హేమలతమ్మ గారితో నా అనుబంధం -వెంకటేశ్వరరావు కె

ఈ సువిశాల ప్రపంచంలో మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకు ఎంతో మందిని కలుసుకుంటాడు. అందరూ బంధువులు కాలేరు. కానీ ఏ సంబంధం లేకపోయినా ఆత్మ సంబంధం కలిగినవారు కొందరుంటారు. అటువంటి వారిలో నా జీవితంలో ఆత్మ సంబంధం కలిగిన వారు డా. పుట్ల హేమలతగారు.

పరిచయం కొన్ని మాసాలే కాని ఒక జీవితానికి సరిపడా తృప్తినిచ్చిన తల్లి హేమలతగారు. వారి గురించి ఈ రోజు ఇలా రాయవలసి వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు. సాగరతీరంలో పదేళ్ల ప్రరవే వేడుకలలో ఎంతో ఆనందంగా గడిపి వచ్చిన మేము, కొద్దిరోజులలోనే విషాధ సాగరంలో మమ్మల్ని వదిలి అనంతలోకాలకు ప్రయాణమై వెళ్లిపోతారని నేనెప్పుడు అనుకోలేదు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్త్రీవాదిగా, కవిగా, రచయిత్రిగా, పరిశోధకురాలుగా ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ‘అంతర్జాలంలో తెెలుగు సాహిత్యం’ కుసుమ ధర్మన్న జీవిత చరిత్ర, అంతర్జాలంలో తొలి తెలుగు పత్రిక ‘విహంగ’ను పరిచయం చేసి శిఖరాగ్రమే అధిరోహించారు. నేను ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌గారి దగ్గర ఎం.ఫిల్‌ పరిశోధన విద్యార్ధిగా 2018లో చేరాను. అప్పడే మా అమ్మ హేమలతగారితో పరిచయమయ్యింది. అప్పటి నుండి నేటివరకు మనల్ని అందరినీ విడిచి వెళ్లిపోయేదాకా ప్రయాణం సాగింది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలబోసిన తల్లి మా హేమలతమ్మ గారు. ఆమె చివరి రోజుల్లో అత్యంత దగ్గరగా చూసిన వాడ్ని నేను. చివరి సారిగా వారి నోటి వెంట ఆ మాటలు వినవలసి వస్తుందని నేను అనుకోలేదు.

శుక్రవారం ఉదయం సమయం సుమారుగా 9.15 కావచ్చును. బొల్లినేని హాస్పిటల్‌లో ఐ.సి.యు. లోకి నేను మందులు తీసుకుని వెళ్లినప్పుడు వెంకట్‌…! నేను చనిపోతాను. ఇక నేను బ్రతకను నన్ను ఇంటికి తీసుకుపోండి. మీ సార్‌ వచ్చారా…? త్వరగా తీసుకుపోండి అని మా హేమలతమ్మ గారు పలికిన చివరి మాటలు. మళ్ళీ ఆ గొంతు వినబడలేదు. కడసారిగా నేను విన్న స్వరం మూగబోయింది. ఎవ్వరికీ అందనంత దూరాలకు నా కవితామ తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. పరలోకపు పిలుపు అందుకుని ఇక ఎప్పటికీ తిరిగిరాని లోకానికి ప్రయాణమై వెళ్ళిపోయారు. మమ్మల్ని దుఖఃసాగరములో వదిలేసి, విహంగంలా ఎగిరి వెళ్ళిపోయారు మా ‘అమ్మ’ హేమలతగారు.

