ప్ర.ర.వే లో చేరాక నాకు ఎంతోమందితో పరిచయం, స్నేహం కలిగాయి. ఆ సందర్భంలో హేమలత గారితో పరిచయం గాఢమైనది. అంతకుముందే ‘నీలిమేఘాలు’లో ఆవిడ ‘జ్ఞాపకాల తెరలు’ చదివినట్లు గుర్తుంది. ”అప్పుడు పాలబువ్వలు తినిపించిన అరిటాకు చేతులు / సుఖదుఃఖాల గోడలను కట్టీ కట్టీ / రాటుదేలిన ఆకురాళ్ళవుతున్నాయి / అప్పుడప్పుడూ / గుండె గుభిల్లున జారి / ఇంటి పెరట్లో బాదంకాయలా రాలి పడుతుంది /.
అరిటాకు లాంటి సున్నితమైన సుకుమారమైన అమ్మ చేతులు ఇంటి చాకిరీలో పడి రాటుతేలిన ఆకురాళ్ళవుతున్నాయని చెప్పడం, గుండె జారి బాదంకాయలా రాలి పడడం అనడం కొత్తగా ఉందే అనుకొన్నాను. హేమలత గారు కవయిత్రి మాత్రమే కాదు ”పరివర్తన, కనలేని కనులు, హరప్పా” మొదలైన కథలు రాసారు. ‘మిస్ పవిత్ర’ నవల కూడా రాశారు.
కవిత్వం రాస్తున్న క్రమంలో పరిణతి సాధిస్తున్న క్రమంలో ”నిన్నటిదాకా / అణచివేయబడ్డాను / ఇవాళ నేను అంతర్జాతీయమయ్యాను” అంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తనదైన గొంతు వినిపించారు.
హేమలత గారు అనగానే నాకు ‘పిండాల బావి’ కవిత గుర్తుకువస్తుంది. ఆమెకు గుర్తింపు తెచ్చిన కవిత అది. ఒరిస్సాలో నయాగఢ్‌లో ఒక పాడుబడ్డ బావిలో దొరికిన ఆరు పిండాల విషయం తెలిసి కరిగి కన్నీరై కలం బట్టి ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షపై తన ఆక్రోశాన్ని తెలిపారు. ఎన్ని యుగాలు గడిచినా, తరాలు గడిచినా పితృస్వామ్య వ్యవస్థలో ఆడపిల్లల పుట్టుక పట్ల సమాజం తన వివక్ష పంజాను ఇంకా విసురుతూనే ఉందని ఆక్రోశించారు. స్త్రీలు అణచివేత గీతాలుగా కాకుండా ఆత్మ గౌరవ గీతాలుగా ఉండాలని ”నీడగా సాగాలన్న చోట / గోడగానే మారాలి / శలభానివి కావాల్సిన చోట / ప్రమిదగానే వెలగాలి” అని అంటారు.
20వ శతాబ్దంలో కూడా ఇంటర్నెట్ వాడడం తెలీని రచయిత్రులు ఉన్న కాలంలో కంప్యూటర్ పరిజ్ఞానం బాగా
ఉన్న వ్యక్తి హేమలత గారు. ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అనే విషయంమీద పరిశోధన చేసి పిహెచ్‌డి తీసుకున్నారు. ప్ర.ర.వే కు జాతీయ అధ్యక్షురాలిగా నాలుగేళ్ళు పనిచేశారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారు. ఎప్పుడూ నవ్వుతూ
ఉండేవారు.
