రామారావుని కలిస్తే మనసు తేలికపడేది. రామారావుతో కలిసి పనిచేస్తే పాట పాడుకున్నంత హాయిగా ఉండేది.
జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే క్యా కరేంగే…
కుందన్‌లాల్ సైగల్ పాట గుండెల్ని పిండుతుంది.
జాతస్య హి ధృవో మృత్యుః దృవం జన్మ మృతస్య చ
తస్మాద పరిహర్యేర్దే న త్వం శోచితు మర్హసి…
జనన మరణ పరమార్ధాన్ని ఘంటసాల కంఠం ప్రతిధ్వనిస్తుంది.
ఓ దునియా కె రఖ్ వాలే, సున్ దర్ద్ భరే మేరే నాలే…
మహమ్మద్ రఫీని వింటుంటే దేవుడు స్పందిస్తున్నట్లే ఉంది.
కహాఁ హో తుమ్ జరా ఆవాజ్ దో హమ్ యాద్ కర్ తే హై…
లతా మంగేష్కర్, ముఖేష్‌తో కలిసి పాడుతుంటే కనిపించకుండా పోయిన మనిషి కనిపించినట్టే ఉంది.
సమయ్ ఓ ధీరే ఛలో, బుజ్ గయీ రాహ్ సే చావ్,
దూర్ హై, దూర్ హై పీకా గాం…
సతీ సావిత్రి తన పతి ప్రాణం కోసం మృత్యువును వెంటాడినట్టు భూపేన్ హజారిక సమయాన్ని వెంటాడినాక కాలం స్తంభించకుండా ఎలా ఉంటుంది.
ఇచ్చోటనే సత్ కవీంద్రుని కమ్మని కలము కరిగిపోయే…
జాషువా పద్యాన్ని ముల్తాన్ రాగంలో బండారు రామారావు, తోడి రాగంలో డివి సుబ్బారావు, రెండున్నర, ఐదున్నర శృతుల మధ్య అర్థరాత్రి కాటిసీనులో ఆడుకుంటుంటే మరణించిన మనుషుల ఆత్మ అమరత్వ తత్వాలు నిండు జీవిత పాఠాల్ని నినదించకుండా ఎలా ఉంటాయి.
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు జహాపనా…
అని యం.యస్.రామారావు జోల పాడుతుంటే తాజ్‌మహల్ కలలు కనకుండా ఉంటుందా!
ఓ దూర్ జానేవాలే వాదా న భూల్ జానా…
అని సురయ పాడుతుంటే చంద్రుడు మన వాకిలి కౌగిలిలో వాలిపోకుండా ఉండగలడా?
వీళ్ళందరూ కలిసి ఒక వేదిక మీద విముక్తి జీవన గీతాన్ని ఆలపిస్తే ఎలా ఉంటుంది! అచ్చం అరుణోదయ రామారావులా ఉంటుంది. మరి రామారావు ఎలా ఉంటాడు. విప్లవ రాగాన్ని ఆలపిస్తున్న దళిత సంగీతంలా ఉంటాడు. ఎర్ర జెండా మీద రెపరెప లాడుతున్న డప్పు దరువులా ఉంటాడు.
ఏ గాయం లేకుండా ఎవడైనా ఎలా పాడుతాడు. పాటంటే గాయాలతో గడ్డకట్టిన మనసును కరిగించే రాగం కదా! మృత్యువు మనసుల్ని భయపెట్టి, బాధ పెట్టే వేళ, మనుషులు నిస్సహాయంగా కుంగిపోతున్నవేళ, అనాధ అవుతున్నవేళ, శూన్యంలోనించి ఒక ఖాళీ కాగితంలా ఒక మనిషి ఒక రాగాన్ని మోసుకుంటూ వస్తాడు. ఆ మనిషి పేరు అరుణోదయ రామారావు. ఆ రాగం పేరు అరుణోదయ రామారావు. వాన చినుకుల్లా, కన్నీటి చుక్కల్లా నిశ్శబ్ద శబ్దాన్ని చీల్చుకుంటూ రామారావు పాటలా మారిపోతాడు. కణకణ మంటూ మార్మోగిపోతాడు. విప్లవాన్ని, విషాదాన్ని, విముక్తిని, అమరత్వాన్ని మేళవించి లోకాల లోతుల్లోకి మనల్ని తీసుకెళ్తాడు.
