ఎప్పుడు ఫోన్ చేసి అలా పిలిచినా
ఏంటి సుమీ ఎలా ఉన్నావు తల్లీ
అని ఆప్యాయంగా పలకరించేది
తొలి పరిచయం 2019-9-11వ తేదీ
ఏ.పీ.ఎక్స్‌ప్రెస్‌లోనే…
ఇదిగో అమ్మడూ అన్నారు నా పేరు సుమన
అక్కా అన్నాను
ఔనా సర్లే సుమనా నాకేమో ఆ పై బెర్త్
వచ్చిందీ కాస్త నువ్వు తీసుకోగలవా
నేనిక్కడే కూచుంటా ఎక్కలేను అన్నది
ఓ సర్లేక్కా అంటూ పైకెక్కి అక్కడినుంచే
వారి మాటలకూ నవ్వులకూ స్పందిస్తూ…
ఒక స్వేచ్ఛాయుతమైన ఆనంద వాతావరణాన్ని
తొలిసారి అనుభవించాను. కొత్తవాళ్ళు తమ
గురించి చెప్పండమ్మా అన్నది
నేను నా కుటుంబం గురించి చెప్పా
వామ్మో నేనింకా ముచ్చటగా ఉందీ పిల్ల
మంచి సంబంధం చూద్దామనుకున్నా
అన్నది. నేను అక్కా మరీ అంతగానా
అన్నాను నమ్మలేనన్నట్లూ. నిజవే తల్లీ
నీమీదొట్టూ అన్నదీ…
ఢిల్లీలో ఉన్న మూడు రోజులలో నాకు
చాలా ఆత్మీయురాలైనది. కలిసి సరోజినీ
మార్కెట్‌కు వెళ్ళాం అక్కడ ఎక్కువ తిరగ
లేక కాళ్ళు నొప్పులంటూ బాధపడుతుంటే
ఓదార్చి తనూ తోడుగా నేనూ ఇద్దరం
తిరిగి ఆంధ్రా భవన్‌కు చేరుకున్నాం
నా దగ్గర ఆయుర్వేద మాత్రుంటే ఇచ్చాను
అబ్బో బాగా తగ్గింది నీ మాత్రకి అంటూ
ఆనందంగా చెప్పింది.
అప్పటినుంచీ అప్పుడప్పుడూ ఫోనులలో
మీటింగులలో తనతో నా కష్టసుఖాలు
చెప్పుకునేదాన్ని. ఇంత బాధతో నువ్వేం
సద్దుకోనక్కర్లా వచ్చేయ్ రాజమండ్రికి
చదువుంది, డాన్సూ సంగీతం వచ్చు
నీకు చక్కని భవిష్యత్తుండేలా నే చూస్తాను
అని భరోసా ఇచ్చింది
ఫిబ్రవరి 14న నందలూరులో సదస్సులకు
వచ్చినప్పుడు హ్యాపీ వాలెంటైన్స్‌డే
అంటూ తనదైన బాణిలో చిక్కగా నవ్వేసింది
ఇద్దరం పురాతన సౌమ్యనాధాలయానికి
వెళ్ళాము ఆ ఆలయ విశేషాలు అడుగుతూ
ప్రతి శిల్పాన్నీ ఫోటోలు తీసుకున్నది
ఎంచక్కా చూపించావే ఏవైనా నీకు
ఓపిక ఎక్కువే అంటూ మెచ్చుకుంది
విహంగ పత్రికలో ఏవైనా వ్రాయమంటూ
ప్రోత్సహించింది నాకు స్మార్ట్ ఫోనూ
లేదు సిస్టం లేదు ఎలా అంటే
చేత్తో రాసి పంపించు. నేనే సిస్టంలోకి
ఎక్కించుకుంటానంటూ భరోసా ఇచ్చింది
గోదావరి పుష్కరాల సమయంలో
రాజమండ్రిలో నాట్య ప్రదర్శనకు వెళ్ళాను
మా ఇంటికి రమ్మంటూ చాలా ఫోన్లు చేసింది
రద్దీ ఓవైపు, నాతో వచ్చిన బృందం ఓ వైపూ
వెళ్ళలేకపోయాను ఆ రోజు సాయంత్రం సభకు
సుధాకర్‌గారు అతిధి ఆ ప్రాంగణంలోకి
వస్తే నన్ను చూడచ్చనీ నీ ఇంటికి తీసుకెళ్ళచ్చనీ
తను వచ్చింది. దురదృష్టం ఆ రద్దీలో
కలుసుకోలేకపోయాను. ఫోనులో మాత్రం
ఎప్పుడూ తన పలకరింపూ, ఆప్యాయత
ఉట్టిపడేలా నా చెవులలో మారుమోగుతూనే ఉంటుంది
ఈ మధ్య శాంతి మంత్రం ఏ వేదంలోనిదీ
అనడిగింది నేను చెప్తే తెలుసమ్మలూ
నీ దగ్గరనుంచీ సరైన జవాబు వస్తుందనీ
నువ్వేం సామాన్యురాలివికాదు ఏంటో
నీలాంటి వాళ్ళకే దేవుడు కష్టాలు పెడతాడు
అని మెచ్చుకుంటూ బాధపడింది.
ఇలా మనసుకు దగ్గరగా ఓదార్పులా
ఆశను చిగురింపచేసేలా ఆత్మీయంగా
తనకూ నాకూ మధ్య చాలా జ్ఞాపకాలు
ఉన్నాయి. తనే ఓ జ్ఞాపిక అవుతుందని
మాత్రం ఎప్పుడూ ఊహించలేదు ఇప్పుడూ
నమ్మకంగా లేదు. తనున్నది నాతో నా మనసులో
నాలాంటి ఎందరితోనో మనసున మనసై…
అక్కా అంతేకదూ… హేమలతక్కా…