చలో… మనం గూడ గెలుపు గుర్రాలమైదామ్‌ -జూపాక సుభద్ర

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఈ దేశంలో మహిళలు రాజ్యాధికార సాధన ప్రోగ్రామ్‌ కాడ లేకపోవడం ఈ దేశ సమాజం యొక్క వైఫల్యంగా చెప్పాలి. ఇప్పటిక్కూడా అశేష మహిళా సమాజమంతా ఆకలి కుండ చుట్టే తిరుగుతోంది. కూలి కూటికాన్నే తెల్లార్తుంది. అసంఘటిత రంగాల్లో నిరక్షరాస్యతతో, ఉపాధుల్లేక, సమాన వేతనాలు, కనీస వేతనాలు లేక, అనేక సామాజికాధిపత్యాల కులహింసలకు, మగహింసలకు గురవుతున్నది. వీళ్ళు రాజ్యాధికారం వైపు రావాలంటే… ఇంకా ఎంత కాలం, ఎన్ని తరాలు పడ్తుందో… మహిళా ఉద్యమాలున్నా అవి సవర్ణ మహిళల ఆధిపత్యంలోనే నడుస్తున్నయి. అవి రాజ్యాధికారంవైపు దృష్టి పెట్టక తాత్కాలిక ప్రయోజనాల దగ్గరే ఉన్నయి. ఇక ఆధిపత్య మహిళల మధ్యే ఉన్న స్త్రీ వాదంకి రాజ్యాధికారం అనేది వారి లక్ష్యం కాదు. అన్ని రకాల అసమానతల్ని కూల్చే ప్రోగ్రామ్‌ వారి ఎజెండాలో లేదు. సవర్ణ మహిళల సమస్యల్ని చర్చించే కాన్నే ఆగిపోయింది. జెండర్‌ సెన్సిటైజేషన్‌కే పరిమితమైంది. అందుకే మహిళా రిజర్వేషన్‌ బిల్లు దాదాపు పాతికేళ్ళు దాటినా కోల్డ్‌సోరేజిలోనే ఉంది.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు మీద శబరిమలై ఆలయ ప్రవేశంలాగా, మీ టూ ఉద్యమం లాగా ఎందుకు దేశమంతా ఉద్యమాలు రాలేదు? ఎందుకు మహిళా రిజర్వేషన్‌ బిల్లును మహిళా సంగాలు సాధించలేదు? ఉద్యమించలేదు? ఎందుకంటే… రాజకీయాధికారం కాడ లేరు గనక, అది వాళ్ళ లక్ష్యం కాదు గనక. ఇక రాజకీయాల్లో ఉన్న కొద్దిమంది సవర్ణ మహిళలు వారి మగ వారసత్వం సంక్షోభంలో పడినపుడు మాత్రమే రావడం చూస్తున్నాము. సుష్మా స్వరాజ్‌ నుంచి వసుంధర రాజే సింధియా, జయలలిత, మమత దాకా. వీరిలో కులం దన్ను ఎక్కువ ఉపకరించింది. దీనికి మాయావతి మినహాయింపు. మాయావతికి కులం సౌండ్‌, కుటుంబ అండలు లేని నేపథ్యాలు. ఆమె కేవలం బహుజన రాజకీయ సిద్ధాంతాల దన్నుతో ఒక పెద్ద జాతీయ పార్టీ అయిన బిఎస్పీకి నాయకురాలు కాగలిగింది.

మాయావతి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి బహుజన సిద్ధాంతాల తాత్విక భూమిక బలంగా పంజేసింది. దళితులు, ఆదివాసీలు, వెనకబడిన కులాలు, మైనారిటీలు బహుజనులుగా ఏర్పడి సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, పెరియార్‌ రూపొందించిన మూలవాసీ ఎజెండాను, అంబేద్కర్‌ ఏర్పాటు చేసిన బహుజన సిద్ధాంత రాజకీయాల దన్నుతో కాన్షీరామ్‌ తన జీవితకాల కార్యాచరణగా రూపొందింది బహుజన రాజ్యాధికారం. ఫూలే, అంబేద్కర్‌ వారసుడిగా కాన్షీరామ్‌ బహుజన రాజ్యాధికార పీఠంపై దళిత మహిళను నిలబెట్టి రాజకీయ, సామాజిక చరిత్రల్ని తిరగరాసిన దార్శనికుడు.

