అగ్రకుల పేదలకు 10% రిజర్వేషండ్లమీద ఎలాంటి చర్చ లేకున్నా, ఎటువంటి నివేదికల్లేకున్నా, ఏ డేటా లేకున్నా ఆగమేగాల మీద రెండంటే రెండు రోజుల్లోనే రాజ్యాంగ సవరణ (124)తో పాటు బిల్లు కూడా పాసయింది ఉభయ సభల్లో. ఇది చూసినంక మనసంత కలికలి అయింది. ఇది ఎలెక్షన్ స్టంట్, ఎన్నికల స్టంట్, అగ్ర కులాల ఓట్ల కోసమే ఈ బిల్లు అని అంటున్నరు. అగ్రకుల జనాభా 15% అంటున్నరు. వారిలో పేదలు 5% లోపే ఉన్నారనుకుందాము. ఇంత తక్కువ జనాభా ఓట్ల పట్ల ఇంత అనుకూలత ఉన్నప్పుడు, వారి ఓట్లు కావాలను కున్నప్పుడు, జనాభాలో 50%
ఉన్న మహిళల ఓటు బ్యాంకు పట్ల భయంగానీ, వారి ఓట్లు భద్రపరచుకునే చర్యలు కానీ పాలకులకు ఎందుకు లేకుండా పోయింది? దాదాపు 25 సంవత్సరాలుగా మహిళా బిల్లు కోల్డ్ స్టోరేజీలో ఉంచారు. ఎప్పుడో 1996లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును మెజారిటీ లేదంటూ దాదాపు పాతికేండ్లవుతున్నా ఏ రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి లేకుండా పక్కన పెడ్తున్నయి.
పార్లమెంటులో పూర్తి మెజారిటీ
ఉన్నా చట్టం కాని ఒకే ఒక బిల్లు భారత పార్లమెంటు చరిత్రలో, భారత ప్రజాస్వామ్య చరిత్రలో మహిళా రిజర్వేషన్ బిల్లు. ఏకాభిప్రాయం లేదని పక్కన పెడ్తున్న కారణం నిజం కాదు. రాజ్యాంగం ప్రకారం గానీ, పార్లమెంట్ నియమాల ప్రకారం గానీ ఒక చట్టం చేయడానికి జాతీయ రాజకీయ ఏకాభిప్రాయం అక్కర్లేదంటున్నయి. అట్లాంటప్పుడు మహిళా బిల్లెందుకు రావడంలేదు? ఆధిపత్య కుల పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలన్నీ మహిళా బిల్లును కోటాల్లేకుండా తేవాలనేది. జనాభా దామాషా ప్రకారంగా తెస్తే అణగారిన మహిళలకు రాజకీయాధికారం చేకూరుతుండడం సహించలేకనే బిల్లును కోల్డ్ స్టోరేజిలో ఉంచారు.
భారత పార్లమెంటు చరిత్రలో ఏకాభిప్రాయం లేని అనేక వివాదాస్పద ప్రజా వ్యతిరేక బిల్లులు పార్లమెంటు ద్వారా ఆమోదం పొందినపుడు మహిళా బిల్లుకే ఏంటి అడ్డం? ఇక్కడ కులమే అడ్డము. ఆధిపత్య కుల మగ, ఆడవాళ్ళు, అణగారిన మహిళలు చట్టసభల్లో అధికారం చేయడం, రాజకీయం చేయడం సహించలేని కుల జాఢ్యం వల్ల బిల్లులోని కోటాను వ్యతిరేకిస్తూ అతీగతీ లేకుండా చేస్తున్నయి.
