”ఈ రోజు నేను పదకొండు అరటి పండ్లు తిన్నాను, దారి పొడుగునా జనం ఇస్తూ ఉంటే…” అన్నాడు అరోన్ బేకర్ అనే ఉపాధ్యాయుడు దీర్ఘ యాత్ర (మార్చ్)లో నడుస్తూ. ఆయన 8వ గ్రేడ్ పిల్లలకు అమెరికా చరిత్ర బోధిస్తాడు. ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్న వారిలో ఆయనా ఒకరు.
”వానలు, మంచు, భూకంపాలు, ఉరుములు ఏవీ మమ్మల్ని ఆపలేవు. చలి వానలో గడ్డకట్టుకుపోతున్నా, బొబ్బలెక్కి పాదాల్లోంచి నెత్తురు చిమ్ముతున్నా మా మార్చ్ ఆగదు” అని నినదిస్తూ 110 మైళ్ళ మార్చ్ నిర్వహించారు ఓక్లాహోమా రాష్ట్రంలోని పబ్లిక్ స్కూల్ టీచర్లు.
పబ్లిక్ స్కూళ్ళకు నిధులు పెంచాలని, ఏప్రిల్ 6 నుంచి వారం రోజులపాటు 150 మంది టీచర్లు తుల్సా అనే పట్నం నుంచి ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఓక్లాహోమా దాకా మార్చ్ నిర్వహిస్తే వారికి అన్న పానీయాలు, సాక్సులు, షూస్, చలికోట్లు అందిస్తూ ”మేం ఉన్నాం మీ వెంట” అంటూ వేలాదిమంది ప్రజలు ఎర్ర టీ షర్టులు ధరించి వీరితోపాటు నడిచారు.
మార్చ్ ఓక్లాహోమా సిటీ చేరుకోగానే, వారిని వేలాదిమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలుసుకున్నారు. తుల్సా పట్టణం స్కూల్ సూపరింటెండెంట్ డెబొర గిస్ట్ మార్చ్‌కు ఎదురెళ్ళి ”ఐ లవ్ యూ ఆల్” అంటూ కన్నీళ్ళ పర్యంతం అయ్యారు. ఆమె కన్నీళ్ళు తుడుచుకుంటూ ”ఇది ర్యాలీ కాదు, ఇది నిరసన కాదు, ఇది ఉద్యమం. సంఘటనలతోనే ఉద్యమాలు తయారవుతాయి. ఇది కేవలం ఒక సంఘటన కాదు. గొప్ప ఉద్యమంలో భాగం” అన్నారు. ఆమె ఆ వారం రోజులు తుల్సా కౌంటీ (జిల్లా)లో స్కూళ్ళని మూసివేస్తున్నట్లు ప్రకటించడమే కాక రాష్ట్రంలోని అన్ని కౌంటీల సూపరింటెండెంట్లకు తమ పరిధుల్లోని స్కూళ్ళను మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక పక్క మార్చ్ సాగుతుండగా ఓక్లాహోమా రాష్ట్రమంతటా 45 వేలమంది టీచర్లు వారం రోజుల పాటు సమ్మెలో పాల్గొన్నారు. ప్రతి చిన్న, పెద్ద పట్టణాల్లో ఎర్ర టీ షర్టులు ధరించి ఊరేగింపులు నిర్వహించారు. రోడ్లన్నీ ఎర్రసముద్రం ముంచెత్తినట్లు తలపించాయి.
