ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో ఒకసారి అబ్బూరి ఛాయాదేవి గారి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో మాట్లాడుతూ వరద రాజేశ్వరరావుగారు షేవ్ చేసుకుని అరిగిపోయిన బ్రష్‌తో కూడా ఒక అమ్మాయి బొమ్మను తయారు చేశాను అని చెప్పారు. ఇంకా చాలా విషయాలు చెప్పారు. అప్పటినుండి వారిని కలవాలని, వారు రాసిన కథలు చదవాలనే ఆసక్తి కలిగింది. అలాగే మానవి పత్రికలో వారి కథలు, వ్యాసాలు కొన్ని చదివాను. అప్పుడు నా కోరిక ఇంకా బలపడింది. కానీ వీలుపడలేదు. బాగ్‌లింగంపల్లిలోని వారి ఇంటిని చూడలేకపోయాను. సి.ఆర్.ఫౌండేషన్‌లో ఉన్నారని తెలిసి, చాలా సార్లు అనుకుని కూడా వెళ్ళలేకపోయాను. కారణం అంత గొప్ప రచయిత్రిని కలవడం అంత సులువు కాదేమో అనుకున్నాను.
కానీ 2018 డిసెంబరులో, అప్పటికి అప్పుడు అనుకుని సి.ఆర్.ఫౌండేషన్‌కి ఫోన్ చేసి ఛాయాదేవి గారు ఉన్నారా, వారిని కలుసుకోవడానికి రావచ్చా అని అడిగి తెలుసుకుని వెంటనే మా అక్క, వాళ్ళ చిన్నమ్మాయి, నేను, మా చిన్నమ్మాయి వెళ్ళాము. వెళ్ళేముందు అంత గొప్ప రచయిత్రి గారికి ఏమి తీసుకువెళ్ళాలా అని తర్జన భర్జన పడి, వారికి శాలువా, పండ్లు తీసుకువెళ్ళాము. అది చలికాలం కావడంతో మేము వెళ్ళేసరికి చాలా నీరసంగా పడుకుని ఉన్నారు. కానీ మేము వెళ్ళిన తర్వాత చిన్నగా హుషారు తెచ్చుకుని చాలా విషయాలు గుర్తుచేసుకుని చెప్పారు. చాలా జోక్స్ కూడా చెప్పారు. మేము, మా పిల్లలు చాలా ఇన్‌స్పైర్ అయ్యాము.
భూమిక ఫిబ్రవరి 2017 సంచికలో ‘ఆర్భాటం లేని ఆదర్శ వివాహాలను ఆదరించి, అభినందించాలి’ అనే నా వ్యాసం ప్రచురించబడింది. ఆ వ్యాసం చదివి ఛాయాదేవి గారు భూమిక తర్వాతి సంచిక ‘ప్రతిస్పందన’లో నాకు అభినందనలు తెలిపారు. నా వ్యాసం చదివి అంత గొప్ప రచయిత్రి గారు స్పందించినందుకు నేను చాలా సంతోషంగా, గర్వంగా, నాకు ఏదో పెద్ద అవార్డు వచ్చినట్లు ఫీలయ్యి ఆ విషయాన్ని చాలా మందితో షేర్ చేసుకుని, ఆ సంచికను చాలా పదిలంగా దాచిపెట్టుకుని నా వెంట తీసుకెళ్ళి వారికి చూపించాను.
అలాగే శిలాలోలిత గారి ‘వర్తమాన లేఖ సాహిత్యం’ చదివి సమీక్ష రాశాను అని ఛాయాదేవి గారికి చెబితే చాలా సంతోషించి, విశాలాక్షి పత్రికకు కూడా సలహా ఇచ్చినారు. భూమికలో వచ్చిన ఆ సమీక్ష చదివి వెంటనే ఫోన్ చేసి బాగుంది అని ప్రోత్సహించారు.
ఛాయాదేవి గారు ఎప్పుడు ఫోన్ చేసినా రమాదేవి గారూ అని సంభోదించేవారు. ఇది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. మీరు నన్ను ‘గారు’ అంటుంటే మనకు దూరం పెరిగినట్లు అనిపిస్తుందని చెబితే దానికి వారు నాన్నను కూడా నాన్నగారు అనేగా పిలుస్తారు అని చెప్పారు.
ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కిందివరకు వచ్చి వారి పుస్తకాలు, వారు చేసిన బొమ్మలు చూపించి వాటి గురించి వివరించారు. వారు రాసిన ‘వ్యాస చిత్రాలు’ అనే పుస్తకం సంతకం చేసి మాకు ఇచ్చారు. మరోసారి నేను, మా వారు, మా చిన్నమ్మాయి మార్చి 2018లో వెళ్ళినప్పుడు ఃఔష్ట్రవ రష్ట్రశీబశ్రీసఅః్ స్త్రఱతీశ్రీర శ్రీaబస్త్రష్ట్ర?ః అనే పుస్తకం ఇచ్చారు. వాటిని ఎంతో అపురూపంగా దాచిపెట్టుకున్నాను.
