మంచి తెలుగు కథ, మంచి వ్యక్తి అనగానే నాకు ముందు జ్ఞాపకం వచ్చే పేరు అబ్బూరి ఛాయాదేవి గారిదే. స్త్రీ వాదం అనే పదం తెలుగు సాహిత్యంలో వినపడని రోజుల్లోనే ఆ ముద్ర లేకుండా ఆమె రచించిన చాలా కథలు స్త్రీ వాదానికి గౌరవం తెచ్చిపెట్టిన కథలే. అప్పటికే ఆమె పేరు ప్రఖ్యాతలు తెలిసనవే అయినా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థాపనకి ఏడాది ముందే ఆమెతో అనుకోని పరిస్థితులలో… అంటే 1993లో ఆమె భర్త, ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వరరావు గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనకి అమెరికా మందులు పంపించడానికి ఆయన సోదరి, మా హ్యూస్టన్ నివాసి, ఎంతో ఆప్తురాలు అయిన ఛాయా జానకి ప్రయత్నాలకి నేను సహకరించిన సందర్భంలో ఛాయాదేవి గారితో నాకు పరోక్షంగా పరిచయం కలిగింది. వరద రాజేశ్వరరావు గారు పరమపదించిన తరువాత నేను ఇండియా ఎప్పుడు వెళ్ళినా ఛాయాదేవి గారిని హిమాయత్ నగర్‌లోని ఆమె ఇంటికి వెళ్ళి పలుకరించేవాడిని. ఎక్కడ చూసినా పుస్తకాలు, చిత్రపటాలు, పువ్వులతో వారి ఇంట్లో అంతా పూర్తిగా సాహిత్య వాతావరణమే. ఆప్యాయంగా పలకరించడం, వరద రాజేశ్వరరావు, శ్రీ శ్రీ, ఆరుద్ర మొదలైన వారి వెక్కిరింతలూ, హాస్య సంబాషణలూ ఏకరువు పెడుతూనే తాము స్థాపించిన ”కవిత” పత్రికకి ఆదిలోనే హంసపాదు లాంటి విఘ్నాలూ, తాము డిల్లీలో ఉన్నప్పటి సంగతులూ, 1963లో వరద రాజేశ్వరరావు గారు ఆమెరికాలో మెడిసన్‌లోని విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నప్పటి అనుభవాలూ… అన్నీ సరదాగా పంచుకునేవారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఎప్పుడు వెళ్ళినా వరద స్మృతులు లాంటి ఏదో ఒక మంచి పుస్తకం నాకు బహుకరించడం నాకు వ్యక్తిగతంగా మర్చిపోలేని జ్ఞాపకాలు. వాటిల్లో ఆమె వ్రాసిన ‘వ్యాస చిత్రాలు’ అనే సంకలనం నాకు చాలా నచ్చిన గ్రంథాలలో ఒకటి. ఇక హైదరాబాద్‌లో మేము ఎప్పుడు సాహిత్యసభ పెట్టినా, ఇంచుమించు మా మొదటి ఆహ్వానం ఆవిడకే. పిలవగానే ఆమె ఏ విధమైన భేషజాలూ లేకుండా సభకి వచ్చి. ఏ సాహిత్యపరమైన అంశం మీదనైనా కూలంకషంగా పరిశోధన చేసి, అనర్గళంగా, సమయం మించకుండా ఉపన్యసించేవారు. మేము నిర్వహించిన మొట్టమొదటి మరియు రెండవ ప్రపంచ సాహితీ సదస్సులు, మూడు మహిళా రచయితల సదస్సులకీ ఆమె సహకారం, ఆమె ప్రసంగాలు ఒక ఎత్తు అయితే 2011లో మా సంస్థ 17వ వార్షికోత్సవ మహాసభలో ఛాయాదేవి గారిని ప్రత్యేకంగా సత్కరించుకునే అదృష్టం ఆమె మాకు ఇచ్చారు. ఆనాటి ఫోటో ఒకటి ఇక్కడ జతపరుస్తున్నాను. తెలుగు పాఠశాలల్లో పాఠ్యాంశమయిన బోన్‌సాయ్ బ్రతుకు కథే కాక, ప్రయాణం, సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు మొదలైన ఛాయాదేవి గారి కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. 2005లో ఆమెకి కేంద్ర సాహిత్య అకాడెమీ వారు అవార్డును ఇచ్చి తమని తామే గౌరవించుకున్నారు. ఆమె అధిరోహించిన సాహిత్య శిఖరాలు ఎవరైనా చెప్తే కానీ తనంత తానుగా ఏనాడూ చెప్పుకోని నిగర్వి అబ్బూరి ఛాయాదేవి గారు.
తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా కథా ప్రక్రియకి, విశ్లేషణా వ్యాసాలకి అబ్బూరి ఛాయాదేవి గారు చేసిన సేవ, ఔత్సాహికులకి కలిగించిన స్ఫూర్తి అనితర సాధ్యం. జూన్ 28, 2019 నాడు తన 86వ ఏట పరమపదించిన అబ్బూరి ఛాయాదేవి గారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వ్యక్తిగతంగానూ, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా తరపునా మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.