కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాల పలవరింపు – ఛాయాదేవి సాహిత్యం

 

అబ్బూరి ఛాయాదేవి గారి తొలి కథల కాలం నుండి నేను ఆవిడ అభిమానిని. ఆచార సంప్రదాయాలను విమర్శనాత్మకంగా చూడడానికి, జీవితాన్ని ఆత్మగౌరవ చైతన్యంతో నిర్మించుకొనడానికి కావలసిన వ్యక్తిత్వాన్ని నవయవ్వనంలోకి అడుగుపెడుతున్న నాకు అత్యంత ఆత్మీయంగా, ఆర్ద్రంగా అందించిన మూడునాళ్ళ ముచ్చట. ఎవర్ని చేసుకోను, బోన్సాయ్‌ బ్రతుకు, కర్త-కర్మ-క్రియ వంటి కథలు వ్రాసిన ఛాయాదేవి గారి పట్ల నాకు ప్రేమ, కృతజ్ఞత. 1990ల నాటికి కానీ నాకు ఆమెతో ప్రత్యక్ష పరిచయం ఏర్పడలేదు. కలంకారీ నేత చీరలు, మెళ్ళో పగడాల మాల, ఒక్కొక్కప్పుడు రుద్రాక్షలు… ప్రశాంతమైన నవ్వు ముఖం, ఒక యోగినిలా అనిపించేవారు. హైదరాబాద్‌ సాహిత్య, సామాజిక సమావేశాలలో తరచూ కలుస్తుండేవాళ్ళం. ఒకటి రెండు సార్లు ఇంటికి వెళ్ళిన గుర్తు. ఆమె కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఒళ్ళోకి ఎక్కి కూర్చుంటూ పిల్లిపిల్లలు… ఆశ్రమ వాతావరణాన్ని తలపించింది.

ఛాయాదేవిగారితో పనిచేసే అవకాశం, ఛాయాదేవి గారి గురించి పనిచేసే అవకాశం రెండూ నాకు లభించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా సంఘం (1997-2002)లో ఆమెతోపాటు నేనూ ఉండడం గొప్ప సంతోషం కలిగించిన విషయం. ఆవిడ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులు కూడా. సలహా సంఘం సభ్యులందరిలోకి నేనే చిన్నదాన్ని అనుకుంటా. అయినా నా అభిప్రాయాలూ, ఆలోచనలూ పంచుకొనడానికి ఎప్పుడూ అవకాశాలు తెరుచుకునే ఉండేవి. అప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ 20వ శతాబ్ది తెలుగు రచయిత్రుల సంకలనం సమకూర్చే పని ఛాయాదేవి గారికి అప్పచెప్పారు. నిజానికి ఏ సహాయమూ అవసరం లేని క్రియాశీలత ఆమె లక్షణం అయినా వ్యవహార ధర్మంగా నాతోపాటు పి.సత్యవతి, ఓల్గా, జయప్రభలతో కూడిన సలహా సంఘాన్ని ఏర్పరచింది అకాడమీ. ఆ రకంగా ఆ సంకలనం రూపొందుతున్న కాలం మా మధ్య సంభాషణలకు, ఉత్తరాలకు కారణమై అనుబంధం పెరగడానికి అది ఒక నెపం అయింది.

