రుక్మిణి పార్థసారధి (జననం 1929) దక్షిణ భారత సాంప్రదాయ కుటుంబానికి చెందినవారు. ఆమె పోషకాహార శాస్త్రం (న్యూట్రిషన్)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి గృహిణిగా ఉండడానికే ఇష్టపడ్డారు. ఆమె తండ్రి కొత్తపల్లె నారాయణాచారి. ఆయన ప్రసిద్ధి చెందిన చీఫ్ ఇంజనీర్. ఆయన హీరాకుడ్, తుంగభద్ర డామ్లను నిర్మించారు. షారాపతి, భాక్రానంగల్ డామ్ ప్రాజెక్టులకు సలహాదారుగా ఉన్నారు.
రుక్మిణి పార్థసారధి గారికి శాస్త్రీయ సంగీతం, నృత్యం, సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆమె పురాణాలని, చరిత్రనీ కలిపి అల్లుతూ ప్రచురణార్హమైన రచనలు చేస్తారు.
మీరు ఎలా పెరిగారు?
1940లో మా అమ్మ బ్రెయిన్ మలేరియాతో చనిపోయేసరికి నాకు పదేళ్ళ వయసు మాత్రమే. జబ్బు చేసిన వారం రోజుల్లోనే ఆమె చనిపోయారు. ఆమె పోయిన పదో రోజు నాక్కూడా బ్రెయిన్ మలేరియా అని నిర్ధారణ చేసి, కోలార్ మిషన్ హాస్పిటల్లో చేర్చారు. చేరిన తర్వాత నాలుగు రోజులు నాకు స్పృహ లేదు. తరువాత రెండు నెలల వరకు హాస్పిటల్లోనే ఉండిపోవలసి వచ్చింది. వయసులో ఉన్న భార్య చనిపోయి, కూతురు (నేను) హాస్పిటల్లో ఉండాల్సి వచ్చినందుకు, మా నాన్న చాలా కుంగిపోయారు. నా బాగోగులు చూసే వాళ్ళెవరూ లేరు. అప్పటికి 15, 16 ఏళ్ళ వయసున్న నా అక్కకు వివాహమై ఆరు నెలలు మాత్రమే అయింది. మా అమ్మ చనిపోయినపుడు ఆమె తన అత్త, మామల ఇంట్లో ఉంది. వారు ఆమెను పుట్టింటికి రానీయలేదు. నా తమ్ముడు చాలా చిన్నవాడు. అప్పుడు అతనికి ఆరు… ఐదు సంవత్సరాల వయసు. అందుకని నేను హాస్పిటల్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. మా తాత, నాయనమ్మలు కూడా అప్పటికి చనిపోయారు. మా నాన్నకు తన ఆఫీసు పని వదిలి నా దగ్గర ఉండడానికి వీలవలేదు. అప్పుడే ఆయనకి బళ్ళారి బదిలీ అయ్యింది. మా దగ్గర బంధువులు బెంగుళూరులో ఉండేవారు. వాళ్ళే వారానికి ఒకసారి హాస్పిటల్‌కి వచ్చి నన్ను చూసి వెళ్ళేవారు. హాస్పిటల్లో ఉండే నన్స్ శ్రద్ధగా నా బాగోగులు చూసేవారు. నేను స్పృహలో లేనప్పుడు వారు ప్రతి రోజూ నా మంచం దగ్గర మోకరిల్లి, నా ఆరోగ్యం కోసం ప్రార్ధన చేసేవారని అక్కడి జనం చెప్పేవారు. నాకు ఒత్తైన, పొడుగు జుట్టు ఉండేది. నాలుగు రోజుల తర్వాత స్పృహ వచ్చినప్పుడు, నాకు గుండు చేశారని గ్రహించాను. నాకు వాళ్ళమీద విపరీతమైన కోపం వచ్చింది. ఏడవడం మొదలుపెట్టాను. ఆ సంఘటన ఎప్పటికీ మరిచిపోలేదు.
ఆ తర్వాత?
చదువు పూర్తవగానే నేను ఉద్యోగం చేద్దామనుకున్నాను. పని చేయాలని నాకు తీవ్రమైన ఆకాంక్ష ఉండేది. నిజానికి నేను మెడిసిన్ చదువుదామనుకున్నాను. మా నాన్న ఒప్పుకోలేదు. నాకు పెళ్ళి చేసి, ఆయన బాధ్యతల నుంచి విముక్తులవుదామని అనుకున్నారు. అప్పటికి నాకు పదకొండేళ్ళే. మా తల్లి చనిపోయే సమయానికి, మా నాన్నకి 42 ఏళ్ళే కానీ, ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. నన్ను కాలేజికి పంపించడం ఆయనకు సుతరామూ ఇష్టం లేదు. కానీ నేను మొండిగా ఉన్నాను. నాకు చదవాలని ఉంది. నా పెంపకం రక్షణ గొడుగు కింద ఉన్నట్టుండేది. మా నాన్న చాలా స్ట్రిక్టుగా ఉండేవారు. నన్ను స్కూలుకి కారులో పంపించేవారు. కారు నా కోసం అక్కడే ఉండేది. క్లాసులవగానే కారెక్కి తిన్నగా ఇంటికి వచ్చేదాన్ని. అప్పుడప్పుడు మా నాన్నే స్వయంగా స్కూలుకి వచ్చి నన్ను షికారుకి తీసుకువెళ్ళేవారు. మేము బీచ్‌లో ఒక చివర నుంచి ఇంకో చివరదాకా నడిచి, తర్వాత ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆయన పి.డబ్ల్యు.డి ఆఫీసు బీచ్ రోడ్డు దగ్గరలో ఉండేది. నన్ను ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనిచ్చేవారు కాదు. అంటే నేను చాలా తీవ్రమైన కట్టుబాట్లలో పెరిగాను. నాన్నకి ప్రతిదీ ఒక పద్ధతిలో ఉండాలి. పద్ధతి దాటి ఏదీ ఉండకూడదు. ఇంటి నిర్వహణ నేనే చూడాల్సి వచ్చేది. మాకు ఒక వంట మనిషి, ప్యూను, ఇంకా మిగిలిన పనివాళ్ళు ఉండేవారు. అందరూ ఉన్నా, నిర్వహణ మాత్రం నేనే చూడాల్సి వచ్చేది. వంట మనిషి అన్నీ వండినా, ఏం వండాలో మాత్రం నేనే చెప్పాల్సి వచ్చేది. వారంలో స్కూలు ఉన్న రోజుల్లో కూడా పొద్దున్నే 5:30కి నిద్ర లేచి అన్నీ సిద్ధంగా ఉంచాల్సి వచ్చేది. ప్రతీ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండేట్లు నేను శిక్షణ పొందాను. ఆయన నాకు డబ్బు ఇచ్చేవారు. నేను ఆయనకు లెక్క చెప్పేదాన్ని.
