హిందూ ఆధిపత్య కుల పితృస్వామ్యము చావందే జోగినీ వ్యవస్థకు చావు రాదు. ఈ పితృస్వామ్యాల కామ దాహాల కోసం అణగారిన మహిళలను, ముఖ్యంగా అంటరాని మహిళలను బలిజేస్తున్నాయి. ఎన్ని సంస్కరణలొచ్చినా, చట్టాలొచ్చినా జోగినీల వ్యవస్థను పోగొట్టలేకపోతున్నరు. బెంగుళూరు నాగరత్నమ్మ నుంచి స్వచ్ఛంద సంస్థలతో పోరాడుతున్న గ్రేస్ నిర్మల, నీలయ్య, విజయ్కుమార్ల, జోగినీ వ్యవస్థ నుంచి బైటికొచ్చిన మొదటి మహిళ ఆజమ్మ, ఇంకా అనేక ఎన్జీఓలు, దళిత సంఘాలుఉద్యమిస్తూనే ఉన్నా జోగమ్మల వ్యవస్థ నిర్మూలించబడడం లేదు. ఇంకా ప్రభుత్వ సంస్థలైన NHRC, NCW, NCRC, NC SC/ST కమిషండ్లున్నా ఈ వ్యవస్థ నిర్మూలన కావడంలేదు.
జోగినీ నిషేధ చట్టం వచ్చి ముప్ఫయ్యేండ్లు దాటినా… ఇంకా జోగినీ అంకితోత్సవాలు జరుగుతూనే ఉన్నయి. ఇవి దళిత బాలికల్ని దేవుడికిచ్చే తతంగం కాదు, ఊరి మగవాళ్ళకిచ్చే అంకిత తతంగంగా చూడాలి. ఇక తెలంగాణలోనైతే ‘ప్రభుత్వ బోనాల ఉత్సవాల పుణ్యమాని జోగినీలు, శివసత్తులు యిచ్చల్లిండ్రు. ప్రజా ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో కూడా శివసత్తుల ఉత్సవాలు జరగడం శోచనీయము.
ఆ మధ్య ‘జోగినీ వ్యవస్థ నిర్మూలన’ మీద తిరుపతిలో ఒక జాతీయ సెమినార్ జరిగింది. దేశం నాలుగు దిక్కుల్నుంచి బసివి, మాతమ్మ, మాతంగి, మురళి, పొరకలు, బేడియాలు, కూంజ్డా, ‘నట్’ (యోన్బంద్) ద్రౌపదీలు, దేవదాసీలు వాళ్ళ పిల్లలను తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి వచ్చిండ్రు. చరిత్రలో కొద్దిమందిగా ఉన్న సవర్ణ మహిళల మీదున్న ‘సతి’, పునర్వివాహ నిషేధం, బాల్య వివాహాలు వంటి అనేక దురాచారాలు సంస్కరణోద్యమాల ద్వారా రూపుమాసిపోయినయి. కానీ దేవదాసీ వ్యవస్థను నామరూపాల్లేకుండా చేయలేక పోతున్నము.
ఈ సెమినార్లో కేరళ పరిశోధకుడు లూయిస్ బీ మాట్లాడుతూ క్రీ.శ. తొమ్మిదో శతాబ్దంలో కేరళ రాజు కులశేఖర్ తిరుమాల్ తన బిడ్డను శ్రీరంగపట్నం ఆలయంలో దేవదాసీని చేసిండట. ఆనాటి సమాజంలో అది ఘనము, గౌరవమట. ఆధిపత్య కులాల ఆడపిల్లల్ని దేవుడికి దాసిత్వం చేసే తతంగమప్పుడు… వారికి భూములు, నగలు, వజ్రవైఢూర్యాలు, సంపదలు ఆస్తులుగా పెట్టేవారట. ఆ దేవదాసీలను పవిత్రులుగా, అపురూపులుగా చూసేదట ఆ సమాజము. దేవదాసిని చేసిన కుటుంబానికి స్వర్గం దొరుకుతుందనీ, దేవదాసిని పెండ్లి చేస్కున్న పురుషుడు పునర్జన్మ నుంచి విముక్తుడవుతాడనే నమ్మకాలుండేవట. రాజులు దేవదాసీలను పెండ్లి చేస్కోనీకి పోటీ పడేవారట. పెండ్లి చేస్కోవడం ఒకవరంగా భావించేవారట. దేవదాసీ వ్యవస్థ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి దాకా కొనసాగిందంటడు. జోగమ్మ వ్యవస్థకి, దేవదాసీ వ్యవస్థకి తేడా
ఉందంటడు. జోగమ్మలు పేద దళిత కూలీల మహిళలు… ఊరంతటికీ వెట్టి లైంగిక సేవలందించాలి. భిక్షమడిగి బత్కుతుంటరు. ఎలాంటి ఆస్తిపాస్తులు పెట్టరు. పెండ్లి చేస్కోవడం దోషంగా చూస్తారు. వారి పిల్లలకు తండ్రి పేరు కూడా ఉండనివ్వరు. దేవదాసి పై కులాల్లో ఉండి సమసిపోయింది (అన్ని గౌరవాలతో). కానీ దళిత కులాల్లో చాలా అమానవీయంగా… తిండిలేని, ‘వెట్టి సెక్స్ సర్వీస్’ కులం, మతం పేరుతో కొనసాగు తోందని చెప్పాడు.
