‘రేష్మ’… చూడచక్కని ముఖం, వినసొంపైన గాత్రం, చిక్కటి కృష్ణవర్ణపు ఛాయ, మెరుపులు చిందే నవ్వు…
అరుణ…ఆకర్షణీయమైన పోలికలు, నెమలి నాట్యంలాంటి నడక, బరువైన మేఘాలు రాసుకున్నట్లున్న గొంతు, ఎవర్నయినా నిలవరించే పదునైన చూపు…
ఇద్దరూ పోలీస్‌స్టేషన్‌లో కలిశారు. అర్థరాత్రి దాటింది. స్టేషన్లో ఉన్న కొద్ది సిబ్బంది నిద్రకి జోగుతున్నారు. రెండు గంటలుగా ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు.
నారాయణపేటకి పదిహేను కిలోమీటర్ల దూరంలోని గ్రామం రేష్మది. తల్లి జోగిని. బిడ్డని ప్రేమగా పెంచింది. బాగా చదువుకుని పట్నంపోయి గౌరవంగా బ్రతకాలని చెప్పేది. మహిళా సంఘంలో చేరి అణచివేతకి గురయిన తన జీవితాన్ని అర్ధం చేసుకుంది. పన్నెండేళ్ళ వయసులో జోగినిగా చేసిన కొన్నాళ్ళకే తల్లి చనిపోవడంతో తనే ఊరి పెద్దలకి ముఖ్యురాలైంది. పొద్దుమీక కళ్ళం దగ్గరికెళ్ళి నిలబడితే కుంచెడు ధాన్యమో, కుండెడు జొన్నలో, పల్లీల మూటో కానుకగా ఇచ్చే ‘దొరలు’ చల్లగా ఉండాలని… తనని కోరి ఏ రోజొచ్చినా కాదనలేదు కనీసం ఆ ఇళ్ళ ఆడోళ్ళ ఏడుపు తనకి తగలదని నమ్మించినందుకు.
కుర్ర దొరలు ఎప్పుడన్నా సెంటు బుడ్లు, పలక సీసాలు, సిల్క్ రవికెలు, చమ్కీ చీరలు తెచ్చి ఒడి నింపితే మురిసిపోయేది. వారి కుటుంబాల్లో పెద్ద మనుషుల చావుల్లో పీనుగ ముందు ఆడడానికి, పాడడానికి, ఏడవడానికి ముస్తాబై ఎల్లేది. దొరింటి పట్నపు మగ బంధువులు దినాలదాకా వంతులేసుకుని తన దగ్గరకొస్తే వారిచ్చే ఈనాముల్తో బిడ్డ చదువుకి ఢోకా లేదని సంబరపడేది. ఆళ్ళు అంటించిన జబ్బుల్ని వదిలించుకోలేనప్పుడు మాత్రం చెదలు పట్టిందని, కాలరాయాలని అనుకునేది. అంతలోనే బిడ్డకోసం మనసు మార్చుకునేది. ఒంటి బాధ, మనసు గాయాలు మర్చిపోడానికి దొరల పాశవిక సరసాలను నవ్వుతో జోడించి హాస్యంగా చెప్పేది బిడ్డకి. ఇవన్నీ చూస్తూ పెరిగిన రేష్మ తనకి నచ్చినవాళ్ళని, తనని బాగా చూసేవాళ్ళని మాత్రమే దగ్గరకి రానిస్తానని చెప్పేది. అమ్మ నవ్వు సాక్షిగా పదో తరగతి పూర్తి కాగానే ఊరు దాటేశారు. కానుకల్ని సొమ్ములుగా మార్చుకున్న తల్లి ముందుచూపు వల్ల, రెండిళ్ళల్లో పాచిపనులకొచ్చే జీతంతోనూ మూడేళ్ళు బాగానే గడిచినా… ఓనాడు చిన్నదొర దోస్తు కళ్ళబడి, ఎవరికీ చెప్పకుండా ఉండేందుకని పక్కపరచాల్సొచ్చి… మర్నాడు పోలీసులకు దొరికిపోయింది. పునరావాసం పేరిట హోమ్‌లో పెట్టి బిడ్డని కూడా చూడనివ్వనప్పుడు… అదిగో అప్పుడు పుట్టింది రేష్మలో కసి. ఏడాదిగా ప్రయత్నం చేస్తుంటే… బతకడం కోసం తప్పక ఎప్పుడన్నా ఒళ్ళు విరుస్తుంటే ఇదిగో ఇప్పుడు ఆటోలో వచ్చిన ఆ నలుగురు ఆడోళ్ళు ట్యాంక్‌బండ్ మీద ‘మగవాళ్ళ’ని ఆకర్షిస్తూ నించున్నావని తెచ్చి పోలీస్టేషన్లో పడేశారు.