నేను, నాన్న ఒకరితో ఒకరం బాగా సర్దుకుపోయే వాళ్ళం. నేనాయన గారాల కూతురిని. ఆయన ఇన్స్పెక్షన్ (తనిఖీ) టూర్లకు వెళ్ళేవారు. నేను స్కూలు లేదా కాలేజికి వెళ్ళేముందు ఆ ప్రయాణానికి అన్నీ సిద్ధంగా ఉంచి, సూట్‌కేసు సర్ది ఉంచమనేవారు. నేను తిరిగొచ్చేసరికి ఆయన వెళ్ళిపోయేవారు. అందుకని నేను సబ్బు పెట్టెతో సహా ప్రతిదీ దేని స్థానంలో అది పెట్టి సిద్ధంగా ఉంచేదాన్ని. అవన్నీ నాకాయనే నేర్పించారు. వివాహమై నేను మా వారి ఇంటికి వెళ్ళాక ఇదంతా నాన్న కోల్పోయారు. ఆయన ప్రయాణాలకి వెళ్ళే ఒకటి, రెండు రోజుల ముందు మా ఇంటికి వచ్చి ప్రయాణానికి అన్నీ సర్దివెళ్ళు అని చెప్పేవారు. నాన్నకి నేను చాలా దగ్గర. అమ్మని చిన్నప్పుడే కోల్పోయాను. అందుకని ఆయనే నాకు తల్లీ తండ్రీ అయ్యారు. నేను చాలా విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాను.
చాలా ఎక్కువ బాధ్యత కదా?
అవును. నేను నా తమ్ముడి బాగోగులు కూడా చూడాల్సి వచ్చేది. అతని అవసరాలు తీర్చేదాన్ని. పైగా అన్నీ పద్ధతి ప్రకారం
ఉండాలి. అందువల్ల చిన్న వయస్సులోనే నేను క్రమశిక్షణ నేర్చుకున్నాను. అందుచేతనే పెళ్ళయ్యాక నేను ఉద్యోగం చేద్దామనుకున్నాను! ఆటవిడుపు లాగా. మా ఆయన అంత స్ట్రిక్ట్ కాదు. నాక్కావాల్సిన స్వేచ్ఛ ఇచ్చేవారు. కొంతకాలం ఉద్యోగం చేద్దామననుకున్నాను. కానీ అప్పుడు మా అత్తగారు ఇంటికి వచ్చారు. ఆవిడ బాగోగులు చూడాల్సి వచ్చింది. ఆవిడ అప్పుడు చాలా సుస్తీగా ఉంది. నేనావిడకి తాగడానికి హార్లిక్స్ ఇచ్చేదాన్ని, బలమైన ఆహారం ఇచ్చేదాన్ని. నడవడానికి సహాయపడేదాన్ని. ఆవిడ ఆరోగ్యం పుంజుకుంది. కొంతకాలం తర్వాత ఆవిడ బాగయ్యారు. నేను మళ్ళీ ఉద్యోగం చేద్దామని రెడీ అయ్యేసరికి మా అబ్బాయి ప్రకాష్ పుట్టాడు. నా టీచర్ ప్రొఫెసర్ రాజమ్మ దేవదాస్ అమెరికా వెళ్ళారు. కోయంబత్తూర్‌లో అగ్రికల్చర్ కాలేజీ వాళ్ళు నన్ను పిలిచి ఉద్యోగం ఇస్తామన్నారు. మా ఆయన నన్నక్కడికి పంపలేదు. అందుకని వెళ్ళాలని బలంగా ఉన్నా నేను వెళ్ళలేకపోయాను. రాజీపడి సర్దుకుపోయాను.
మీరు బాధపడ్డారా?
లేదు. ఎందుకంటే అదే సమయంలో నేను సంతోషంగా కూడా ఉన్నాను. నాకు ఉద్యోగం చేద్దామనీ ఉండేది. అట్లాగే ఆదర్శ గృహిణిగా ఉండాలనీ ఉండేది. అదలా ఉంచితే నాకు కొడుకు ఉన్నాడు. మా అత్తగారు నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. ఆవిడ నన్ను బాగా అర్థం చేసుకుంది. అందుకని నేను వెళ్ళలేకపోయినందుకు బాధపడలేదు. కానీ ఈ రోజుక్కూడా నేనప్పుడు ఉద్యోగం చేసుండాల్సింది అనిపిస్తుంది. కేవలం ఇల్లు చూసుకోవడమే కాదు నాకు ఇంకేమైనా చెయ్యాలనిపించేది. కానీ చెయ్యలేకపోయాను. సమాజానికి
ఉపయోగపడేది ఏదీ చెయ్యలేకపోయానని ఇప్పటికీ బాధపడుతున్నా.
నా చిన్న మరిది ఎమ్‌బిబిఎస్ పూర్తి చేశాడు. అతను మైసూర్ వదిలి సేవాగ్రాం వెళ్ళాడు. అందుకని బి.ఎస్సి పూర్తి చేసిన నా చిన్న తోటికోడలు వచ్చి మాతో ఉంది. నాకంటే సంవత్సరమే చిన్నదయినా, నేనామెను కూతురిలా చూసేదాన్ని. తను నాకు బాగా దగ్గర. తన అనుభూతులన్నీ నాతో పంచుకునేది. మా ఆయన కొంచెం మెతక. కానీ అందరూ నన్ను ఇష్టపడడం వల్ల నా భావాలు గౌరవించేవారు. మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకోవడానికి అది తోడ్పడింది.
అందరూ మిమ్మల్ని ఇష్టపడడం వల్ల ఆయన మీ భావాలు అర్థం చేసుకున్నారన్నారు కదా… ఒక ఉదాహరణ ఇవ్వండి.
మాది చాలా చిన్న ఇల్లు. చాలా మంది జనం వచ్చేవారు. నాకది ఎంత కష్టమో ఆయన అర్థం చేసుకున్నారు.
రానివ్వండి. అందరూ కలిసి ఉండాలనుకుంటారని నేనెప్పుడూ చెప్పేదాన్ని. చిన్న ఇల్లయినాగాని అందరూ వచ్చి మాతో
ఉండడానికి ఇష్టపడేవారు. వాళ్ళెప్పుడు రావాలనుకున్నా వాళ్ళకు ఎప్పుడూ ఆహ్వానం ఉండేది.