1999లో ఆ సంకలనం పూర్తి చేయడానికి ఆమె ఎంత శక్తిమంతంగా, సునిశితంగా పనిచేశారో నాకు తెలుసు. రచనల ఎంపికలో హేతుబద్ధత, దృష్టికోణం, ప్రతిదాన్ని అందరితో చర్చించి నిర్ణయం తీసుకునే ప్రజాస్వామిక దృక్పథం నన్నెంతో ప్రభావితం చేశాయి. ”కథలను ఎంపిక చేసేటప్పుడు నేను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకున్నది ‘ఈ శతాబ్దంలో ఆరంభం నుంచి నేటివరకు స్త్రీలు ఏ క్రమంలో చైతన్యవంతులయ్యారో ఈ కథల ద్వారా తెలియాలి’ అనే అంశం. స్త్రీలు తమ అస్థిత్వాన్ని గుర్తించడం, తల్లిదండ్రులు పెంపకంలో చూపే వివక్ష, స్త్రీ, పురుష సంబంధాలు, వైవాహిక జీవితంలో స్త్రీల సంక్షిప్త అనుభవాలు, సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే వివిధ సమస్యలు… వీటిని ఆనాటి నుండి ఈనాటి వరకూ వివిధ తరాలకు చెందిన స్త్రీలు ఏ విధంగా చిత్రించారో చూపే కథల్ని ఎంపిక చేస్తే, స్త్రీల ప్రగతిపైన దృష్టిని కేంద్రీకరించినట్లవుతుందనీ, ఈ విషయంలో రచయిత్రుల దృక్పథం కొంత స్పష్టమవుతుందనీ అనిపించింది” అని (12-5-99 నాటి లేఖ) ఆమె వ్రాసిన మాటలు, జీవితం పట్ల ఒక దృక్పథం లేకపోయినా, తప్పుడు దృక్పథం ఉన్నా అలాంటి కథలను ఎంచుకోలేదని ఛాయాదేవిగారు చెప్పిన మాటలు పనిలో ఆమె ఎంత పద్ధతిగల మనిషో చెప్తాయి.

అప్పుడే నాకు సాహిత్య అకాడమీ తెలుగునాట మహిళా ఉద్యమాల గురించి ఒక సంకలనం తీసుకువచ్చే బాధ్యతను అప్పగించింది. ఆ పనిని త్వరగా పూర్తి చేయమని హెచ్చరిస్తూ ఆవిడ రాసిన ఉత్తరాలు, చూపిన అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనివి. 2006లో ‘ఆధునిక తెలుగు సాహిత్యం – స్త్రీ వాద భూమిక” అనే వ్యాస సంకలనం ప్రచురిస్తున్నప్పుడు దానికి ఛాయాదేవి గారిని ముందుమాట వ్రాయమని అడిగాను ”సదవగాహనకీ, భావి పరిశోధనకీ భూమిక” అనే శీర్షికతో ఆవిడ వ్రాసిన ముందుమాట నాకెంతో విలువైనది.

2011లో అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్‌ వారు అబ్బూరి ఛాయాదేవి గారికి ప్రతిభామూర్తి పురస్కారాన్ని ప్రకటించి ఆ సందర్భంగా స్త్రీల సాహిత్యంపైనా, ప్రత్యేకించి అబ్బూరి ఛాయాదేవిగారి సాహిత్యంపైనా రెండు రోజులు సదస్సు నిర్వహించే బాధ్యత నాకు అప్పగించినప్పుడు ఛాయాదేవిగారి సమగ్ర సాహిత్యమూర్తిమత్వాన్ని మరింత బాగా అర్థం చేసుకొనే అవకాశం నాకు దొరికింది. ఛాయాదేవిగారు కేవలం సృజనాత్మక రచయిత మాత్రమే కాదు, ఆలోచన, తర్కం విశ్లేషణ ప్రధానమైన వ్యాస రచయిత, సాహిత్య విమర్శకురాలు, జీవిత చరిత్ర, యాత్రా చరిత్రల రచయిత, అనువాదకురాలు, పత్రికా సంపాదకురాలు, తాత్విక చింతనాపరురాలు, బహుముఖ కళా నైపుణ్యం ఆమెది. దానిని వ్యక్తీకరించే విధంగా ఆ రెండు రోజుల సదస్సుకు అంశాల నిర్ధారణ, వక్తల ఎంపిక దగ్గరనుండి ఆ వ్యాసాలతో ప్రతిభా వైజయంతి సంచిక ప్రచురణ వరకు దాదాపు ఒక ఏడాదికి పైగా ఛాయాదేవిగారి సాహిత్యంతో సత్సంగం నాకెంత ఉత్తేజాన్ని,