వారణాసి నుంచి సబిహ బానో (జనసేన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్) కొద్ది మంది భజనకారిణుల్ని తీసుకొచ్చి మాట్లాడింది.
ఉత్తరప్రదేశ్ గ్రామాల్లోని దళిత వాడల మీదబడి ఆడపిల్లల్ని ‘భజన’ కోసం అని చెప్పి తరలిస్తారట. శివుడి రాజ్యంలో భజన చేస్తే వచ్చే జన్మలో మంచిగ బత్కుతారనీ, దేవుడి దయ దొర్కుతదనీ, మంచి తిండి, వసతి సౌకర్యాలుంటాయనీ, భజన చేసి బత్కొచ్చని మాయమాటల్తో తీసుకొస్తారట ఆశ్రమాలకు. పగలంతా ఆటపాటలు, భజనలు చేయడం, పాచిపనులు చేయడం, ఆశ్రమాలు ఊడ్వడం, రాత్రికి సాధు, సన్యాసీల కామ కలాపాలు తీర్చే పనుల్లో దించుతారట. తర్వాత వాళ్ళను తమ గ్రామాల్లోకి కూడా పోనివ్వని పరిస్థితుల్ని కల్పిస్తారట. వాళ్ళ కుటుంబాలతో సంబంధాలు లేకుండా చేస్తారట. మా బిడ్డలు దేవుని సేవలో ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారట.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ నుంచి ‘దక్షా అంబోర్ సొపైటీ’లో పనిచేసే బేడియా, సాసి కులాల నుంచి వచ్చిన శివమ్ఛారి, అరుణఛారి, భారతి సొనకర్ చెప్పిన నిజాలు నిద్రబోనియ్యలే. గ్వాలియర్ గ్రామాల్లో భూస్వాముల ఇండ్లకు బోయి వారికి, వారి బంధు జనాల లైంగిక అవసరాలు తీర్చనీకి కొన్ని దళిత కులాలు (బేడియా, సాసి, కార్కోర్) వ్యవస్థీకృతంగా ఏర్పాటు చేస్కున్న ఆధిపత్య కుల మగ దుర్మార్గుల గురించి విప్పి చెప్పారు. ఈ కులాల్ని కేవలం తమ సెక్స్ అవసరాలకు వ్యవస్థీకృతంగా పెట్టుకున్నరు వాళ్ళు. పొద్దున కోడి కూయక ముందే పోయి రాత్రెప్పుడో పొద్దుబోయినంక ఈ బేడియా ఆడవాళ్ళు ఇండ్లకు చేర్తరట. వాళ్ళు పెండ్లిళ్ళు చేస్కోవద్దు, వాళ్ళ మగపిల్లలక్కూడా పెండ్లి నిషేధం. ఆడపిల్లలకు ఇదే పరంపరనట… ఎదురు తిరిగితే హింసలు బెట్టి చంపుతారట. 1958లో మొట్టమొదటిసారి రామ్ స్నేహి అనే (బేడియా) అతను అనేక నిర్బంధాల్లో పెండ్లి చేస్కున్నాడట. అతని మనవడు శివాఛారి వచ్చిండు. ఇంక అనేక కతలు దేశం నలు మూలల్నుంచి వినిపించారు. అంతా ఒకటే సెక్స్ సర్వీసుల్ని తుదముట్టించాలి అని….