మా పెళ్ళి 1949 ఫిబ్రవరిలో జరిగింది. అప్పటినుండీ ఈ 56 ఏళ్ళూ మేము చాలా సంతోషంగా గడిపాము. తొలినాళ్ళలో భవిష్యత్తు గురించి మేము ప్రణాళికలు వేసుకోవలసి వచ్చింది. పెళ్ళప్పుడు నేను డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. అందుకని కాలేజీకి వెళ్ళాల్సి వచ్చేది. ఒక సంవత్సరం అంతా కాలేజీకి వెళ్ళి,1950లో నా చదువు పూర్తి చేశాను. 1950లో కాపురం పెట్టాము. ఇల్లు చిన్నదైనా వంటకి మనిషుండేవాడు. అందుకని నేను కాలేజీకి, మా ఆయన ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళం. రాత్రిపూట కలిసి భోజనం చేసేవాళ్ళం. అంతే. ఆ ఏడు న్యూట్రిషన్లో నా డిగ్రీ పూర్తి చేశాను. 1951లో మా అబ్బాయి పుట్టాడు. కాలేజీ పూర్తయ్యాక బాబుని పెంచుకోవటం చాలా ఆనందాన్నిచ్చింది. తర్వాత మా అత్తగారు మైసూరులో ఆమె సంసారం తీసివేయాల్సి వచ్చింది. మాతో ఉండడానికి వచ్చారు. మా వారి కుటుంబం చాలా పెద్దది. వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు, ఐదుగురు అక్కచెల్లెళ్ళు. నేను అయిదో కోడల్ని. మా ఆయన పార్థసారధికి తల్లి అంటే చాలా ఇష్టం. తల్లి తన దగ్గరే ఉండాలనుకునేవారు. అంతమందిని పెంచడం, పెద్ద సంసారం నడపడానికి ఆవిడ చాలా కష్టాలు పడిందని ఆయన ఆవిడని చాలా జాగ్రత్తగా చూసుకోవాలనుకునేవారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆవిడకి పెద్ద లక్ష్యాలు ఉండేవి. అందరినీ బాగా చదివించింది. ఆవిడ పల్లెటూరునుంచి వచ్చింది. ఆవిడ పెద్దగా చదువుకోలేకపోయినా, పిల్లలందరినీ చదివించాలని కలలు కనేది. వాళ్ళంతా మంచి ఉద్యోగాలు చేసి బాగా స్థిరపడాలని కోరుకునేది. పిల్లలకి చదువు చెప్పించడం ఆమె లక్ష్యం. ఎక్కడ మంచి స్కూల్స్ ఉంటే అక్కడి బంధువుల ఇళ్ళకి పిల్లల్ని పంపించి చదివించింది. అందరూ బాగా స్థిరపడ్డారు. అందుకనే మా ఆయన ఆవిడంటే బాగా ఇష్టపడేవారు. ఆవిడ మాతో ఉంటూ ప్రశాంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో ఆమెని తీసుకువచ్చారు. పదకొండేళ్ళకే తల్లిని పోగొట్టుకున్న నాకు, నా భావాలు పంచుకోవడానికి గౌరవించదగిన పెద్దవారు ఎవరైనా ఇంట్లో ఉంటే బాగుండుననిపించేది. నేను చిన్నప్పుడు ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. మా తాత, నాయనమ్మ, అందరూ ఉండేవారు. అందుకని ఎవరైనా ఇంట్లో ఉండాలనిపించేది. దాంతో ఆవిడ మాతో ఉండడం నాకు సంతోషంగా ఉండేది. ఆమె నాకు చాలా విషయాలు నేర్పింది. రకరకాల స్వభావాలున్న పిల్లల్ని తనెలా పెంచిందీ కథలుగా చెప్పేది. కొడుకులందరికీ, ఎవరికి వాళ్ళకి స్వంత ఉద్దేశాలు ఉండేవి. వారికి అనుగుణంగా, సందర్భానుసారంగా ఉండడం వలన ఆవిడ పిల్లలందరూ వేసవి సెలవుల్లో మా ఇంటికి వచ్చేవారు. అందర్నీ చూడడం బాగుండేది. అందరితో ఆవిడ వ్యవహరించే తీరు నిజంగా గొప్పగా ఉండేది. అది కూడా ఆవిడ దగ్గరే నేర్చుకున్నానేమో! కానీ నాకు చాలా స్వంత భావాలుండేవి. నేను చెయ్యాలనుకున్నది చేసేదాన్ని కాని ఎప్పుడూ ఎవర్నీ నొప్పించేదాన్ని కాదు. నా ఉద్దేశ్యం చెప్పి పనయ్యేటట్టు చూసేదాన్ని. ఆ రకంగా నా భర్తకు కూడా స్వంత భావాలుండేవి. ఇద్దరం అలాంటి వాళ్ళమే అయినా ఒకరితో ఒకరం సర్దుకుపోయేవాళ్ళం. ఆయన ఏదైనా చాలా గట్టిగా కావాలనుకుంటే నేనూరుకునేదాన్ని. అలాగే నాకనిపించినప్పుడు ఆయన ఊరుకునేవారు. అలా ఒకరి అవసరాలకి అనుగుణంగా ఒకరం సర్దుకుపోయేవాళ్ళం.
1951లో మా అబ్బాయి పుట్టాడు. ఏడేళ్ళ తర్వాత మా అమ్మాయి పుట్టింది. అప్పుడు మేము మద్రాసులో ఉన్నాం. మాది ఐదుగురు సభ్యులు… అత్తగారు, మేము నలుగురం… చక్కటి కుటుంబం. ఒకరంటే ఒకరం బాగా ఇష్టపడేవాళ్ళం. మాకు చక్కటి ఇల్లు, తోట ఉండేవి. అయినా కానీ నాకు ఉద్యోగం చెయ్యాలనిపించేది. 1964లో ఆయనకు హైదరాబాద్ బదిలీ అయ్యింది. మళ్ళీ మేము మొదలుపెట్టాల్సి వచ్చింది. తర్వాత ప్రయత్నం చేయొచ్చని, ఉద్యోగం చేసే ఆలోచనకి అప్పుడు అయిష్టంగా స్వస్తి చెప్పాను. అది అలా వాయిదా పడుతూ వచ్చింది.
చిన్నప్పుడు మీకెవరూ లేకపోవడం వల్ల, మీ చుట్టూ ఎప్పుడూ మనుషులుండటం మీకు ఆనందం కలిగించి ఉంటుంది. కానీ మీరు బాగా వత్తిడికి గురైన సందర్భాలు కూడా ఉండి ఉంటాయి…
అవును, చెప్పనక్కరలేదు. ఒకే సమయంలో చాలామంది వ్యక్తులతో సర్దుకుపోవలసి వచ్చేది. సెలవుల్లో అందరూ వాళ్ళమ్మని చూడడానికి వచ్చేవారు. ఇంట్లో అన్నీ చూసుకోవాలంటే ఒక్కొక్కరూ ఒక్కో రకం. సమయం, సందర్భాన్ని బట్టి వ్యవహరించాల్సి వచ్చేది. సర్దుకుపోవడం చాలా కష్టమయ్యేది. కొన్నిసార్లు మేము ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా కష్టమయ్యేది. మేము చాలా జాగ్రత్తగా
ఉండాల్సి వచ్చేది. అందుకని మానసిక వత్తిడి ఎక్కువగా ఉండేది. మా అత్తగారు పూర్తిగా మంచం పట్టడం వల్ల, ఆమె బాగోగులు చూడడం కూడా భారంగానే ఉండేది. ఆమెను ఒంటరిగా విడిచి నేను బయటకు ఎక్కడికీ వెళ్ళలేకపోయేదాన్ని. ఆమె నన్ను ఎక్కడికీ వెళ్ళనిచ్చేది కాదు. మొదటేడు భోజనం కూడా నేనే పెట్టాల్సి వచ్చేది. ప్రొద్దున్న 8 గంటలకి టిఫిన్ ఇస్తే, మధ్యాహ్నం 12 గంటలకల్లా భోజనం పెట్టాలి. నేను పెడితేనే తినేవారు. నెమ్మదిగా అది అధిగమించి తర్వాత్తర్వాత ఆయా పెట్టినా తినేవారు. ఆవిడ స్నానం కూడా నేనే చేయించాలనేవారు. అదంతా నన్ను వత్తిడికి గురిచేసింది. బైటికి ఎక్కడికీ వెళ్ళలేకపోయేదాన్ని. పూర్తిగా ఇంటిపట్టునే ఉండాల్సి వచ్చింది. అందరూ వచ్చి వెళ్ళేవారు. మర్యాదగా కబుర్లు చెప్పి వెళ్ళిపోయేవారు. కొన్నాళ్ళ తర్వాత నాకు మార్పు కావాలనిపించింది. నేను బాగా దిగులుపడి ఏడవడం మొదలుపెట్టాను. మా వారి అన్నదమ్ములందరూ అప్పుడు వచ్చి ఉన్నారు. అందరూ చుట్టూనే ఉన్నారు కానీ నేనెక్కడికీ వెళ్ళలేక పోయేదాన్ని. నేను వాళ్ళతో బయటికి వెళ్ళడానికి ఆవిడ ఒప్పుకునేవారు కాదు. ఒకరోజు నేను ఏడ్చేశాను. చివరకు పదిహేను రోజులు బయటకు వెళ్ళడానికి నాకు అనుమతి దొరికింది. నేను బద్రికి వెళ్ళాను… కాదు కాదు హృషీకేశ్, హరిద్వార్ వెళ్ళాను. ఆవిడ బాగోగులు వాళ్ళకప్పగించి నేను, పార్ధసారధి వెళ్ళాము. నెమ్మదిగా వత్తిడి నుంచి తేరుకున్నాను.