”మా జీతాల పెంపు కోసం మాత్రమే కాదు, స్కూళ్ళ నిర్వహణకు తరుగుతున్న నిధుల వల్ల పెరుగుతున్న సమస్యల పరిష్కారం కోసం కూడా మేము ఆందోళన చేస్తున్నాం” అని టీచర్లు ప్రకటించారు. పబ్లిక్ స్కూళ్ళలో టీచర్ల కొరత ఉన్నా నియామకాలు జరగడం లేదు. 2008లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా టీచర్ల జీతాలు, స్కూళ్ళ నిధులు 15-20 శాతం తగ్గించారు. పరిస్థితులు చక్కబడినా 2015 నుంచి ఎలాంటి పెరుగుదల లేకపోగా, మరిన్ని కోతలు విధించారు. మరోపక్క ధనవంతులకు భారీ ఎత్తున పన్నులు తగ్గించారు. ధనవంతుల పన్నులు తగ్గించడమంటే స్కూళ్ళకు నిధులు తగ్గించడమే. పన్నుల వసూళ్ళలో 50% పబ్లిక్ స్కూళ్ళ నిర్వహణ, టీచర్ల జీతాలు, పెన్షన్ల కోసం ఉపయోగిస్తారు. ధనవంతుల పన్నులు తగ్గించడమంటే నేరుగా పబ్లిక్ స్కూళ్ళను ఎండబెట్టడమే. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసింది సరిగ్గా అదే. ఇదే సమయంలో అమెరికాలో ప్రైవేటు స్కూళ్ళు వృద్ధి చెందడం కాకతాళీయం కాదు, ఉద్దేశ్యపూర్వకం.
అమెరికాలో అత్యధికంగా పబ్లిక్ స్కూళ్ళే ఉన్నాయి. వీటిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ, పిల్లల మీద ఫీజుల భారం ఉండదు. ఇప్పుడు పబ్లిక్ స్కూళ్ళను మూసివేసి ఖరీదైన ప్రైవేటు స్కూళ్ళను పెంచడానికి ఇదొక ‘పన్నాగం’ అనే అనుమానం బలపడుతోంది.
ట్రంప్‌ను గెలిపించిన రాష్ట్రాల్లోనే టీచర్ల సమ్మెలు పెద్ద ఎత్తున జరగడం మరొక గమనార్హ విషయం.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు, పడమరల్లో డెమొక్రటిక్ పార్టీకి పట్టు ఉండడంతో వాటిని బ్లూ స్టేట్స్ అని, దక్షిణాదిన, మధ్య అమెరికాలో రిపబ్లిక్ పార్టీకి పట్టు ఉన్న వాటిని రెడ్ స్టేట్స్ అనడం వాడుక. డోనాల్డ్ ట్రంప్‌ను గెలిపించిన ‘ఎర్ర’ రాష్ట్రాల్లోని టీచర్లు వేలాదిమంది ఎర్ర చొక్కాలు వేసుకుని ఊరేగింపులు, సమ్మెలు, ప్రదర్శనలు, పాదయాత్రలు (మార్చ్) చేస్తున్నారు. గత మూడు నెలల్లో ఆరు రాష్ట్రాల్ని టీచర్ల ఊరేగింపులు ఎర్ర సముద్రాల్లా ముంచెత్తాయి. సమ్మెలు మరిన్ని దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించే సూచనలున్నాయి.
అమెరికా పబ్లిక్ స్కూల్ టీచర్లలో అత్యధికంగా (77%) స్త్రీలే పనిచేస్తున్నారు. ”ఇది స్త్రీల రంగం. కనుకనే వేతనాలు తక్కువగా ఉన్నాయ”ని అంటారు కెంటకీ స్టేట్ రిప్రజెంటేటివ్ అటికా స్కాట్. ఈమె కెంటకీ రాష్ట్రం జనరల్ అసెంబ్లీలో ఉన్న ఒకే ఒక్క ఆఫ్రికన్-అమెరికన్. ”టీచర్ల ఉద్యమాన్ని స్త్రీలే నాయకత్వం వహించి నడుపుతున్నారు. టీచర్లలో స్త్రీల సంఖ్యే ఎక్కువ. స్త్రీలు అత్యధికంగా పనిచేసే రంగమంటే రాజకీయ నాయకులకు చులకన. అందుకే టీచర్ల వేతనాలు తగ్గించడమే కాక, స్కూళ్ళకు కేటాయించాల్సిన నిధులను కూడా గణనీయంగా తగ్గించారు. చట్టసభల్లో స్త్రీల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చట్టసభలను స్త్రీలు ఆక్రమించాలి” అంటారు ఆమె.
