(గత సంచిక తరువాయి…)
లక్షణాలు, గుణాలే కాదు ప్రదేశాలు కూడా జెండర్‌కి గురవుతాయి. పబ్, ఫుట్‌బాల్, స్టేడియం, వీథి మూల, టీ దుకాణం, పాన్‌షాప్, సినిమా హాలు వంటివన్నీ పురుష ప్రదేశాలవుతాయి. వీటిల్లోకి స్త్రీలు సాధారణంగా పురుషులతో కలిసి వెళతారు. ఒంటరిగా ఇటువంటి ప్రదేశాలలోకి వెళ్ళాల్సి వస్తే ఇబ్బందులలో చిక్కుకోకుండా ఉండాలంటే సాధ్యమైనంత తొందరగా బయటికి వచ్చేయాలి. పురుషుల లాగా ఎట్టి పరిస్థితులలోనూ అక్కడే కాలయాపన చేయకూడదు.
అదేవిధంగా వంటిల్లు లేదా బావి దాదాపుగా స్త్రీల ప్రదేశంగా ఉంటుంది. మహిళలకే పరిమితమైన సామాజిక ప్రదేశం నాకిప్పటి వరకు కనపడలేదు. పనికిగానీ, మనోల్లాసానికి గానీ తమదైన ప్రదేశం ఏదీ స్త్రీలకు లేదు. ఢాకాలో కొంతమంది స్త్రీలు ప్రతివారం కలుసుకునే ఒక ‘అడ్డా’ మొదలుపెట్టారు. పురుషులు కలిసి తిని, తాగి ఆనందించడాన్ని సూచించడానికి సాధారణంగా ‘అడ్డా’ అన్న పదం ఉపయోగిస్తారు. ఈ అడ్డా అన్న పదం పురుష సంబంధమైనది కాబట్టి, స్త్రీలకు గౌరవనీయమైనది కాదు కాబట్టి ఈ పదాన్నిఉపయోగించకూడదని చాలామంది పురుషులు, కొంతమంది స్త్రీలు అభ్యంతరం తెలిపారు. ‘గౌరవనీయులైన’ పురుషులకు సరిపోయే పదాలు, పనులు ‘గౌరవనీయులైన’ స్త్రీలకు మంచివి కావని భావిస్తారు. పితృస్వామ్య తర్కం అలా ఉంటుంది.
కుటుంబంలోని మిగిలినవాళ్ళు చికాకుపరచకుండా ఉండేలా ఇంటిలో సైతం ప్రశాంతంగా ఉండే గది లేదా ప్రదేశం పురుషుడికి కేటాయిస్తారు. ఇంటికి సంబంధించిన వనరులు, వస్తువులు కూడా జెండర్‌కి గురవుతాయని అనేక వర్క్‌షాప్‌లలో నా దృష్టికి తీసుకువచ్చారు. ఉదాహరణకు పెద్ద గ్లాసు, కుర్చీ లేదా మంచం కుటుంబ అధిపతికి కేటాయిస్తారు. శ్రామిక వర్గ ఇళ్ళల్లో సైకిల్, రేడియో, చేతి గడియారం వంటివన్నీ పురుషులకే ఉంటాయి.
భాష కూడా జెండర్‌కి గురి కాలేదా?
అయ్యింది. భాష కూడా పితృస్వామ్యానికి చెందినది, అది జెండర్ వివక్షతను, అసమానతలను ప్రతిబింబిస్తుంది. తరచూ పురుషులకు తమదైన పదజాలం ఉంటుంది. దీన్ని స్త్రీలు అరుదుగా తప్పించి వాడరు. దీనికి స్పష్టమైన ఉదాహరణ బూతు తిట్లు. వీటిని పురుషులు తరచూ ఉపయోగిస్తుంటారు. అయితే స్త్రీలు వీటిని ఉపయోగిస్తే వాటిని ఎప్పుడూ ఉపయోగించే పురుషులు ఏదో జరగకూడనిది జరిగినట్లు భావిస్తారు.
స్త్రీలు పురుషులకంటే తక్కువనీ, వాళ్ళు పాపులనీ, సంకుచితులనీ, గయ్యాళులనీ తెలియజేసే సామెతలు, సూక్తులు అనేకం మన భాషల్లో ఉన్నాయి. మద్దెల, తక్కువ కులం వ్యక్తి, స్త్రీలను కొడుతూ ఉండాలనే హిందీ నానుడి తరచూ వల్లిస్తుంటారు. ”పురుషుని పాదాల వద్ద స్త్రీ స్వర్గం ఉంది” అన్న సామెతను కొంతమంది మౌల్వీలు నిత్యం చెబుతుంటారు. బాంగ్లాలో ఒక సామెత ఇలా ఉంది. ”ఆవు చనిపోయిన పురుషుడు దురదృష్టవంతుడు. భార్య చనిపోయిన పురుషుడు అదృష్టవంతుడు”.
స్త్రీ, పురుషులను కలిపి సూచించేటప్పుడు కూడా పుంలింగ పదాలను సాధారణంగా వాడే అలవాటు ఉంది. స్త్రీలను
ఉద్దేశించినప్పుడు కూడా ‘నరజాతి’, ‘అతడు’, ‘అతడి’ అన్న పదాలను ఉపయోగిస్తారు. ఆయా పనులలో స్త్రీలను సూచించడానికి కూడా ఛైర్మన్, న్యూస్‌మేన్, స్పోర్ట్స్‌మేన్, ఒన్-మాన్-షో వంటి వందలాది పురుష పదాలు ఉపయోగిస్తారు. అయితే ఈ అలవాటు ఇప్పుడిప్పుడే మారుతోంది.
