తెలుసు… ఏ క్షణంలోనైనా
ఆ పిలుపు వస్తుందని
కాదనలేని… కాస్సేపైనా ఆగని
ఆఘమేఘాల పిలుపని
అకారణమైనా… సకారణమైనా
తక్షణమే తల వంచాల్సిందేనని
తల వాలాల్సిందేనని, తెలుసు…
చూపు మాత్రంగానైనా
ఎవరికీ చెప్పకుండా
మౌనంగా నిష్క్రమించాల్సిందేనంటూ
చివరిగా కారిన కన్నీటిబొట్టు
చుట్టూ ఉన్న ఆత్మబంధువుల
రక్త సంబంధుల గుండెల్ని
భోరున పిండేస్తుంది…
అమ్మ భాషను ప్రేమించిన హేమా,
అమ్మానాన్నల తెలుగును
అంతరంగంలో నిలుపుకున్నావు
అంతర్జాతీయంగా నిలపాలనుకున్నావు
అంతర్జాలంలో ‘విహంగ’మై
దిగంతాలు విహరించావు
భావాలకు రెక్కలు తొడిగి
అక్షరప్రియులను ‘విహంగం’లో ఊరేగించావు
‘ప్రరవే’తో ప్రయాణంలో
ఆకాశాలన్నింటినీ చుట్టి వచ్చావు…
ఏకం చేశావు…
హేమా, నువ్వు నడిచివచ్చిన దారంతా
చల్లిన నీ నవ్వులు… ఇప్పుడు
మా గుండెల్లో కన్నీటి ఊటలవుతున్నాయి
ఎన్నెన్నో ఆత్మీయ స్మృతులను
కానుకగా మాకిచ్చి
ఇంత హఠాత్తుగా… అదృశ్యమవడం
… నీకు…న్యాయమా, హేమా…
నిరంతర పనిభారాల సుడిగుండాల్లో
చిక్కుకుపోతున్న మనల్ని
దయాదాక్షిణ్యాలతో భరిస్తున్న దేహాలకు
చిరు విశ్రాంతినిచ్చే బాధ్యత… మనదేనని
ఓ పెద్ద పాఠం… మాకందరికీ నేర్పించావు…
అంతా అయిపోయింది…
ఇక… మాకు నువ్వు లేవు
పిల్లలకు అమ్మ లేదు
జీవితం… ఎంత పరిమళభరితమైనా
ఎంత ఉత్తుంగ తరంగమైనా
వీడ్కోలు పలికే సమయం
కన్నీటి మహా సముద్రం…!