’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్‌ -కె. సజయ

పౌర స్పందన వేదిక ఏర్పాటు:

నా ఉద్యమ గమనంలో అత్యంత ముఖ్యమైనది, చాలా ప్రాధాన్యత గల అంశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలలో జరిగింది. అది పౌరస్పందన వేదిక ఆవిర్భావం. తెలంగాణ జిల్లాలలో పోలీసుల నిర్బంధం, నక్సలైట్ల కార్యక్రమాల వల్ల సామాన్య ప్రజలు ఇద్దరి మధ్యలో నలిగిపోవడమే కాకుండా సామాజికాభివృద్ధి కుంటుపడింది. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇబ్బంది ఏర్పడింది. నక్సలైట్ల సమస్యను బూచిగా చూపిస్తూ ప్రభుత్వ అధికారులు గ్రామాలకు వెళ్ళి పథకాలను అమలుపరచడం మానుకున్నారు. నక్సలైట్ల అణచివేత పేరుతో పోలీసులు పార్టీ కార్యకర్తలను, సానుభూతిపరులనే కాకుండా ఏమీ సంబంధం లేని అమాయకుల్ని కూడా వేధించడం జరిగింది.

ప్రజాస్వామిక వాదులుగా ఈ పరిస్థితిలో జోక్యం చేసుకుని ప్రభుత్వానికి, నక్సలైట్లకు పరిస్థితి తీవ్రతను వివరిస్తూ, బాధిత ప్రజల తరపున మాట్లాడడానికి ఒక ”మూడవ గొంతుక” అవసరం అని భావించిన రిటైర్డ్‌ ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఎస్‌.ఆర్‌.శంకరన్‌, సీనియర్‌ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావులు ”పౌరస్పందన వేదిక” ఆవిర్భావానికి చొరవ తీసుకున్నారు. ఇది 1997లో ప్రారంభమయింది. హక్కుల రంగం నుంచి బాలగోపాల్‌, కోదండ్‌ వేదికలో ఉండాలని వాళ్ళను అడిగారు. బాలగోపాల్‌ నా పేరు సూచించారు. నాకు గ్రామాలలో అన్ని వర్గాలతో సంబంధాలున్నాయని, పరిస్థితులను చాలా కాలంగా చూస్తున్నానని, కాబట్టి నేను ఉండడం సబబు అన్నాడట. వేదికలో ఎస్‌.ఆర్‌.శంకరన్‌, పొత్తూరి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్‌ డి.నరసింహారెడ్డి, ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రొఫెసర్‌ బియ్యాల జనార్ధన్‌, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కన్నాభిరాన్‌, మాజీ ఎంఎల్‌ఏ పి.జనార్ధనరెడ్డి (జనతా పార్టీ, కమలాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్‌), జర్నలిస్టులు అనంతకృష్ణ, అఖిలేశ్వరి, కోదండ్‌

ఉండేవాళ్ళం.

తెలంగాణ జిల్లాలలో ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి ఈ వేదిక తరపున చాలా ప్రయత్నాలే చేశాం. అన్ని జిల్లాలలో సమావేశాలు, అన్ని రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలతో, వార్తాపత్రికల సంపాదకులతో సమావేశాలు నిర్వహించాం. నేను దాదాపు ఎస్‌.ఆర్‌.శంకరన్‌ గారి వెంటే ఉంటూ కార్యక్రమాల ఏర్పాటులో, వ్యక్తులను, సంస్థలను గుర్తించే విషయంలో సహాయం చేసేవాడిని. ‘పౌరస్పందన వేదిక’ సాహిత్యం పంచడం కూడా ప్రధాన కార్యక్రమంగా చేసేవాడిని.

ఈ ప్రయత్నంతో చివరకు ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య సుహృద్భావం కల్పించి చర్చలు జరిపే దిశగా కొనసాగింది. చర్చలు విఫలమైనప్పటికీ ”శాంతి” ప్రయత్నం అవసరమనే భావనను సమాజంలో అన్ని వర్గాలలో కల్పించామనే సంతృప్తి అందరితో పాటు నాకూ మిగిలింది.