ఉత్సాహాన్ని, సంతృప్తిని ఇచ్చిందో చెప్పలేను. ఆ సందర్భంగానే ఆంధ్ర యువతి మండలి పక్షాన ఛాయాదేవిగారు సంపాదకులుగా హైదరాబాద్‌ నుండి 1956లో ప్రారంభమై ఏడాదిపాటు నడిచిన వనిత పత్రిక సంచికలు చూడగలిగాను. ప్రారంభ సంచిక సంపాదకీయంలో ఛాయాదేవి ”స్త్రీని వంటయిల్లు అనే చీకటి పరిధి నుంచి తప్పించి, ఆరుబయట ఆకాశం క్రింద ఏం జరుగుతున్నదో తెలియచెప్పడానికి, చుట్టూరా విస్తరించుకుని ఉన్న విశాల ప్రపంచంలో అనునిత్యం సాగే జీవన సంఘర్షణలో స్త్రీ

ఉనికి, స్త్రీ భాగస్వామ్యం, ఆమె నిర్వహించవలసిన పాత్ర ఇత్యాది విషయాలను ప్రబోధించడానికి ఎక్కువ మహిళా పత్రికలు అత్యంతావశ్యకం” అని వ్రాసిన మాటలు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి దశాబ్దంలోనివి అని మనం గుర్తుంచుకొంటే ఆవిడది ఎంత ముందు చూపో అర్థమవుతుంది. ఛాయాదేవిగారి కథా రచనకు ప్రేరణ అయిన వదిన రుక్మీణీ గోపాల్‌, ఉన్నవ విజయలక్ష్మి , నందగిరి ఇందిరాదేవి, ఎల్లాప్రగడ సీతాకుమారి, నాయని కృష్ణకుమారి వంటి వాళ్ళ రచనలతో పాటు ఛాయాదేవిగారి రచనలు కూడా అందులో ప్రచురించబడ్డాయి. ఎస్‌.రాజ్యలక్ష్మి, డాక్టర్‌ కొండా శకుంతలాదేవి వంటివారు విద్యా, వైద్య విషయాలపై వ్రాస్తుండేవారు. ఆధునిక స్త్రీ భావజాల చైతన్యాన్ని అర్థం చేసుకొనడానికి ఇలాంటి పత్రికలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఆ లక్ష్యంతో ఆ పత్రికపై వనిత అనే ఆమెతో ఎంఫిల్‌ డిగ్రీ కోసం కాకతీయ యూనివర్శిటీ తెలుగు విభాగం నుండి పరిశోధన చేయించటం నాకొక మంచి అనుభవం.

ఛాయాదేవి గారి కథల తరువాత నా ఆంతర్యానికి దగ్గరగా వచ్చిన రచన ‘మృత్యుంజయ’. అది ఒక రకంగా ఆమె తండ్రి జీవిత చరిత్ర. తండ్రి తనకు వ్రాసిన