సామాజిక శాస్త్రాలు, తత్వశాస్త్రం, ఇతర రంగాలకు సంబంధించిన భాష సైతం పితృస్వామ్యానికి గురయి మహిళలను విస్మరిస్తుంది. అంచులకు నెట్టివేస్తుంది. తప్పుగా ప్రతిబింబిస్తుంది. నిసర్గ ఆలోచన, దాన్ని వ్యక్తపరిచే భాష నిర్వహించబడిన విధానం ఫలితంగా స్త్రీలు అంచులకు నెట్టివేయబడిన పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. స్త్రీలుగా మనల్ని మనం వ్యక్తపరచుకోవడానికి పితృస్వామ్య ఆలోచనా విధానాన్ని అనుసరించాల్సి వస్తోంది. అది మనం ఉపయోగించే భాషలో ప్రతిఫలిస్తుంది. ఈ భాషలో ఓ”మానవు”లను సూచించే సాధారణ పదం ”పురుష” సంబంధమైనది. తమ శారీరక అనుభ వాలను వివరించడానికి స్త్రీలు ”మురికి పదాలను” లేదా ”వాడకూడని పదాలను” ఉపయోగించాల్సి వస్తుంది. ఏ భాషలోనైనా అన్నింటికంటే తీవ్రమైన తిట్లు స్త్రీ శరీరానికి, స్త్రీల లైంగికతకు సంబంధించినవి – జెర్డాలెర్నర్
ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి. మన భాషలో కొన్ని పదాలు, పాత్రలు జెండర్‌ని తెలియచేస్తాయి.
ఉదాహరణకు అత్త-మామ, అక్కా-తమ్ముడు, తల్లి-తండ్రి వంటివి. ఇవి ఆయా సంబంధాలనే కాకుండా వారి జెండర్‌ని కూడా తెలియచేస్తాయి. అయితే ఇలా జెండర్‌ని తెలియచెయ్యని పదాలు చాలా ఉన్నప్పటికీ అవి పురుషులనో లేదా స్త్రీలనో సూచిస్తాయని అందరూ భావిస్తారు.
ఉదాహరణకు సెక్రటరీ, నర్స్, కిండర్ గార్డెన్ టీచర్ వంటివి స్త్రీలను సూచిస్తాయనీ, బాస్, పైలట్, మేనేజర్, రాజకీయవేత్త, సర్జన్, రైతు వంటివి పురుషులను సూచిస్తాయనీ, భావిస్తారు. బయటి ప్రదేశాలు, ఉద్యోగాలలో పురుషుల ఆధిపత్యం ఇంకా కొనసాగుతూనే ఉందని ఈ అభిప్రాయాలు తెలియచేస్తాయి. నిర్ణయాలు తీసుకునే స్థాయిలో యాజమాన్య స్థాయిలో స్త్రీలు చాలా తక్కువమంది ఉన్నారు.
పితృస్వామ్యం అన్న పదాన్ని తరచూ వాడారు. స్త్రీల అణచివేతకూ, స్త్రీ-పురుషుల మధ్య అదే కారణం అన్న భావన కలిగించారు. ఈ పదాన్ని కొంచెం వివరిస్తారా?
ప్రస్తుత స్త్రీ-పురుష సంబంధాలను అర్ధం చేసుకోవడానికి పితృస్వామ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. పితృస్వామ్యం కారణంగానే జెండర్ సంబంధాలు అసమానంగా ఉన్నాయి. పురుష ఆధిపత్యాన్ని సూచించడానికి సాధారణంగా పితృస్వామ్యం అన్న పదాన్ని వాడుతుంటారు. ”పితృస్వామ్యం” అన్న పదాన్ని భాషాపరంగా చూస్తే తండ్రి (పితృ) ద్వారా పాలన అని అర్థం. ఈ పదాన్ని మొదటి ”పురుష పెత్తనంలోని కుటుంబాన్ని” సూచించడానికి ఉపయోగించారు. ఒక పురుషునికి చెందిన స్త్రీలు, యువకులు, పిల్లలు, బానిసలు, పనివాళ్ళు అతని ఆధీనంలో ఉండడాన్ని ఇది సూచిస్తుంది. ఇప్పుడు ఆ పదాన్ని మరింత విస్తృత అర్థంలో పురుష ఆధిపత్యాన్ని, స్త్రీలను అణచివేయడానికి పురుషులు ఉపయోగించే అనేక ఆధిపత్య సంబంధాలనీ, అనేక విధాలుగా మహిళలను తక్కువ స్థాయిలో
ఉంచే సామాజిక విధానాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. దక్షిణాసియాలో ఈ పదానికి హిందీలో ‘పిత్రసత్తా’ అనీ, ఉర్దూలో ‘పిదర్‌షాహీ’ అనీ, బెంగాలీలో ‘పిత్రితొంత్ర’ అనీ, తెలుగులో పితృస్వామ్యం అనీ వ్యవహరిస్తారు.
