రామాపురంలోని సుబ్బారావు చాలా గర్విష్టి. చాలా డబ్బున్నప్పటికీ ఎవరికీ సహాయం చేసేవాడు కాదు. ఆ ఊరి ప్రజలు అతనికి దూరంగా ఉండేవాళ్ళు. ఆ ఊరికి ఒకరోజు కొత్తగా ధర్మరాజు అనే వ్యక్తి భార్యాబిడ్డలతో నివసించడానికి వచ్చాడు. ఊరివాళ్ళు అతనికి సుబ్బారావు గురించి చెప్పి అతనికి దూరంగా ఉండమని చెప్పారు. ధర్మరాజు సుబ్బారావుని మార్చే రోజు కోసం ఎదురు చూడసాగాడు.
ఒకరోజు సుబ్బారావు పక్క ఊరినుండి ఎద్దుల బండిమీద గింజల సంచులు వేసుకుని వస్తూ, దారిలో బండి చక్రం దిగబడి పోవడంతో ఆగిపోయాడు. సంగతి తెలిసిన ఆ ఊరి ప్రజలెవరూ సహాయం చేయడానికి వెళ్ళకపోవడంతో సుబ్బారావు అలాగే ఉండిపోయాడు. అప్పుడు ధర్మరాజు ప్రజలతో ”నేను సుబ్బారావుని చంపడానికి వెళ్తున్నాను” అని చెప్పి సుబ్బారావు దగ్గరకు వెళ్ళాడు. కానీ ధర్మరాజు వెళ్ళి సుబ్బారావుకు సహాయం చేసి బురదలో దిగబడిపోయిన బండిని బయటికి తెచ్చాడు.
సుబ్బారావు చేతులు జోడించి ”ధర్మరాజూ! నేను ఇన్ని రోజులూ ఇతరుల సహాయం అవసరం లేదనుకున్నాను. నన్ను క్షమించు” అని అన్నాడు. అప్పుడు ఊరి ప్రజలు వచ్చి ధర్మరాజుతో, ”సుబ్బారావుని చంపడానికి వెళ్ళి నువ్వు అతనికి సహాయం చేసినావెందుకు?” అని ప్రశ్నించారు. దానికి ధర్మరాజు ”నేను సుబ్బారావులోని గర్వాన్ని చంపడానికి వెళ్ళాను. అది సాధించాను” అని బదులిచ్చాడు. ఆ రోజునుండీ సుబ్బారావులో మార్పు వచ్చింది. ఊరి ప్రజలంతా కలిసి మెలిసి హాయిగా ఉన్నారు.