ఉత్తరాల ఆధారంగా తండ్రి వ్యక్తిత్వంపై తనదైన వ్యాఖ్యానంతో చేసిన రచన కనుక మరొక రకంగా స్వీయ చరిత్ర కూడా. తండ్రుల పట్ల కూతుళ్ళకు, తల్లుల పట్ల కొడుకులకు ప్రేమ ఉంటుందనేది ఒక లోక వ్యవహారం. తండ్రి పోలికలతో ఉన్న ఆడపిల్లలు, తల్లి పోలికలతో ఉన్న మగపిల్లలు అదృష్టవంతులు అనటం బహుశా దానికే మరొక తరహా వ్యక్తీకరణ కావచ్చు. ఛాయాదేవి గారి తండ్రి మద్దాలి వెంకటాచలం. తనపై తండ్రి ప్రభావాన్ని గురించి పత్రికలకు ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో తరచూ ప్రస్తావించారు. వాటితో కలుపుకొని ఈ జీవిత చరిత్రను చదవాలి, నా జీవితంలో ప్రధానమైన వ్యక్తి మా నాన్నగారు అంటారామె. ఆయన ఎందుకు ప్రధానమైన వ్యక్తి అయ్యారు? తన జీవితం ఎలా నడవాలో నిర్దేశించిన వ్యక్తి కనుక. తనను ఆడపిల్లలాగా కాక మగపిల్లవాడిగా చూశాడు. ఆడపనులు, ఆడపిల్లల ఆటలు, ఆడతనం అబ్బుతుందేమోనని అమ్మతో, అక్కతో సాన్నిహిత్యం అన్నీ ఆమెకు నిషేధమే. మగపిల్లవాడిగా చూశాడు కనుకనే అక్కకు చెప్పించని చదువు తనకు చెప్పించాడు. అన్నతో పోల్చి ఆడపిల్లవు కనుక పోటీ పడలేకపోతున్నావని నిఘా చూపులతో, హెచ్చరికలతో ఆత్మన్యూనతా భావం పెంచాడు. ఇంట్లో తండ్రి అధికారం మాటమీద, నవ్వుమీద, నడకమీదా నిఘా అయి సహజ మానవీయ స్పందనలను స్వచ్ఛందంగా అణచుకొనేట్లు చేశాయి. అసలా తండ్రి అధికారంపై, పెత్తనంపై విమర్శగానే ఆమె సాహిత్య ప్రస్థానం ప్రారంభమయింది. ఇంతకూ అలాంటి తండ్రి పట్ల ఆమెకు కోపమా? భయమా? ద్వేషమా? అని తరచి చూస్తే చాలా ఆశ్చర్యంగా వాటన్నింటికీ అతీతంగా ఒక సదవగాహన, నిర్లిప్తత అంచుగా గల ప్రేమ, గౌరవాల కలనేత తత్వం కనబడుతుంది.

తండ్రి నుంచి ఆమె ఆశించింది ప్రేమ, స్నేహం, చనువు. అవి ఆమెకు లభించలేదు. ప్రేమపూర్వక స్పర్శ ఒక మానవీయ ఆకాంక్ష. కరచాలనాలూ, కౌగిలింతలూ అన్నీ అందులో భాగమే. క్రమశిక్షణ పేరుమీద ప్రేమరాహిత్యం, మనుషుల మధ్య బెదురురేఖ కావటం ఒక విషాదమే. అదే తండ్రి చివరి రోజులలో ఒంట్లో బాగాలేక మంచంమీద ఉన్నప్పుడు చూడడానికి వెళ్ళిన కూతురు ఉద్వేగాలన్నీ అణచుకొని మొహమాటంగా, దూరంలో ఒక కుర్చీలో కూర్చొనే పరిస్థితిని కల్పిస్తుందని 1989లో వ్రాసిన ‘స్పర్శ’ అనే కథలో సూచించారు. ఆత్మీయ స్పర్శను ఆకాంక్షిస్తూ తండ్రే కూతురిని మంచంమీద తన దగ్గరగా వచ్చి కూర్చోమనటం ద్వారా ఆ బెదురు రేఖలను చెరిపేసుకునే మానవ ప్రయత్నాల ప్రారంభాన్ని చిత్రించారు. తండ్రి, తనయల సంబంధాల మీద తీర్పులకు తావులేని అత్యంత వాస్తవిక స్థితి చిత్రణ ఈ కథ. దీనికి కొనసాగింపు 1993లో వ్రాసిన ‘మృత్యుంజయ’.

