వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియాతి

ప్రియమైన అమ్మా! నువ్వు ఒట్టి అమ్మవే కాదు. నా స్నేహితురాలివి కూడా! అరుదైన కానుకవి. పి.యమ్‌.మణి పేరుతో రాసేదానివి. నేను ఈ రోజు అంతో ఇంతో రాస్తున్నానన్నా అది నీ వల్లే! అమ్మా నువ్వంటే చాలా ఇష్టం. నీ గురించి అప్పుడెప్పుడో ‘ఊబిలో అమ్మ’ అని కవిత కూడా రాశాను. మా బాల్యంలో మాతో పాటు నువ్వు పిల్లలా కలిసిపోయేదానివి. రోజూ అందరికీ ‘చందమామ’, బాలమిత్రల కథలు విన్పిస్తుండేదానివి. మిగతా అమ్మల్లా కాక నువ్వు వేరుగా ఉండేదానివి. శంషాబాద్‌లో అప్పట్లో వీణ కూడా నేర్చుకునేదానివి. ఎంబ్రాయిడరీ వర్క్‌, రకరకాల పూసల బ్యాగులు అల్లడం, అరల్‌డైట్‌ పెట్టి గాజు సీసాల్తో మందిరాలు తయారుచేయడం నేర్పించేదానివి. మహిళా మండలికి నాటకాలురాస్తే, వాళ్ళు

వేసేవాళ్ళు. చిన్న చిన్న కథలు, సీరియల్స్‌ రాస్తే ప్రచురింపబడేవి. 1968 ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా రాసేదానివి. అలా సుమారు 1998 వరకూ రాశావు. ఆదర్శాల ఆరాటంలో ‘జీవిత పోరాటం’ సీరియల్‌గా వచ్చింది. కల్కివాణి, ప్రగతి, జ్యోత్స్న, జనమిత్ర, వనిత, మహిళ, ప్రజాతంత్ర, పత్రిక, జ్యోతి, ఆంధ్రభూమి, భూమిక, వార్త వంటి పత్రికల్లో తరచు నీ రచనలు వస్తుండేవి. ఆ రోజుల్లో చాలామంది సీరియల్స్‌ని చింపి పుస్తకాలుగా కుడుతుండేవారు. అలాంటి పుస్తకాలు నువ్వు కూడా కుట్టి, చిన్నపాటి లైబ్రరీగా తయారుచేశావు. అవన్నీ చదువుకున్నాను. రేడియో స్టేషన్‌లో కూడా చదివేదానివి. మిగతావాళ్ళ కంటే మా అమ్మ ప్రత్యేకం అనిపించేది. నలుగురు పిల్లలమవడం, వచ్చేపోయే చుట్టాల సంఖ్య ఎక్కువ కావడంతో నీకస్సలు టైం మిగిలేది కాదు. దొరికిన ఏ కాస్త సమయంలోనో పుస్తకం చదువుతూనో, రాస్తూనో కనబడేదానివి. నీ పెనుగులాట నాకప్పుడు అర్థం కాలేదు. కానీ బీజం పడిందప్పుడే! అమ్మలా రాయాలి, చదువుకోవాలి. నాకంటూ సమయాన్ని మిగుల్చుకోవాలి, హాయిగా రాసుకోగలగాలి అనుకునేదాన్ని కానీ, అప్పటికి ఏం రాయాలో తెలియని పదేళ్ళ వయస్సే కదా! ఆ తర్వాత సిటీకి షిఫ్ట్‌ అయ్యాక, శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర గ్రంథాలయంతో పరిచయం ఏర్పడింది. సురేషన్నతో కలిసి లిఖిత మాసపత్రికను నడిపేవాళ్ళం. ఆ రోజులన్నింటినీ ఇప్పుడు తల్చుకుంటుంటే విచిత్రంగా అన్పిస్తోంది. అమ్మా, నిరీక్షణ, పెంచిన ప్రేమ, ప్రేమాయణం, నేటి బాలలే రేపటి విప్లవకారులు, విధిలిఖితం, నేను నా ఉద్యోగం, కుక్క తోక, ప్రయాణం వంటి కథలు, సీరియల్స్‌ రాశావు. కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు, మరణాలు నిన్ను రచనను ఆపేట్లుగా చేశాయి. ఆధ్యాత్మిక రచనవైపు దృష్టి మళ్ళింది. ‘అవతార్‌ మెహర్‌బాబా’ను నమ్మడం మొదలుపెట్టావు. ‘రియల్‌ హాపీనెస్‌ లైఫ్‌ ఇన్‌ అదర్స్‌ హాపీ’ అనే సూక్తి నీకు నచ్చింది. ‘అవతార్‌ మెహర్‌’ మాసపత్రికలలో నెలనెలా వ్యాసాలు వచ్చేవి. ‘అన్వేషి’ అనే పేరుతో పుస్తకాన్ని కూడా ప్రచురించావు. బాబా వ్యాసాలున్నా యందులో.