పబ్లిక్ స్కూల్‌లోని ఒక్కో క్లాస్‌రూంలో 10-20 మించకుండా విద్యార్థులుండాలి. ఒక్కో గ్రేడ్‌లో విద్యార్థుల సంఖ్యను బట్టి క్లాస్ రూములుంటాయి. (ఇండియాలో ఒక్కో తరగతిని కొన్ని సెక్షన్లుగా విభజించినట్లు అమెరికాలో ఒక్కో గ్రేడ్‌ను క్లాసులుగా విభజిస్తారు). చాలా రాష్ట్రాల్లో గత పదేళ్ళుగా టీచర్ల నియామకాలు జరగకపోవడంతో 40-45 మంది విద్యార్థులుండే పెద్ద క్లాస్ రూంలు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారంలో నాలుగు రోజులు మాత్రమే స్కూల్ పనిచేస్తోంది. కొన్ని స్కూళ్ళలో నర్సుల నియామకం లేదు. మరికొన్ని స్కూళ్ళలో ఆర్ట్ టీచర్లు, సెకండ్ లాంగ్వేజ్ (స్పానిష్) బోధించే టీచర్లు ఉండడం లేదు. చలికాలంలో కూడా స్కూల్ బిల్డింగులకు హీటర్ సౌకర్యాలు లేకపోవడం, బాత్‌రూమ్‌లో పేపర్ లేకపోవడం వంటి సమస్యలతో పాటు పుస్తకాలు కొనలేకపోవడం వల్ల టీచర్లు పాత పుస్తకాలను సేకరించి విద్యార్థులకు పంచుతున్నారు. పెన్సిళ్ళు, పేపర్లు టీచర్లే తమ డబ్బుతో కొని తమ క్లాస్ విద్యార్థులకు ఇస్తున్నారు. అమెరికాలోని పబ్లిక్ స్కూళ్ళకు హీటర్, ఏసీ సౌకర్యాలతో కూడిన విశాలమైన స్కూల్ భవనం, మ్యూజిక్, ఆర్ట్ టీచర్లు, వారికి ప్రత్యేకమైన క్లాస్ రూమ్‌లు (పిల్లలకు డ్రాయింగ్ పేపర్లు, కలర్స్ స్కూల్ నుంచే ఉచితంగా ఇవ్వడం రివాజు), రెండు, మూడు భాషలు బోధించే టీచర్లు, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న నర్సు, కొన్ని ఫస్ట్ ఎయిడ్ మందులతో పాటు రెండు, మూడు బెడ్స్ ఉన్న ఒక డిస్పెన్సరీ రూం, ఆటల టీచర్లు, లైబ్రరీ, లైబ్రేరియన్‌లు ఉంటారు, ఉండాలి. విద్యార్థులు ఇంటినుంచి పుస్తకాలు మోసుకుని వెళ్ళక్కర్లేదు. వర్క్ బుక్‌లు, పెన్సిళ్ళు, రబ్బర్లు, షార్ప్‌నర్లు క్లాస్ రూంలో ఉన్నంతవరకు స్కూలువే ఉపయోగించుకుంటారు (ఇదంతా ఎలిమెంటరీ స్కూల్స్ గురించి మాత్రమే).
చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో టీచర్ల జీతాలు ఏడాదికి 30-45 వేల డాలర్లలోపే ఉంటున్నాయి. న్యూయార్క్ స్టేట్‌లో మాత్రమే ఏడాదికి 70-80 వేల డాలర్ల వరకు వేతనాలు ఉంటున్నాయి. టీచర్ల వేతనాలు అత్యధికంగా ఉన్న ఒకే ఒకటి న్యూయార్క్ స్టేట్. రెండో స్థానంలో ఉన్న కాలిఫోర్నియా, మసాచ్యుసెట్స్ రాష్ట్రాల్లో ఏడాదికి 60-70 వేల డాలర్ల వేతనాలున్నాయి. మిగిలిన కొన్ని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో టీచర్ల వేతనాలు 60-50 వేల డాలర్ల వరకు ఉన్నాయి. ఏడాదికి 30-45 వేల డాలర్ల మధ్య జీతాలున్న వాళ్ళు జీవిత అవసరాల కోసం రెండు ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. టీచర్లు తమ సమయాన్నంతా ఒక్క ఉద్యోగానికే పరిమితం చేయకపోతే పేద విద్యార్థులు నష్టపోతారు.