అవును. అది తీవ్రమైన వత్తిడిని కలిగిస్తుంది. జనం ఊరికే వచ్చి వెళ్తుంటారు కానీ అర్థం చేసుకోరు…
ఒకసారి అందరూ తిరుపతికి వెళ్ళాలనుకున్నారు. నేను కూడా వెళ్ళాలనుకున్నాను. మద్రాస్ నుంచి తిరుపతి వెళ్ళడానికి రెండు రోజులే పడుతుంది. నేను అన్ని ఏర్పాట్లూ చేసుకున్న తర్వాత, ఆమె ”నన్ను వదిలి నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళొద్దు”
అని ఏడ్చి, నేను ప్రయాణం మానేట్లు చేసింది.
మీ ఆయన ఈ ఆందోళనలన్నీ మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్నాయని గ్రహించారా? మీ మానసిక పరిస్థితి అర్థం చేసుకున్నారా?
అవును. ఆయన అర్థం చేసుకునేవారు. కానీ ఆయనకి తల్లంటే విపరీతమైన ఇష్టం. మిగిలిన వాళ్ళెవరికీ ఆమె అక్కర్లేదు. ఆవిడే వాళ్ళందరినీ పెంచి పెద్ద చేసింది. ఆమెను నిర్లక్ష్యం చేయడం సరికాదని నాక్కూడా అనిపించింది. కానీ నేను ఒక్కదాన్నే సంభాళించుకు రాలేకపోయాను. అతని అన్నదమ్ములు ఆమెను చూడడానికి కొంత డబ్బు పంపించేవారు. ఒక ఆయా ఇంట్లో ఉండేది. చాలా విషయాలు జరిగేవి. ఇవన్నీ పార్ధసారధి గుర్తించారు. పైగా నేను ఆయనకి నా తరపు నుండి పూర్తి సహకారం అందిద్దామనుకున్నాను. నాకు అమ్మ లేదు. ఆయనకి ఉంది. నేను చాలా చిన్నప్పుడే మా అమ్మను పోగొట్టుకున్నాను. నా పెళ్ళైనప్పుడు, కొత్త కాపురంలో నన్ను నడిపించేందుకు పెద్దవాళ్ళొకరున్నారనే ధైర్యం మా అత్తగారు నాకు కలిగించింది.
ఒక రోజు రాత్రి నిద్రలోనే ఆమె పోయారు.
ఇప్పుడు వచ్చి మాతో పనిచేయండి!
(నవ్వు) నిజం చెప్పాలంటే నేనిప్పటికీ ఏమీ చెయ్యలేకపోతున్నాను. నా చిన్న మరిది డా.దేశికన్, లెప్రసీ డాక్టరు (కుష్ఠు వ్యాధి నిపుణులు) నన్ను సేవాగ్రాం రమ్మని కోరారు. (మహారాష్ట్రలోని సేవాగ్రాంలో కస్తూర్బా మెడికల్ కాలేజి ఉంది) నా తోటికోడలు అక్కడ ఒక సంఘ సేవిక. కస్తూర్బా మెడికల్ కాలేజీలో ఆమె సెక్రటరీ. వారు మా ఆయన పార్ధసారధి ఒప్పుకుంటే వచ్చి మాతో ఉండు నీకిష్టమైన పని చేసుకోవచ్చని అన్నారు.
కానీ, నేనెప్పుడూ మా ఆయన్ని వదిలి వెళ్ళి అక్కడ ఉందామనుకోలేదు. మా అనుబంధం అటువంటిది. కొన్ని కొన్నిసార్లు మా ఇద్దరికీ పొరపొచ్చాలు వచ్చినప్పటికీ ఈ 56 ఏళ్ళలో నేను ఆయనకి దూరంగా ఉన్నది 6 నెలలు మాత్రమే. అది ఎప్పుడంటే మా అబ్బాయి, అమ్మాయి పుట్టినప్పుడు. నేను నా అక్కతో ఉన్నానప్పుడు. మా నాన్న ఉన్నాకానీ నేను వెళ్ళలేదు. నా తల్లి లేనందువల్ల, నేను ఎక్కడికీ వెళ్ళి ఉండలేదు. కొద్దికాలం కూడా నేను మా ఆయనను వదిలి ఉండలేదు. మా అనుబంధం అంటారా… ఆయన ఆఫీసుకి వెళ్ళిన సమయం తప్ప ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఆయనా అట్లాగే అనుకునేవారు. ఆయనకి బ్రాంకైటిస్, ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు చాలా
ఉండేవి. అందుకని ఎప్పుడూ ఆయనతోనే ఉండి ఆయన సంరక్షణ చూసుకునేదాన్ని. ఇటువంటి కొన్ని విషయాల గురించి పిల్లలకి కోపం వచ్చేది. రిటైరయ్యాక బ్యాంకుకి, ఇంకా మిగిలిన చోట్లకి ఆయనొక్కరే వెళ్ళాలనుకునేవారు. నేను కూడా ఆయనతో వెళ్ళేదాన్ని. ఆయనకి నామీద కోపం వచ్చేది నువ్వు నా తోకవా? అని అడిగేవారు. తర్వాత ఆయనను ఒంటరిగా వెళ్ళనిచ్చేదాన్ని.
ఆ తర్వాత…?
నా మాట వినేవారు కాదు. చెన్నైలో ఒకసారి బయటకు వెళ్ళి, ఇంటికి రాలేకపోయారు. దోవ తప్పారు. ఇంటిదారి కనుక్కోలేకపోయారు. మా వీథి పేరు మరచిపోయారు. తప్పిపోయి, దారి వెతుక్కుంటూ తిరుగుతూ ఉండిపోయారు. అప్పుడే మా మనవడు స్కూలు నుంచి వచ్చాడు. వాళ్ళ తాతను వెతుక్కుంటూ వెళ్ళాడు. మా ఆయన గంటకు పైగా వెతికినా ఇంటికి దారి కనుక్కోలేకపోయారు. వీళ్ళు ఇంటికి తీసుకు వచ్చేవరకూ ఒకచోట కూర్చుని ఉండిపోయారు. అందుకే నేను భయపడేదాన్ని.
మీరిద్దరూ కలిసి ఏ పనులు చెయ్యడం ఇష్టపడేవారు?
కలిశా? చదవడం. ఆయనకి రెటీనల్ డీజనరేషన్ అనే జబ్బు ఉండడం వల్ల నేను చదివి వినిపించేదాన్ని. ఆయనకి దృష్టి లోపం చాలా ఉండేది. పెద్ద అక్షరాలు మాత్రమే చదవగలిగేవారు. న్యూస్ పేపర్ చదివి వినిపించేదాన్ని. తర్వాత ఆయన పోవడానికి ముందు రెండేళ్ళు సాయంత్రం 5-7 గంటల మధ్య రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి గ్రంథాలు, ఇంకా చాలా పుస్తకాలు చదివేవాళ్ళం. అది ఆయన ఆనందించేవారు. తన స్కూలు రోజుల్లోని అనుభవాలను ఆయన చెప్పేవారు. 2001-2004 మధ్య గడిపిన కాలం మా జీవితంలో ఎంతో మంచి కాలం. మాకు మేముగా చాలా ఆనందించేవాళ్ళం. నాక్కూడా బాగా దృష్టి లోపం ఉండేది. రెండు కళ్ళల్లో నాకు గ్లకోమా (నీటి కాసులు) అనే జబ్బు ఉండేది. అయినా కానీ నేను చదివేదాన్ని. చదవడం ఆనందించేదాన్ని. ఇంకో విషయమేమిటంటే, ఆయన పూజ అయిన తర్వాత… ఆఫీసు పూజయినా కానీ నన్ను పిలిచేవారు. ఇద్దరం కలిసి తీర్థం ఇచ్చేవాళ్ళం. పనిచేసినన్ని రోజులూ ఇది మానలేదు.
