నా బంగారు తీగా!
నా ఏకాంతంలో
ఒక అంకెను మాత్రమే
నీ పక్కన చేరాకే
నేను రెండుగా మారాను
నీతో నిండుగా జీవించాను
నీ సాంగత్యంలో
వసంతమే తప్ప
ఆకురాలు కాలం లేదు
నువ్వు ఏ లోకపు దేవతవో
నా కోసం పుట్టిన ఈకాలపు వనితవో
నా వంశ వృక్షానికి
రెండు గర్భఫలాలనిచ్చావు
నేను నీ చుట్టూ తిరిగానో
నువ్వు నా చుట్టూ పరిభ్రమించావో
ఈ భూమండలం మీద
దాంపత్యపు జంట చీమలమయ్యాం
నవరసాలు కలిసిన
తొలికారు పంట ప్రేమలమయ్యాం
జీవితం అనుక్షణం రసమయం కాదు
సంసార సాగర మథన విషమయం కూడా
ఒక దుఃఖపు మబ్బుల మధ్య
అర్థాకాశంలోంచి రెప్పపాటులో
నక్షత్రంలా రాలిపోయావు
భళ్ళున గాజు పాత్రలా పగిలిపోయావు
అర్థ దేహంతో శూన్యంగా మిగిలిపోయాను
పశ్చాత్తాప వీణ మీద
క్షమారాగం ఆలపించే అవకాశం లేదు
మట్టిపెట్టెలలో నువ్వు
ఒంటరి మంచంలో నేను
నా కలత నిద్రలో
నా గుండె పక్కన పడుకుంటావు
నేను కళ్ళు తెరిచినప్పుడు
వేకువరాగంలా మేలుకొంటావు
నిజానికి నువ్వు నాలోనే ఉన్నావు
నువ్వు విడిచిపెట్టిన చెప్పుల్ని
రహస్యంగా ముద్దుపెట్టుకుంటున్నా
తోలు వాసన కాదు
ఈ చర్మకారుడికి
ప్రేమ వాసన గుభాళిస్తోంది.
(9.02.2019 నాడు తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన నా జీవన సహచరి డా.పుట్ల హేమలత స్మృతిలో)