నా స్వభావరీత్యా సంస్థాపరంగానే కాకుండా కొన్నిసార్లు వ్యక్తిగతంగా కూడా కొన్ని సమస్యలకు స్పందించేవాడిని. ఎవరిదైనా సమస్య వచ్చినప్పుడు, ముఖ్యంగా పేద ప్రజలది అయినప్పుడు దాన్ని నిజాయితీగా పరిష్కరించే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఫలితం కనబడుతుందనే విశ్వాసం నాకు చినవెంకటి సంఘటన తర్వాత అనేక విషయాలలో కలిగింది. వరంగల్‌లో విద్యుత్‌ ఆఫీసు ముందు పిచ్చమ్మ అనే ఒకావిడ చనిపోయిన తన భర్త పెన్షన్‌ను మంజూరు చేయడం లేదని ఒక అట్టముక్క మీద రాసుకుని ఒక్కతే రోజుల తరబడి కూర్చుంది. కాలేజీకి వెళ్తూ చూశాను కానీ ముందు అంత శ్రద్ధ పెట్టలేదు. ఎవరో మంత్రి వస్తున్నారంటే పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడినుంచి లేపడంతో ఆమెను వెళ్ళి ఆరా తీయగా, అసలు సంగతి తెలిసింది.

ఆమె భర్త అక్కడ చాలా చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయాడు. ఆఫీసులో అతని సర్వీస్‌ రూల్స్‌ సరిగ్గా రిజిస్టర్‌ చేయకపోవడం వల్ల అతనికి పెన్షన్‌ రాలేదు. కారుణ్య నియామకం కింద ఆమె కొడుకుకి ఉద్యోగం కూడా రావాలి. కానీ ఈ విషయాలేవీ కార్మిక సంఘాలు కూడా పట్టించుకోలేదు. ఆమెతో అప్లికేషన్‌ రాయించి ఆఫీసులో ఇప్పించాను. నెలల తరబడి పని జరగలేదు. ఆమె పూర్తిగా నిరాధారమైపోయింది.

అప్పుడు హైదరాబాద్‌లో ఉన్న బాలగోపాల్‌ని తీసుకుని విద్యుత్‌సౌధకు వెళ్ళి అక్కడ ఎపిఎస్‌ఇబి సెక్రటరీ, ఐఎఎస్‌ ఆఫీసర్‌ ఎపివిఎన్‌ శర్మ గారిని రెండు మూడుసార్లు కలిశాం. ఇంత చిన్న విషయమై వరంగల్‌ నుంచి వస్తున్నారా అని ముందు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొంత కాలానికి నేను హైదరాబాద్‌లో ఉంటున్నప్పుడు మా అమ్మ ఇంటి నుంచి ఫోన్‌ చేసి ‘నీ వల్ల ఉద్యోగం వచ్చిందని ఎవరో వచ్చి స్వీట్స్‌ ఇచ్చి వెళ్ళార’ని చెప్పింది. అతను పిచ్చమ్మ కొడుకు. మా ఈ ప్రయత్నం వల్ల అతనితో పాటు ఇంకా ఇరవై మూడు మందికి కూడా ఆ డిపార్టుమెంట్‌లో కారుణ్య నియామకాల్లో ఉద్యోగాలు వచ్చాయని విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది.

ఇంకో సంఘటన, నిజామాబాద్‌ జిల్లాలోని ఒక గ్రామంలో సున్నం నర్సిమ్ములు అనే పేరుతో నలుగురు ఉండేవారు. అందులో ఒకతను ఒక విప్లవ సంస్థలో మిలిటెంట్‌. పోలీసులు అతననుకొని ఇంకో అతన్ని చంపేశారు. అక్కడ అప్పుడు జాయింట్‌ కలెక్టర్‌గా నా స్నేహితుడు ఉన్నారు. విచారణలో నా సహాయం అడిగాడు. చాలా కష్టపడి పోలీసుల చర్యను బయటపెట్టగలిగాం. కలెక్టర్‌ బాధిత కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం సూచించారు. కానీ తప్పు చేసిన పోలీసులకు శిక్ష వేయలేకపోయారు.

సాహిత్యం, సినిమాలతో అనుబంధం:

చదవటం విషయంలో నాకు ఇప్పటికీ కాళోజీ భయం, దానితోపాటు వచ్చిన అమితమైన ఇష్టమూ ఉంటుంది. ఆయనకు చెప్పటం కోసం చదివిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఖలీల్‌ జిబ్రాన్‌ జీవనగీతిక. ఇది కాళోజీ అనువాదం చేశారు. ఈ అనువాదం మీద రాచమల్లు రామచంద్రారెడ్డి చాలా కటువైన విమర్శ చేశారు. చాలా చర్చలు కూడా జరిగాయి అప్పుడు. మహాశ్వేతాదేవి రచనలు, రష్యన్‌ సాహిత్యం, దోస్తోవిస్కీ, గోర్కీ (అమ్మ), ఉన్నవ లక్ష్మీనారాయణ వంటి వారి రచనలు చదివాను. ఇంగ్లీషు సాహిత్యంలో సోమర్‌సెట్‌ మామ్‌ రచనలు బాగా ప్రభావితం చేశాయి. అలాగే థామస్‌ హార్టీ నవలలు, విక్టర్‌ హ్యూగో, ఛార్లెస్‌ డికెన్స్‌ రచనలు చదివాను. పొయిట్రీలో వర్డ్స్‌ వర్త్‌, కీట్స్‌, షెల్లీలను అధ్యయనంలో భాగంగా చదివాను. చాలా ఇష్టంగా కూడా ఉండేవి.

నేను కాలేజీలో ఉగ్యోగంలో చేరాక పిల్లలకు కూడా వీటి గురించి బాగా చెప్పేవాడ్ని. షేక్‌స్పియర్‌, టాగోర్‌, ఆర్‌.కె.నారాయణ రచనలన్నీ చదివాను. ముల్క్‌ రాజ్‌ ఆనంద్‌ అన్‌టచబుల్స్‌, రష్యన్‌ నవల యమా ది పిట్‌ (యమకూపం) చదివాను. అన్నాకెరీనినా నవల చాలాసార్లు చదివాను. బాగా నచ్చిన నవల అది.

హక్కుల ఉద్యమంలో కొచ్చాక నాకు బాగా దగ్గర అనిపించినవి మహాశ్వేతాదేవి రచనలు. ఆవిడ రచనలలో ఉన్నటువంటి పరిస్థితులే తెలంగాణలో ఉండడం కూడా కారణం కావచ్చు. ‘ఒకతల్లి’ ఇంగ్లీషులో చదివి చాలా ఏడ్చాను. సరిగ్గా అలాంటి సంఘటనే మా కళ్ళముందు జరిగింది. హన్మకొండలో ఉండే సోంనర్సమ్మ కథ కూడా ఇలాంటిదే. ఆమె చిన్న కొడుకు ప్రకాష్‌ను హన్మకొండ పోలీసులు వరంగల్‌ కోర్టులో మా కళ్ళముందే ఎత్తుకెళ్ళి మాయం చేశారు. ఆమె బిడ్డను, ఇంకొక కొడుకును, మనుమడిని కూడా పోలీసులు చంపేశారు.

అలానే తెలుగులో రావిశాస్త్రి రచనలు కూడా బాగా నచ్చాయి. పౌరహక్కుల ఉద్యమంలో భాగంగా పోలీసులు, కేసులు, కోర్టులను నిరంతరం చూడడం, వాటి స్వభావాలు అర్థమవుతున్నకొద్దీ ఆయన ఎంత బాగా వాటిని పట్టుకోగలిగారు అని అనిపించింది. చలం, కొ.కు.లను చదివాను కానీ, రచనాపరంగా చలం నచ్చినట్లుగా కొ.కు. రచనలు నన్ను ఎక్కువగా ఆకట్టుకోలేదు. ఆయన రాసిన జీవితానికి, నేను వచ్చిన తెలంగాణ సాంస్కృతిక నేపథ్యానికి చాలా తేడా ఉండటం కారణమేమో! తర్వాత కాలంలో నేను వాటిని పెద్దగా పరిశీలించలేదు. అల్లం రాజయ్య, కేశవరెడ్డిల సాహిత్యం మొత్తం చదివాను. పెల్లుబికిన నక్సలైట్‌ ఉద్యమం గురించి ‘కాల్లకింది మన్ను కళ్ళల్లో పండింది’ అని అల్లం రాజయ్య ఒకచోట అంటాడు. తెలంగాణ గ్రామీణ భాషలో ఊరి ప్రజల జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చూపిస్తాడు రాజయ్య. కేశవరెడ్డి ‘చివరి గుడిసె’, ‘మూగవాని పిల్లనగ్రోవి’ చదివినప్పుడు కడుపులో దేవేసినట్లు అవుతుంది. అట్టడుగున ఉన్న పేదవాళ్ళ జీవితాలను బాగా చిత్రీకరించాడాయన. అలాగే అంపశయ్య నవీన్‌ నవలలు కూడా…. అంపశయ్య, చీకటి రోజులు, సౌజన్య, కాలరేఖలు నాకు బాగా నచ్చినవి.

