ఆశ్రమం నుంచి ఆప్యాయంగా వినవచ్చే ఆ పిలుపు ఆగిపోయింది. నెమ్మదిగా, కొంచెం హస్కీగా అయినా దృఢంగా, ప్రేమగా పలకరించే ఆ గొంతు మరింక వినిపించదు అంటే గుండె నిండా బాధ గుబగుబలాడుతోంది.
అబ్బూరి ఛాయాదేవి గారి పరిచయం తలచుకున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. క్రమంగా ఇప్పుడది దుఃఖంగా మారుతోంది.
అది 1992 అని గుర్తు. అస్మిత రిసోర్స్ సెంటర్ వారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబోయే సదస్సులో పాల్గొనమని నాకు ఆహ్వానం రావడంతో అత్యంత ఉత్సాహంగా బయలుదేరాను. అప్పటికి నేనింకా ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.లో ఉద్యోగంలో ఉండడవల్ల సహజంగానే విజయవాడలో ఆర్టీసీ బస్సెక్కి హైద్రాబాద్ చేరుకున్నాను. తొమ్మిది గంటలకే సభ ప్రారంభమైపోతుందనీ, సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉన్న మా తమ్ముడింటికి వెళ్ళి రావడం కష్టమనీ, నేరుగా విజ్ఞానకేంద్రానికి వెళ్ళిపోయాను. సభకి ఇంకా సమయం ఉండడంవల్ల అక్కడెవ్వరూ లేరు. అప్పుడేం చెయ్యాలో తోచక, దిక్కులు చూస్తూ కాసేపు కాలక్షేపం చేశాను. నేరుగా బస్సు దిగి వచ్చానేమో చిరాగ్గా ఉంది. మా వాళ్ళింటికి వెళ్ళి రావడమే మంచిదని అక్కడొక స్లిప్ పెట్టి బ్యాగ్ తీసుకుని బయలుదేరాను. గేటు దాటుతుంటే ఎదురుగా ఆమె కనిపించారు. తెల్లగా, అందంగా, సన్నటి గళ్ళున్న తెల్లటి మిక్స్‌డ్ కాటన్ చీరతో పొందికగా ఆమె లోపలికొస్తూ, నేను బయటికెళ్తూ… ఆమె నావైపు చూసి చిరునవ్వు ముఖంతో ”మీరు జానకీ బాలా” అన్నారు.
”అవును మీరు ఛాయాదేవి గారు కదా!” అన్నాను. ఇద్దరం అంతకు పూర్వం కలుసుకోలేదు. ఆమె నవ్వుతూ నా మాటలన్నీ విని ”భలేవారే.. మా ఇల్లు ఇక్కడే. రండి కాస్త స్నానంచేసి కాఫీ తాగి వద్దురుగాని” అంటూ వాళ్ళింటికి తీసుకువెళ్ళారు. అప్పటినుంచి సుమారు పాతికేళ్ళుగా ఎన్నోసార్లు కలుసుకున్నాం, ఎన్నో సభల్లో పాల్గొన్నాం. ఆమె విజయవాడ బుక్‌ఫెయిర్ ఉపన్యాసం చదవడంలో గొంతు సహకరించకపోతే అది నేను చదివాను. ఎప్పుడూ నవ్వుతూ, నిష్కర్షగా, నిర్మొహమాటంగా, సౌమ్యంగా తన అభిప్రాయం చెప్పేవారు.
ఆమె పరిచయం కానంతవరకు ఆమె రచనలే తెలుసు. కలుసుకుని స్నేహం ఏర్పడిన తర్వాత, గొప్ప రచనల వెనుక గొప్ప వ్యక్తిత్వం ఎంత అవసరమో తెలిసివచ్చింది. ఆమె నాకు చేసిన హితబోధను నేనెప్పటికీ నెమరేసుకుంటూ ఉంటాను.
నేను ఒక సభలో మాట్లాడుతూ ఒక రచయిత్రి రచనలమీద విమర్శ చేశాను. అప్పుడు చాలామంది కష్టపెట్టుకున్నారు. నన్ను మరిక పిలవకూడదని భావించి పిలవలేదు ఆ తర్వాత, ఇప్పటికీ పిలవరు.
ఛాయాదేవి గారు నాతో ఇలా అన్నారు… ”ఎందుకలా విమర్శ చేశారు? పుస్తకంలో ఉన్న నాలుగు మంచి మాటల్ని ప్రస్తావిస్తూ మాట్లాడితే పోయేది ఎందుకొచ్చిన రొష్టు” అన్నారు.
నిజమేకదా! అనిపించింది. అసలే విమర్శని స్వీకరించలేని సాహితీపరుల మధ్య నొప్పించకపోవడమే మంచిది అనుకున్నాను, తెలుసుకున్నాను. ఇది ఆత్మవంచన కాదు. సమాజధర్మం అన్నారామె. అవును, నిజం. ఆమె నన్నెంతో ప్రేమించారు. నా పుస్తకం మీద మంచి సమీక్ష వ్రాశారు. మరో పుస్తకానికి ముందు మాట వ్రాశారు.
ఒకసారి శర్మగారు కర్ర పుచ్చుకుని నడుస్తూ సభకి వస్తే ”ఏమిటి చేతికి కర్ర వచ్చింది” అన్నారామె నవ్వుతూ. ”మరేనండీ, కర్ర పెత్తనం చేద్దామనీ” అన్నారాయన. ”అంటే పెత్తనం పోయి కర్ర మిగులుతుందన్న మాట” అన్నారామె నవ్వుతూ. ఆమెకున్న హాస్య ప్రియత్వం, చమత్కారం ఆమె రచనలు ”ఎవర్ని చేసుకోను” లాంటి వాటిల్లో కనిపిస్తూనే ఉంటుంది.
ఈ ఛలోక్తి మేమింట్లో తరచూ చెప్పుకుని నవ్వుకుంటాం. నవ్వుతూ కనిపించినా ఆమెకి సాహిత్యం పట్ల, జీవితం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. మనసా నిరాడంబరత్వం అంటే ఆమెనే చెప్పుకోవాలి.
ఆమె చంద్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమంలో ఉన్నారనే ఊహే ఊరటగా ఉంది. ఆమెకి మరణం ఏమిటి? అనే ప్రశ్న కలుగుతుంది. అయితే ప్రకృతి సహజమైన విషయాన్ని ఎవరూ తప్పించుకోలేరు. ఇప్పుడు దుఃఖించిన మనమంతా కలకాలం ఉంటామనే గ్యారంటీ లేదు కదా. ఆమె మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోయారని నమ్ముతూ… ఛాయాదేవి గారూ… మరి శెలవు.