కొందరు మనుషులుంటారు. వాళ్ళ పని ప్రదేశం వేరు. మరీ తరచు కలవం. అయినా మన, మన పనుల కారణంగానే తారసపడుతుంటాం. మళ్ళీ కలుసుకునేవరకు ఆ జ్ఞాపకాన్ని మోసుకు తిరుగుతుంటాం. ఈ మాట స్వవచన వ్యాఘాతం (సెల్ప్ కాంట్రడిక్షన్) అనిపిస్తుంది కానీ, కాదు. ఎందుకు కాదో చెబుతాను.
రామారావు, నేను ఒకే పార్టీలో పనిచేశాం. ఒకే పని చేయలేదు. తన పని పాట. నా పనిలో పాట (కూడా) ఉండేది కానీ, మేము ‘పని’లో కలుసుకున్నది చాలా తక్కువ.
తను పాటలు పాడతాడు. నేను పాటలు (కూడా) రాసేవాడిని.
నాకు మోహన రాగం, కాపీ రాగం లాంటివి ఏవీ రావు. లయ తప్పకుండా పట్టుమని పది అడుగులు దూల వేయలేను. కోరస్‌లో పదాలు, పాదాలు కలిపేస్తుంటానెప్పుడైనా. పాటలకు అడ్డంగా నేనెందుకులే అనుకున్నప్పుడు, లోలోపల (కాస్త బయటికి కూడా) సిగ్గుపడుతూ పక్కన నించుంటాను.
అదీ సంగతి.
రాముడు ఒక పాట. ఎడతెగని పాట. ఊరక నడుస్తున్నప్పుడు, కూర్చుని ఉన్నప్పుడు కూడా తన చేతి వ్రేళ్ళు కంజెర మీది చిర్రల మాదిరి కదులుతుంటాయి, తన లోపలి గొంతులో తారాడే… కాదు కాదు… ఎగిసిపడే ఏ పాటలోని లయకో.
పైన గొంతులో ‘తారాడే’ అని రాయబోయి, కాదని ‘ఎగిసి పడే’ అని రాశాను.
రాముడి గొంతులో పాట తారాడదు. తీగె పాకినట్లుండదు. ఎగిసిపడుతుంది. మండుతుంది. భూమ్యాకాశాల్ని నిలదీసి ప్రశ్నిస్తే దుఃఖిస్తుంది.
రాముడి గొంతులో ప్రియుడిని గుర్తు చేసుకునే ప్రేయసి బాధ, కన్న బిడ్డ చనిపోయిన తల్లి ఆక్రోశం అధికం. రాముడి పాట తదనంతర జ్ఞాపకం కాదు, తక్షణ దుఃఖం.సెలయేరు కాదు, ఎగిసిపడే తుఫాను.
రాముడు లలిత సంగీత నేపథ్యం నుంచి వొచ్చినవాడు. తన గొంతు లలిత గీతాల కంటే పద్యానికి చేరువ.
కాశీపతి రాయగా రాముడు పాడిన ‘ఉయ్యాలో జంపాలా’, ‘అన్న అమరుడురా’ పాటలు, కానూరి వీథిభాగోతం లోని ‘సాముదాయిక ఫండు సొంతము మింగేసి’ వంటి పద్యాలూ, పాటలు చిరస్మరణీయాలు, మరొకరు అలా పాడగలరా అనిపించే గేయాలు.
వ్యక్తిగతంగా నాకు పద్యాలు వినడం ఇష్టం. ‘అహో ఆంధ్ర భోజా’ అని గొంతెత్తి పాడే పాటలు ఇష్టం. లలిత గీతాలు చెవికి పట్టవు. ‘మల్లియలారా మాలికలారా’ లాంటివి ఆనవు.
నేనూ, తానూ రాయలసీమ వాళ్ళం కావడం దీనికి కారణమా? కరాఖండిగా చెప్పలేను గానీ, అది ఆలోచించాల్సిన విషయమే అనుకుంటాను.