చాలావరకు ప్రయాణాల్లోనే పుస్తకాలు చదవడం అలవాటు. హక్కుల ఉద్యమం బాధ్యతలు పెరుగుతున్నకొద్దీ సాహిత్యం చదవటానికి సమయం సరిపోవటం లేదు. రిపోర్టులు చదవటానికే ఒక్కోసారి సమయం ఉండదు. తెలుగులో వచ్చిన కవిత్వం పెద్దగా చదవలేదు. ఈ మధ్యకాలంలో తెలుగులో నేను చదివిన పుస్తకాలలో బాగా ఆకట్టుకున్నది కళ్యాణరావు రాసిన ‘అంటరాని వసంతం’. క్రిస్టియానిటీకి సంబంధించిన కోణం మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టినట్లు అనిపించింది.

అలాగే వై.బి.సత్యనారాయణ రాసిన ‘మా నాయన బాలయ్య’ చాలా నచ్చింది. ఆయన ధర్మవంత్‌ కాలేజీలో మాకు ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. ఇలా అట్టడుగు సమూహాల నుంచి సాహిత్యం రావటం చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తాను నేను. సాహిత్యపరంగా చూస్తే నేను కేవలం చదువరిని. ఆ తర్వాత వాటి గురించి నా విద్యార్థులకు చెప్పటం, అంతవరకే. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు కొంతమంది కలిసినప్పుడు చెబుతారు ‘మీ వల్లే పుస్తకాలు చదవటం అలవాటయ్యాయని’. హక్కుల కోణంలో అయితే వ్యాసాలు వెంటనే రాసేస్తాను. అవి చాలా ఉన్నాయి.

వరంగల్‌ ఫిలిం క్లబ్‌ ద్వారా చాలా విస్తృతంగా వివిధ భాషల్లోని సినిమాలు చూసేవాళ్ళమని చెప్పాను కదా! ఇప్పటికీ నాకు ఈ విషయంలో ఆసక్తి ఎక్కువ. అకిరో కురసోవా సినిమాలు దాదాపు అన్నీ చూశాను. ఫెడేరిక్‌ ఫెలిని, విక్టోరియా డిసికా, సత్యజిత్‌ రే, మృణాల్‌ సేన్‌, గౌతంఘోష్‌ సినిమాలు చాలా చూశాను. ఇప్పటికీ అవకాశం దొరికినపుడు వివిధ భాషల్లోని సినిమాలు చూస్తూ ఉంటాను.

మలి తెలంగాణ ఉద్యమం, ప్రస్తుత పరిస్థితులు:

నా చిన్నప్పటినుంచి ఉన్న అనుభవాలు, తెలంగాణలో గత అరవై ఏళ్ళుగా జరిగిన పరిణామాలు, మధ్యమధ్యలో జరిగిన అనేక సంఘటనలు తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడవల్సిందే అనే అభిప్రాయాన్ని ఎక్కువ చేశాయి. మా తమ్ముడు శ్రీకాంత్‌కు 1973లో ఆంధ్ర యూనివర్శిటీలో బి.ఫార్మసీలో సీటు వచ్చింది. అప్పుడు తెలంగాణలో ఈ కోర్సు లేదు. వరంగల్‌ ఆర్‌ఇసిలో తెలిసిన ఒక ప్రొఫెసర్‌ నుండి లెటర్‌ తీసుకుని విశాఖపట్నం వెళ్ళి మా తమ్ముడిని చేర్పించి రెండు రోజులుండి వచ్చాను.

నెల రోజుల తర్వాత మా తమ్ముడు తిరిగి వచ్చేశాడు. అక్కడ తెలంగాణ విద్యార్థులు ఎవరూ లేరనీ, తన పట్ల చాలా వివక్ష చూపుతూ, అవమానపరుస్తున్నారని చెప్పాడు. సర్దిచెప్పి మళ్ళీ పంపిస్తే, అన్నింటికీ ఓర్చుకుని చదువు పూర్తి చేసుకున్నాడు. ఇటువంటి అనుభవాలు ఎన్నో పేరుకుపోవడం వల్ల మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా హక్కుల కార్యకర్తలుగా, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి చాలా అంశాలను హక్కుల కోణం నుంచి చూసి మా వంతుగా మేం కూడా ఉద్యమానికి దోహదపడ్డాం.

