అవును, ఆమె అస్తమించలేదు! -అరణ్య కృష్ణ

 

సావిత్రి ఎన్ని కవితలు రాశారని కాదు, ఆమె ఒక్క కవితే చాలు… పది కాలాల కీర్తి తురాయి! సావిత్రి ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఆమె వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలను వెతికి పట్టుకొని ఈ డిసెంబరు ఇరవైన మళ్ళీ మన ముందుకు తెస్తున్న అరణ్య కృష్ణతో సావిత్రి పుస్తకం ”ఆమె అస్తమించలేదని…” గురించి నాలుగు మాటలు :

మీకు సావిత్రి గారు ఎలా పరిచయం? ఎంత పరిచయం?

నాకు సావిత్రిగారు ఆమె చివరి దశలో మాత్రమే పరిచయం. నేను హైదరాబాద్‌ నుండి విశాఖకి బదిలీ మీద వెళ్ళినప్పుడు అన్నె అరుణ, కత్తి పద్మ, వశీరా లాంటి మిత్రులు చెప్పారు ఆమె గురించి. ఎవరో మిత్రుడితో కలిసి ఆమెను చూడడానికి వెళ్ళాను. అప్పుడామె రామా టాకీస్‌ దగ్గర ఉమా నర్సింగ్‌ హోమ్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. ఆమెను చూసిన క్షణమే ఖిన్నుడనయ్యాను. సన్నగా, పుల్లలా ఉన్నారామె. (అప్పుడామె బరువు కేవలం 24 కిలోలే). ఒక చేతిని మరో చేతితో పట్టుకొని ఆమె ఒక పుస్తక సమీక్ష చేస్తున్నారు. కళ్ళు సరిగా కనపడవు. చెవులు వినబడవు. మాట నీరసంగా ఉన్నా ఆవిడ నవ్వు దేదీప్యమానంగా ఉంది.

నా కవితలు కొన్ని చదివారట. ”మీ కవితలు బాగుంటాయి. కానీ మీ సహచరితో మీరెలా

ఉంటారో నేను చూస్తే కానీ మీరు కూడా అంత మంచి మనిషని నేననుకోలేను” అన్నారు ఆవిడ. అప్పుడు నేను నా జీవితంలోకి ఇంకా ఒక సహచరి రాలేదని చెప్పాను. నవ్వారు. ఆ తరువాత ఆవిడని అతి కొద్దిసార్లే కలిశాను. నాకావిడతో సాన్నిహిత్యం చాలా తక్కువ. ఒకసారి వెళ్ళినప్పుడు వాళ్ళ పెద్దమ్మాయి ఈవిడ సరిగ్గా మందులేసుకోవటం లేదని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. రెండో అమ్మాయి అలా నిస్సహాయంగా నేల చూపులు చూస్తోంది. ఆవిడ మాత్రం ఏమీ ఎరగనట్టు ఏదో పుస్తకం చదువుకుంటూ

ఉండిపోయారు. ఆమెతో సాన్నిహిత్యం లేకపోయినా ఆమె మరణానంతరం సోమయాజులు, కృష్ణాబాయి గారు వంటి మిత్రులు, ఆమె పిల్లల ప్రోద్భలంతోనే ”సావిత్రి” పుస్తకానికి సంపాదకత్వం వహించడానికి పూనుకున్నాను. నా పేరు వేసుకోలేదు కానీ అప్పటికే ప్రజా రచయితల సమాఖ్య తరపున బాల కార్మిక వ్యవస్థ మీద ”మొగ్గ మిరుగులు”, దక్షిణాఫ్రికా పోరాటానికి మద్దతుగా ”జాతి మొత్తం బందీ అయినప్పుడు” వంటి పుస్తకాలు రావటంలో నా పూర్తి పాత్ర లేదా భాగస్వామ్యం ఉన్న అనుభవం ఉన్న కారణంగా కూడా సరేనన్నాను.

”సావిత్రి” పుస్తకం కోసం మీరు చేసిన కృషి ఏమిటి? అందులోని ఆమె సాహిత్యం అంతా అంతకు ముందే ముద్రితమా? ఆమె రచనలు ఎలా సంపాదించారు?

