తాలిబాన్ మత సంస్థ పుట్టుకతో మొదలయిన మత సంస్థలు చీమల పుట్టల్లాగ పుట్టుకొచ్చాయి. వాటిలో అత్యంత భయంకరమైనది, ప్రమాదకరమైనది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐ.ఎస్.ఐ. ఇరాన్లో స్థావరం ఏర్పరచుకుని దాడులకు తెగబడింది. అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ మొదలగు దేశాలపై దాడులు చేసి వేలాదిమంది ప్రాణాలను బలిగొంది. ముస్లిం దేశాలను కూడా వదిలిపెట్టలేదు. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘన్ దేశాల ధీర, సాహస యువకులు మిలిటెంట్లను ఎదిరించి హతమార్చబడ్డారు. ఆఫ్ఘన్లో తాలిబన్లను ఎదిరించిన జకియా ఔకీ అనే జర్నలిస్టును రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మెషీన్గన్లతో కాల్చి చంపారు. ఇరాన్లో రాకీ గ్రామంపై దాడికొస్తున్నారని తెలిసి గ్రామస్థులు ఊరు వదిలి వెళ్ళిపోయారు. రఖియా అనే యువతి కుటుంబీకులు కూడా వెళ్ళారు. కానీ రఖియా వెళ్ళలేదు. అంతకుముందే రఖియా ఐఎస్ఐ ఉగ్రవాదుల అరాచకాలను గురించి ఇతర దేశాలలోని పత్రికలకు వ్యాసాల ద్వారా తెలియజేసింది. ఐఎస్ఐ ఉగ్రవాదులు ప్రవేశించినపుడు కూడా ఇబ్రహీం అనే మారు పేరుతో వ్యాసాలు రాస్తూనే ఉంది. మిలిటెంట్లు ఇబ్రహీం అనే పేరుతో రాస్తున్న రఖియాను కనుగొని బహిరంగంగా కాల్చి చంపారు.
అత్యాచార బాధిత యువతి నదియా మురాద్ ఉత్తర ఇరాక్ సిన్జార్ ప్రాంతంలోని కోజో అనే చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టింది. నదియా తల్లిదండ్రులకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. నదియాకు అక్క ఉంది. పేదరికం వలన ఎవరూ పెద్ద చదువులు చదవలేదు. టీనేజీలో ఉన్న నదియా హిస్టరీ టీచర్ కావాలని కలలు కంటూ ఉండేది. ఐఎస్ఐ ఉగ్రవాదులు 2014 ఆగస్టు 15న దాడి చేసి నదియా కళ్ళముందే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కను హతమార్చారు. 21 సంవత్సరాల అందమైన నదియాను చెరపట్టారు. వాళ్ళలో చేరడానికి నిరాకరించిన పురుషులను నరికిపారేశారు. గ్రామాన్ని భస్మం చేశారు. ఆడవాళ్ళపై అత్యాచారం చేశారు. నదియాను చెరపట్టిన మిలిటెంట్లు మూడు మాసాల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమె శరీరంలో గాయాలు లేని చోటంటూ లేదు. శారీరకంగా అనేక చిత్రహింసలకు గురయింది. అనంతరం ఒకదాని తర్వాత మరొక ప్రాంతంలోని వేశ్యాగృహాలకు అమ్ముడుపోయింది. ఆమె అనుభవించిన నరకాన్ని రాయడానికి మాటలు చాలవు. విటులు సిగరెట్లతో కాల్చేవారు. వ్యభిచార గృహ నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లుగా కొట్టేవారు. ఆమెతో చేయరాని పనులు చేయించేవారు. అంతటి నరకంలోను నదియా తప్పించుకునే మార్గాన్ని వెతుక్కొనే ప్రయత్నం చేస్తూ ఉండేది. చివరకు ఆమె ప్రయత్నం ఫలించి బయటపడింది.