కొడుకు, కోడలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తీర్థం ఇవ్వడానికి వారిని పిలిచేవారు. ”వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళే వస్తారు వదిలేయండి” అనేదాన్ని. ”లేదు, మనం నేర్పాలి. వాళ్ళు మన సాంప్రదాయాలు తెలుసుకోవాలి. తర్వాత కావాలంటే పాటిస్తారు లేదా వదిలేస్తారు. తండ్రిగా సాంప్రదాయాలు నేను నేర్పాలి” అనేవారు.
శని, ఆదివారాలు పిల్లలతో కలిసి బయటకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళని తీసుకుని రకరకాల ప్రదేశాలకి, పార్కులకి వెళ్ళేవాళ్ళం. ఆయన సెలవు పెట్టినప్పుడు ఆయన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ ఇళ్ళకీ, స్నేహితుల ఇళ్ళకీ వెళ్ళేవాళ్ళం. పిల్లలు వాళ్ళ కజిన్స్‌తో కలిసేటట్లు, ఒకరినొరు తెలుసుకునేటట్లు ఆయన చూసేవారు. అది నాకు నచ్చేది. అవన్నీ నాకు గుర్తుకు వస్తాయి. ఎప్పుడంటే… ప్రతి విషయం మేమిద్దరం కలిసే చెయ్యాలి. పిల్లలకి నేర్పాలి. పిల్లలకి మన సాంప్రదాయాలు నేర్పాలని ఆయన చాలా పట్టుదలగా ఉండేవారు. పిల్లలు ఎంతో కొంత ఇవి పాటిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది.
దేవుడిపై ఆయనకున్న నమ్మకం, పూర్తిగా తనను తాను అర్పించుకోవడం నిజంగా చెప్పుకోదగ్గవి. కానీ నేను అట్లా కాదు. నేను నమ్మితే తప్ప దేనినీ అంగీకరించను.
ఇంకోటి… మానసికంగా ఆధారపడడం గురించి అడుగుతున్నాను. ఆయనమీద మీరు ఎంత ఆధారపడేవారు?
అతన్ని బాధించే విషయం ఏదైనా ఉంటే నాకు చెప్పేవారు. పెద్ద కుటుంబం అవడం వల్ల చాలా విషయాలు జరిగేవి. చాలా ఆటుపోట్లుండేవి. నామీద ఎవరైనా కేకలేసినపుడు నేనాయనకు చెప్పేదాన్ని. ఆయన నన్ను ఓదార్చేవారు. ”బాధపడకు. పెద్ద కుటుంబాల్లో ఇలాంటివన్నీ సహజం. మా అమ్మని చూడు. ఆవిడ ఇలాంటివన్నీ భరించింది. అలా జరుగుతూ ఉంటాయి” అనేవారు. ఇదంతా నాకు సాంత్వననిచ్చేది. కొన్నిసార్లు ఆఫీసులో విషయాలకి ఆయన చాలా కుంగిపోయేవారు. అప్పుడొచ్చి నాతో మాట్లాడేవారు. ఆయనకి చాలా కోపం వచ్చేది. ఆయనకి తొందరగా కోపం వచ్చేది. దానివల్లే ఆయనకి దృష్టిలోపం వచ్చింది. ఆయనకి తీవ్రమైన రక్తపోటు, ముక్కోపం
ఉండేవి. కానీ మేము విషయాల గురించి చర్చించుకునేవాళ్ళం. నా మనసులో ఉన్నదంతా చెప్పేదాన్ని. ఆయనకి ఏదైనా నచ్చనప్పుడు నాతో మాట్లాడేవారు. అలా ఉండడం నాకు చాలా మేలు చేసింది. ఆయన ”నేను చెయ్యలేను అని అనొద్దు. నువ్వు ప్రయత్నం చెయ్యాలి. నా వల్ల కాదు అని ఎప్పుడూ అనొద్దు” అని అనేవారు.
మాకు భేదాభిప్రాయాలు వచ్చేవి. కానీ అవి నిమిషాల్లోనో, గంటల్లోనో సమసిపోయేవి. మాకు ఒకరిపై ఒకరికి గల నమ్మకం ఈ భేదాభిప్రాయాలు అధిగమించడానికి తోడ్పడేది. ఇద్దరం విలాసవంతమైన జీవితం కోరుకోలేదు. వయస్సులో ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు కోపగించుకునేవాళ్ళం. స్వాభిమానాలు వగైరా వాటికి సంబంధించిన విషయాలు మా మధ్య ఉండేవి. కానీ ఒకరిపై ఒకరికి గల గౌరవమూ, ప్రేమల వల్ల అవి తగ్గాయి.
ఆయన పూజలు చేసేవారని చెప్పాను కదా! బాగా బలహీనంగా ఉన్నప్పుడు కూడా పూజ మానలేదు. చివరి రోజు కూడా చేశారు. ఎంత ఓపిక లేకపోయినా ప్రార్థన చేసేవారు. నేను చెయ్యలేను అని ఎప్పుడూ అనలేదు. ఎంత చెయ్యగలిగితే అంత చేసేవారు. అది ఆయన దగ్గర్నుంచే నేర్చుకున్నాను. ఆ సంకల్ప బలం ఉండాలి. దాని మూలంగానే వాళ్ళందరూ జీవితంలో పైకొచ్చారు. వాళ్ళు, చాలా మంది చుట్టాల దగ్గర ఉండాల్సి వచ్చినా, అవమానాలు పడాల్సి వచ్చినా గానీ చివరికి జీవితంలో పైకొచ్చారు.
అంటే మీరిద్దరూ భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చారు. అవునా? ఆయన చాలా కష్టాలు పడి పైకొచ్చారు. మీరు భద్రమైన, వడ్డించిన విస్తరి లాంటి జీవితం నుంచి వచ్చారు.
అవును. చాలా భద్రమైన, రక్షణతో కూడిన మంచి నేపథ్యం. నేనెప్పుడూ విలాసవంతమైన, గొప్ప కుటుంబంలోకి అడుగు పెట్టాలని కోరుకోలేదు. నేను చాలా సామాన్యురాలిని. సాదాసీదాగా పెరిగాను. మా నాన్న కూడా కష్టపడి పైకొచ్చారు. ప్రేమ, అభిమానాలుండే కుటుంబంలోకి అడుగుపెట్టాలనుకున్నాను. నిజానికి, మా పెళ్ళయినప్పుడు మా అత్తగారింట్లో తెలుగు మాట్లాడేవారు. మేము శుద్ధ తమిళంలో మాట్లాడేవాళ్ళం. ఆ కుటుంబంలోకి వెళ్ళడం నీకు కష్టమనిపించలేదా అని అందరూ అడిగారు.
నేపథ్యంలో భేదం మీకెలాగనిపించింది?