స్త్రీలు ఏ వర్గానికి చెందినవారైనప్పటికీ రోజూ అనేక రకాలుగా అణచివేతకు గురవుతుంటారు. ఇంటా, బయటా సమాజంలో వివక్షతకు, నిర్లక్ష్యానికీ, అవమానానికీ, నియంత్రణలకు, దోపిడీకీ, అణచివేతకు, హింసకూ గురవుతుంటారు. వివరణలు మారవచ్చు కానీ అంశాలు అవే.
పితృస్వామ్యం అంటే అంతటా ఒకే రకంగా ఉండదు. ఒకే సమాజంలో భిన్న వర్గాల మధ్య అది భిన్నంగా ఉండవచ్చు, ఉంటుంది కూడా. అలాగే అది భిన్న సమాజాలలోనూ, చరిత్రలో భిన్న కాలాలలోనూ భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు మన అమ్మమ్మలు అనుభవించిన పితృస్వామ్యం, ఈనాటి పితృస్వామ్యం ఒకటి కాదు. గిరిజన స్త్రీలు, హిందూ సమాజానికి చెందిన ఉన్నత కుల స్త్రీలు ఎదుర్కొనే పితృస్వామ్యం ఒకటి కాదు. అమెరికాలో స్త్రీలు, భారతదేశంలోనూ స్త్రీలు ఎదుర్కొనే పితృస్వామ్యం ఒకటి కాదు. పితృస్వామ్యం పని చెయ్యడంలో, సామాజిక, సాంస్కృతిక ఆచరణలో ప్రతి సామాజిక వ్యవస్థ, చారిత్రక యుగం తనదైన విధానాలను రూపొందిస్తుంది. ఆర్థిక వనరులను దాదాపుగా పురుషులు నియంత్రించడం, అన్నీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్థలు వారి ఆధీనంలో ఉండడం అన్న విస్తృత సూత్రం మాత్రం మారదు.
పితృస్వామ్యం ఒక సామాజిక వ్యవస్థ. ఒక సిద్ధాంతం లేదా నమ్మకాల విధానం. దీని ప్రకారం పురుషులు ఉన్నతులు. పితృస్వామ్య సిద్ధాంతాన్ని తయారుచేసి, కొనసాగించడంలో మతాలు ముఖ్యమైన పాత్రను పోషించాయి. ‘ఆదాము’ పక్కటెముక నుంచి ‘అవ్వ’ను తయారుచేయడం; దేవుని ప్రతిరూపంగా పురుషుడు తయారు చేయబడ్డాడనడం వంటి కథల ద్వారా వివిధ మతాలు పురుషులు ఉన్నతులన్న భావనను కలిగించాయి. పురుషులను బలవంతులుగాను, నిర్ణయాలు తీసుకునే పాత్రలలోనూ చూపించడం ద్వారా, స్త్రీలను పరాధీనులుగా, ఈర్ష్యాపరులుగా, అంతులేని వస్తు వ్యామోహం ఉన్నవారిగా చిత్రీకరించడం ద్వారా నేటి ప్రసార మాధ్యమాలు, విద్యా సంస్థలు కూడా పితృస్వామ్య భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాయి. సామాజిక వ్యవస్థలు కొనసాగడంలోనూ, ప్రజల ఆలోచనలను నియంత్రించడంలోనూ భావజాలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు స్త్రీలను కేవలం శరీరాలుగా, వస్తువులుగా చూపించడం ద్వారా ప్రసార సాధనాలు వారిపై హింసను ప్రోత్సహిస్తున్నాయి. సామాజిక ప్రవర్తననూ, సామాజిక-ఆర్థిక వ్యవస్థలనూ సమర్ధించుకోవడానికి భావజాలం ఉపయోగపడుతుంది.
స్త్రీల జీవితాలకు, సమాజాలకు సంబంధించి ఈ దిగువ అంశాలు పితృస్వామ్య ఆధీనంలో ఉన్నాయని చెప్పవచ్చు.
స్త్రీల ఉత్పాదక లేదా శ్రమశక్తి
స్త్రీల పునరుత్పత్తి శక్తి
స్త్రీల లైంగికత
స్త్రీల కదలిక (మొబిలిటీ)లు
ఆస్తి, ఇతర ఆర్థిక వనరులు
సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సంస్థలు
సమాజంలోని ప్రధాన సంస్థలైన కుటుంబం, మతం, చట్టం, రాజకీయం, విద్య, ఆర్థిక వ్యవస్థలు, ప్రసార సాధనాలు, జ్ఞాన వ్యవస్థలు అన్నీ తమ పితృస్వామ్య స్వభావాన్ని వెల్లడిచేస్తూ పితృస్వామ్య వ్యవస్థకు మూలస్తంభాలుగా ఉన్నాయి. ఇలా బలంగా అల్లుకునిపోయిన వ్యవస్థల ద్వారా పితృస్వామ్యం దుర్భేద్యంగా కనిపిస్తుంది. అంతేకాకుండా సహజమైనదిగా కూడా కనిపిస్తుంది.
పితృస్వామ్యం కింద స్త్రీలను నియంత్రించడానికి, అణిచి ఉంచడానికి అనేక రకాల హింసలను ఉపయోగించవచ్చు. ఈ రకమైన హింస చట్టబద్ధమైనదని కూడా భావించవచ్చు. పితృస్వామ్యంలో స్త్రీలపై హింస సర్వవ్యాప్తంగా ఉండటమే కాకుండా పకడ్బందీగా జరుగుతుంటుందని ఫెమినిస్టులు నమ్ముతారు.