పబ్లిక్ స్కూళ్ళలో అరకొర సౌకర్యాల మధ్య చదువు సరిగ్గా సాగడం లేదని కొందరు టీచర్లే తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుకుంటున్నారు. ”బలమైన వ్యక్తిత్వం పొందేలా పిల్లల్ని తీర్చిదిద్దడం తేలికే కానీ, ధ్వంసమైన మనిషిని బాగుచేయడం కష్టం” అంటాడు ఫ్రెడరిక్ డగ్లస్. రోజురోజుకు కునారిల్లుతున్న పబ్లిక్ స్కూళ్ళ వల్ల పిల్లలు ఎలా తయారవుతారోనన్న భయం కూడా ఇప్పుడు టీచర్లకు పట్టుకుంది. ”పిల్లలంటే భవిష్యత్తు. ఈ రాష్ట్రం భవిష్యత్తు, ఈ దేశం భవిష్యత్తు. మా విద్యార్థులకు ఇన్నాళ్ళూ తన కోసం తాను నిలబడాలని చెప్పాం. కానీ ఇప్పుడు మా వంతు వచ్చింది. మా కోసం మేము నిలబడడమే కాకుండా, మా విద్యార్థుల కోసం కూడా మేము నిలబడాల్సిన పరిస్థితులు తోసుకొచ్చాయి” అంటున్నారు టీచర్లు.
”విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను చూస్తూ ఎన్నాళ్ళు మౌనంగా ఉండాలి? అపరాధభావంతో గుండె పగిలిపోతోంది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? మేము కాకపోతే ఇంకెవరు? అనే ప్రశ్న ఎదురైంది నాకు. క్లాస్ రూం వదిలి పికెట్ లైన్‌లో నిలుచున్నాను” అని ‘ఎడ్యుకేషన్ వీక్’లో రాసింది వెస్ట్ వర్జీనియా టీచర్ టోనో ఎం.పోలింగ్. ఈమె వెస్ట్ వర్జీనియా టీచర్ ఆఫ్ ది ఇయర్-2017గా ఎంపికైన అధ్యాపకురాలు.
టీచర్ల సమ్మె మొదట ఫిబ్రవరి 22న వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలో రాజుకుంది. యూనియన్ల ద్వారా సంఘటితమై సమ్మెకు దిగలేదు టీచర్లు. ఆరు రాష్ట్రాల్లోనూ సమ్మెలు టీచర్ యూనియన్ల ద్వారా, అంటే పై నుంచి దిగుమతి కాలేదు. టీచర్లు సంఘటితమైన తర్వాత, తమ ఉనికి కోసం తప్పనిసరై యూనియన్లు కలిసి వచ్చాయి. ఒక రకంగా కింది నుంచి వచ్చిన చొరవ పైకి పాకింది. ప్రపంచవ్యాప్తంగా యూనియన్ల పని ముగిసిందనీ, అవి పూర్తిగా చతికిలపడ్డాయనీ కార్మిక అనుకూల శక్తులు తీవ్ర నిరాశకు, అసంతృప్తికి గురవుతున్న సందర్భంలో జరిగిన ఈ సమ్మెలు అమెరికాలోనే కాదు, ఇతర దేశాలలోని శ్రామికుల
ఉత్సాహాన్నీ, ప్రేరణను అందిస్తాయనడంలో ఆశ్చర్యం లేదు.