తండ్రంటే ఎదుటబడితే భయమే. కానీ చిత్రంగా ఛాయాదేవికి ఉత్తరాలు ఆ భయాన్ని అధిగమించటానికి వారధి అయ్యాయి. చదువుకోసం హైదరాబాద్‌లో ఉన్నపుడు, ఆ తరువాత పెళ్ళయి ఢిల్లీలో ఉన్నపుడు తండ్రి వ్రాసిన ఉత్తరాలు స్నేహపూర్వకంగా ఉండేవని, తానూ స్వేచ్ఛగా జవాబులు వ్రాసేదానినని ఆమె చెప్పుకొన్నారు. అలా తండ్రి వ్రాసిన ఉత్తరాలలో కొన్ని భాగాలను ఉటంకిస్తూ, వ్యాఖ్యానిస్తూ ఆమె వ్రాసిన పుస్తకం ‘మృత్యుంజయ’. సుమారు 1960 నుండి మొదలై 1975లో ఎమర్జెన్సీ ప్రకటన తరువాత కాలం వరకు 16, 17 ఏళ్ళ కాలం మీద తండ్రి వ్రాసిన ఉత్తరాలలోని కొన్ని భాగాలను ప్రస్తావిస్తూ, తండ్రి వ్యక్తిత్వాన్ని నిర్మిస్తూ సాగే రచన ఇది. రాజమండ్రిలో లాయర్‌గా ఉన్న తండ్రి ఆ వృత్తి నుండి విరమించి హైదరాబాద్‌కు మకాం మారటం అనే చలన ప్రక్రియలో భాగంగా తండ్రి నిర్వహించిన ఇంటి బాధ్యతలు, వాటిపట్ల ఆయన దృష్టి, ఆయన సాహిత్యాభిలాష, జిడ్డు కృష్ణమూర్తి తత్వం పట్ల అభిమానం, ఆయనలోని అహంభావం, అహంకారం, ఆలోచనలు, అభిప్రాయాలు, మృత్యు చింతన… అన్నింటినీ దాపరికాలు, దాటవేతలు, అతిశయోక్తులు ఏమీ లేకుండా

ఉన్నది ఉన్నట్లుగా తగినంత దూరంలో నిలబడి చేసిన వస్తుగత విశ్లేషణ ఈ రచన.

నాన్నగారిదీ, అన్నయ్యదీ ఇద్దరిదీ పుట్టినరోజు ఒక్కటే అని చెప్పి ఛాయాదేవి ఇద్దరూ ఒకేచోట ఉన్నారు కదా అని పుట్టినరోజుకి ఇద్దరికీ కలిపి ‘బెర్ట్రాండ్‌ రస్సెల్‌ స్పీక్‌ హిస్‌ మైండ్‌’ పుస్తకం కానుకగా పంపానని, తండ్రికి ప్రత్యేకంగా శుభాకాంక్షలతో ఉత్తరం రాశానని, దానికి జవాబుగా తండ్రి రాసిన ఉత్తరంలోని విషయాలను ప్రస్తావిస్తూ రచనను కొనసాగించారు. మృత్యువు కోసం ఎదురు చూస్తూ తనను తాను సన్నద్ధం చేసుకొంటున్న అరవై ఏడేళ్ళ ఆయన తన పేరును ‘మృత్యుంజయ’ అని మార్చుకొని అట్లాగే చిరునామాలో రాయమని కూతురికి చెప్పడం, తాను అలాగే సంతకం చేయటం చిత్రంగా అనిపించకపోదు. మానవ జీవితంలోని వైచిత్రి అదే. అదే ఈ జీవిత చరిత్రకు పేరు అయింది. పదహారేళ్ళ జీవితం గడిచి ఎనభై నాలుగేళ్ళ వయసులో తాను ఏ మృత్యువు కోసం ఎదురుచూస్తున్నాడో ఆ మృత్యువు కొడుకును కబళించిన చోట కొత్త బరువులతో, బాధ్యతలతో ఆయన జీవించాల్సి రావటం దగ్గర ఈ రచన ముగుస్తుంది.

అక్కకు, చెల్లెలికి ఆడపిల్లలు పుట్టినప్పుడు తండ్రి వ్రాసిన ఉత్తరాలలోని అభిప్రాయాల ప్రస్తావన ఇందులో ఒక ముఖ్యాంశం. మగపిల్లలంటే తండ్రికి ప్రీతి అని తెలిసిన కూతురికి, ఆడపిల్లలంటే కూతురికి ప్రేమ, మగపిల్లలంటే అసహ్యం అని తెలిసిన తండ్రికి మధ్య సంవాదం తీవ్రంగా ఉంటుందని అనుకుంటాం. నీకు ఒక్క మొగపిల్లడు కూడా లేకుండా ఏడుగురు ఆడపిల్లలు పుడితే మీ అత్తమామలు, మీ ఆయన ఎంత సంతోషిస్తారో చూస్తాను అని సవాల్‌ విసిరే తండ్రి పట్ల ఛాయాదేవి ఆగ్రహించరు. మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉండడానికి యూరప్‌ ఖండమంతటా యుద్ధరంగంలో పోరాడి మరణించిన వాళ్ళ ఆత్మలు ప్రశాంతమైన సాంసారిక జీవితాన్ని, ఇంటిపట్టున లభించే సౌఖ్యాలను కోరి స్త్రీల శరీరాలలోకి చేరడమే కారణమని, ఆ గతజన్మ లక్షణాలను బట్టే స్త్రీలకు చదువుకోవాలని,