దీని అర్థం పితృస్వామ్యంలో స్త్రీలకు ఎటువంటి హక్కులు లేవని, అధికారాలు లేవని, ప్రభావం, వనరులు లేవని కాదు. ఏ అసమాన వ్యవస్థ అయినా కొనసాగాలంటే అణచివేతకు గురయ్యే వారిలో కొందరు దాని ద్వారా లాభపడాలి. అందులో పాల్గొనాలి. ఇది పితృస్వామ్యానికి కూడా వర్తిస్తుంది. స్త్రీలు అధికార స్థానాలకు ఎదిగారు. నియంత్రణ స్థితిలో తాత్కాలికంగానైనా ఉన్నారు. కొద్దోగొప్పో ప్రయోజనాలను సాధించుకోగలిగారు. వ్యవస్థ పురుష ఆధిపత్యంలో ఉందన్న వాస్తవాన్ని ఇవేవీ మార్చలేవు. ఇందులో స్త్రీలకు అనేక విధాలలో కొంత స్థానం కల్పిస్తుంటారు. ఒక సమాంతర ఉదాహరణ తీసుకుందాం. పెట్టుబడిదారీ ఆర్థిక విధానంలో కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. వాళ్ళు కొంతమేరకు యాజమాన్యంలో కూడా పాలు పంచుకోవచ్చు. కానీ దాని అర్థం వాళ్ళు నియంత్రణ స్థానంలో ఉన్నారని కాదు. అనేక సంక్లిష్ట కారణాల వల్ల స్త్రీలు కూడా పితృస్వామ్యానికి మద్దతునిచ్చి అది కొనసాగేలా చేస్తున్నారు. మనలో చాలామందిమి పితృస్వామ్య విలువలను వంటబట్టించుకున్నాం, దాని భావజాలం నుంచి అన్నివేలలా స్వతంత్రులం కాలేం.
తమకున్న కొద్దిపాటి హక్కులను కాపాడుకోవడానికి స్త్రీలు తమ స్థానాన్ని నిరంతరం నిలబెట్టుకుంటూ ఉండాలి. ఇందుకు ఒక్కొక్కసారి ఇతర స్త్రీలను పణంగా పెట్టాల్సి రావచ్చు. ఈ సంక్లిష్ట స్థితికి కారణాలను విశ్లేషించి మొత్తం వ్యవస్థను చూడడం ఎంతో ముఖ్యం. స్త్రీలు తమ కొడుకులకు ప్రాధాన్యతనిస్తారన్నదీ, ఆడపిల్లల స్వేచ్ఛను అరికడతారన్నదీ, చదువుకోనివ్వరన్నదీ, కోడళ్ళను ఆరళ్ళకు గురిచేస్తారన్నదీ వాస్తవమే. సమాజంలో, కుటుంబంలో స్త్రీలు, పురుషులకు ఉండే స్థానం, అధికారాల నేపథ్యంలో వీటన్నింటినీ అర్థం చేసుకోవాలి. ఒక గ్రామీణ మహిళ దీన్ని చాలా చక్కగా వివరించింది. ”మా కుటుంబంలోని పురుషులు సూర్యుని వంటివాళ్ళు. వాళ్ళకి తమదైన కాంతి ఉంటుంది (తమవైన వనరులు ఉంటాయి, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కలిగి ఉంటారు; మొదలైనవి) స్త్రీలు తమకంటూ కాంతిలేని ఉపగ్రహాలలాంటివారు. అందుకే స్త్రీలు సూర్యకాంతిలో అధిక భాగం కోసం ఒకరితో ఒకరు ఎప్పుడూ పోటీపడుతుంటారు. సూర్యకాంతి లేకపోతే బతుకు ఉండదు కదా”.
స్త్రీలపై పురుషుల నియంత్రణని ఆదరణతో కూడిన ఆధిపత్యంగా వివరించవచ్చు. ఆధిపత్యం ఉంటుంది కానీ ఆశ్రయం కల్పించడం, ఆహారం ఇవ్వడం, బయట వార నుంచి రక్షణ క ల్పించడం వంటివి ఉంటాయి. కాబట్టి ఇది ఆదరణతో కూడిన ఆధిపత్యం అవుతుంది. ఈ ఆధిపత్యంలో అణచివేత అంశాలు ఉంటాయి. అదే సమయంల ఇందులో ఒకరిపట్ల ఒకరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉంటాయి. దీనిలోని అణచివేతను అన్నివేళలా కనుగొనలేదు. అందుకే దాన్ని గుర్తించి, పోరాడడం చాలా కష్టమయినది.
జాతీయ విముక్తి (స్త్రీలను) ఏ మేరకు విముక్త పరచింది?
జాతీయ స్వాతంత్య్ర ఉద్యమం ఫలితంగా వలస పాలకుల రాజకీయ పెత్తనం అంతమై శాసన తయారీ, న్యాయ నిర్ణయం, శిక్ష అమలు అధికారాలు వేర్వేరుగా ఉండాలన్న సూత్రం అమల్లోకి వచ్చినప్పటికీ ఇంట్లో తండ్రి, భర్తల పాలన నుండి స్త్రీలకు విముక్తి లభించలేదు. ఇంటిలోని నియమాలు తయారుచేయటం, వారి పనితీరును అంచనా వేయటం, శిక్షించడం వంటి అన్ని అధికారాలు పురుషుల చేతిలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. పురుషుల చేతిల్లోని పగ్గాలు ఇవీ ః
బ ఎప్పుడంటే అప్పుడు లైంగిక కోర్కె తీర్చమనడం.