కేవలం రెండుసార్లే వారిని కలుసుకోగలిగాను. కానీ వారితో నాకెంతో ఆత్మీయానుబంధం ఉన్నట్లుగా అనిపించేది. ఫోన్‌లో వారితో మాట్లాడినప్పుడు కూడా ఎంతో హాయిగా అనిపించేది. మొన్న మే నెలలో ఒకరోజు సాయంత్రం ఛాయాదేవి గారు ఫోన్ చేసి రమాదేవి గారూ నేను మీతో పొరపాటున నా ఆరోగ్యం బాగోలేదని చెప్పాను. ఈ విషయం మీరు సత్యవతి గారు, శిలాలోలిత గారితో చెప్పవద్దు. వారికి తెలిసి అందరూ చూడడానికి వస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. అది విని నేను ఆశ్చర్యపోయి నేను వారికి ఫోన్ చేయలేదు కదా? ఎవరు చేశారో కానీ నేనే చేశాను అనుకుని నాకు చేశారు అనుకున్నాను. సత్యవతి గారికి, శిలాలోలిత గారికి నేను ఫోన్ చేసేంత క్లోజ్ కాదండి, నేనే ఒకసారి వస్తాను అంటే కూడా వద్దు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నారు. ఈ విషయం వారికీ తెలియచేయాలా వద్దా అని చాలా మధనపడ్డాను. వారి చెల్లెలు యశోద గారు ఉన్నారు కదా అంత అవసరమైతే వారే తెలియచేస్తారులే అని సమాధానపడ్డాను.
చివరికి మొన్న జూన్ 28న సడన్‌గా ఛాయాదేవిగారు భౌతికంగా ఇక మన మధ్య లేరు అని తెలిసిన వెంటనే నేను, మా చిన్నమ్మాయి బయలుదేరి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని అలా వదిలి రావాలి అని అనిపించనందున వారితో పాటు ఈఎస్‌ఐ వరకు వెళ్ళాము. ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు చాలా తృప్తిగా అనిపించింది. ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం కావడంతో ఇంటి చుట్టుపక్కల వారు ఉదయం నుండి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళినారు అని అడిగినారు. విషయం చెప్పగా ఆమె మీ బంధువులా అని అడిగారు. బంధువుల కంటే గొప్ప ఆత్మీయానుబంధం ఉంది, వారు చనిపోతే నాకు నిజంగా మా కుటుంబ సభ్యులు చనిపోయినట్లుగా అనిపిస్తోంది అని చెప్పాను.
అబ్బూరి ఛాయాదేవి గారి జీవితం నుండి నేర్చుకుని ఆచరించాల్సిన మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఛాయాదేవి గారి సాహిత్య రచనలు రాబోయే భావితరానికి అందించి వారి రచనలలోని విశేషాలను ప్రత్యేకంగా అమ్మాయిలకు తెలియచేయాలి. అప్పుడే అబ్బూరి ఛాయాదేవి గారికి నిజమైన హృదయపూర్వక నివాళి అందించినట్లు అవుతుంది. ఇది అభ్యుదయ భావాలు గల మనందరి బాధ్యత.
ఈ రకంగా భూమిక ఆగస్టు సంచికను ఛాయాదేవి గారి ప్రత్యేక సంచికగా తీసుకువచ్చి దానిలో మాలాంటి వారికి కూడా అవకాశం కల్పించినందుకు సత్యవతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను.
ఛాయాదేవి గారి ప్రతిస్పందన
స్త్రీ వాద పత్రిక భూమిక సంపాదకులకు నమస్కారం. ‘భూమిక రజతోత్సవ సంచికలో ప్రచురించిన ఒక వ్యాసం నాకు చాలా నచ్చింది. ”ఆర్భాటం లేని ఆదర్శ వివాహాలను ఆదరించి అభినందించాలి” అనే శీర్షికతో దాన్ని ఒక ఆదర్శంగా రాసిన శ్రీమతి పసుపులేటి రమాదేవికి నా హృదయపూర్వక అభినందనలు. సాంప్రదాయాల పేరుతో కట్నాలు, లాంఛనాలు ఇస్తూ, తీసుకుంటూ వివాహాల పేరుతో డబ్బు ఖర్చు పెట్టడం, డబ్బు తీసుకోవడం చేస్తున్న పెద్దవాళ్ళది ఎంత తప్పో, ఆర్భాటాలతో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకోవడం, పెద్దల చేత ఖర్చు పెట్టించడం చేస్తున్న యువతీ, యువకులది కూడా అంతే తప్పు. పూర్వపు రోజుల్లో పెళ్ళి భోజనాలు సాంప్రదాయ బద్దంగా ఉన్నా వెర్రి పోకడలు ఉండేవి కావు. ఈ రోజుల్లో ఎన్ని రకాల ఆహార పదార్ధాలు ఏర్పాటు చేస్తే అంత గొప్ప అనుకుంటూ వాటి మీద విపరీతమైన ఖర్చు చేస్తున్నారు. ఊరేగింపులో డాన్స్ చేయడానికి పూర్వం కొందరు డాన్సర్లను పెట్టేవారు. సినిమాల ప్రభావంతో ఇప్పుడు యువతీ, యువకులే డాన్సులు చేస్తున్నారు. ఇంకా ఎన్నో ఉన్నాయి. పెళ్ళి కార్డుల మీద లక్షలు, కోట్లు ఖర్చు పెట్టడం వంటివి సంస్కరించవలసిన అంశాలు.
ఆదర్శ వివాహం చేసుకున్న నాగ్‌పూర్‌కి చెందిన జంటకి నా హృదయపూర్వక అభినందనలు. అటువంటి వాళ్ళు ఒక ఉద్యమాన్ని నడపాలని, సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాను.
– అబ్బూరి ఛాయాదేవి