వెస్ట్ వర్జీనియాలోని చార్లెస్టోన్ (Charleston) లో 7వ గ్రేడ్‌కు ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న జాయ్ ఓ నీల్, తన సహోద్యోగి ఎమిలి కోమర్‌తో కలిసి 2017 అక్టోబర్‌లో ‘పబ్లిక్ ఎంప్లాయీస్ యునైటెడ్’ అనే ఒక ఫేస్‌బుక్ గ్రూప్‌ను ఏర్పాటు చేశాడు. వెస్ట్ వర్జీనియాలో రెండు ముఖ్యమైన టీచర్ సంఘాలున్నాయి. అవి ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి పనిచేయడమే పనిగా పెట్టుకోవడంతో తీవ్రమైన నిరాశకు గురయిన జాయ్ ఓ నీల్ టీచర్ల యూనియన్ నుంచి బయటికి వచ్చి ఫేస్‌బుక్ గ్రూప్‌ను ప్రారంభించాడు. జనవరికల్లా 20 వేల మంది సభ్యులుగా చేరడంతో ఇది టీచర్లకు ముఖ్యమైన హబ్‌గా మారిపోయింది. టీచర్లు పాఠశాలలు వదిలాక విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి పాఠశాలల్లో నిధుల కొరత వల్ల ఏర్పడిన సమస్యలను వివరించడం మొదలుపెట్టారు. వారి నుంచి మంచి స్పందన లభించడంతో చాలా త్వరగా రాష్ట్రమంతటా ప్రభుత్వ పాఠశాలల టీచర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ సమయలో రెండు యూనియన్లు ఐక్యంగా రంగప్రవేశం చేశాయి. అలా సమ్మె పుట్టుకొచ్చింది. సర్వసాధారణంగా యూనియన్లు సమస్యలపై శ్రామికుల్ని సంఘటితం చేసి సమ్మె చేయాలని, ఏ ఏ డిమాండ్లతో ఎలా పోరాడాల్సిందనేది ఆదేశాలిస్తాయి. కానీ టీచర్లు తమకు తామే సంఘటితమై యూనియన్లకు ఆదేశాలిచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల టీచర్లు సమ్మె చేయడం చట్ట విరుద్ధం. కానీ సమస్యలు వారిని సమ్మెకు ఉరిగొల్పాయి. సంఘటితంగా పోరాడితే విజయం సాధించవచ్చని పట్టుదలగా సమ్మెకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 55 కౌంటీస్ (జిల్లాలు) లోని 680 ప్రభుత్వ పాఠశాలల్లోని 20 వేలమంది టీచర్లు ఎర్రని షర్టులు ధరించి, తొమ్మిది రోజులపాటు సమ్మెను కొనసాగించి, వేతనంలో 5% పెంపును, స్కూళ్ళకు నిధుల పెంపును సాధించుకున్నారు. వెస్ట్ వర్జీనియా టీచర్ల సమ్మె జరిగిన తీరు, వారు సాధించిన విజయం ఇతర రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు ఒక బ్లూ ప్రింట్‌లాగా ఉపయోగపడడమే కాక వారిలో గొప్ప ఉత్సాహాన్ని నింపింది.
ఓక్లాహోమా రాష్ట్రంలోని టీచర్లు కూడా సోషల్ మీడియా ద్వారానే సంఘటితమయ్యారు. ఈ రాష్ట్రంలో ఏప్రిల్ 6న పబ్లిక్ స్కూల్ టీచర్ల సమ్మెలు మొదలై వారం రోజులు సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల మంది టీచర్లు ఎర్రని టీ షర్టులు ధరించి సమ్మెలో పాల్గొన్నారు. తుల్సా నగరం నుంచి ఓక్లాహోమాకు 110 మైళ్ళు మార్చ్ నిర్వహించి స్కూళ్ళకు నిధులు పెంచుకోవడమే కాకుండా, తమ వేతనాల్లో సగటున ఏడాదికి 6000 డాలర్ల పెంపును సాధించుకున్నారు.