బ గర్భ నిరోధక పద్ధతులు తమ భార్యలు పాటించకుండా చేయడం;
బ ఇంటి పనిలో, చదువులో, ఖాళీ సమయంలో, సాంస్కృతిక కార్యక్రమాలలో తమ భార్యలు, కూతుళ్ళు తమ సమయాన్ని ఎలా వెచ్చించాలో నిర్ణయించటం, ఉపాధి కోసం బయట ప్రపంచంలోకి అడుగుపెట్టేటపుడు షరతులను నిర్ఱయించడం.
బ స్త్రీలు నియమాలను ఉల్లంఘించారని అనుకున్నప్పుడు వారిని శిక్షించడం, హింసించడం, అయినా చట్టం పరిధిలోకి రాకపోవడం.
బ భార్యలు తాము పుట్టింటి నుండి వారసత్వంగా పొందిన లేదా సంపాదించుకున్న ఆస్తులను ఉపయోగించుకోవటం, అమ్మివేయడం.
బ భార్యలు/కూతుళ్ళను అమ్మడం లేదా కొనడం, అప్పుల కింద తాకట్టు పెట్టడం, ఇతర పురుషుల అవమానాలకు స్త్రీలను బలిచెయ్యడం.
ఈ అభిప్రాయాలు, ప్రవర్తనలు సమాజం బయట, పని ప్రదేశంలో, రాజకీయ స్థలాలలో, స్త్రీలతో సంబంధాలలో వ్యక్తమవుతాయి.
విద్య లేదా ఆధునికీకరణ లేదా అభివృద్ది, స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని తీసుకురాదా?
అలా జరగాలని ఏమీ లేదు. తరచూ విద్యే పితృస్వామ్య భావజాలానికి గురయి ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య అసమానతలను అది పట్టించుకోదు, సమర్ధిస్తుంది, కొనసాగేలా చేస్తుంది. పిల్లల పుస్తకాలు, పాఠ్యపుస్తకాలను విశ్లేషించిన అనేక సందర్భాలలో వాటిల్లో జెండరు వివక్ష ఉందని, పురుషులకు అనుగుణంగా అవి ఉన్నాయని నిరూపితమయింది. ఈ వివక్ష అన్ని అధ్యయన రంగాలలో కొనసాగుతోంది. స్త్రీ ఉద్యమాలు, స్త్రీ అధ్యయన కేంద్రాలు అన్నిచోట్లా దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.
చరిత్ర అంటే అతడి కథ
ప్రపంచం మొత్తం గురించి తెలియాలంటే
మనకి ఆమె కథ కూడా కావాలి.
అందరికీ చదువు అంది చాలాకాలమై, ఆధునిక పారిశ్రామిక, సమాన అవకాశాలు గల దేశాలుగా పరిగణింపబడుతున్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాలను పైపైన చూసినప్పటికీ వాటిల్లోనూ జెండర్ అసమానతలు కొనసాగుతున్నాయని అర్థమవుతుంది. రెండు దేశాలలోనూ కుటుంబ పెద్దగా స్త్రీలు చాలామంది ఉన్నప్పటికీ కుటుంబ పెద్ద అంటే పురుషులమన్న భావన ఉంది. ఈ సమాజాలలో 50 శాతానికి పైగా స్త్రీలు తమ భర్తల చేతుల్లో హింసకు గురవుతారు. స్త్రీల పట్ల హింస, అత్యాచారాలు కూడా ఎక్కువే. అమెరికాలో సమాన వేతన చట్టం ఇంకా ఆమోదం పొందలేదు. అనేక రాష్ట్రాలలో గర్భస్రావం ఇప్పటికీ చట్టవిరుద్ధమే.
అమెరికా గణాంక వివరాల ప్రకారం పట్టా పొందిన స్త్రీ ఉద్యోగం చేస్తున్నట్లయితే తనతో పాటు చదివిన పుపరుషునితో పోలిస్తే 25 శాతం తక్కువ వేతనం పొందుతుంది. ఆమె పైకెదుగుతున్న కొద్దీ ఈ అంతరం పెరుగుతుంటుంది. 1991 గణాంకాలను అసోసియేటెడ్ ప్రెస్ విశ్లేషించి ప్రతి విద్యాస్థాయిలోనూ అదే స్థాయి ఉన్న పురుషులకంటే స్త్రీలు తక్కువ వేతనం పొందుతున్నారని వెల్లడించింది.
అన్ని వృత్తులలో కాకపోయినప్పటికీ చాలా వాటిల్లో జెండర్‌పరంగా స్పష్టమైన విభేదాలు, అన్నీ పారిశ్రామిక దేశాలలో ఉన్నాయని తెలియచేసే గణాంకాలను ఆన్ ఓక్లే అందచేస్తున్నారు. ప్రత్యేకించి ఒక వృత్తి-గృహిణి పని- కేవలం స్త్రీలకే పరిమితమైంది. పరిశ్రమలలో లింగపరంగా చాలా విభేదాలున్నాయని ఆమె తెలియచేస్తోంది. అధికశాతం అంటే పని చేస్తున్న స్త్రీలలో మూడింట రెండు వంతులు నూలు పరిశ్రమ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఉన్నారు.