అగ్రకుల పేదల విషయంలో ఏమి చర్చలు, ఏమి డిమాండ్ లేకున్నా పాలక పార్టీ ఆగమేగాల మీద బిల్లు చట్టం తెచ్చింది. మరి అదే చిత్తశుద్ధి మహిళా బిల్లు పట్ల ఎందుకు లేకుండా పోయింది. సగం జనాభా ఉన్న మహిళల ఓట్లు వద్దా! మహిళలు కూడా మహిళా బిల్లు కోటాగా వచ్చేవరకు ఓటేయము అని ప్రకటించితేగానీ… మహిళా బిల్లుకు చలనం రాదు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడమనేది రాజ్యాంగ విరుద్ధం కాదు. రాజ్యాంగ మౌళిక స్వభావాన్ని తూట్లు పొడిచే అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్‌కన్నా మహిళా రిజర్వేషన్ బిల్లు అడ్డగోలుది కాదు, న్యాయమైనది. మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా జెండర్ ప్రజాస్వామ్యాల్ని, జెండర్ సమానత్వాల్ని రూపొందించే అవకాశాలేర్పడ్తాయి సమాజంలో. కానీ సమాజామోదం లేని, రాజ్యాంగ విరుద్ధమైన ఓబీసీ బిల్లును కూడా తీసుకొచ్చిన సంకల్పము, పట్టుదల మహిళా బిల్లుపట్ల లేకపోవడం మహిళల అసహాయతే అని చెప్పాలి. ఇంకోటి… ఆధిపత్య కుల సంగాల, వామపక్ష ఉద్యమ సంగాల మహిళక్కూడా కోటాలో కోటా అనేది వారి ఆధిపత్యాలక్కూడా అడ్డని భావించడం కూడా!
50% ఓటు బ్యాంకు పట్ల మగ కులాధిపత్యాలకున్న నిర్లక్ష్యం, లెక్కలేనితనం వల్లనే మహిళా రిజర్వేషన్ బిల్లు రావడం లేదు. జనాభా దామాషా ప్రకారం మహిళా బిల్లు వస్తే ఆధిపత్య కుల మగ, ఆడవాళ్ళకు కిరీటాలు కిందబడ్తాయనే భయంతో కూడా బిల్లు రావడంలేదు.
మహిళలంటే మనుషులనీ, వాళ్ళ జనాభాలో సగభాగంగా ఉన్నారనీ, ప్రజాస్వామిక హక్కులన్నీ వాళ్ళక్కూడా చెందుతాయనీ, ఆర్థిక, రాజకీయ, సాంఘిక వనరులు మహిళలక్కూడా సగభాగమని రాజ్యాంగం చెపుతున్నా కూడా ఆధిపత్య కుల మగస్వామ్యాల ప్రభుత్వాలకు నెత్తికెక్కది. కానీ మరుగుదొడ్లు నిర్మించినం, బహిరంగ మలవిసర్జన నిర్మూలించినమనీ ఇదే మహిళా సాధికారత, ఇదే మహిళా గౌరవాలని డప్పుకొట్టుకుంటున్నయి. మరుగుదొడ్లు అందరి మహిళలకు రాలేదనేది ఒకటైతే, మహిళా సాధికారత మరుగు దొడ్ల వల్ల రాదు, రాజకీయ అధికార చైతన్యం వల్లనే వస్తుంది. మహిళా గౌరవాల్ని, మహిళా సాధికారతల్ని పెంచాలంటే… ముందు మహిళా రిజర్వేషన్లు తీసుకురాండ్రి.
ప్రజామోదంలేని, సమాజా మోదంలేని, రాజ్యాంగ విరుద్ధమైన, మహిళా ప్రస్థావన లేని బిల్లు ‘అగ్రకుల పేదల రిజర్వేషన్ బిల్లు’. అగ్రకులాల కోసం, వారి ఓటు బ్యాంకు కోసం కేవలం 15% ఉన్న అగ్రకులాలకు చక చకా తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. మరి 50% (7% అగ్రకులాలు, 47% అణగారిన కులాలు) మహిళల ఓట్లు అవసరం లేదా? ఓట్లు మహిళలవి, సీట్లు మగవాల్లయా? అగ్రకుల మహిళా సంగాలు, ఫెమినిస్టు సంగాలు ‘మీ టూ, శబరిమలై ప్రవేశం, వన్ బిలియన్ రైజింగ్ 19’ కంటే మహిళా బిల్లు కోటాగా వస్తేనే ఓట్లేస్తాం, లేకుంటే వేయమనే మహిళా ఉద్యమం దేశవ్యాప్తంగా వస్తేనే జెండర్ సమానత్వాల దశ దిశ సాగుతది.