కష్టం కాలేదు. నా అదృష్టంకొద్దీ వాళ్ళంతా నన్నిష్టపడేవారు. ప్రేమాభిమానాలు చూపేవారు. నాకు పెద్ద తేడా అనిపించలేదు. చిన్నప్పుడే తల్లిని కోల్పోవడంతో మొదట్నుంచీ ఒంటరిగా ఉన్నాను. మనుషుల కోసం, స్నేహితుల కోసం అర్రులు సాచాను. చాలా కట్టుబాట్లలో పెరిగాను. పెళ్ళయిన తర్వాతే నాలుగు చోట్లకి వెళ్ళడం, నలుగుర్ని కలవడం జరిగింది. పార్ధసారధి క్రమశిక్షణ అమలు పరిచినా గానీ చాలా విషయాల్లో ఆయనకు సర్దుబాటు తత్వం, సాయం చేసే గుణం ఉండేవి. నా భావాలని గౌరవించేవారు. చాలా పెద్ద కుటుంబంలోకి అడుగుపెట్టాను. అది నాకు చాలా నేర్పింది. మా అత్తగారు, మా వారి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు నన్నిష్టపడేవారు. చాలా చాలా ప్రేమాభిమానాలు చూపేవారు. వారికి నేనంటే గౌరవం. కష్టపడి పైకి రావడం వల్ల వాళ్ళకి జీవితం విలువ బాగా తెలుసు. నేను కరువు వాచిన ప్రేమాభిమానాలు మా అత్తగారు ఇచ్చారు. ఆవిడ నాకు అమ్మలాగే ఉండేది.
జాబ్ చెయ్యకపోవడమే కాకుండా, పెద్ద కుటుంబంలోకి వెళ్ళడం వల్ల మీరు చెయ్యాలనుకొని చెయ్యలేకపోయినవి ఏమిటి?
(నవ్వు) నాకు బయటకు వెళ్ళి చాలా ప్రదేశాలు చూడాలని ఉండేది. మా నాన్న చాలా చోట్లకి తీసుకువెళ్ళేవారు. ఆ రోజుల్లో నేను కారు నడపాలనుకునేదాన్ని. మా నాన్న ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో ఆడవారు కారు నడపడం ఒప్పుకునేవారు కాదు. ఇంట్లో రెండు, మూడు కార్లున్నా గానీ నన్ను నేర్చుకోనివ్వలేదు. తరువాత మా ఆయన నేర్చుకోమని చెప్పారు. అప్పుడు నేర్చుకున్నాను. ఒక టైములో డ్రైవరు లేకపోవడం వల్ల ఆయనే కారేసుకుని వెళ్ళిపోయేవారు. అందుకని నేను నేర్చుకున్నది ఉపయోగించలేకపోయాను. ఇలాగే చిన్న, చిన్న విషయాలు… జాబ్ చెయ్యడం, జనాలకి ఉపయోగపడడం తప్ప నాకు పెద్దగా కోరికలు లేవు. నాకు మనుషులతో, స్నేహితులతో కలవడం ఇష్టం. ఇప్పుడు కూడా స్కూలు స్నేహితులతో కలుస్తూ ఉంటాను. స్కూలు స్నేహితులు, కాలేజి స్నేహితులు కలుస్తూనే ఉంటారు.
మీ వైవాహిక జీవితంలో మీ యవ్వనంలో, మధ్య వయస్సులో స్నేహితులతో స్నేహం కొనసాగించడానికి సమయం, వీలు
ఉండేవా?
అవును! ఉండేవి. చాలా కాలం మేము మద్రాసులో ఉన్నాం. అప్పుడు ఉత్తరాలు రాసుకునేవాళ్ళం. నాకు ఉత్తరాలు రాయడం ఇష్టం. తంజావూరులో, నా చిన్నప్పుడు ఉత్తరాలు ఎలా రాయాలో నేర్పేవారు. ఇప్పటికీ మర్చిపోలేను. ఉత్తరాలు రాయడం నాకిష్టం. ఇప్పుడు కూడా రాస్తాను. ఈ పరిస్థితుల్లో కూడా ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఉత్తరాలు రాస్తాను. నా ఫ్రెండ్స్‌కి జవాబులు రాయడం బద్ధకం. ఫోన్లో కబుర్లు చెబుతారు. అది ఫరవాలేదు కానీ నేను వాళ్ళని ఉత్తరాలు కూడా రాయమంటాను. మా అమ్మాయికి కూడా నేను రాస్తాను. తను జవాబివ్వదు, ఫోన్ చేస్తుంది. మా అబ్బాయి జవాబిస్తాడు. నేను ఉత్తరాలు రాయడం తనకు ఇష్టం, జవాబిస్తాడు.
ఉత్తరాలు రాయడం అనేది మరిచిపోయిన కళ కదా!
ఈ-మెయిల్, టెలిఫోన్ (నవ్వు).. సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి చాలా మార్గాలున్నాయి. కానీ నాకు ఉత్తరాలు రాయడం ఇష్టం. కథలు రాయాలని బలమైన కోరికుండేది. చాలా కథల గురించి ఆలోచనలు వచ్చేవి. కానీ కాగితం మీద పెట్టేలోపు మరిచిపోయేదాన్ని. మేము మద్రాసులో ఉన్నప్పుడు ఒక గొప్ప జ్యోతిష్కుడు మా ఇంటికి వచ్చేవాడు. మమ్మల్ని కొన్ని అంకెలు లేదా పూవులు తలుచుకోమనేవాడు. అవేమిటో ఆయన చెప్పేవాడు. పువ్వు పేర్లు ఎప్పుడూ సరిగానే చెప్పేవాడు. ఆయనకి కొంత శక్తి ఉండేది. మా గతం గురించి చెప్పేవాడు. మా ఆయనకంటే నేను ముందుగా పోతానని చెప్పినట్లు గుర్తు. అట్లాగే జరుగుతుందనే ఫీలింగ్ నా మనసులో ఎప్పుడూ ఉండేది. కానీ మా ఆయన ”నీకు తెలీకుండానే ఒకరోజు పోతాను” అనేవారు. ”లేదు లేదు మీకంటే ముందు నేనే పోతానని నాకు గట్టి నమ్మకం” అనేదాన్ని. అందుకని ఆయన హఠాత్తుగా పోవడం నాకు పెద్ద షాక్. తేరుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు సమాధానపడ్డాను. బాగానే
ఉన్నాను.
మీ వారిని చివరిదాకా జాగ్రత్తగా చూసుకోవటం మీకు బాగా అనిపించింది కదూ?
అవును. నాకనిపించింది. నేను లేకపోవడం వల్ల ఆయన బాధపడకూడదనుకునేదాన్ని. అప్పటికే ఆయనకు చాలా ఆపరేషన్లు జరిగాయి. ఇకనైనా సుఖంగా ఉండాలి. ఆయనకి సేవలు చేసి తర్వాతే నేను పోవాలనే కోరిక నాకు ఎప్పుడూ కలుగుతూ
ఉండేది. అలాగే జరిగింది కూడా. అది భగవదేచ్ఛ. నా మనసు సమాధానపడింది. ప్రతి క్షణం ఆయన్ని జాగ్రత్తగా చూసుకునేదాన్ని. నా గురించి మరచిపోయాను. నా గురించి నేనెప్పుడూ పట్టించుకోలేదు. అప్పటికి నా కంటి సమస్య మొదలవుతోంది. కానీ నేనది కాటరాక్ట్ అనుకున్నాను. దాని గురించి పట్టించుకోలేదు. బాగా ఎక్కువైనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే, గ్లకోమా అని తెలిసింది. దాదాపు 60 శాతం చూపు కోల్పోయాను. ఉన్న కొద్దిపాటి చూపు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతి మూడు నెలలకీ చెకప్‌కి వెళ్తాను. ఒక విధంగా చెప్పాలంటే, ఆ జబ్బు నన్ను బాధపెట్టకుండా, సంతోషంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నా జీవితం తృప్తిగా ఉంది. నేనిప్పుడు స్వతంత్రురాలిని. నా పిల్లలు నా కార్యలాపాల్లో కలగజేసుకోరు. నేను కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఆ విధంగా వాళ్ళకీ సంతోషం. పిల్ల్లలిద్దరూ నన్ను జాగ్రత్తగా చూసుకుంటారు. ఇప్పటిదాకా ఎటువంటి సమస్య లేదు.