తెలంగాణ ఏర్పడితే హక్కుల రక్షణ, పోలీసు వేధింపుల విషయంలో కొంచెం మెరుగ్గా ఉంటుందని ఆశించాం. ఎన్‌కౌంటర్లు, లాకప్‌ మరణాలు, పోలీస్‌ స్టేషన్లలో చిత్రహింసల విషయాలపై రాజకీయ నిర్ణయం తీసుకోవాలని మా సంస్థ తరపున ముఖ్యమంత్రిని అడిగాం. నిర్ణయం అట్లా ఉంచి, మెల్లమెల్లగా తీవ్రమైన నిర్బంధ పరిస్థితులు కల్పించారు. సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు వంటి రాజ్యాంగపరమైన హక్కులు కూడా అణచివేయబడ్డాయి.

గత రెండున్నర దశాబ్దాలుగా తెలంగాణ హక్కుల కోసం కృషి చేస్తూ, మలిదశ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన కోదండరాం ఇంటి తలుపులు బద్దలుకొట్టి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది, ఆయన రాజకీయ పార్టీ పెట్టకముందే జరిగింది. ప్రజా

ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం మళ్ళీ మొదలయింది. హక్కుల కోసం పనిచేసేవారినీ అక్రమ అరెస్టులు చేశారు. ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. హోం మంత్రి, ఇతర మంత్రులెవ్వరూ కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోని పరిస్థితి కల్పించారు.

ఒకప్పుడు ప్రజాస్వామిక సంస్థలకు బాధ్యుడిగా ఉండి ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేసి ఇప్పుడు ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్నవారు కూడా ఈ పరిస్థితిపై మాట్లాడడంలేదు. ప్రజాస్వామిక, రాజ్యాంగపరమైన హక్కుల ఉల్లంఘన విషయంలో జోక్యం చేసుకోలేదు. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న అన్ని రకాల ఉల్లంఘనల విషయంలో వీలైనచోట్ల సమావేశాలు నిర్వహించడం, కరపత్రాలు వేయడం చేస్తున్నాం. ముఖ్యమంత్రికి, అధికారులకు బహిరంగ లేఖలు రాయవలసి వచ్చింది ముఖ్యమంత్రికి రాసిన లేఖ విషయంలో ‘మీరెందుకు ఇట్లా రాశారు’ అని అధికారులు మమ్మల్ని ప్రశ్నించారు కూడా!

తెలంగాణ పరిస్థితి ఇలా ఉంటే, జాతీయ స్థాయిలో చూస్తే గత రెండు దశాబ్దాలుగా హిందూ ఫాసిస్టు శక్తులు బలపడుతూ వస్తున్నాయి. ఒక ప్రయోగంగా బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్‌లో ముస్లింల ఊచకోత జరగటం మామూలు విషయమేమీ కాదు. ప్రజల ఆలోచనల్లో హిందుత్వ భావనను చొప్పించడంలో ఈ శక్తులు విజయం సాధించాయి.

ముస్లింలలో ఒక వర్గమైన ”ఖురేషి అసోసియేషన్‌” అనే సంస్థకు గత నాలుగేళ్ళ నుంచి గౌరవ సలహాదారుగా

ఉన్నాను. ఈ కమ్యూనిటీ వాళ్ళు గ్రామాల నుండి పశువులను (ఆవులు కాదు) కొని, హైదరాబాద్‌కు తెచ్చి మాంసశాలలకు అమ్ముతుంటారు. అలానే మాంసం దుకాణాలను నడుపుతుంటారు. వీళ్ళను ”గో సంరక్షణ కమిటీ” పేరుతో హిందుత్వ కార్యకర్తలు నానా ఇబ్బందులు పెడుతుంటారు. వాళ్ళపై దాడులు చేస్తూ వాళ్ళు ప్రభుత్వ నియమాల ప్రకారం తెచ్చుకునే పశువుల్ని కూడా అక్రమంగా గోశాలలకు తరలిస్తుంటారు.

ఆ పశువుల్ని విడిచిపెట్టే విషయమై నేను అధికారులను కలుస్తుంటాను. ఈ విషయంలో డీజీపీ దగ్గర నుండి కింది అధికారుల వరకూ చాలా అసహనంగా వ్యవహరిస్తారు. తామే భారతదేశ పశుసంపదను కాపాడుతున్నట్లు, దేశాన్ని ముస్లింల నుంచి రక్షిస్తున్నట్లు మాట్లాడుతుంటారు. ముస్లిం, దళిత వ్యతిరేక భావాలు మధ్యతరగతి శ్రేణుల్లో కూడా వ్యాప్తి చెందడం అనేది చాలా విచారకరం. ప్రజాస్వామిక భావాలు కలవాళ్ళంతా, వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఈ భావాలకు వ్యతిరేకంగా కృషి చేయాలి. ఆ అవసరం ఎంతైనా ఉంది.