ఓక్లాహోమా టీచర్ల సమ్మె ముగిసిన మర్నాడే, కెంటకీ రాష్ట్రంలోని టీచర్లు రాష్ట్ర రాజధాని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఏప్రిల్ 13న పాఠశాలలను మూసివేసి, ఎర్రని టీ షర్టులు ధరించి ప్రదర్శన నిర్వహించారు. గవర్నర్ వీటోను కాదని, లెజిస్లేచర్లు ఓట్ వేయడం వలన పబ్లిక్ స్కూళ్ళ నిధులు పెరిగాయి. ఆరిజోనా రాష్ట్రంలోని 50 వేల మంది టీచర్లు వారం రోజుల సమ్మె చేయడంతో ఏప్రిల్ 26 నుంచి మే 3 వరకు 110 కౌంటీలలో వెయ్యికి పైగా స్కూళ్ళు మూతపడ్డాయి. రాష్ట్రమంతటా ప్రదర్శనలు, ఊరేగింపులు జరిగాయి. సమ్మె మొదటిరోజునే టీచర్ల జీతాలు 1% పెంచుతానని గవర్నర్ ప్రకటించినా సమ్మె కొనసాగించారు. వేతనాలు 20% పెంచాలని, స్కూళ్ళ నిధుల్ని 1 బిలియన్ డాలర్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఏదో తప్పు జరుగుతోందని తెలుస్తోంది కానీ, ఏం చేయాలో తెలియలేదు వారికి. సమ్మెల కెరటాలు ఒక్కో రాష్ట్రంలో ఎగిసిపడేసరికి వారికి ఆత్మస్థైర్యం వచ్చింది. మార్పు కోసం తామూ సమ్మె చేయాలని ఫేస్‌బుక్ ద్వారా సంఘటితమయ్యారు.
కొలరాడో రాష్ట్రంలో పబ్లిక్ స్కూల్ టీచర్ల సమ్మె రెండున్నర వారాలపాటు ఏప్రిల్ 27 నుంచి మే 12 వరకు సాగింది. పబ్లిక్ స్కూల్ టీచర్ల సమ్మె చట్టవిరుద్ధమని, సమ్మెలో పాల్గొనే టీచర్లకు రోజుకు 5 వేల డాలర్ల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష విధించాలనే బిల్లు ప్రవేశపెట్టారు ఇద్దరు రిపబ్లికన్ స్టేట్ సెనేటర్లు. కానీ సబ్ కమిటీ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించడమే కాక తిరస్కరించింది. 2019లో మళ్ళీ టీచర్లు సమ్మె చేస్తే మళ్ళీ బిల్లును ప్రవేశపెడతానని రిపబ్లికన్ స్టేట్ సెనేటర్ బాబ్ గార్డినర్ బెదిరించాడు. డెమోక్రటిక్ గవర్నర్ పబ్లిక్ స్కూళ్ళ నిధులను ఏడాదికి 150 మిలియన్ డాలర్లకు పెంచుతూ, టీచర్ల వేతనాలను 2% పెంచుతున్నట్లు ప్రకటించారు.
నార్త్ కరోలినా రాష్ట్రంలోని 20 వేలమంది టీచర్లు మూకుమ్మడిగా సెలవు పెట్టి మే 16న రాష్ట్ర రాజధాని నగరమైన ర్యాలీ (=aశ్రీవఱస్త్రష్ట్ర)లో ఎర్ర టీ షర్టులు ధరించి ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల టీచర్లు తమ వేతనాల సమస్యను మాత్రమే కాకుండా ప్రధానంగా పాఠశాలల సమస్యను, విద్యార్థుల సమస్యను ముందుకు తీసుకురావడంతో టీచర్ల సమ్మెలకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. టీచర్లు, ప్రజలు ఉచిత విద్య పొందడం పౌరహక్కుగా భావిస్తున్నారు. న్యాయ నిపుణులు, విద్యారంగంలో పనిచేసే నాయకులు సైతం ప్రభుత్వ పాఠశాలల సమస్యలపై దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.