ఆయన పోయిన తరువాత మీరు బాగానే కోలుకున్నారు. కానీ మళ్ళీ జీవించడం నేర్చుకుంటున్నారా?
అవును. అలాగే అనుకోవచ్చు. ఇప్పుడు కేవలం నా గురించి మాత్రమే నేను శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు నన్ను బానే చూసుకుంటారు. నా చూపు గురించి నేను శ్రద్ధ తీసుకుంటాను. జీవితాంతం చూపు నిలిచేటట్లు జాగ్రత్త తీసుకుంటాను. ఉన్న కొంచెం చూపును ఎలాగైనా కాపాడుకోవాలి.
కొంతమంది జీవితం వెళ్ళబుచ్చుతారు. కొంతమంది వాళ్ళకిష్టమైనది చేస్తూ మళ్ళీ జీవించడం నేర్చుకుంటారు.
నాకు జీవితం రోజులు గడపడమే. మళ్ళీ జీవించాలని లేదు. నాకిష్టం లేదు.
మీరు మార్గాలు వెతుక్కోవాలి. చావు కోసం ఎదురుచూస్తూ గడపలేరు. ఆ విధంగా మీరు మళ్ళీ జీవించడానికి మార్గాలు దొరకవచ్చు.
అవుననుకోండి! మా కోడలికి సహాయపడుతూ, చిన్న చిన్న పనులతో నన్న నేను బిజీగా ఉంచుకుంటాను. ఆమె పని చేసుకొని
ఉద్యోగానికి వెళ్ళిన తరువాత, నేను మిగిలిన పనులు చేస్తాను. ఆమె వదిలిన కొంచెం పని పూర్తి చేస్తాను. కొద్దిగా చదువుతున్నాను. ఇదివరకు తోటపని చేసేదాన్ని. ఇప్పుడు చెయ్యలేను. ఇదివరకు నేను బయటికి వెళ్ళేదాన్ని. సాయం చేసేదాన్ని. షాపింగ్ చేసేదాన్ని. ఇప్పుడు అన్నీ ఆపేశాను.
ఇంటి లోపల తిరుగుతూ చిన్న, చిన్న పనులు చెయ్యగలను. చదవటం, టి.వి చూడడం చేస్తాను. ఇక్కడ కానీ, బెంగుళూరులో మా అమ్మాయి గీత ఇంట్లో కానీ, నెనెక్కడుంటే అక్కడ సాయం చేస్తాను.
బంధువులింటికి వెళ్ళినా వాళ్ళ ఇంటి పనుల్లో సాయం చేయడానికి ప్రయత్నిస్తాను. పూలు కోసి మాలలు కడతాను. పూజ చేస్తాను. చిన్న చిన్న పనుల్లో సాయపడతాను. నా సమయం గడుపుతాను. కూర్చుని లేనిదాని గురించి ఆలోచించను. నన్ను నేను బిజీగా ఉంచుకుంటాను. చదవడం, రాయడం… రాయాలని ఉంది.
ఎప్పుడైనా డైరీ రాసేవారా?
ఇదివరకు రాసేదాన్ని. నా చిన్నప్పుడు చాలా రాసేదాన్ని. అవన్నీ విసిరేశాను (నవ్వు).
విలాసవంతం కాకపోయినా, మాది సుఖమయమైన జీవితం. జీవితంలో ఎక్కువ కాదు… కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. నెమ్మదైనా, సాఫీగా సాగిన జీవితం. పిల్లలతో చాలా సంతోషకరమైన జీవితం. సమాజానికి ఏదైనా చెయ్యాలనే కాంక్ష తప్ప, ఇప్పటిదాకా నాకు దేనికీ విచారం లేదు. ఆయనకి అదే చెప్పేదాన్ని. ఆయన ఇంటి దగ్గర్నుంచి ఏదైనా చెయ్యగలిగితే చెయ్యమనేవారు. నాకు వీలవలేదు. నా తోటి కోడలి భర్త లెప్రసీ రిహాబిలిటేషన్ సెంటర్లో పనిచేసేవాడు కాబట్టి, ఆమె అక్కడ చాలా పనులు చెయ్యగలిగేది. అతను ఆ ఫీల్డ్‌లో ఉండబట్టి, వాళ్ళందరూ హాస్పిటల్‌తో సంబంధం ఉండి అక్కడే పని చేసేవారు. అందుకనే ఆమె ఉపయోగపడే పని చేయగలిగింది.
మా వారు, నేను కలిసి పుస్తకాలు చదవడం నేనెప్పటికీ మర్చిపోను. శనివారం ఉదయం ఆయన పోయారు. ఆ ముందు రోజు శుక్రవారం సాయంత్రం కూడా మేము కలిసి చదివాం. ఆ రోజు పాదుకా పట్టాభిషేకం కలిసి చదవడం ఎప్పటికీ మర్చిపోలేను. నాతో మంచిగానే ఉండేవారు. కానీ బాగా కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేసేవారు. ప్రతివాళ్ళకీ ఏవో లోపాలుంటూనే ఉంటాయి. నాక్కూడా కొన్ని ఉన్నాయి. ఇది తెలుసుకోవడం వల్ల సర్దుకుపోవడం నాకు తేలికైంది. చిన్నప్పుడు నేను చాలామంది మనుషులని చూశాను. నా కుటుంబం నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. ఇవి నాకు సాయపడ్డాయి. ప్రతివారి వ్యక్తిత్వంలోనూ కొన్ని వ్యతిరేక లక్షణాలు ఉంటాయి.
ఇప్పుడు ఈ జీవితంతో సమాధానపడి, సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాను. వీలైనంత ఉత్సాహంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాను. అంతే….
ఇప్పుడు మానసికంగా దృఢంగా ఉన్నాననుకుంటున్నారా?
అవును. నేనెప్పుడూ ఆయనతోనే ఉన్నాను. ఆయన వెనకాలే ఉన్నాను. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆయనతోనే ఉండేదాన్ని. ఇంటికి వచ్చేదాన్ని కాదు. అపోలోలో ఆయనతో ఉండేదాన్ని. పెట్టె సర్దుకుని ఆయనతో వెళ్ళేదాన్ని. ఆయనకి అలా చెయ్యగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేనిప్పుడు ఒక్కదాన్నే స్వతంత్రంగా కొంతవరకు చేసుకోగలను. ఎల్.వి.ప్రసాద్ కంటి హాస్పిటల్‌కు నాకు నేనే వెళ్ళగలను. అదంతా నేను చెయ్యగలను. నేను పనులు చేయగలను అని అనుకోవాలని ఆయన నేర్పించారు. అందుకని నాకిప్పుడు ఒక రకంగా బలంగా అనిపిస్తుంది. ఇవన్నీ నాకెప్పుడూ గుర్తుకు వస్తూ ఉంటాయి. దేనికీ భయం వెయ్యదు.
ఆయన వల్ల మీరనుభవించిన భయం గురించి చెప్పండి. ఏమవుతుందోనని మీరు భయపడేవారు. అది జరిగిన తరువాత మీరు భయపడడానికి ఏమీ మిగల్లేదు.