నేను నడిచిన ఈ గమనంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం, నక్సలైట్‌ ఉద్యమం, అవి లేవనెత్తిన అనేక సామాజిక అంశాలు, వామపక్ష విద్యార్థి, మహిళా ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ఆదివాసీల పోరాటాలను ఎంతో దగ్గరగా, చాలా సందర్భాలలో భాగమై వీక్షించడం నాకు లభించిన గొప్ప అవకాశం. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం, అన్ని ఉద్యమాలకు జవాబుగా రాజ్యం అణిచివేసే పద్ధతుల్ని, అది ప్రయోగించిన క్రూరమైన హింసను కూడా చూశాను.

రాష్ట్రంలో కాళోజీ, కన్నాభిరాన్‌, బాలగోపాల్‌, వరవరరావు, ఎస్‌.ఆర్‌.శంకరన్‌, పొత్తూరి వెంకటేశ్వరరావు, కేశవరావు జాదవ్‌, బొజ్జాతారకం, రమా మేల్కోటే, ఎం.టి.ఖాన్‌, జావెద్‌ ఆలీఖాన్‌ లాంటి సామాజిక ఆలోచనాపరులతో కలిసి పనిచేయడం నా వ్యక్తిత్వం మలుచుకోవడానికి దోహదపడింది.

జాతీయస్థాయిలో మేథాపాట్కర్‌, అరుణారాయ్‌, సందీప్‌ పాండే, హర్షమందిర్‌ లాంటి ఉద్యమకారుల వల్ల, వాళ్ళు పాల్గొంటున్న సామాజిక ఉద్యమాల్లో పాల్గొనటం, వాటితో కలిసి పనిచేయటం కూడా నాకు లభించిన ఒక మంచి అవకాశం. మా గ్రామంలోని నా బాల్య స్నేహితులు అయిలయ్య, అశోక్‌కుమార్‌, రజిత, బాలరాజు, మోహన్‌, శ్రీనివాస్‌ల సాంగత్యం నా జీవిత ప్రథమభాగంలో గాఢముద్ర వేసింది.

… … …

జీవన్‌ పాతబస్తీ యాకుత్‌పురలోని ధర్మవంత్‌ కాలేజీలో పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత అక్కడ ముస్లిం ప్రజలతో వారి సమస్యల మీద చాలా పనిచేశారు. హైదరాబాద్‌ లాంటి నగరాలలో బస్తీలలో ఉండే పేద ప్రజల జీవితాలు నిత్యం ఒక అభద్రతలోనే ఉంటాయి. కనీస ప్రాథమిక అవసరాలు కూడా ఉండవు. అభివృద్ధి పేరుమీద ఏ క్షణాన అధికారులు వచ్చి ఇళ్ళు, గుడిసెలు కూలగొడతారో తెలియదు. అలా కూల్చినపుడు పరిస్థితి ఎంతో హృదయవిదారకంగా ఉంటుంది. సుఖంగా జీవించే మధ్యతరగతి వాళ్ళకు ఆ సమస్య ఎంత దారుణంగా ఉంటుందో అర్థంకాదు. ఆదుకునే వ్యవస్థలు ఉండవు.

జీవన్‌ హైదరాబాద్‌ వచ్చినప్పటి నుంచి ఈ సమస్యను ఎంతో బాధ్యతగా పట్టించుకున్నారు. నివాస హక్కుల వేదిక ‘ఛత్రి’ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. ఈ పనిలో బ్రదర్‌ వర్గీస్‌, అశ్వాక్‌, బిలాల్‌ ఇంకా నాతోపాటు ఎంతోమంది భాగస్వాములుగా ఉన్నారు. బస్తీల్లో ఏదైనా సమస్య రాగానే, ఏ సమయంలో అయినా పరిగెత్తడం, వాళ్ళకు సహాయం చేయడం అది తన కర్తవ్యంగా భావించుకోవడం నేను జీవన్‌లోనే చూశాను. బస్తీలలో కొంతమంది తమ పిల్లలకు జీవన్‌ అని పేరు కూడా పెట్టుకోవడం చూస్తేనే ఆయనంటే వారికి ఎంత అభిమానమో అర్థమవుతుంది. జీవన్‌, వర్గీస్‌ ఇద్దరూ ప్రతి రంజాన్‌ పండుగకు బస్తీలకు వెళ్ళి అక్కడి కుటుంబాలను కలిసినప్పుడు బస్తీవాసుల ఆప్యాయతను, సంతోషాన్ని చూసి తీరాలి!