ఉద్యోగాలు చేయాలని, పురుషులతో సమాన ప్రతిపత్తి కావాలని కోరిక కలుగుతున్నదని తండ్రి చేసిన తర్కాన్ని ఆమోదించలేకపోవచ్చు కానీ విసుక్కోరు. సరియైన పనిని సరియైన సమయంలో సరియైన విధంగా నిర్వర్తించాలని ఆయన చేసే బోధ విసుగు కలిగించేది అని చెప్పటానికి మొహమాటపడరు. ఏది సరియైనది అని ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారు? ఒకరికి సరియైనది మరొకరికి అవుతుందా వంటి ప్రశ్నలతో దానిపట్ల విమర్శనాత్మకంగా ఉంటారు కానీ అలాగని ఆ విషయం తండ్రి ఎదుటబడి అడిగే ధైర్యం లేదని అంగీకరిస్తారు.

నరనరాన అధికార లక్షణం, ఆడవాళ్ళ పట్ల చులకన భావన తండ్రిలో మూర్తీభవించిన విషయం చెప్పడానికి ఛాయాదేవి ఎక్కడా సందేహించలేదు. ఉన్నచోటు నుండి ఎక్కడికీ, ఏ పిల్లల దగ్గరికీ వెళ్ళనని భీష్మించుకుని కూర్చొనటం, అక్కా చెల్లెళ్ళ మీద, అన్న మీద, అన్నపిల్లల మీద ఆయన వ్యక్తపరిచే అసంతృప్తిని, రిటైరయినా నిర్లిప్తత అలవరచుకోలేని బలహీనతను గురించి చెప్పినా, ఇంగ్లండులో చదువుకొని హేతువాదిగా మారిన కొడుకుకు అనుగుణంగా తానూ ఆచార సంప్రదాయాలను వదిలేసి హేతువాదిగా, మానవతావాదిగా మారగలిగినా కూడా కుటుంబంలో మగవాడి అధికార స్థానాన్ని అమలు చేయాలన్న అలవాటు వల్ల కొడుకుతో సంఘర్షణకయినా సిద్ధమవుతున్న తీరును ప్రస్తావించినా ఏ ఆరోపణా లేని స్వరమే ఆమెది. అందువల్ల ఆయన ఒక సాధారణ కుటుంబీకుడుగా కనబడతాడే కానీ ఎక్కడా ప్రతినాయక స్థితిలో ప్రదర్శితం కాలేదు. అన్నమీద కానీ, అక్కాచెల్లెళ్ళ మీద కానీ తండ్రికి ఏవో ఆరోపణలు ఉన్న సందర్శాలలో వాళ్ళను కూడా ఆమె ఎక్కడా తప్పు పట్టకపోవడం గమనించవచ్చు. మనుషుల మీద ప్రవర్తనల ప్రభావం పరిసరాల మీద, సంబంధాల మీద ఎలా ప్రసరిస్తుందో పరిశీలించటమే తప్ప, గుర్తించి చెప్పటమే తప్ప తీర్పును ఎక్కడా ప్రకటించకపోవడం చూడవచ్చు. ఇంత వస్తుగత దృష్టి, రాగద్వేషాలకు అతీతమైన స్థితి ఎలా సాధ్యమైందన్నది ప్రశ్న.