అధిక హోదా, నైపుణ్యం, జీతం వచ్చే ఉద్యోగాలలో మొత్తం మీద పురుషులదే ఆధిపత్యం. ఇది పారిశ్రామిక దేశాలన్నింటికీ వర్తిస్తుంది. ఇంగ్లాండులో 1966లో సేకరించిన లెక్కల ప్రకారం పెద్ద సంస్థలలో మేనేజర్లుగా 87 శాతం పురుషులు కాగా 13 శాతం స్త్రీలు. లాయర్లలో చూస్తే అమెరికాలో స్త్రీలు మూడు శాతం, ఇంగ్లాండులో నాలుగు శాతం, స్వీడన్‌లో ఏడు శాతం ఉన్నారు. మొత్తం ఇంజనీర్లలో స్త్రీల శాతం ఇంగ్లాండులో 0.06 కాగా, అమెరికాలో 0.07, ఫ్రాన్స్‌లో 3.7 శాతం. ఇటువంటి వృత్తిపర ఉపాధులలో స్త్రీలు పురుషులతో సమానంగా వేతనం పొందుతుండగా మిగతా రంగాలలో పరిస్థితి ఇలా లేదు. అంటే నైపుణ్యం, హోదా, ఆర్థిక ప్రతిఫలం, జెండర్ వంటివి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఈ సంబంధాలు చాలా సంక్లిష్టమైనప్పటికీ అంతటా అవి ఒకే రీతిగా ఉన్నాయి.
ఉన్నత విద్యలోనూ తేడాలు ఎక్కువే. ఆన్ ఓక్లే ప్రకారం ”విద్యలో అత్యంత ఉన్నత స్థాయిలో ఈ తేడాలు మరింత స్పష్టంగా
ఉన్నాయి. 1965లో ఉన్నత విద్యలో ఉన్న 20-24 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి వంద మందిలో ఇంగ్లాండులో 6.6 మంది స్త్రీలు కాగా, డెన్మార్క్‌లో 5.3, స్విట్జర్లాండ్‌లో 2.3, బల్గేరియాలో 15.2 మంది ఉన్నారు. 1967లో ఇంగ్లాండ్‌లో విశ్వవిద్యాలయాల్లో చేరినవాళ్ళలో అయిదింట ఇద్దరు స్త్రీలు, పట్టా పొందిన వాళ్ళలో మూడింట స్త్రీలు ఒకరికంటే తక్కువ; అన్ని రకాల మాస్టర్స్, ఆ పై పట్టా పొందిన వాళ్ళలో స్త్రీలు తొమ్మిదింట ఒకరుంటారు”. అభివృద్ధి చెందిన దేశాలని పిలవబడుతున్న వాటిల్లో కూడా ఆడపిల్ల కంటే మగపిల్లవాడికి చదువు ముఖ్యమని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఆడపిల్లలు, మగపిల్లలు ఎంచుకునే విషయాలలో కూడా ఈ తేడా స్పష్టంగా కనబడుతుంది. అమెరికాలో 1964లో ఎం.ఇడి. పట్టా పొందిన వాళ్ళలో 46 శాతం స్త్రీలే. అయితే వీరిలో విజ్ఞాన శాస్త్రం తీసుకుంది కేవలం 10 శాతమే. 1967లో ఇంగ్లాండులో వైద్యం, దంత వైద్యం, ఆరోగ్యానికి సంబంధించిన చదువులలో మూడింట ఇద్దరు పురుషులే.
పారిశ్రామిక దేశాల – (అవి పెట్టుబడిదారీ విధానం అవలంబించనీ, సోషలిజం అవలంబించనీ) ఈ గణాంకాలు కేవలం చదువు లేదా ప్రగతి ద్వారా జెండర్ తారతమ్యాలను తొలగించలేమని నిరూపిస్తున్నాయి. పితృస్వామ్య నిర్మాణాలను, దృక్పథాలను మార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేయకపోతే ఫలితముండదు.
స్త్రీ, పురుషుల పాత్రలను, హోదాను జెండర్ నిర్ణయిస్తే వారి మధ్య సంబంధాలను కూడా అదే నిర్ణయిస్తుంది కదా?
నిర్ణయిస్తుంది. బంగారం, వెండికి భిన్న విలువలు కేటాయించినప్పుడు వాటి మధ్య సంబంధాలను కూడా నిర్ణయించిన వారవుతారు. అదేవిధంగా సమాజం కూడా స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలను నిర్ణయిస్తుంది. జెండర్ ఆధారిత సంబంధాలను జెండర్ సంబంధాలంటారు. ”జెండర్ సంబంధాలు అన్న పదం స్త్రీ, పురుషుల మధ్య అధికార సంబంధాలను తెలియచేస్తుంది. ఇవి ఆచరణలో, ఆలోచనలలో, ప్రతీకలలో వెల్లడవుతాయి. స్త్రీలు-పురుషుల మధ్య పని విభజన, పాత్రల విభజన, వనరుల విభజన ఇందులో భాగమే. దీని కింద స్త్రీ, పురుషులకు భిన్న సామర్ధ్యాలు, దృక్పథాలు, కోరికలు, వ్యక్తిత్వ లక్షణాలు, ప్రవర్తనా విధానాలు వంటివి ఆపాదిస్తారు. ఈ ఆచరణల ద్వారా జెండర్ సంబంధాలు నిర్ణయించబడి తిరిగి అవి ఆచరణలను ప్రభావితం చేస్తాయి. ఇవి వర్గం, కులం, జాతి వంటి సామాజిక తారతమ్యాలతో ముడివడి ఉంటాయి. ఈ సంబంధాలు (శరీర నిర్మాణం ఆధారంగా నిర్ణయించబడినవి కాకుండా) సమాజం ద్వారా నిర్ణయించబడినవి. ఇవి స్థలం, సమయం బట్టి మారుతుంటాయి”.