ముందు కేవలం మిత్రుల రచనలతో ఒక యాభై పేజీలతో స్మృతి సంచిక మాత్రమే తేవాలనుకున్నాం. కానీ తరువాత నా ఆలోచన మారింది. సావిత్రిగారి రచనలు కూడా వేస్తే బాగుంటుందనుకున్నాను. అయితే, ఆమె రచనలు ఏవీ అందుబాటులో లేవు ఒక్క ”బందిపోట్లు” కవిత తప్ప. కానీ ఆవిడ ఏదో ఒకటి రాస్తుండేవారని అందరూ అన్నారు. ఎక్కడున్నాయి అవి మరి? అని ఆలోచించాను. ఆమె ఖచ్చితంగా శక్తిమంతంగా రాస్తుంటారని అనిపించింది. ఆమె వ్యక్తిత్వమే కాదు, ఆమె సాహిత్యాన్ని కూడా భావి తరాలకు అందించాలనిపించింది. అందుకే పుస్తకంలో ఆమె సృజన, స్మృతి రెండూ ఉండాలనుకున్నాను.

సావిత్రిగారి రచనల కోసం చాలామందిని సంప్రదించాను. ఆమె తన రచనలను ఏ మాత్రం జాగ్రత్త చేయలేదు. పి.రామకృష్ణారెడ్డి వంటి పత్రికల్లో పనిచేసే మిత్రుల మీద ప్రధానంగా ఆధారపడ్డాను. ఆమెకి ‘రేడియో సావిత్రి’ అనే పేరు కూడా ఉన్నందున రేడియోలో పనిచేసే మధు వంటి మిత్రుల్ని కూడా ఆశ్రయించాను. సాహిత్య పేజీల్లో ప్రకటనలిచ్చాను. ఆమె ముద్రితాలకంటే అముద్రితాల కోసమే ఎక్కువ వెతకాల్సి వచ్చింది. పత్రికలకి పంపనివి ఆమె ఎంతో కొంత రాసుంటారని బలంగా అనుకున్నాను. ఆ ఊహ నిజమైంది. చివరికి ఒక ట్రంకు పెట్టెలో కొన్ని పుస్తకాల మధ్యలో ఆమె రచనలు కొన్ని దొరికాయని ఆమె పిల్లలు ఇచ్చారు. కొన్ని ముద్రితాల్ని కృష్ణాబాయి గారు, రాజమండ్రి మిత్రులు ఇచ్చారు. గౌతమి లైబ్రరీలో పనిచేసే సన్నిధానం నరసింహ శర్మ గారు కూడా సహకరించారు. ఇంక ఆమె స్మృతి సంచిక తేవాలని మొదలెట్టి, ఆ తరువాత ఆవిడ రచనలు ఒక్కొక్కటిగా దొరుకుతున్నాక ఆవిడ రచనలే ప్రధానంగా వేయాలని అనుకున్నాం. ఆ పుస్తకంలో మంచి చెడు అంతటికీ నాదే బాధ్యత. ఎవరూ వేలెట్టలేదు. సావిత్రిగారి కుటుంబానికి ఆత్మీయ మిత్రుడు, ఈ పుస్తకం రావాలని ప్రధానంగా సంకల్పించిన సోమయాజులు మాత్రం వాకబు చేస్తుండేవాడు. చివరికి ఇంతకంటే ఆమె రచనలు ఇంక దొరకవు అని నిర్ధారణకొచ్చాక, ఒక పది నెలల తరువాత ప్రింటింగ్‌కి వెళ్ళాం. ఈ పుస్తకాన్ని ఆమెకెంతో ఇష్టమైన రాజమండ్రి సాహితీ వేదిక ముఖ్య మిత్రుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. చేకూరి రామారావుగారు హైదరాబాద్‌ నుండి వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు. కృష్ణాబాయి, అద్దేపల్లి రామ్మోహనరావు, సతీష్‌ చందర్‌, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ వంటి సాహితీవేత్తలు మాట్లాడారు. చేకూరి రామారావుగారు తన ‘చేరాతలు’లో ఈ పుస్తకాన్ని సమీక్ష చేశారు. అది చాలా గొప్ప సమీక్ష. ఆమె సాహిత్యం లోతుల్లోకి కాదు, ఆమె హృదయ లోతుల్లోకి వెళ్ళి చేసిన సమీక్ష. దాన్నే ఇప్పటి పుస్తకానికి పీఠికగా తీసుకున్నాం.