దాదాపు బహుజన సామాజిక సంస్కర్తలంతా మహిళల ఉన్నతికై పోరాడినవాళ్ళే. ఆధునిక కాలంలో సావిత్రి బాయి ఫూలే, ఫూలే, పెరియార్‌, నారాయణగురు, అంబేద్కర్‌, కాన్షీరామ్‌ల దాకా మహిళా ఉన్నతికి, మహిళల మీద ఉన్న దురాచారాల్ని పోగొట్టడానికి, వారికి మానవహక్కులు కల్పించడానికి నాయకత్వ స్థానాల్లో ఉంచే వ్యవస్థల కోసం పోరాడినవాళ్ళు. కానీ వ్యవస్థల్ని, సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకున్న హిందూ ఆధిపత్య మగ సమాజం, బహుజన సామాజిక సంస్కర్తల్ని, జెండర్‌ సమానత్వ సంస్కర్తల్ని, వారి చరిత్రల్ని, కార్యాచరణని అవాచ్యం చేసినట్లు సవర్ణ మహిళలు కూడా చేయడం ఒక విషాదం. ఫెమినిస్టు సంగాలు, మహిళా ఉద్యమ సంగాలు బహుజన కులాల సంస్కర్తల్ని, తాత్వికుల్ని వారి జెండర్‌ సమానత్వ కార్యాచరణని, పోరాటాల్ని గుర్తించక పోవడానికి కులమే కారణంగా చెప్పుకోవాలి.

సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే బాలికా పాఠశాలల్ని పెట్టి అన్ని కులాల మహిళల్ని విద్యావంతులుగా చేశారు. సవర్ణ మహిళల మీదున్న దురాచారాల్ని రూపుమాపారు. వారికి పునర్వివాహాలు, వితంతు వివాహాలు జరిపించారు. ఇక అంబేద్కర్‌ మహిళా హక్కులకై పోరాడి అవి చట్టబద్దం చేయడానికి రూపొందించిన హిందూ కోడ్‌ బిల్లును వీగిపోయేట్టుగా నిలువరించింది నెహ్రు, సరోజినీ నాయుడు లాంటి సవర్ణ మగ మహిళా నాయకత్వాలే. బిల్లు వీగిపోయినందుకు తన మంత్రి పదవి సైతం ఒదులుకున్న మహిళా పక్షపాతి అంబేద్కర్‌. ‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అన్న మను స్మృతిని తగలబెట్టిన గొప్ప సామాజిక తత్వవేత్త అంబేద్కర్‌. అయినా సవర్ణ మహిళా వ్యవస్థలు అంబేద్కర్‌ని అంటరానివానిగానే చూస్తుండడంలో జెండర్‌ సెన్సిటైజేషన్‌ లోపించి ఆధిపత్య కుల సెన్సిటైజేషనే కనిపిస్తుంటుంది.

ఇక ఇప్పుడు జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మగ అభ్యర్థులు దాదాపు రెండువేలు ఉంటే… దాంట్లో మహిళా అభ్యర్థులు కేవలం 43 మంది మాత్రమే

ఉన్న మహిళాభివృద్ధి, మహిళా సాధికారత చూడొచ్చు. ఇది మహిళలకు చాలా అవమానకరమైన అంకె. వ్యవస్థలు, సమాజాలు రోజురోజుకు వృద్ధి కావాలి కానీ దిగజారుతున్న వైఖరులే కనిపిస్తున్నయి మహిళల విషయంలో. ఈ 43 మంది మహిళా అభ్యర్థుల్లో దళిత, ఆదివాసీ మహిళలు దాదాపు పదిమంది కూడా లేరు. టీఆర్‌ఎస్‌ పోయిన ఎలెక్షన్స్‌లో మహిళలకు ఆరు సీట్లు కేటాయిస్తే… ఈసారి నలుగురికే సరిపెట్టింది. ఈ సారి ఒక్క దళిత మహిళక్కూడా కేటాయించలే… ప్రగతి శీలుడనీ, సమసమాజ రాజకీయాలు మాట్లాడ్తాడని చెప్పుకుంటున్న టీజేఎస్‌ నాయకుడు కూడా ఒకే ఒక్క మహిళకు అదీ తన సొంత కులం మహిళకు తప్ప ఇతర బహుజన కులాల మహిళలకు చోటు కల్పించక పోవడం శోచనీయం. ఇక టిడిపి కూడా అంతే సేమ్‌ టు సేమ్‌. తమ పరిస్థితులు సంక్షోభంలో పడిన హిందూ మగ పార్టీ కొన్ని (14) సీట్లు ఇతర పార్టీలకన్నా కొంచెం పెంచింది. ఇక ఎంఐఎం వంటి ముస్లిమ్‌ రాజకీయ పార్టీలు మహిళలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం అన్యాయం, అప్రజాస్వామికం. ఇక జాతీయపార్టీ, శతాబ్దానికి పైబడిన చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ కూడా కేవలం పదకొండు స్థానాలిచ్చి దులిపేసుకుంది. దీకూూని ట్రాన్స్‌జెండర్‌కి టిక్కెట్‌ ఇచ్చి చరిత్ర మార్చినందుకు అభినందించాలి. మహిళలు రాజ్యాధికార కార్యాచరణను మొదలుపెట్టాలి. మహిళలంతా కల్సి రాజకీయ పార్టీ పెట్టాలి. కులాల వారీగా రాజకీయ పార్టీలున్నప్పుడు జెండర్‌ పరంగా పార్టీలుండకూడదా! మహిళా పార్టీ పెట్టి దామాషా ప్రకారం సీట్లు కేటాయించుకొని మనం కూడా గెలుపుగుర్రాలమౌదామ్‌.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.