పుట్ల హేమలత గారు నన్నెప్పుడూ హైమా, హైమా అని పిలిచేవారు. పదేళ్ళ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సభల సందర్భంలో విశాఖపట్నంలో మేమిద్దరం ఒకేచోట ఉన్నాం. సభలో నవ్వుతూ, నవ్విస్తూ నవ్వుల వల్లరిలా ఉండే ఆమె అక్కడినుంచి తిరిగిరాగానే అలసిపోయి మూలుగుతూ పడుకునేవారు. మర్నాడు ఆ ఊరినుంచి వెళ్ళిపోయే రోజు. ముందు రోజు రాత్రి మేమిద్దరం ఒకే గదిలోనే పడుకున్నాం. ఎన్నో కబుర్లు కలబోసుకొన్నాం. మాటల మధ్యలో నేను ”ఇదివరకు నా కవితలు పత్రికల్లో వచ్చిన వెంటనే సుధాకర్ గారు ఫోన్ చేసేవారు. కానీ ఇటీవల నా కవిత వచ్చినప్పుడు సార్ గారు ఏమీ మాట్లాడలేదు” అని అన్నాను. అప్పుడు ”హైదరాబాద్ వచ్చాక చాలా బిజీగా ఉంటున్నారు హైమా అందుకే చేసి ఉండకపోవచ్చు” అన్నారు.
అంతలోనే హేమలతగారికి ఫోన్ వచ్చింది. మాట్లాడడం అయిపోయాక ఇప్పుడే సుధాకర్ గారు ఫోన్ చేశారు. ఇప్పుడే నీ ‘సర్ప పరిష్వంగం’ గురించి క్లాసులో పాఠం చెప్పారట అన్నారు. ఆ తర్వాత మళ్ళీ కబుర్లు. తెల్లారి పొద్దున్నే ఆరున్నర గంటలకు హేమలతగారి రైలు. తెల్లవారుఝామున నాలుగ్గంటలకు లేచి కాఫీ తాగి మళ్ళీ పడుకున్నారు. మళ్ళీ ఆరింటికి లేచి సామాను సర్దుకొన్నారు. ఇద్దరం కిందకి వచ్చాము. సూట్‌కేసులు తీసుకొని ఆటోలో పెట్టాను. ఆటోలో కూర్చున్నాక ”వెళ్తున్నాను హైమా” అన్నారు. ”రాజమండ్రి వెళ్ళగానే ఫోన్ చెయ్యండి” అన్నాను. ఆవిడతో నేనన్న చివరి మాటలు అవే. ‘అలాగే’ అన్నారు. ఆ వెళ్ళడం వెళ్ళడం అనారోగ్యం. హఠాత్తుగా ఈ ప్రపంచ బంధాలను తెంచుకుని పరలోక ప్రయాణం. వాట్సప్‌లో ఆవిడ నవ్వు ముఖం చూసినప్పుడల్లా ఆవిడ ఇక లేరన్న కఠిన వాస్తవం గుర్తుకొచ్చి కళ్ళవెంట కారిన కన్నీళ్ళు తట్టుకోలేని బేలగుండె.
సభ రెండవరోజు చెవులకు తెల్లని బుట్టలు పెట్టుకొని ‘బాగున్నాయా హైమా’ అని అడిగితే బాగున్నాయని చెప్పగానే మురిసిపోయారు. ఆ రోజు తెల్ల గళ్ళచీర కట్టుకొని మెడలో కూడా తెల్లని గొలుసు వేసుకొని శ్వేత సుందరిలా మెరిసిపోయారు.
పదేళ్ళ సభ సందర్భంగా ప్రరవే ప్రచురించిన ‘బోల్షివిక్ విప్లవం’ వ్యాస సంపుటికి సంపాదకుల్లో ఒకరుగా వ్యవహరించారు. ఈ సందర్భంలో ‘విహంగ’ ప్రత్యేక సంచిక తెచ్చారు. దళిత స్త్రీల సాహిత్య సంకలనం ప్రచురించే సందర్భంలో నన్ను ఒక వ్యాసం రాయమన్నారు. సమయానికి పంపించమని చెప్పే సందర్భాలలో తరచూ మాట్లాడుకునేవాళ్ళం.
ఆమె హఠాన్మరణం ప్ర.ర.వే కు తీరని లోటు. హేమలతగారి ఆత్మకు శాంతి కలగాలని, ఆ దుఃఖ తీవ్రత నుండి ఆమె జీవన సహచరుడు డా|| ఎండ్లూరి సుధాకర్ గారు, పిల్లలు మానస, మనోజ్ఞలు కోలుకోవాలని కోరుకొంటున్నాను. వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.