Get up, stand up, stand up for your rights! Get up, stand up-don’t give up the fight!
మార్లీ గొంతుని తలుచుకుంటే యువతరమా నవతరమా, ఇదే అదను కదలి రమ్ము అనే పాటను పాడిన రామారావు గుర్తుకొస్తుండు.
ఉస్మానియా విద్యార్థి ఉద్యమ కాలాన్ని ఉయ్యాలో జంపాలా ఈ దోపిడి కూలదొయ్యాలా అంటూ ఒక ఊపు ఊపిన రామారావు కంఠం కళ్ళల్లో తడిని రాజేస్తుంది. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ, మళ్ళీ వినాలనిపించే పాటలు పక్షుల రాగాల్లా పిలుస్తున్నాయి. రామారావు బాణీల బాటల్లో శాశ్వత అస్తిత్వాన్ని పొందిన పాటలు వీరగాథల్లా వినిపిస్తున్నాయి. రామారావుకి తప్ప మరెవ్వరికీ పాడడానికి సాధ్యం కాని అమ్మ పాట, అడివి పాట, అరుణారుణ బాట, అమర కళావేత్తల పాట, అన్న రామనర్సయ్య పాట సమయం, సందర్భం, సాహిత్యంతో సంబంధం లేకుండా వెంట పడుతున్నాయి. జీవితానికి, మరణానికి మధ్య హలో హలో అని పలకరించే సరిహద్దు రేఖ మీద ఆ రాగాలు ముసురుకుంటున్నాయి.
రామారావు స్వరం. ఒక వరం. ప్రతి ప్రగతిశీల రచయిత రామారావు గొంతులో తన పాటని ఒక్కసారైనా చూసుకోవాలనుకుంటాడు. రామారావు గురించి విన్న ప్రతి మనిషి ఆయన పాటల్ని, పద్యాల్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటాడు. రామారావు గొంతులో పలికిన ప్రతి పాట ఒక క్లాసిక్!
దిష్టి తగిలింది. ఎటువంటి హెచ్చరిక లేకుండా మృత్యువు రామారావుని వెతుక్కుంటూ వచ్చింది. హైద్రాబాద్ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రిలో ICU లో ఉన్న అరుణోదయ రామారావుని పని పెట్టుకొని మరీ పట్టుకుంది. రామారావు గుండెని అరెస్ట్ చేసింది. విప్లవోద్యమంలో ఒక సుందర స్వర ధారని తెంపేసింది. పోరాట రాగాల ప్రవాహాన్ని నిలిపేసింది. 5 మే 2019 మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాలకు మృత్యు మేఘం అరుణోదయాన్ని కమ్మేసింది. అలసట ఎరుగని అరుణోదయ రామారావు అస్తమించాడు.
”హృదయమున నీ చరిత్ర పదిలమాయే / మరతుమన్నన్ గత స్మృతుల్ మరపు రావు / నీ విధానము చారిత్రిక అవసరము / విప్లవ పదాన అది సదా వెలుగుజ్యోతి / అంజలి ఘటించి పాడెద నీ అమరగీతి / ఓ వీరుడా! ఓ అమర వీరుడా! కామ్రేడా! / అందుకో నా భాష్పాంజలి, నా అరుణాంజలి”.
మానవ సంబంధాలలో విషాదమేంటంటే మనిషి మరణించిందాక ఆ మనిషి విలువని తెలుసుకోము. దగ్గరగా ఉన్నప్పుడు మనిషి పరిమళాన్ని ఆస్వాదించలేము. మనిషి చనిపోయినాక నాలుక కరుచుకుంటాం. నలిగిపోతాం. కేకలేస్తాం. జ్ఞాపకాల కోసం గునపాలతో గుండెల్ని తవ్వుకుంటాం. మనసు చచ్చిపోతే పిచ్చిగానైనా బ్రతకొచ్చేమో! కాని మనిషి మరణిస్తే…?