అందుకే విప్లవ గాయకులలో తెలంగాణా గద్దర్, గూడ అంజయ్యలను, ఉత్తరాంధ్ర వంగపండును చాలా చాలా ఇష్టపడుతూనే… రాముడు పాడే పాటల్ని చాలా చాలా చాలా ఇష్టపడతాను.
ఇక్కడ రాముడికీ, నాకూ సంబంధించి మరో ఇసిత్రం చెప్పాలి. వినడానికైతే పద్యాలు, వాటికి దగ్గరైన పాటలే ఇష్టం కానీ, అవి రాయడం నాకు చేతనయ్యేది కాదు. వాటిలోని ‘సందేశాత్మకత’ ఒక రాసే మనిషిగా నా చేతిని పట్టేసి ఆపేసేది. అవి రాయడం నాకు కుదిరేది కాదు. అందుకే నేను రాయగా అరుణోదయ గాయకులు పాడినవి లలిత గీతాలకు దగ్గరగానే ఉండేవి. … ”తూర్పు సేనీ గట్టు కాడా / సెట్టు పుట్టా గొట్టెటోడా’ వంటి పాటలు కామ్రేడ్స్ అంబిక, పార్వతి (శివసాగర్ భార్య) వంటి వారి గొంతులో బాగా పలికేవి. ‘జాజర జాజర జాజరాడుదం’ వంటి పిలుపు పాటలు కూడా అంతే. దానికి మల్లేపల్లి లక్ష్మయ్య వంటి తెలంగాణ స్వరం అవసరమయ్యేది. ఒక్క మాటలో చెప్పాలంటే కదన శంఖమూదినట్లుండే రాముడి గొంతుకు నా పాటల రచన పద్ధతి కుదిరేది కాదు. నాకు తగినట్లు నేను కామ్రేడ్ నర్సా గౌడ్ వంటి తెలంగాణ మిత్రుల దగ్గర కూర్చుని వాళ్ళిచ్చే ట్యూన్‌తో పాటలు కట్టుకునేవాడిని, అదీ ఉద్యమావసరాల కోసం. ఆ తర్వాత నన్ను బతికించింది కేవలం వచనమే.
అదిగో, అందువల్లనే నేనూ, రాముడూ ‘పని’లో కలిసి ఉన్న సందర్భాలు చాలా తక్కువ. కానీ పార్టీ కారణంగా, ఇద్దరమూ… మా ఇద్దరి భార్యలతో పాటు పూర్తికాలం కార్యకర్తలం కావడం వల్ల ఒక కుటుంబీకులుగా గడిపాం. చెప్పానుగా, ఒక శ్రోతగా నాకు లలిత గీతాలకన్నా పద్యాలు, పద్యాల్లాంటి పాటలంటే ఎక్కువ ఇష్టమని. అదే ఒక మనిషిగా నన్ను రాముడితో అనుబంధించింది, నా బతికిన క్షణాలంతటా.
ఇద్దరం మా భార్యలతో పాటు హోల్ టైమర్లం కావడంవల్ల, పనుల్లోనే గాక, అంతకంటే ఎక్కువగా… ‘మా’ ఇంట్లో కలిసేవాళ్ళం. ‘మా ఇల్లం’టే మరేం లేదు, పార్టీ ఆఫీసు. ‘విమోచన’ పత్రిక కూడా అదే. రాముడు, కానూరి హైదరాబాద్‌లో ఉన్నప్పుడంతా మాతోపాటు ఉండేవారు. రాముడు ఉన్నాడంటే నా గిన్నెలు తోముడు కార్యక్రమం తగ్గిపోయేది. రాముడికి శుభ్రత పట్టింపు ఎక్కువ. తను ఇల్లు ఊడిస్తే తుడిచినంత శుభ్రంగా ఉండేది. మా ఇంట్లో ఇస్త్రీ పెట్టె ఉండేది కాదు, కానీ రాముడు తన బట్టలు
ఉతుక్కుని, మడతలు పెట్టుకుంటే, ఇస్త్రీ చేసినట్లు, శుభ్రంగా, మడత నలక్కుండా ఉండేవి.