ఇసామియా బజార్‌లో బాబా సెంటర్లో నీ పాటలు విన్న జ్ఞాపకం నాలో ఇంకా కదులుతూనే ఉంది. మంచి మంచి పాటల్ని కూడా రాసేదానివి. అమ్మా! నువ్వొక నల్ల గౌను (ఎంత బాగా కుట్టావో అది) కుట్టావు కదా! నాకు చాలా ఇష్టంగా ఉండేది. రకరకాల డిజైన్లలో మాకు డ్రెస్సులు కుట్టేదానివి. నువ్వు కుట్టే పంజాబీ డ్రస్సుల్ని చూసి, ఓఁ పంజాబీ అమ్మాయ్‌ అని పిల్చేవాళ్ళారోజుల్లో. తాతయ్య వల్ల నీలో సంగీతాభిరుచీ, సాహిత్య పఠనాసక్తి కలిగింది కదూ! ఇన్ని విద్యలున్న, ఇంత చైతన్యవంతురాలైన నీలాంటి ‘అమ్మలు’ ఎందరో, ఎందరెందరో కుటుంబాలలో కునారిల్లిపోతున్నారు. ’60 ఆ ప్రాంతంలో స్త్రీలు ఎక్కువ సంఖ్యలో రచనలు చేశారు. యద్ధనపూడి సులోచనారాణి నీకు మిత్రురాలే కదమ్మా! ఈ మధ్యే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. బాధ్యతల చట్రంలో నలిగిపోతున్న రచయిత్రులనేకులు కదూ! స్త్రీలలోని అంతర్గత శక్తి అంచనాకు అందనంత ఎత్తులో ఉన్నా, విలువ లేకుండానే పోతోంది. కొన్నికొన్నిసార్లు పి.మంగమణి అనే పేరుతో రాశావు. మెహర్‌బాబా అవతార తత్వంపై ‘పరిశోధనా గ్రంథం’ రాశావు. దానికి ఉత్తమ పరిశోధనా గ్రంథంగా విజయవాడలో అవార్డునిచ్చి సత్కరించారు.

ప్రారంభంలో నీ రచనలన్నీ, సమాజవైఖరి గురించి, స్త్రీ పురుష వివక్ష పోవాలనీ, మానవత్వం నిండిన మనుషులతో ఈ సమాజపు చెరువంతా నిండిపోవాలనీ, కుల, మత, వర్గ రహిత సమాజ ముండాలనీ, మనుషులంతా ఒకటేననీ, పేద, ధనిక వర్గాలుండకూడదనే ఇతివృత్తాన్నే ప్రధానంగా తీసుకున్నావు. జీవితంలో వచ్చిన ఎన్నో మార్పులు అలిసిన నీ హృదయాన్ని ఒక నిర్లిప్తత వైపు నడిపించాయి. నీకు తెలీకుండానే ఆధ్యాత్మికం వైపు మనసు మళ్ళింది. ఐనా, రచనను ఆపలేదు. మెహర్‌ మానవ స్వభావాన్ని విశ్లేషించిన తీరు నచ్చుండుంటుంది. నోములు, వ్రతాలు,, మొక్కులు లేకుండా మానవసేవ చేయడమే గొప్పదని చెప్పే వ్యాఖ్యలు బహుశా నిన్ను ఆకర్షించి ఉండొచ్చు. ఈ మధ్య అవీ మానేశావ్‌? అనారోగ్యం నిన్ను ఆవహించి

ఉంది. అమ్మా! ఎప్పటికీ నీ కూతురిగానే

ఉండాలనే కలగంటూ…

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.