తండ్రీ తనయల సంభాషణ ప్రధానంగా మేధకు సంబంధించినది. నెహ్రు మరణం, సర్వేపల్లి రాధాకృష్ణ మరణం, తుఫాన్‌ వంటి సమకాలిక విపత్తులు, తెలంగాణ ఉద్యమం వంటి వాటి గురించిన ప్రస్తావనలు ఆయన ఉత్తరాలలో ఉన్నాయి. పెళ్ళిళ్ళలో దుబారా ఖర్చుల పట్ల విముఖత ఆయన ఉత్తరాలలో వ్యక్తమయ్యేది. హోమియో వైద్య విజ్ఞానాన్ని, జిడ్డు కృష్ణమూర్తి తాత్విక చింతనను ఆయన కూతురితో పంచుకునేవారు. కూతురికి ఆస్తమా, కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం ఎంత కోరుకుంటారో, తన హోమియో వైద్య పరిజ్ఞానాన్ని ప్రయోగదశకు తేవటానికి అంతగా ఉబలాటపడతారు. ఆఫీసుకు యధాప్రకారం వెళ్ళి వస్తూ, ఇంట్లో పనీ, వీథిలో పనీ చేసుకుంటున్నా తండ్రి తనను ఒక వ్యాధిగ్రస్థురాలిగా ఊహించుకుంటూ వ్యాధి లక్షణాల గురించి, మందుల గురించి ఉత్తరాలు వ్రాస్తుంటే కూతురు దానిని పిల్లల మీద జాలి, శ్రద్ధ చూపి ఆట్టుకొనే వయోసంబంధమైన మానసిక దశావిశేషంగా గుర్తించిందే కానీ అంతకుమించి ఆందోళన చెందలేదు. ఈ స్థిత ప్రజ్ఞత్వం ఎక్కడనుండి వచ్చిందనేది ప్రశ్న.