I don’t try any image at all, other than the person that Iam Tracy
చాప్ మాన్ చెప్పిన మాటలు రామారావు వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తున్నాయి. ప్రేమ తప్ప ఎలాం టి పేరుని ఆశించని ఆర్గానిక్ కళాకారుడు. గోంగూర పచ్చ donడి, గోంగూర బోటి, ముద్దపప్పు కారం, టీ నీళ్ళు, గోల్డ్‌ఫ్లాక్ లైట్స్ తప్ప ఏమీ కోరని ‘అల్ప సంతోషి’ రామారావు. చివరి వరకు విప్లవ రాగాల రారాజుగా బ్రతికాడు. విప్లవ విభేదాల్ని పట్టించుకోలేదు. విప్లవ హోదాల్ని లెక్క చేయలేదు. విప్లవ విషాదాల్ని చిరునవ్వుతో భరించాడు.
రామారావు కేవలం కళాకారుడే కాదు, శ్రమించే కార్యకర్త కూడా. పార్టీ మీటింగులకి హాళ్ళు బుక్ చేసేవాడు. పోలీస్ పర్మిషన్ల కోసం తిరిగేవాడు. ప్రెస్ ఇన్విటేషన్లు, ప్రెస్ రిపోర్ట్‌లు అన్ని ప్రెస్‌లకి తిరిగి ఇచ్చేవాడు. సమావేశాలకి హాజరైన వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసేవాడు. స్పీకర్లను ఏర్పాటు చేసేవాడు. ప్రింటింగ్, బ్యానర్, కుర్చీలు, మైకులు ఏర్పాటు చేసేవాడు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికైనా జబ్బు చేస్తే ఆస్పత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించేవాడు. ఎవరైనా మరణిస్తే ఏడ్చేవాడు. ఏడ్పించేవాడు. ఒక్క మాటలో పార్టీలో చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అన్ని పనులు చేసేవాడు. మానవ సేవనే విప్లవంగా నమ్మి ఆచరించాడు. రామారావు ఒక నిష్కల్మషమైన సామాజిక విప్లవ సేవకుడు. సాంస్కృతిక ఉద్యమంలో నిత్యం ప్రకాశించే అరుణ కిరణం. గాయపడిన గుండెల గుంపుల నుండి పదునుగా వినిపించే వజ్ర గీత సంగీతం. నవ ఱర a ఎవశ్రీశీసవ శీట తీవఙశీశ్రీబ్‌ఱశీఅ.
The greatness of a man is not in how much wealth he acquires, but in hiss integrity and his ability to affect those around him positively – Bob Marley
రామారావును కలిస్తే మనసు తేలికపడేది. రామారావుతో కలిసి పని చేస్తే పాట పాడుకున్నంత హాయిగా ఉండేది. ఫోను చేసిన ప్రతిసారీ పాటనో, పద్యాన్నో కొంచెం పాడి ‘అదీ సంగతి’ అని అసలు విషయంలోకి వస్తాడు. రామారావుది ఒక మానవీయ పలకరింపు. తెల్లవారకముందే మనుషుల్ని వెతుక్కుంటూ, రోడ్లమీదికి వస్తాడు. పాల పాకెట్ల దగ్గరో, ఒక చెట్టు క్రిందో, టీ కొట్టు దగ్గరో, కూరగాయ బండి దగ్గరో, నిలబడి మన కోసం ఎదురు చూస్తున్నట్టే ఉంటాడు. రోడ్లు ఊడ్చే వాళ్ళని, పేపర్ బోయ్‌ని, ముసలి వాళ్ళను, పడుచువాళ్ళను, పెద్దా చిన్నా తేడా లేకుండా అందరినీ పలకరిస్తాడు. అందరినీ నవ్విస్తాడు. మనం కనిపిస్తే, ఈల వేస్తాడు. కేకలేస్తాడు. దగ్గరకొచ్చి ఒక మాటని, ఒక పాటని అందిస్తాడు. మనసు పరిచి మనల్ని తన గుండెలోకి తీసుకెళ్తాడు. ఎక్కువసార్లు జోకుతో సందడి చేస్తాడు. తక్కువ సార్లు కన్నీళ్ళని పంచుకుంటాడు. కొన్నిసార్లు పిలవకుండానే వస్తాడు. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా రాడేమో. చాలాసార్లు అనుకోకుండా కనిపిస్తాడు. ఇప్పుడు ఎంత ఏడ్చి గీపెట్టినా కనిపించడేమో.
”Death is not the end. I gaze into the doorway of temptation’s angry flame; and every time I pass that any way I always hear my name”.
(సారంగ వెబ్ మ్యాగజైన్ నుండి)