”గత 20 సంవత్సరాల నుంచి నేను జీవన్‌తో చాలా సన్నిహితంగా నివాస హక్కులు, బస్తీవాసుల సమస్యలపై కలిసి పనిచేస్తున్నాను. సమాజపు అంచుల్లోకి నెట్టివేయబడిన ప్రజల హక్కుల కోసం అత్యంత నిజాయితీగా స్పందించే వ్యక్తి. ఏ సమయంలో పిలిచినా వెనుకడుగు వేయరు. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా సరే వెనుకడుగు వేయని హక్కుల నేత. అన్నింటినీ మించి అత్యంత మానవీయమైన వ్యక్తి” అని హైదరాబాద్‌ మౌంట్‌ ఫోర్ట్‌ సోషల్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ బ్రదర్‌ వర్గీస్‌ చెప్పారు. నిజమే! జీవన్‌లో అరుదైన మానవీయ కోణం ఉంది. అది రాజకీయాలకు అతీతం. ఎలాంటి సమస్యలతో వచ్చినా గానీ నాకెందుకులే అని వదిలేయరు. ఇది ఆయనతో కలిసి పనిచేస్తున్న నాలాంటి వాళ్ళందరికీ బాగా తెలిసిన విషయమే.

బాలగోపాల్‌ చనిపోయిన తర్వాత ఆయన ఆఫీసులో పెండింగ్‌లో ఉండిపోయిన కోర్టు కేసులన్నింటినీ సమర్ధవంతంగా వాదించి, దాదాపుగా పూర్తిచేసిన హైకోర్టు న్యాయవాది వసుధ నాగరాజ్‌ అభిప్రాయంలో జీవన్‌ ఒక ‘జనవారధి’. అండగా నిలిచే ‘ప్రజాగొంతు’.

జీవన్‌ పని విధానంలో తనకెదురైన ఒక అనుభవాన్ని గురించి చెబుతూ ”చాలాకాలం క్రితం వృద్దురాలైన ఒక ముస్లిం మహిళ ఇంట్లో అద్దెకు ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ ఒకతను ఇల్లు ఖాళీ చేయకుండా, అద్దె ఇవ్వకుండా సమస్యలు సృష్టిస్తున్నాడు. అతను కోర్టుకి కూడా వెళ్ళి ఖాళీ చేయకుండా ఇంజంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నాడు.

ఆమె ఈ కేసు విషయంలో సహాయం చేయమని నా దగ్గరకు వచ్చింది. అతన్ని కోర్టు ద్వారా ఖాళీ చేయించటానికి కనీసం రెండేళ్ళు పడుతుంది. అప్పటివరకు అతని చేతిలో ఆమె అలా ప్రతిరోజూ హింసబడుతూ ఉండాల్సిందే. పైగా ఒంటరి మహిళ. అప్పుడు నేను ఆ విషయంలో, అతను పనిచేసే డిపార్టుమెంటులో పై అధికారుల ద్వారా ఏమన్నా చెప్పించగలుగుతామా అని జీవన్‌ గారి సహాయం అడిగానున. ”పోలీసుల చేతుల్లో హింసకు గురైన ఒక యువకుడికి సంబంధించి ఆ మర్నాడు హోం మినిస్టర్‌ని కలుస్తున్నానని, నన్ను కూడా తనతో రమ్మని” చెప్పి తీసుకెళ్ళారు.

ఆ యువకుడితో పాటు ఆమెది కూడా ఒక విజ్ఞాపన పత్రాన్ని రాసుకుని అక్కడకు తీసుకువచ్చారు. హోం మినిస్టర్‌ జీవన్‌తో చాలా మర్యాదగా మాట్లాడారు. ఈ రెండు కేసులను విన్న ఆయన వాటిని పరిశీలించమని తన అసిస్టెంట్‌కు చెప్పారు. మేము ఆయన్ని కలిసింది కేవలం ఐదు నిమిషాలే. ఆ మర్నాడు నా క్లయింట్‌ ఫోన్‌ చేసి ఆ పోలీసు కానిస్టేబుల్‌ ఇల్లు ఖాళీ చేశాడు అని చాలా ఆనందంతో చెప్పింది.

