అదాటున దూరదర్శన్‌లో చూసిన ఒక క్విజ్ ప్రోగ్రాంలో అడిగిన ప్రశ్న… కలచివేసింది.
కాన్పూర్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ క్యాంప్. ఆర్మీ మెడికల్ ఆఫీసర్లు 3350 అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే 1000 మందిని రిజెక్ట్ చేశారు. కారణం… వాళ్ళంతా ‘గుట్కా’ ఎడిక్ట్స్ కావడం. ఆ అభ్యర్థులంతా దిగువ మధ్యతరగతికి చెందిన పేద దళిత, బహుజనులే.
లక్నోలోని జె.కె.కాన్సర్ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ ఎం.పి.మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన వైద్య పరీక్షల్లో (ఫోర్ ఫింగర్ టెస్ట్… OSMF) ఆ అభ్యర్థుల్లో అందరికీ వివిధ దశల్లో ఉన్న క్యాన్సర్ బయటపడింది.
సిగరెట్‌లా పొగ రాదు. వెలిగించాల్సిన పని లేదు. ఏ మాత్రం ఖరీదు కాని అతి చిన్న ఐదు రూపాయల పౌచ్‌లో ఉన్న విషానికి మీరు బానిసలు.
మన చుట్టూ ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీల లేబర్, లాంగ్ ట్రావెల్ డ్రైవర్లు, వెల్డర్లు, ఫిట్టర్లు, స్టోన్ పాలిషింగ్ చేసే వాళ్ళు, పెయింటింగ్ పని చేసేవాళ్ళు, సెంట్రింగ్ కూలీలు, బోర్లు వేసే లేబర్… ఇలా అనేక అసంఘటిత రంగాల్లో ఉన్న వాళ్ళు ఆహారం లేకుండా గంటలు గంటలు పనిచేసుకోవడానికి ఆశ్రయించే మహమ్మారి గుట్కా.
తినకున్నా, నమలకున్నా బుగ్గన పెట్టుకుని రసం పీలిస్తే, ఒక లాంటి SATIATION ని, మత్తుని కలిగిస్తూ సగటున 15 నుండి 35 సంవత్సరాలు ఉన్న నిరుపేద యువకులను కబళిస్తున్న మహమ్మారి గుట్కా. నిరుపేద కుటుంబాలకు ఆసరా అవుతున్న యువకులు చిన్న వయసులోనే క్యాన్సర్ల బారిన పడి అంతులేని దారిద్య్రంలోకి మరింతగా కూరుకుపోవడానికి కారణమవుతోంది ఈ విషం.
వేల కోట్ల పరిశ్రమగా మారిన గుట్కా సంస్థలకు నిషేధం వరమే. నిషేధం కూడా ఆరోగ్యరీత్యా కాకుండా పర్యావరణ నిమిత్తం జరగడం విశేషం. రాజస్థాన్‌లోని ‘ఆస్తమా సొసైటీ’ అధ్యక్షుడు ధర్మవీర్ కటువా గుట్కా పౌచ్‌ల వల్ల పర్యావరణ కాలుష్యం జరుగుతోందని కోర్టుకు ఎక్కారు. పర్యావరణ అనుకూలమైన ప్యాకింగ్ వాడాలని తీర్పు ఇచ్చిందట కోర్టు.
వక్కలు, పెర్‌ఫ్యూమ్ పరిశ్రమ నుండి తెచ్చిన రెసిడ్యూ, కొద్ది మొత్తంలో మైనం, పొగాకు, మత్తును కలిగించే కెమికల్స్ కలిపి ‘పాన్ మసాలా’గా పిలిచే ఈ గుట్కాను తయారుచేస్తారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI జరిపిన పరీక్షల్లో గుట్కాలో అధిక మొత్తంలో లెడ్, చీ – నైట్రో సమీన్స్, కాపర్ ఇంకా వెయ్యి రకాల ఇతర హానికర రసాయనాలు ఉన్నాయని తేల్చారు.
రాజమండ్రిలోని ‘పొగాకు పరిశోధన సంస్థ’ తాము కేవలం టొబాకో లెవల్స్ మాత్రమే పరిశీలిస్తామని, కెమికల్ టెస్టులు చేయమని చెప్పిందట. 2004 నుండి 2011 వరకు అనేక రాష్ట్రాలలో, ప్రస్తుతం దేశంలోని 22 రాష్ట్రాలలో గుట్కా నిషేధం ఉంది. అయినా గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలుగు రాష్ట్రాలలోకి ఈజీగా స్మగుల్ అవుతోంది. ఉల్లిపాయలు, కూరగాయల సంచులలో, కారులలో ట్రైన్‌లో వచ్చిన సరుకును టెంపోల ద్వారా తరలిస్తూ గోడౌన్‌లలో భద్రపరుస్తున్నారు. 5 రూపాయలకు దొరికే సాచేను 25 రూపాయలకు అమ్ముకుంటున్నారు. షాప్‌లలో గుట్కాను పోలీసులు, అధికారులు పట్టుకున్నా నామమమాత్రపు ఫైన్‌తో వదిలేస్తున్నారు.
సినిమాల్లో పబ్లిక్ ఇంటరెస్ట్ అని గుట్కా పాన్ మసాలాపై వచ్చే ప్రకటన సినిమా మొదలయ్యే ముందు రావాలని గుట్కా సంస్థలు ప్రతిపాదించాయి. గుట్కా అలవాటున్న ముందు సీట్లలో ఉన్నవాళ్ళు సినిమా మొదలయ్యాక రావచ్చని.
గుట్కా బారన్ ‘మానిక్ చంద్ రసిక్‌లాల్ ధరీవాల్’కు 2017లో ఉన్న పరిశ్రమ విలువ 2,80,000 కోట్లు. పూణేలో 650 కోట్ల విలాసవంతమైన ప్యాలస్ నిర్మించాడు. ముంబైని శాసిస్తున్న అండర్ వరల్డ్ మాఫియాతో ఈయనకు సత్సంబంధాలు సహజంగానే
ఉన్నాయి. 2017లో ఈయన మరణించాడు. ఆయన వారసుడు ప్రకాష్ దరీవాల్ ఇప్పుడు మానిక్‌చంద్ గ్రూప్‌నకు యజమాని. బాలీవుడ్ హీరోలు వాళ్ళ ఫంక్షన్లలో డాన్స్‌లు చేస్తారు. యూత్ ఐకాన్‌లు అయిన హీరోలు గుట్కా అడ్వర్టయిజింగ్ చేస్తారు. నిస్సిగ్గుగా గుట్కా పేరుతో ఇచ్చే పిల్మ్‌ఫేర్‌లను హత్తుకుంటారు.
అందుకే ఏ ప్రభుత్వమూ నిషేధించడం తప్ప మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ)ని అడ్డుకునే సాహసం చేయదు. ప్రజారోగ్యం కన్నా ఎక్సైజ్ డ్యూటీలు జిఎస్‌టి మాత్రమే ముఖ్యం కదా.
తరాల యువశక్తిని నిర్వీర్యం చేస్తున్న ఈ మహమ్మారిపై దృష్టి సారించాలి. నిబంధనలు కఠినతరం చేయాలి. ఎన్జీఓలు, ఇతర సంస్థలు కార్మికులకు వేతనం, అలవెన్స్‌ల కన్నా గుట్కా వ్యసనం బారి నుండి కార్మికులను కాపాడుకోవడం, వారిని ఎడ్యుకేట్ చేయడంపై దృష్టి పెట్టాలి. అదే నిజమైన కార్మిక సంక్షేమం.