సావిత్రిగారి పుస్తకాన్ని ఇప్పుడు మళ్ళీ ముద్రిస్తున్నారు కదా! మారుతున్న సమాజం నేపథ్యంలో సావిత్రి గారి రిలవెన్స్‌ ఇప్పుడెలా

ఉంటుందనుకుంటున్నారు?

చేకూరి రామారావు గారు తన సమీక్షలో ”స్త్రీ విముక్తి ధోరణి కవయిత్రుల్లో ప్రథమ గణ్యగా సాహిత్య పరిశీలకులు సావిత్రిని ఎవరూ అని ఇవాళ ఎవరూ అడగరు” అని 1992లో అన్నారు. కానీ ఒక పావు శతాబ్దం తరువాత పరిస్థితి చూస్తే సావిత్రిగారు ఈ తరంలోని చాలామందికి తెలియదన్న విషయం అర్థమైంది. చేరాగారే మరో మాట అన్నారు ”కృష్ణశాస్త్రి గారు భారతి రజతోత్సవ సంచికలో ‘పాతికేళ్ళ తెలుగు కవిత్వం’ అనే వ్యాసం రాస్తూ గురజాడ అప్పారావు గారు మరణించిన తర్వాతనే జీవించడం ప్రారంభించారన్నారు. ఈ మాట సావిత్రికి కూడా అన్వయిస్తుంది. స్త్రీ విముక్తి ధోరణి సాహిత్యంలో సావిత్రి స్థానం ఆధునికాంధ్ర సాహిత్యంలో గురజాడ అప్పారావు గారి స్థానంలో పోల్చదగింది కావడం కూడా ఈ సందర్భంలో గుర్తు రాక మానదు”. ఈ మాటలు కూడా నాకెప్పుడూ గుర్తుకొస్తుంటాయి.

మరి గురజాడ తరువాత స్థానంలో సావిత్రి గారున్నారని చేరా అంతటి వారన్నాక ఈ తరానికి, ముందు తరానికి సావిత్రిగారిని అందివ్వాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. లేకుంటే కెరీరిజం, కీర్తి కండూతి ఉన్న వారే సాహిత్యంలో జాతి ప్రతినిధులు కాగలరు. సరే, కాసేపు సావిత్రిగారి గొప్పదనాన్ని పక్కనపెట్టి ఆలోచిద్దాం. ఇవాళ ప్రపంచం సాంకేతికంగా చాలా మారింది. కానీ మన సమాజంలో మనిషి మారలేదు. మానవ సంబంధాలు, ముఖ్యంగా స్త్రీ, పురుష సంబంధాల్లోని పవర్‌ రిలేషన్స్‌ ఏమీ మారలేదు. అయితే స్త్రీల ప్రతిఘటన చైతన్యం పెరుగుతున్నది. వారిలో స్వేచ్ఛ కాంక్ష బలీయమౌతున్నది. ఈ సందర్భంలో సావిత్రిగారి జీవితం, సాహిత్యం స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుందనుకుంటున్నాను. అందుకే ఈ పుస్తకానికి టైటిల్‌ కూడా ”ఆమె అస్తమించలేదని…” అని పెట్టాను. ఈ సందర్భంగా నేను ఈ పుస్తక ప్రచురణ గురించి ఆలోచన పంచుకోగానే ఒక ఐదుగురు మిత్రులు భారం పంచుకోవడానికి ముందుకొచ్చారు. వారి బేషరతు సహకారానికి నా కృతజ్ఞతలు.

Share
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.