ప్రియమైన ‘సజయా’ ఎలా ఉన్నావ్?
నీతో నా తొలి పరిచయం గౌతమీ గ్రంథాలయం, రాజమండ్రిలో. ఆ పొగడపూల చెట్టు కింద అందరం సాహిత్య చర్చలు చేస్తుండే వేళలో నిన్ను చూశాను. చేతినిండా ఫైల్స్ పట్టుకుని రిసెర్చి స్కాలర్‌గా, ఓ సీరియస్ వ్యక్తిగా అప్పుడే నాకు అన్పించింది. ‘ఉమెన్ రైటింగ్ ఇన్ ఇండియా’ రాసేటప్పుడు లలిత.కె, సూసీతార్లకు సంఘ సంస్కరణ కాలంకంటే ముందే స్త్రీల పత్రికలు చాలా వచ్చాయని గ్రహించి మెటీరియల్ కలెక్షన్ కోసం నిన్ను పంపించారు. అలా, నువ్వు ‘అన్వేషి’ కోసం రిసెర్చ్ అసోసియేట్‌గా 89లో వేటపాలెం, గౌతమీ, గుంటూరు, విజయవాడ, వేమన లైబ్రరీ (హైదరాబాద్) పురాతన లైబ్రరీల్లో నీ అన్వేషణ మొదలైంది కదూ!
సజయా! చిన్నప్పటినుంచీ మీ ఇంటికి వచ్చే రష్యన్ పుస్తకాల ద్వారా ఎక్కువగా చదవడం నీకలవాటయింది. మీ తాతగారు కాకర్ల వెంకటేశ్వరరావు గార్ని ఆ రోజుల్లో ‘పెద కామ్రేడ్’ అనేవారు. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త ఆయన. మీ అత్తయ్య ‘టాన్యా’ నీ పేరు పెట్టారన్నావ్. ఇంట్లో ఉన్న ప్రోత్సాహం వల్ల స్టూడెంట్ ఆర్గనైజేషన్లలో ఎక్కువగా పాల్గొనేదానివి. టాపిక్స్ మీద ఇంట్రస్ట్‌తో, వ్యాసాలు, ఉపన్యాసాలు, పోటీల్లో పాల్గొనడం, గెలుపును సాధించడం నీకిష్టం. 86లో అనుకుంటా రామచంద్రరావుగారి ‘వికాసభారతి’ మోడల్ స్కూల్లో టీచర్‌గా చేరావు. చిన్నపిల్లలకు స్టోరీ టెల్లింగ్‌ను, బాడీ మూమెంట్‌తో చెప్పడం భలే థ్రిల్లింగ్‌గా ఉండేదన్నావ్. వాళ్ళ హావభావాలు, ఆశ్చర్యానందాలు నీకెంతో ఉత్ప్రేరకంగా
ఉండేవి. మనం కలుసుకొనే సందర్బాలు తక్కువే అయినప్పటికీ, కలిసిన ప్రతిసారీ ఆత్మీయంగానే ఉన్నాం. నీ సహచరుడు ఒమ్మి రమేష్‌బాబు కూడా మంచి మిత్రుడు, కవి, సున్నిత హృదయుడు కావటంతో నాకూ, యాకూబ్‌కు మీతో స్నేహం మరింత చిక్కనైంది. మీ సహజీవన ప్రారంభం 98′ నుంచే కదూ! ‘నలుపు’ పత్రిక మొదలైన తర్వాత, ‘తారకం’ గారితో పరిచయం, మహాశ్వేతాదేవి గారి ఆర్టికల్‌ను ట్రాన్స్‌లేట్ చేశావు. ఒకసారి మీటింగ్ కోసం ఆమెను సెంట్రల్ యూనివర్శిటీకి తీసుకెళ్తున్న సందర్భంలో ఆమె రోడ్డు పక్కన నివసిస్తున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి మాట్లాడడం, అవన్నీ నీమీద చాలా ప్రభావం చూపాయన్నావ్. దృఢంగా తయారయ్యానన్నావ్. ఒక సమస్యను ఎన్ని కోణాల నుంచి పరిశీలించవచ్చో, హృదయంతో ఎలా పనిచేయవచ్చో స్పష్టంగా తెలిసిందన్నావ్.
