‘నందిని’ సంపాదకత్వ బాధ్యత నుండి నీ ప్రతిభ వల్ల విపుల, చతుర పత్రికల సంపాదకత్వ నిర్వహణ నీ ఎదుగుదలకు నిదర్శనం. ‘భూమిక’లో కూడా అడ్వయిజరీ బోర్డు మెంబర్‌వి. ‘చినుకు’ పత్రికలో ‘కవి కథకులు’ అనే కాలమ్‌, ఆంధ్రప్రదేశ్‌ పత్రికలో ‘కుంచె-కలం’ పేరున నిర్వహించిన కాలమ్‌, చేతన పత్రికలో ‘ఆధునిక సాహిత్యంలో ‘హాస్య నవల’ కాలమ్‌ గుర్తుచేసుకోవాల్సిందే.

నువ్వన్నట్లుగా మన పుస్తకాలే మన విజిటింగ్‌ కార్డులు. నువ్వు రాసిన సాహిత్య వ్యాసాలు, కాలమ్స్‌ (నువ్వు అన్నీ భద్రపరచుకోలేదు) పుస్తక రూపంలో రావాలి. నీ సమగ్ర కృషి అప్పుడే బాగా కన్పిస్తుంది. మనం వదిలేసే జాడలే కదా! ఈ అక్షరాలు. ఎప్పటికీ సాహిత్య చేలల్లో మనం వేసిన విత్తనాలు కొన్నైనా మొలకెత్తి వృక్షాలవుతాయి కదా!

లక్ష్మీ! నీ గురించి రాయాలంటే చాలా కష్టం. ఎందుకంటే, అన్నింటినీ ఈ కాలమ్‌ సైజులో కుదించలేం. రాయకపోయినా అదొక బయోడేటాలా మిగిలే ప్రమాదముంది. అందుకే నీ ఆత్మీయ స్నేహాన్ని మాత్రం ఎక్కువగా తలచుకుంటూ, నీ సాహిత్య కృషీ, నీ నైపుణ్యాలను తగుమాత్రంగానే పరిచయం చేసాను. పువ్వులా జీవిస్తూ, నవ్వుతూ, స్నేహానికి నువ్విచ్చే ప్రాధాన్యతల వల్లే మనం మంచి మిత్రులుగా మిగిలామని భావిస్తూ నీవు రాయబోయే లేఖ కోసం ఎదురుతెన్నులు చూసుకుంటూ…

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.