అది ఎప్పుడూ ఉంది. సున్నితమైన ఆరోగ్యం వల్ల ఆయన పూర్తిగా మంచాన పడకపోయినా చాలా సుస్తీగా ఉండేవారు. ఆ భయం ఎప్పుడూ ఉండేది. దాని ప్రభావం నామీద ఉండి ఉండొచ్చు. నాకు కాళ్ళ నొప్పులు, తలనొప్పులు… అన్ని రకాల బాధలూ ఉండేవి. ఇప్పుడు అది అయిపోయింది. నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నా స్వంత సమయం ఎక్కువ లభించింది. ఎంత కాలం ఇట్లా ఉంటుందో చూద్దాం. అదే ఆత్మస్థైర్యం. నా చూపు పోతూ ఉండడం వల్ల ఆ స్థైర్యం కూడా తగ్గిపోతోంది.
ఆయనకి సంగీతం అంటే ఇష్టమా?
అవును. నేను సంగీతం పాడడం, వీణ వాయించడం నేర్చుకున్నాను. కానీ వాళ్ళ కుటుంబంలో సంగీతానికెప్పుడూ ప్రోత్సాహం లేదు. అందుచేత నేను కొనసాగించలేకపోయాను. అది తప్ప వేరే సమస్య లేదు.
ఇప్పుడెలా ఉంది?
మా ఇద్దరి సాన్నిహిత్యం (విషయాలు పంచుకోవడం) నేను కోల్పోయాను. అదింక లేదు. ఇప్పుడు పంచుకోలేను. మా పిల్లలతో పంచుకోవచ్చు కానీ, భర్తతో పంచుకోవడానికీ, దీనికీ తేడా ఉంటుంది. నాకేదనిపిస్తే అది ఆయనతో పంచుకునేదాన్ని. అదిప్పుడు కోల్పోయాను.
ఇతర స్త్రీలు కూడా అదే అన్నారు…
ప్రకాష్ పెళ్ళయినప్పుడు నేను వాళ్ళకి దూరంగా ఉందామనుకున్నాను. ”వాళ్ళ జీవితం వాళ్ళకి ఉండాలి. వాళ్ళక్కడ
ఉండాలి. మనం వచ్చెయ్యడం బాగుంటుంది” అని మా వారితో అన్నాను.
కానీ ఆయన అందరూ కలిసే ఉండాలన్నారు. దాన్ని చాలా నొక్కి చెప్పారు. ”వాళ్ళను వదిలి మనం వెళ్ళిపోకూడదు. వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళనీ. మనం వాళ్ళని విడిగా ఉండమని చెప్పకూడదు” అన్నారు. మా అబ్బాయికి ఇష్టం లేదు. అతను మాతోనే
ఉండాలనుకున్నాడు. తన తల్లిదండ్రులు తమతోనే ఉండాలనుకున్నాడు. అతను చాలా ప్రేమాభిమానాలు ఉన్న వ్యక్తి..
మీరు పెద్ద కుటుంబంలోకి అడుగు పెట్టాలని కోరుకున్నారు కదా. మీ అబ్బాయి విషయంలో అలా ఎందుకనుకున్నారు?
ఆ కాలం వేరు. ఈ రోజుల్లో పిల్లలు వేరు. వీళ్ళకి స్వేచ్ఛ కావాలి. తీసుకోనివ్వండి. మాకవసరం లేకపోయింది, వీళ్ళని తీసుకోనీ అని అలోచించాను. కానీ మా వారు నొక్కి చెప్పారు. ఆయనకి కోపం ముక్కుమీదే ఉండేది. తననుకున్నది గట్టిగా నొక్కి చెప్పేవారు. కానీ అలాగే దయాగుణం, అర్థం చేసుకునే తత్వం ఉండేవి.
ఆయన పోయిన తర్వాత, నాకు తేరుకోవడానికి రెండు, మూడు నెలలు పట్టింది… విడిపోవడమనే నిజాన్ని అంగీకరించడానికి.
ఏది కష్టమనిపించింది?
ప్రతిదానికీ ఆయన దగ్గరకు వెళ్ళేదాన్ని. నన్ను బాధపెట్టేదేదైనా ఉంటే, వెంటనే ఆయనతో మాట్లాడేదాన్ని. ఆయన పోయిన తర్వాత నేనెవరివైపు చూసేది? నెమ్మదిగా అలవాటు పడ్డాను.
నిశ్శబ్దానికి అలవాటు పడడం చాలా కష్టం.
అవును… నిజమే. కర్మకాండలన్నీ పూర్తయిన తర్వాత, ప్రతివాళ్ళూ వాళ్ళ వాళ్ళ పనులతో బిజీ అయిపోయారు. ఏకాకినై, ఒంటరితనానికి అలవాటు పడ్డాను. దీనికీ నాకు ఐదారు నెలలు పట్టింది. మా అత్తగారు చనిపోయినప్పుడు కూడా ఇలాగే అయింది. అదే జీవితం, పొగొట్టుకోవడానికి అలవాటు పడాలి.
జీవితంలో ఈ అంకం ఎలా అనిపించింది?
నా గురించి నేను ఆలోచించుకోవడానికి ఎక్కువ సమయం దొరికిందనిపించింది. కొన్నిసార్లు ఆ నొప్పి, ఈ నొప్పి అని నా గురించి నేను ఆలోచించుకోవడం సరికాదనిపించింది. ఇదివరకు ఆయన గురించి ఆలోచించేదాన్ని. ఏమైనా ఉన్నా గానీ, నా గురించి నేను ఆలోచించుకోవడం మర్చిపోయేదాన్ని. అదే సరిపోతుందనుకునేదాన్ని. ఆయన గురించి చింత ఎక్కువుండేది. ఇప్పుడు నా ఆరోగ్యం గురించి పట్టించుకోవడానికి సమయం దొరికింది కానీ అది మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు ఏదో ఒకటి చేస్తాను… చదవటం, రాయటం, ఏదో ఒకటి చేస్తూ ఉండడం, శుభ్రం చేయడం, వస్తువులు సర్దడం వగైరా. గతం అంటే ఏమిటి? మంచి జ్ఞాపకాలుంటే చాలు. గడ్డు కాలం గురించి జ్ఞాపకాలు పక్కకు పెట్టి మర్చిపోవాలి. మంచి విషయాలే గుర్తుంచుకోవాలి. నా సమయం అలాగే గడుపుతాను. చదవడానికి, రాయడానికి, నా గురించి ఆలోచించడానికీ ఎక్కువ టైమ్ దొరికినా గానీ నాకు ఆయన లేని లోటు తెలుస్తోంది.
మీ జీవితంలో 90 శాతం ఒక వ్యక్తి చుట్టూ అల్లుకున్నప్పుడు, ఆ వ్యక్తి పోతే ఈ జీవితాంకములో ఏం చెయ్యాలో తెలీదు.
అవును. మీరు బయటికి వెళ్ళి పనిచేస్తూ, నలుగురితో కలుస్తారు. ఇంట్లో గడిపే సమయం తక్కువ. ప్రేమలుండొచ్చు గానీ మీకు సమయం ఉండదు. మా తరంలో ఇంట్లో గడిపే సమయం ఎక్కువ. బయటకు వెళ్ళి పని చేస్తుంటే ఇదంతా మరచిపోవచ్చు. ఒక సంవత్సరం నేనేమి చేసినా గానీ, ప్రతీ క్షణం ఆయనే గుర్తొచ్చేవారు.
‘తడి ఆరని గాయాలు’ పుస్తకం నుండి…