మేడమ్‌ గారితో నా పరిచయం కొద్దికాలమే. కాని ఒక జీవితకాలమంతా అనుబంధం పెనవేసుకున్నది, నన్ను కని పెంచలేదు కాని, తమ సొంత కొడుకు లాగ చూసుకున్నారు. ఒక రోజు తెలుగు యూనివర్సిటీలో నేను భోజనం వడ్డిస్తూ

ఉన్నప్పుడు గత జన్మలో నేను నీకు తల్లినై ఉంటాను వెంకట్‌! ఈ జన్మలో నువ్వు నా రుణం తీర్చుకుంటున్నావు, నాకు కొడుకు లేడనే బెంగ తీర్చావు అని ఎంతో ఆప్యాయంగా చెప్పారు. నేను కలం పట్టి కవితలు రాసేలా చేసి నాకు తొలి కవితా గురువయ్యారు హేమలతమ్మ గారు.

స్త్రీ వాద రచయిత్రిగా ఎన్నో వ్యాసాలు రాసారు. ముఖ్యంగా దళిత స్త్రీల సమస్యలను, సమాజంలో వారికి ఎదురయ్యే బాధలు, అణగారిన వర్గాల స్త్రీల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. ‘నల్ల పొద్దు’ తరువాత మళ్లీ దళిత స్త్రీలపై అటువంటి పుస్తక సంకలనం రాలేదని, నూతన దళిత రచయిత్రులు ఎంతో మంది నేటి కాలంలో ఉన్నారని, వారందరినీ మనం ఈ సమాజానికి పరిచయం చేయాలని ఒక ధృడ సంకల్పంతో ‘దళిత స్త్రీల సాహిత్యం’ అనే పరిశోధక వ్యాసాల సంకలనం తీసుకురావాలని, తెలుగు రాష్ట్రాలలో ఉన్న దళిత రచయిత్రులందరి రచనల్ని, ఈ సమాజానికి తెలియజేయడానికి ఎంతో శ్రమించి ఒక పుస్తక రూపం తీసుకురాగలిగారు. మనం అంతర్జాతీయ సెమినార్‌ పెడదాం వెంకట్‌, ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుదామని మేడమ్‌ గారు చెప్పారు. కాని అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. నేను చిన్న చిన్న కవితలు రాస్తుంటే వాటిని చదివి, తప్పులు సరిచేసి పదాల కూర్పు ఎలా ఉండాలో చెప్పేవారు. ఒక రోజు నేను రాసిన కవితను మా హేమలతమ్మగారు రాస్తూ, వెంకట్‌ మీ సుధాకర్‌గారి తరువాత నీకే నేను ప్రూఫ్‌్‌ రీడింగు చేస్తున్నాను అని అన్నారు. మనం ఇంకా చాలా వర్కు చేయాలి వెంకట్‌ అంటూ ప్రోత్సహించేవారు. ఏదైనా ఒక విషయం ఎవరితోనైైనా చెప్పాలనుకుంటే ముక్కుసూటిగా చెప్పేవారు.

చివరిసారిగా పదేళ్ల ‘ప్రరవే’ కార్యక్రమం విశాఖపట్టణంలో జరిగే కార్యక్రమానికి వ్యాసం రాసే సందర్భంలో ‘ట్రోజన్‌ హార్స్‌’ అనే కవితా సంకలనం నుండి ఒక కవిత చెపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం అనారోగ్యంతో హాస్పటల్‌లో బెడ్‌ మీద ఉన్నప్పుడు రాసిన కవిత అది. నేను చావుని అతి దగ్గరగా చూసి వచ్చాను వెంకట్‌. అప్పుడే చనిపోవాలి నేను. కాని మీ అందరినీ చూడాలని దేవుడు నాకు ఆయుష్షునిచ్చాడు అని గుర్తు చేసుకున్నారు. బహుశా ఇక కొన్ని రోజులే బ్రతికి ఉంటారని ఆ రోజు నాకు తెలియలేదు.

వ్యక్తిగతంగా మేడమ్‌ గారు లేకపోవడం నా జీవితానికి తీరని లోటు. మా అమ్మ హేమలతగారు చిరకాలం కవితామతల్లిగా ఈ కవితా ప్రపంచంలో జీవిస్తూనే ఉంటారు.

ఆశ్రునయనాలతో….

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.