కర్నూలు నుంచి మెడిసిన్ చదవడానికి పట్నం వచ్చిన అరుణ తల్లి బసివిని. బిడ్డ డాక్టరీ కల నిజం చేయడానికి రోజుకి వెయ్యి రూపాయలు తక్కువ కాకూడదని కనీసం నలుగురికి ‘సేవ’ చేసేది. వారిలో ఎవరన్నా కంటికి నదురుగా
ఉన్నవారు తనవైపు ఆకలిగా చూస్తే ఒళ్ళు ఝల్లుమనేది అరుణకి. పదిహేడేళ్ళకి తనలో వస్తున్న లైంగిక మార్పులను గుర్తించి తాను కూడా అమ్మకి అపుడప్పుడూ ‘సాయపడతా’నంది. గుబులుపడ్డ తల్లి బిడ్డని వారించినా, ఆమె కోరికను అర్ధం చేసుకుని నెలకి ఒకటో, రెండో ‘సేవ’లకి మాత్రమే సమ్మతించి ఓ రోజు శోభనం ఏర్పాటు చేసింది. ఎప్పుడన్నా మూడ్ కోసమే తన దగ్గరికొచ్చే ఓ కుర్ర ‘కవి’ని ఎంపిక చేసి, నీకూ మొదటి రాత్రే అని నవ్వి వారికి ప్రైవసీనిస్తూ ఆమె రెండో ఆట సినిమాకి వెళ్ళింది. అర్థరాత్రి దాటొచ్చి అరుగుమీదే పడుకుని తెల్లారకముందే తలుపు తట్టి కవిని పంపేసింది. బిడ్డ ముఖంలో వెలుగును చూసి దిగులుపడింది. డాక్టరీ పూర్తి చేస్తానని, ‘ఇబ్బందుల్లో’ పడకుండా చూసుకుంటానని మాట తీసుకుని బిడ్డని పట్నం పంపింది. ముగ్గురు మాత్రమే ఆధునిక భావాలున్న, విద్యావంతులైన ‘బాయ్‌ఫ్రెండ్’ కస్టమర్ల సహకారంతో మెడిసిన్ నాలుగో సంవత్సరంలోకొచ్చింది అరుణ. అలా ఆహ్లాదంగా కబుర్లు చెప్పుకోడానికి వస్తానన్న ‘బాయ్‌ఫ్రెండ్’ కోసం నెక్లెస్ రోడ్డులో ఎదురు చూస్తుండగా ఆటోలో వచ్చిన ఆ నలుగురు ఆడోళ్ళు అరుణని పోలీస్‌స్టేషన్‌కి ఈడ్చుకెళ్ళారు.
తమ కథల్ని కలబోసుకున్న రేష్మ, అరుణలది ఒకేలాంటి అనుభవం. పోలీస్ రైడ్‌లో దొరకలేదు. వ్యభిచారం చేస్తూ పట్టుబడలేదు. ఎవరూ బలవంతంగా తరలించట్లేదు. ఇష్టపూర్వకంగా ఎంచుకున్న దారి. ఆడా, మగా శరీరాలకి సహజంగా
ఉండే అవసరం. పెళ్ళి, కుటుంబం పేరుతో ‘ప్రైవేట్’ చేయబడ్డ ప్రక్రియ. సంస్కారం పేరుతో గదిలో జరిగే అరాచకం, గౌరవ మర్యాదల ముసుగులో మగ్గిపోతున్న స్త్రీల ఆశలు. వైవిధ్యం కావాలనుకోవడం మగవారికి ‘మగతనం’కాని, అలాంటి ఊహ కూడా ఆడవారిని ‘అపవిత్రుల’ని, పతితలను చేస్తుంది. ‘కోరిక’ తీర్చుకుని స్త్రీకి సుఖాన్నిస్తున్నాననుకునే మగాడు ఆమె అసంతృప్తి భావాన్ని లక్ష్యపెట్టనపుడు, హిస్టీరిక్‌గా ప్రవర్తించే స్త్రీల రహస్యాలని గౌరవ పరదాల మాటున దాచేసి సభ్యత సంకెళ్ళు వేసేస్తున్నారు. బయటపడి అడిగిన స్త్రీలని ‘సాంప్రదాయ’ కషాయం పోసి ‘బిడ్డల భవిష్యత్తు’ మలాము రాసి మభ్యపడమంటున్నారు. జన్మాంగాలు తప్పించి వేటితోనైనా వృత్తిపని చేయొచ్చట. కానీ తరాలుగా లైంగిక వృత్తిలోనే
ఉన్నవారిని ఇప్పుడు బలవంతంగా పునరావాసానికి పంపడం తమాషాగా ఉంది. ఇసుక పునాదుల మీద కట్టిన కుటుంబ బంగ్లాలను నిలబెట్టడానికి ఇది అసంబద్ధ ప్రయాస కాదా!!
మా దగ్గరకొచ్చిన మగాళ్ళు మాత్రం ఇళ్ళకెల్లిపోవచ్చంట… మేము మాత్రం పునరావాస గృహాలలో గబ్బిలాల మాదిరి మగ్గాలంట… ఇది ఏ ఆదర్శం? ఏ న్యాయం?? ప్రశ్నలు… ఎన్నో ప్రశ్నలు…ఎటు తేలాలి ఈ ప్రశ్నలు…