హైదరాబాద్‌లోనే కాదు, అసలు మొదటిసారి రామారావును చూసింది కూడా మా పార్టీ ఆఫీసులోనే, అదీ కర్నూలు జిల్లా పార్టీ ఆఫీసు.
నేను పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తానని వెళ్ళిన మొదటి రోజులవి. బహుశా, ఎమర్జెన్సీకి ఏడాది, ఏడాదిన్ననర ముందు…
సిపిఐ ఎమ్మెల్ (సీపీ) పార్టీ కర్నూలు జిల్లా ఆఫీసుగా వాడుకుంటున్న ఎన్నార్ (నీలం రామచంద్రయ్య) పాత ఇంట్లో ఒక ఉదయం బొల్లారం చెన్నయ్య పరిచయం చేశారొక అందమైన కుర్రవాడిని, దాదాపు నా వయసు వాడిని, ‘తన పేరు సత్తెన్న, భలే బాగా పాడతాడు’ అంటూ.
అతడు పాడాడు… ఆకాశం నుంచి మేఘాలు దిగివొచ్చినట్లు, అవి ఒకదానికొకటి రాసుకుని జిగేల్మని మెరిసినట్టు, చిలుకలు ముక్కులకు పదును కత్తులు మొలిచినట్లు, పాండవుల విజయంలో కృష్ణుడు ఇక యుద్ధం తప్పదని ప్రభుత్వానికి చివరి హెచ్చరిక చేస్తున్నట్లు, నేను ఒక కొత్త ప్రపంచంలో అడుగిడిన సంగతి నా మనస్సులో నాటుకుపోయేట్టు… పాడాడు.
అలా పాడుతూనే ఉన్నాడు.
విప్లవ గీతాల నడుమ ఆర్టిస్టుగా తన మూలాలైన స్టేజి నాటకాల నుంచి పద్యాలు అడిగి మరీ పాడించుకునేవాడిని. ముఖ్యంగా గుర్రం జాషువా రాసిన ‘కాటి సీను’ పద్యాలు.
ఆ రోజుల్లోనే కాదు, ఆ తరువాత కూడా అంతే. ఇప్పటికి చివరగా… గతేడాది విజయవాడ బుక్‌ఫేర్‌లో ఉండగా ఎక్కడినుంచో ఫోన్ చేసి…’హలో’ బదులు, ‘ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయె’ అంటూ అదే గొంతు. లిటరల్‌గా అదే నినాద భీషణస్వరం.
ఇప్పుడిక కనిపించినప్పుడంతా ‘రాముడూ’ అని నేను మనసారా పిల్చుకునే మా రామారావు లేడు.
కాశీపతి లేడు, కానూరి లేడు, రాముడు లేడు, ఇంకొన్నాళ్ళకు నేనూ ఉండను.
భూమి అందరికీ ఒకే అమ్మ ఒడి, అదే సమయంలో…
‘ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె కదిలించి యాడు రంగస్థలంబు ఇది మరణదూత తీక్షణ దృక్కులొలయ అవని పాలించు భస్మ సింహాసనంబు’
ఉంటాను రాముడూ మరి కొన్నాళ్ళిక్కడ…
మనం అనుకున్న పనుల్లో నాకు చేతనయినవి చేతనయిన రీతిలో చేస్తూనే ఉంటాను.
వీడ్కోలు…
కలుద్దాం ఈసారి ఒక అనంత వితర్ది మీద. రాసుకుందాం, పాడుకుందాం, తుదీ మొదలు లేని పాట.
(రస్తా వెబ్ మ్యాగజైన్ నుండి)