జెండర్ మాదిరిగానే జెండర్ సంబంధాలు కూడా అన్నీ సమాజాలలోనూ, అన్ని కాలాలలోనూ స్థిరంగా ఒకే రకంగా ఉండవు. అవి గతిశీలమైనవి. కాలాన్ని బట్టి మారుతుంటాయి. చాలా సమాజాలలో జెండర్ సంబంధాలలో అసమానత ఉందన్న సాధారణ సూత్రీకరణ చేయవచ్చు.
ఇంటిలో స్త్రీ, పురుషుల సంబంధాలు ఎటువంటి సంఘర్షణ లేకుండా సామరస్యంగా
ఉన్నాయన్న అభిప్రాయాన్ని ఈ అవగాహన సవాలు చేస్తుంది. వాస్తవానికి సహకారం ఉంది. సంఘర్షణా ఉంది, సామరస్యమూ ఉంది, విద్వేషాలూ ఉన్నాయి. ఇంకో మాటలో చెప్పాలంటే జెండర్ సంబంధాలలో రాజకీయాలు ఉన్నాయి. ఇక్కడ ‘రాజకీయాలు’ అన్న పదం ఏ సంబంధంలోనైనా అధికారం కొనసాగే వ్యూహాలను సూచిస్తుంది. వేర్వేరు వ్యక్తులను (ఇతర వ్యక్తులు, వనరులపై నిర్ణయాలు తీసుకోవటంలో) వేరు వేరు అధికారులు, పెత్తనం, నియంత్రణ కేటాయించడం వల్ల కులాలు, వర్గాలు, జాతుల మధ్య మాదిరే కుటుంబంలో, పనిన ప్రదేశంలో, విస్తృత సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య ప్రచ్ఛన్నంగానో, బహిరంగంగానో అధికార పాకులాటలు, రాజకీయాలు చోటు చేసుకుంటాయి.
సిద్ధాంత రీత్యా చూస్తే జెండర్ ఆధిపత్యం అంటే స్త్రీ కానీ, పురుషుడు కానీ అవతలివారిపై ఆధిపత్యం చెలాయించడం కావచ్చు. కానీ వాస్తవంలో అది ఎల్లప్పుడూ స్త్రీలపై పురుషుల ఆధిపత్యం చెలాయించడమే. భిన్న సంస్కృతులలో ఇటీవలి కాలంలో జెండర్ సంబంధాలలో పురుషుడికి స్త్రీ లోబడి ఉండడమే సాధారణంగా కనబడుతుంది కాబట్టి జెండర్ సంబంధాలంటే ఆధిపత్య, పరాధీన సంబంధాలు, సహకారం, అధికారం, హింస వంటి అంశాలు అవి కొనసాగేలా చేస్తాయి. చాలా సమాజాలు పితృస్వామ్యమైనవి లేదా పురుష ఆధిపత్యం కలవి కావటం వల్ల ఇలా ఉంది. చాలా సమాజాలలో జెండర్ సంబంధాలు పితృస్వామ్య స్వభావం కలిగి ఉంటాయని కూడా చెప్పవచ్చు. ఈ భావజాలం, సామాజిక వ్యవస్థలో స్త్రీలకంటే పురుషులు ఉన్నతులని భావిస్తారు. పురుషుల అధికార స్థానంలో ఉంటారు. వనరులు, సామాజిక సంస్థలను వాళ్ళే నిర్ణయిస్తారు.
స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలనే కాకుండా జెండర్ పురుషుల మధ్య సంబంధాలను, స్త్రీల మధ్య సంబంధాలను నిర్ణయిస్తుంది. జెండర్ అసమానతలు ఎక్కువగా ఉన్న దక్షిణ ఆసియాలో ఇది చాలా బలమైనదిగా ఉంటుంది. ఉదాహరణకు (ఉత్తర) భారతదేశంలో పెళ్ళికూతురు కుటుంబం, పెళ్ళికొడుకు కుటుంబం మధ్య సంబంధాలను పేర్కొనవచ్చు. పెళ్ళికొడుకు తండ్రి ఎంతో ఉన్నతుడిగా, ఎంతో గౌరవంగా చూడవలసిన వ్యక్తిగా భావిస్తారు. ఆడపిల్ల తండ్రి అయినందుకు గాను పెళ్ళికూతురు తండ్రి తక్కువగా, లోబడి ఉండవలసిన వాడిగా చూస్తారు.
