వంటగదిలో చెమటలు కక్కుతూనో
దండెంమీది బట్టల మడతలవుతూనో
ప్రరవే సభలకు పరుగు పరుగౌతూనో
యూనివర్శిటీకి వెళుతూ చెప్పే జాగ్రత్తలవుతూనో
రోజుకొక జ్ఞాపకమై గుర్తొస్తావు
ఓ తల్లీ!
ఎదను తన్నుకొచ్చిన కన్నీళ్ళు ఎప్పటికి మర్చిపోతాం
ఈ దూరాలను కలిపే దారాలని ఎవరైనా కనిపెడితే
నిజంగా కాలచక్రంలో వెనక్కి వెళ్ళగలిగితే
ఎంత బావుణ్ణు!
తండ్రి గరగర, తల్లి పీచుపీచు,
నీవు లేకపోయినా నీ బిడ్డలు రత్నమాణిక్యాలే!
ఈ దుఃఖాన్ని ఎంత మర్చిపోదామనుకున్నా
రోజూ మనిద్దరం చేసిన కబుర్ల కచేరీ జుగల్బందీ పదే పదే గుర్తుకొస్తుంది
మన నలుగురం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను రాగయుక్తంగా పాడుకున్న రాత్రిళ్ళు
కుటుంబ ప్రార్ధనలో నువ్వు చేసిన విజ్ఞప్తులు జ్ఞప్తికొస్తున్నాయి.
ఆవూ-పులి కథలో అమ్మవైనా
అమ్మగా తిరిగిరాని ముగింపును
దుఃఖంతో మేము కొత్తగా రాసుకోవాలి
కాలధర్మంలో కనిపించకుండా పోవడంలో ధర్మమేమిటో మా నలుగురం నిలదీస్తాం
అడుగుడి మీకియ్యబడునని మత్తయి సువార్తలో రాయబడినట్లు
నువ్వు మళ్ళీ మా మధ్యకు రావాలని నిలదీసి అడుగుతాం
జాన్‌కూ జూన్‌కూ ఒక వత్తే తేడాగానీ
కలలు కల్లలైపోయినప్పుడు
వాస్తవానికి జ్ఞాపకానికీ ఎంత దూరం!
ఒక పెనవేసుకున్న తీగ ఎండిపోయినట్లు
వీడ్కోలు చెప్పకుండా వెళ్ళిపోయావని
బిత్తరపోయిన ఎండ్లూరి సుధాకర్
గత్తరైపోయి ఫేస్బుక్కులో తలదాచుకున్నాడు
అల్లుడి పిలుపులు ఇంకా పాతబడనేలేదమ్మా
అత్తగా నీ మురిపాలు ఇంకా తీరనే లేదమ్మా
ఇష్టమైన వంటలు వండిపెట్టే చేతులతో ఎక్కడికి మాయమయ్యావు
కష్టమైన రోజుల్లో జాగ్రత్తలు చెప్పిన గొంతు ఎలా కనుమరుగయింది
రాజమండ్రి వచ్చినప్పుడు బొమ్మూరు కొండెక్కి నువ్వు బస్సెక్కి తెలుగు పీఠానికి వస్తున్న జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటా…