ఒక ఊరిలో భీముడు అనే బలశాలి ఉండేవాడు. అతని భార్య అంజమ్మ. ఇద్దరికీ చాలా అహంకారం ఉండేది. ఎవరినీ లెక్కచేసేవారు కాదు. ఆ వీథిలోని వారు వారితో మాట్లాడడానికి భయపడేవారు. దీంతో భీముడు తన ఇంట్లోని చెత్తాచెదారాన్ని వీథిలోకి విసిరేసేవాడు. అంతేకాక మురుగు నీటిని కూడా వీథిలోనికి విడిచి పెట్టేవాడు. ఆ వీథిలో వారెవ్వరికీ అతనినెదిరించే ధైర్యం లేక ఊరుకున్నారు. కొద్ది రోజులకు మురుగు నీరు బాగా ఎక్కువై దోమలు, ఈగలు పెరిగి వాటి ప్రభావంతో భీముడు మరియు అతని భార్య ఇద్దరూ జబ్బుపడ్డారు. కనీసం తమ పనులు తాము చేసుకునే స్థితిలో కూడా లేకుండా పోయారు. అప్పుడు అదే వీథిలో ఉండే రమేష్ అనే అబ్బాయి వాళ్ళ అవస్థను చూసి జాలిపడి ఒక డాక్టర్‌ను భీముడి ఇంటికి తీసుకువచ్చాడు. డాక్టర్ పరిసరాలను గమనించి భీముడితో మీ అనారోగ్యానికి కారణం మీ పరిసరాలే. కావున మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి మందులు ఇచ్చి వెళ్ళాడు.
అప్పుడు రమేష్ తన స్నేహితులతో కలిసి వీథిలోని చెత్తాచెదారాన్ని ఎత్తి ఊరికి దూరంగా వేశాడు. మురుగునీటి కాలువను కూడా సరిచేసి నీరు పారేటట్లు చేశారు. దాంతో భీముడి ఆరోగ్యం బాగుపడడమే కాక, పరిసరాల పరిశుభ్రత కూడా మెరుగైంది. భీముడు తన తప్పును తెలుసుకున్నాడు. రమేష్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. అప్పటినుంచి అతను చాలా మారిపోయాడు.