స్త్రీల మధ్య సంబంధాలను జెండర్ ప్రభావితం చేయడానికి ఉదాహరణలుగా అత్తా-కోడళ్ళను, వదిన-ఆడపడుచులు; లేదా ఇద్దరు అత్తల మధ్య సంబంధాలను పేర్కొనవచ్చు. వీటన్నింటిలో పెళ్ళికొడుకుతో సంబంధం ఉన్న వాళ్ళందరూ పెళ్ళికూతురితో సంబంధం ఉన్నవారికంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమిస్తారు.
జర్మనీలో మూడు వందల సంవత్సరాల క్రితం జీవించిన థామస్ వాన్ అక్వినాస్ (అతడు ఇతరత్రా తెలివైనవాడు, క్త్రీస్తు పట్ల భక్తి ప్రపత్తులు కలిగినవాడు) స్త్రీలు కలుపు మొక్కల్లాంటివారని, వాళ్ళకు విలువ లేదు కాబట్టి వేగంగా పెరుగుతారని పేర్కొన్నాడు (పురుషులు ప్రధాన పంట, నేటి ప్రపంచంలో వాణిజ్య పంట.)
పురుషులతో సమానంగా పరిగణింపబడడానికి స్త్రీలు పురుషులకలంటే రెట్టింపు సమర్ధత కనబరచవaతీ,
…….. అదృష్టవశాత్తు అదేమంత కష్టం కాదు………….
కుటుంబంలో రాజకీయాలు అన్నప్పుడు, స్త్రీలు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుండాలి అన్నప్పుడు మీ అసలు
ఉద్దేశ్యం ఏమిటి?
కుటుంబంలోని సభ్యులందరికీ వనరులు, సేవలు, అవకాశాలు ఒకే రకంగా అందుబాటులో ఉండవని మనం చూశాం. ఈ అసమానతల ప్రాతిపదికమీద కుటుంబంలో అధికారం కోసం నిరంతర లావాదేవీలు, ఘర్షణలు జరుగుతుంటాయని సామాజిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ దీన్ని సహకారం-సంఘర్షణ నమూనా అంటాడు. ఫెమినిస్ట్ ఆర్థికవేత్త అయిన బీనా అగర్వాల్ ఈ సిద్ధాంతాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళింది. ఆమె ప్రకారం కుటుంబం అనేది సంక్లిష్ట సంబంధాల మాత్రిక; ఇందులో జెండర్, వయసు, సంబంధాల శ్రేణి, ‘తిరుగులేని సాంప్రదాయాలు’ వంటి పరిమితులకు లోబడి లావాదేవీలు నిరంతరం కొనసాగుతుంటాయి. కుటుంబంలో, సమాజంలో, మార్కెట్‌లో, రాజ్యంలో జెండర్ మధ్య సంబంధాలలో సహకారం, ఘర్షణ అన్న అంశాలుంటాయి. సహాయ నిరాకరణ కంటే సహకారం వల్ల తమ పరిస్థితి మెరుగుపడుతుందనుకుంటే ఇరు వర్గాలు సహకరించుకోటానికి అంగీకారం కుదుర్చుకుంటాయి.
బీనా అగర్వాల్ ప్రకారం ఒక గ్రామీణ వ్యక్తి బేరమాడగల శక్తి అతడి/ఆమె వెనుకనున్న మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఇది తిరిగి అయిదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి ః
వనరులు, ప్రత్యేకించి సాగుభూమి కలిగి ఉండడం.
ఉపాధి లేదా ఇతర ఆదాయ వనరులు కలిగి ఉండడం.
ఊరు ఉమ్మడి ఆస్తులు, అడవులు వంటి సామూహిక వనరులు అందుబాటులో ఉండటం.
సాంప్రదాయ బాహ్య సామాజిక మద్దతు వ్యవస్థలు అందుబాటులో ఉండటం.
ప్రభుత్వ లేదా స్వచ్ఛంద సంస్థల నుండి మద్దతు అందుబాటులో ఉండటం.
”ఒక వ్యక్తి తన మనుగడ అవసరాలు సాధించుకోవడాన్ని ఈ అయిదు అంశాలు ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. ఇవి కుటుంబం బయటి అంశాలు. కుటుంబం బయట భౌతికంగా మనగలిగిన సామర్ధ్యం పెరిగిన కొద్దీ కుటుంబంలో అతడి/ఆమె బేరమాడే శక్తి (కనీసం మనుగడ కోసం వనరులు పంచుకోవడం వరకు) ఆ మేరకు పెరుగుతుంది. ఈ అంశాలలో కుటుంబసభ్యుల మధ్య అసమానతలు ఉంటే ఒకరితో ఒకరు పోల్చినప్పుడు మరొకరికి బేరమాడే శక్తి బలహీనంగా ఉంటుంది. అసమానతలకు కారణమయ్యే అంశాలలో జెండర్ ఒక్కటి, వయసు మరొకటి”.
ఇక్కడ ఒక ఉదాహరణ పరిశీలిద్దాం. స్త్రీ సంపాదన సామర్ధ్యం పెరిగినపుడు, ప్రత్యేకించి ఆమె ఆదాయం కుటుంబ మనుగడకు ఉపయోగపడుతుంటే ఆమె బేరమాడే శక్తి బలపడుతుంది. అదేవిధంగా భూమి, డబ్బు వంటి ఇతర ఆస్తులు కలిగి ఉండటం, అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళ పరాధీనత తగ్గుతుంది. కుటుంబంలో మరింత మెరుగైన స్థాయిని సాధించుకోగలుగుతారు.