నేను నిజంగా నమ్మలేకపోయాను. అదీ జీవన్‌గారు ఇచ్చే విజ్ఞప్తి పత్రానికున్న బలం. పోలీసులతో కానీ, అధికార యంత్రాంగంతో కానీ ముడిపడిన కేసులు ఏమైనా ఉంటే నేను ముందు ఫోన్‌ చేసి సహాయం అడిగేది జీవన్‌ గారినే. సహాయం అంటే ఆ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్ళడం. ఆ సమస్య పరిష్కారం కోసం వారితో చర్చించడం. జీవన్‌ లాంటి వ్యక్తులు ఒక వ్యవస్థగా పనిచేయకపోతే చాలా విషయాలు కనీసం వెలుగులోకి కూడా రావు. ఈ అంశాన్ని మనం గుర్తించి తీరాలి” అంటారామె.

జీవన్‌ ఉద్యోగం నుంచి రిటైరైన సందర్భంలో ధర్మవంత్‌ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ఏర్పాటు చేసిన సభలో వరవరరావు గారు మాట్లాడుతూ ”జీవన్‌ని కేవలం ఏదో ఒక చట్రంలో పెట్టి మాత్రమే చూడలేం. చాలా విస్తృత ప్రాపంచిక అంశాలు తను చేసే పనుల్లో ఇమిడి ఉంటాయి. సమాజం పట్ల, పౌరుల హక్కుల పట్ల చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి” అని చెప్పారు. జీవన్‌ దగ్గరకు వచ్చే వ్యక్తుల సంఖ్యను లెక్కబెట్టలేం. అలా అని ఎక్కడా రాజకీయ నాయకుల్లాగా అట్టహాసమేమీ ఉండదు. ఎంత పనైనా నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందరికీ అండగా ఉంటారు.

చివరగా, గత నలభై సంవత్సరాలుగా ఆయన జీవిత భాగస్వామి ప్రతిమ కూడా ఈ ప్రయాణంలో అనేక ఆటుపోట్లను మౌనంగానే ఎదుర్కొన్నారు. అప్పటి రోజులను గుర్తుచేసుకుంటూ ”తను చేసే పని గురించి నాకు ముందు పూర్తిగా అవగాహన లేదు. తర్వాత అర్థమైంది. అతి మంచితనం, అతి సహనం గల వ్యక్తిగా నేను జీవితంలో గమనించాను. ఆయన పనికి నేను అడ్డుచెప్పకుండా, సపోర్టు చేస్తున్నానని మా అత్తగారు మొదట్లో అనేవారు. వరంగల్‌లో ఉన్నప్పుడు మాకు ప్రతిరోజూ టెన్షన్‌గానే ఉండేది. చాలా నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం. దాన్ని నేను వర్ణించలేను. ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోవడం ఆయన స్వభావం కాదు. అటువంటి వ్యక్తులకు సహాయం చేసే ప్రయత్నంలో తానూ ఇబ్బందులకు గురైన సందర్భాలు కూడా నాకు గుర్తు. ఆయన విలువలతో నిండిన ఒక మంచి మనిషి” అన్నారు.

జీవన్‌ గారూ, మీరు క్రమం తప్పకుండా హక్కుల కలమై పత్రికల్లో దశాబ్దాలుగా వ్యాసాలు రాస్తూనే ఉన్నారు కానీ, ఇంతవరకూ అవి పుస్తక రూపం దాల్చలేదు. అది వాస్తవ రూపం దాల్చాలని, మీ తర్వాతి తరాలకి అవి అందించాలని కోరుతున్నాం. అలాగే ఈ మధ్యనే హరగోపాల్‌ గారు ”జీవన్‌, హక్కుల ఉద్యమంలో నీది సుదీర్ఘమైన అనుభవం. వాటిని రాస్తే, అది అత్యంత విలువైన చరిత్ర అవుతుంది. నువ్వు ఆ పనిని ఆలస్యం చెయ్యకుండా చేయాలి” అని అడిగిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. ఆ పనిని మీరు వెంటనే మొదలుపెట్టాలని, అది తొందరలోనే పుస్తకరూపంలో బయటకు రావాలని ఆశిస్తూ, హక్కుల బాటసారికి ‘యాక్టివిస్ట్‌ డైరీ’ సెల్యూట్‌.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.