తండ్రి దివ్యజ్ఞాన సమాజ ప్రభావంలో వాడు. పదమూడేళ్ళ వయసులోనే కూతురిని కూడా ఆవైపు నడపడానికి ఆయన ప్రయత్నించాడు. ఉత్తరాలలో కూడా తరచు దివ్యజ్ఞాన సమాజపు సభ్యత్వం కొనసాగిస్తున్నావా అని ఆరా తీస్తుండేవాళ్ళు. క్రమంగా ఆయన జిడ్డు కృష్ణమూర్తి ప్రభావంలోకి వచ్చారు. ఉత్తరాలలో ఆయన గురించి తన అధ్యయనాన్నీ, అందువల్ల అవగాహనలో వచ్చే మార్పులను గురించి వ్రాస్తుండేవారు. ‘ఫస్ట్‌ అండ్‌ లాస్ట్‌ ఫ్రీడమ్‌’ అనే గ్రంధాన్ని చదివి అధ్యయనం చేసి ఒక కాపీని కూతురికి పంపిన ఆయన ఒకసారి ఆమె నిరాశా నిస్పృహలతో రాసిన ఉత్తరాన్నికి జవాబుగా ఆ గ్రంథంలోని బోర్‌డం అనే అధ్యాయం చదవమని, అది ఆమె సమస్యలకు మార్గమవుతుందని వ్రాశారు. ఆ రకంగా జిడ్డు కృష్ణమూర్తి వైపు ఆమె ఆలోచనను మళ్ళించిన తండ్రి తాను మారుతూ ఛాయాదేవి జీవితతాత్విక దృక్పథ విసనానికి కూడా కారణమయ్యారు. ఒకసారి కళ్ళ బాధ నివారణకు తెల్ల సుర్మా కావాలని, ఢిల్లీలో కొని పంపించమని తండ్రి వ్రాసిన ఉత్తరానికి ఛాయాదేవి చేసి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ విషయం తెలుపుతూ వ్రాసిన ఉత్తరానికి ఆయన జవాబిచ్చిన తీరు చూస్తే ఆమెకు తండ్రికి కోపం వచ్చిందేమోనన్న అనుమానం కలిగింది. ఆమె అనుమానాన్ని నివృత్తి చేస్తూ వ్రాసిన ఉత్తరంలో ఆయన ‘అమ్మాయీ చాలాకాలంగా నాకు కోపం రావడమనేది జరగడం ఆగిపోయింది. ఇకముందు కూడా నాకు దేనికీ కోపం రాదనుకుంటాను. సరియైన అవగాహన ఉంటే కోపం తెచ్చుకోవలసిన అగత్యమే ఉండదు…’ అన్నాడు. దూర్వాసుడికి ఉన్నంత కోపం, విశాల హృదయం, ఔదార్యం, కరుణ మొదలైన సద్గుణాలన్నీ మింగేసే అసహనం, కోపం ఉన్న తండ్రి కోపమే రాని ఉత్తమ సంస్కారంవైపు ఎదగడానికి జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలను దీక్షగా అధ్యయనం చేయడమే కారణమైందని ఛాయాదేవి అభిప్రాయపడ్డారు. ఛాయాదేవి కూడా 1980ల నుండి క్రమంగా జిడ్డు కృష్ణమూర్తి ప్రభావంలోకి వచ్చారు. వస్తుగత దృష్టి రాగద్వేషాలకు అతీతమైన స్థిత ప్రజ్ఞత మూల బలం ఆ తాత్విక సారమే. ప్రశాంతమైన అవగాహన వల్ల మనస్సు నిశ్చలమవుతుందని, నిన్నటితో, పూర్వ జ్ఞానంతో సంబంధం లేకుండా ప్రతిరోజు కొత్త రోజుగా అప్పుడే తెలుసుకుంటున్నట్లు సంభావిస్తూ, జీవించడానికి చేసే సాధనలోనే బాధలు, అసంతృప్తుల స్పర్శ లేని వర్తమానం వాస్తవికమూ, వినూత్నమూ అవుతుందని జిడ్డు కృష్ణమూర్తి తత్వం ఏది చెబుతుందో అది ఆమెలో నిత్య చేతనంగా మేల్కొన్నది. కనుకనే బాల్యంలో తననొక రకంగా వేధించిన తండ్రిని కలం స్నేహితుడిగా భావించే స్థితికి చేరగలిగింది. తండ్రి నియంతృత్వాన్ని ధిక్కరించటం ఒక ఆదర్శంగా పెంపకం నాటకాన్ని, అనుబంధం కథను వ్రాసి 1950లలో సాహిత్యరంగ ప్రవేశం చేసిన అబ్బూరి ఛాయాదేవి ఆ తరువాత సరిగ్గా నలభై ఏళ్ళకు సాధించిన జీవిత పరిణత దశలో మిత్రవైరుధ్యాలను పక్కకు పెట్టి మానవ సంబంధాలలో అభివృద్ధి చేసుకొనవలసిన ఉత్తమ సంస్కారాల వైపు వేలు చూపుతూ ‘మృత్యుంజయ’ చరిత్రను వ్రాసారు. తండ్రీ కూతుళ్ళ సంబంధంలోని మాధుర్యాన్ని నిర్దిష్ట సుందరంగా గుబాళించేలా చేయడం ఛాయాదేవి గారికే చెల్లింది. స్వీయ జీవిత చరిత్రలలో స్త్రీ అనుభవ వ్యక్తీకరణగా దీనికి అనితర ప్రాధాన్యం ఉంది.

జిడ్డు కృష్ణమూర్తి చెప్పే ‘అవగాహన’ అనేది వ్యక్తి పెంచుకోవాల్సిన సర్వోన్నత సంస్కారం ఛాయాదేవి లాగా అందరూ అలాంటి అవగాహనను అలవర్చుకోగలిగితే సంఘర్షణ లేని జీవితం సాధ్యం కావచ్చు. ఆ వెలుగులో ఆమె సాహిత్యం సమస్తాన్నీ విలువ కట్టవచ్చు. కానీ అవగాహన దానంతట అది కుటుంబాలను ప్రజాస్వామి కీకరించగలదా? సమన్యాయం వైపు సమాజాన్ని నడిపించగలదా వంటి ప్రశ్నలు మనముందున్న సవాళ్ళే.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.