బయటపడిన తర్వాత ఆమె మనోనిబ్బరం కోల్పోలేదు. ధైర్యం చెక్కుచెదరలేదు. యజిది తెగకు చెందిన మహిళలు, యువతులు ఐఎస్ఐ ఉగ్రవాద మూకల అత్యాచారాలకు గురవుతున్నారని, పారు గ్రామంలో జరిపిన భయంకర మృత్యు కార్యకలాపాలను పూసగుచ్చినట్లు ఒక వ్యాసం రాసి ఒక వార్తాపత్రికకు పంపింది. దాంతో నదియా జీవితం మలుపు తిరిగింది. అష్టకష్టాలు పడుతూ ఎదురైన ఆటంకాలను, ఇబ్బందులను దాటుకుంటూ చివరకు భద్రతా మండలిలో కాలుపెట్టింది. ఆ వేదికపై నుంచి తమ దేశంలో జరుగుతున్న భయంకర మారణకాండ, మూడువేల మంది మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలను గురించి,శారీరక హింస గురించి, సెక్స్ వ్యాపారాన్ని గురించి పొల్లుపోకుండా వివరిస్తూ, స్వయంగా తాను అనుభవించిన ఘటనలను తేటతెల్లంగా తెలియచేసింది. ఆమె
ఉపన్యాసం అందరినీ కంట తడి పెట్టించింది.
ఐ.రా.స. నదియాను ‘డిగ్నిటీ ఆఫ్ సర్వైవర్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్’ విభాగానికి గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. బాధిత మహిళల బాధలు, శరణార్ధుల సమస్యలు, బాధలు మొదలైనవి తెలుసుకుని వారికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఐక్యరాజ్యసమితి తరపున ప్రపంచ దేశాలను పర్యటించే అవకాశంం లభించింది. నదియా తాను పర్యటించిన దేశాలలో బాధిత మహిళలను కలుసుకునేది. చెల్లాచెదురయిన బాధిత కుటుంబాలలో సభ్యులను వెదికి కుటుంబ సభ్యులందరినీ కలిపేది. ఆమె చేస్తున్న ఈ పని కొంతమందికి స్ఫూర్తి కలిగించింది. వారు కూడా నదియా చేసే పనిలో పాల్గొని ఆమెకు అండదండలు అందించసాగారు. అది మిలిటెంట్లకు కంటగింపుగా ఉండేది. బెదిరింపులకు పాల్పడేవారు. హత్యా ప్రయత్నాలు కూడా చేసి విఫలమయ్యారు. దెబ్బతిన్న ఆడపులిలా గర్జించింది కానీ భయపడలేదు. వెనుకంజ వేయలేదు. ఘర్షణ జరిగిన ప్రాంతాలకు వెళ్ళడం మానుకోలేదు. అక్కడ లైంగిక దాడులకు, అక్రమ రవాణాకు గురయిన బాధిత మహిళల తరపుపన నిలబడి పోరాటం సాగిస్తూ ఉంది. నోబెల్ శాంతి బహుమతి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని ప్రకటించింది. తన లక్ష్యాలకు ఈ బహుమతి తోడ్పడుతుందని, యుద్ధ ప్రాంతాలలో బందీలుగా ఉన్న బాధితులను బయటకు తీసుకురావడానికి సహాయపడుతుందని తెలియజేసింది. అయినా ఈ బహుమతిని వెయ్యి ముక్కలైన హృదయంతోనే అందుకుంటున్నానని తెలిపింది. నదియా అందుకుంటున్న నోబెల్ శాంతి బహుమతి సంయుక్తమయినది.
కెన్యా దేశానికి చెందిన గైనకాలజిస్టు డాక్టర్ డెనిస్ ముక్వేకు, నదియాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడం జరిగింది. డాక్టర్ డెనిస్ ముక్వె యుద్ధం జరిగే ప్రదేశాలలోను, ఘర్షణలు జరిగే ప్రాంతాలకు వెళ్ళి లైంగిక, అత్యాచార బాధిత మహిళలకు వైద్యసేవలు, సహాయక పనులు నిర్వర్తించేవారు. ఆయన బాధిత మహిళలకు చేస్తున్న సేవలకు, కృషికి ఫలితంగా నోబెల్ బహుమతికి ఎన్నికయ్యారు.