నీ చేతిరాత ముత్యాల్లా ఉండడంతో ‘సవాలక్ష-సందేహాలు’ (1991- 92)ను నువ్వు ముందే కాపీ చేయడాన్ని చాలా ఇష్టమైన పనిగా చేసేదానివి. అందువల్లే ‘ఉమెన్ రైటింగ్ ఇండియా’ (1991) కూడా ముందే చదివే అవకాశమొచ్చింది. ఉమెన్ పేజీలు పత్రికల్లో అప్పుడప్పుడే మొదలైన రోజులవి. మరాఠీలో పత్రిక, హిందీలో ‘మానుషి’ వస్తుండేవి. నీకూ, లలిత, ఉమలకు వచ్చిన ఆలోచన మనం కూడా తెలుగులో పత్రిక ఎందుకు పెట్టకూడదు అని. ‘అన్వేషి’ నుంచి లక్ష్మి, భారతి, రమలతో కలిసి ఆలోచించేవారు. ఏయే టాపిక్స్ అయితే బాగుంటాయి అని చర్చించుకుంటూ, నచ్చిన ఆర్టికల్స్‌ను పక్కకు పెడ్తుండేవాళ్ళు. అలా రెండేళ్ళపాటు పనిచేసిన తర్వాత, కొండవీటి సత్యవతి, ఉష, మనోరమలు వచ్చి మీతో జాయిన్ అయ్యారన్నావు కదూ. మీరంతా కలిసి ఒక కాంక్రీటు దశకు చేరుకున్నారు. పునాది వర్క్ చాలా సీరియస్‌గా, కలెక్టివ్ వర్క్ చాలా బలంగా ఉండేది. ‘అన్వేషి’ లైబ్రరీవల్ల అంతర్జాతీయ సాహిత్యం, బ్లాక్ సాహిత్యం విషయాల పట్ల అవగాహన బాగా పెరిగింది. ఒక యాక్టివిస్ట్ రూపానికి జీవితం తొడుక్కుంది. 99 వరకూ ‘భూమిక’తోనే అనుబంధం. ఎడ్వర్టయిజ్‌మెంట్‌లు, ఎడిటోరియల్స్ అన్నీ టీమ్ వర్క్‌గా చేసేవారు. నీ భుజానికున్న సంచీలోంచి ఎంతో అపురూపంగా నువ్వందించిన ‘భూమిక’ పత్రిక అంతే ప్రేమగా హత్తుకున్నాన్నేను. ఆ తర్వాత స్త్రీల హక్కులు, సమస్యల గురించి ‘వార్త’లో ‘ప్రవాహం’ పేరిట 1 1/2 సంవత్సరాలపాటు ‘కాలమ్’ రాశావు. 2013లో పుస్తకంగా కూడా వచ్చింది. ‘రైతు ఆత్మహత్యలు-మనం’ పేరుతో పుస్తకం కూడా వచ్చింది. దానికి సౌత్ ఏషియా ‘లాడ్లీ’ అవార్డు కూడా వచ్చింది. ప్రజాతంత్ర డైలీలో ‘సంకేతం’ కాలమ్ 2018 నుంచి కాంటెంపరరీ ఇష్యూల మీద కామెంట్. ప్రస్తుతం లేటెస్ట్‌గా ‘యాక్టివిస్ట్ డైరీ’, ‘సారంగ’ వెబ్ మ్యాగజైన్‌లో మొదలుపెట్టావు.
షరీఫ్ గారి వల్ల పరిచయమైన ‘హసన్’ (లామకాన్ వాళ్ళిల్లే) గారితో 1994 నుంచే ‘డాక్యుమెంటరీ’లో ట్రాన్స్‌లేటర్‌గా తెలుగులో చేశావు. వారితో పాటు చాలా జిల్లాలు తిరగడంతో ఫీల్డ్ నాలెడ్జి బాగా పెరిగింది.
ఉరిశిక్షలకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంలో, ఆ ప్రాంతంలో తీసిన ఫిల్మ్ చాలా ఎఫెక్టివ్‌గా వచ్చింది. మూడేళ్ళపాటు చాలా శ్రమ పడ్డారు. ఇంతలో అనుకోకుండా పిలవని చుట్టంలా క్యాన్సర్ నీ కిడ్నీని ఆక్రమించుకుంది. 2001లో తీసేశారు. అయినా ధైర్యాన్ని వీడలేదు. నీ ఆత్మ విశ్వాసంతో గెలుస్తూనే వస్తున్నావు. భూమి హక్కుల కోసం జరిగిన మహిళల పోరాటాలు రికార్డ్ చేయడంతో జాతీయ మీడియా అవార్డు కూడా వచ్చింది.
‘స్త్రీ వాద రాజకీయాలు-వర్తమాన చర్చలు’కు రమా మెల్కోటే, నువ్వు సంపాదకత్వం వహించారు. ‘సవాలక్ష సందేహాలు’ ద్వితీయ ముద్రణను హెచ్.బి.టి. వాళ్ళు వేస్తే లలితతో కలిసి ఎడిటింగ్ మొత్తం నువ్వే చూశావు. కోదండరామ్, రమా మెల్కోటేతో ‘ఫుడ్ సెక్యూరిటీ’ విషయాల మీద పనిచేశారు. అదే సమయంలో రైతు ఆత్మహత్యల మీద అనూరాధ, అంబిలతో కలిసి ఫాక్ట్ ఫైండింగ్‌లకు వెళ్ళేవాళ్ళు.
‘లిఖిత’ ప్రెస్‌ను నువ్వు, రమేష్, నిర్మలలు మొదలుపెట్టారు. 2000లో మొదలుపెట్టి 18 పుస్తకాల వరకూ వేశారు. ‘కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్’ అనే ఆర్గనైజేషన్‌లో జీవన్, అంబి, అను, రేవతి, మొగిలమ్మ, నర్గీస్, లక్ష్మి, ప్రవీణ్, శ్వేత, సుజాత, సత్యలక్ష్మి , వినోదిని, సంధ్య, కొండల్‌రెడ్డి, ఆశ… ఇలా చాలా చాలా మంది కార్యకర్తలున్నారు. రైతుల ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు సహాయం చేయడానికి, పిల్లలకు సపోర్ట్ చేస్తున్నారు. గ్రామాల్లో ఉండే చిన్న సన్నకారు మహిళా రైతుల కోసం ‘నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘం’ మొదలుపెట్టారు. అది సిద్ధిపేటలో నడుస్తోంది. అగ్రికల్చర్‌లో శిక్షణ, ఎడ్యుకేషన్ మొదలైన విషయాలపై పనిచేస్తోంది. నేల బాగుంటే అన్నీ బాగుంటాయి, పునరుజ్జీవింపచేయాలి, చిరుధాన్యాలపై అవేర్‌నెస్ అయితే వచ్చింది కానీ, రైతులకు సాయపడదామన్న ఆలోచన రాలేదన్న నీ భావన కరక్టే. ………….