కాలమిస్టుగా అబ్బూరి ఛాయాదేవి -కొండవీటి సత్యవతి

అబ్బూరి ఛాయాదేవి గారి పేరు తలచుకుంటేనే ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది. ఆవిడ ఇంటి ముందు నిలబడినపుడు మొదట సంపెంగ పరిమళం, దాన్ని దాటి వెళితే తెల్లటి మల్లెపూవు లాంటి ఛాయాదేవి గారు. కుటీరంలాగా ఉండే పరిసరాలు. మ్యావ్‌మంటూ కాళ్ళకు చుట్టుకునే పిల్లులు. పిల్లుల లీలల గురించి ఎంతో అపురూపంగా ఆవిడ చెప్పే కథలు, ఎంతసేపు కూర్చున్నా విసుగనిపించని సాహచర్యం. ఎన్నోసార్లు వెళ్ళాను ఆ ఇంటికి. ఎప్పుడూ ఒకేలాంటి ఆదరణ. మొదటిసారి 1989లో అనుకుంటాను నేను జయప్రభతో కలిసి ఛాయాదేవి గారింటికి వెళ్ళాను. మేమిద్దరం కలిసి ‘లోహిత’ నడుపుతున్న రోజులు. జయప్రభే నన్ను తీసుకువెళ్ళింది. ఆ రోజు అబ్బూరి వరద రాజేశ్వరరావుగారే మాట్లాడారు ఎక్కువగా. ఛాయాదేవి గారు ఆ రోజు ఏం మాట్లాడారో నాకసలు గుర్తులేదు. ఆనాటి ఆ పరిచయం తర్వాత నేను చాలా తరచుగా వాళ్ళింటికెళ్ళేదాన్ని. ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. భూమిక సంపాదక సభ్యులైన తర్వాత మా మధ్య మరింత స్నేహం, ఆత్మీయత ఏర్పడ్డాయి. ఆవిడ జీవన విధానం, క్రమశిక్షణ, కఠోర శ్రమ అబ్బురమనిపిస్తాయి. చకచకా నడుస్తూ పోస్టాఫీసుకి, కరెంటు ఆఫీసుకి, వాటర్‌ బిల్లులు కట్టడానికి ఆవిడే వెళుతుంటే… ఆవిడ నిబద్ధత కంటనీరు తెప్పిస్తుంది. ఆ పనులు మాకు చెప్పండి అంటే ఒక్కరోజు కూడా ఆవిడ ఒప్పుకోలేదు. ఆవిడ లైఫ్‌ స్టైల్‌ని ఒక పాఠంగా పెట్టాల్సిన అవసరం చాలా చాలా ఉంది. సెల్ఫ్‌ రెస్పెక్ట్‌, సెల్ప్‌ డిగ్నిటీ, తనకంటూ ఏర్పరచుకున్న తన మార్గంలో తప్ప వేరే మార్గంలో వెళ్ళరు కాక వెళ్ళరు. ఇది అందరికీ ఆచరణీయం.

కాత్యాయని ఫోన్‌ చేసి అప్పాజోస్యుల – విష్ణుబొట్ల కందాళం ఫౌండేషన్‌ వారు ఛాయాదేవి గారికి ప్రతిభామూర్తి అవార్డు ఇస్తున్నారని చెప్పినప్పుడు చాలా సంతోషమనిపించింది. ఆవిడ కాలమ్స్‌ మీద పేపర్‌ ప్రజెంట్‌ చేయాలని అడిగినప్పుడు మాత్రం అమ్మో! అన్పించింది. ఎందుకంటే ఛాయాదేవి గారి ప్రమేయంతోనే నేను సి.పి.బ్రౌన్‌ అకాడమీ వారి కోసం భండారు అచ్చమాంబ జీవిత చరిత్ర వ్రాస్తూ ఉన్నాను. నా మూడ్‌ అంతా అచ్చమాంబ చుట్టూ ఉంది. హఠాత్తుగా దానిలోంచి బయటపడి ఛాయాదేవి గారి కాలమ్స్‌ మీద వ్యాసం రాయడం కొంచెం కష్టమే. అయినప్పటికీ కాత్యాయనికి ఎస్‌ అని చెప్పేశాను. ఛాయాదేవి గారి గురించి ఏమి రాయమన్నా రాస్తాను అని ఒప్పేసుకున్నాను. చాలాకాలం ఆవిడ భూమికలో ‘ఆలోకనం’ పేరుతో కాలమ్‌ రాశారు. అంతకుముందు చాలా పత్రికల్లో కాలమ్‌ రాసిన విషయం అంతగా గుర్తులేదు. మళ్ళీ ఆవిడే అన్ని పుస్తకాలూ స్వయంగా తెచ్చి భూమిక ఆఫీసులో ఇచ్చారు. 1989లో

ఉదయం నవతరం పత్రికలో ‘ఉదయిని’ పేరుతో ఆవిడ నిర్వహించిన కాలమ్‌తో సహా అన్నీ నా టేబుల్‌ మీద చేరిపోయాయి. వాటిల్లో మునగడమే నా పని. ఛాయాదేవి గారు బహుముఖ ప్రతిభా మూర్తి. ఆమె వచనం, రచనా శైలి సున్నితంగా, సౌకుమార్యంగా ఉంటుంది ఆవిడలాగే. కథా రచయిత్రిగా ఆవిడ ప్రతిభ గురించి నేను ఇక్కడ ప్రస్తావించబోవడం లేదు. ఆవిడ చేతుల్లో అందరూ పనికిమాలిన వస్తువులుగా, బయట పారేసే వస్తువులు అందమైన ఆకృతులుగా రూపుదిద్దుకుంటాయి. మద్యం బాటిళ్ళ లేబుళ్ళని కూడా ఆవిడ కళాత్మకంగా ఉపయోగిస్తారు. బహుశా ఆవిడ బొమ్మల తయారీ గురించి కూడా ఎవరో ఒకరు మాట్లాడుతారు. నేను ఆవిడ కాలమ్స్‌కే పరిమితమౌతాను.

4.8.89 నుండి 14.9.1990 వరకు దాదాపు ఏడాదిపైనే ఉదయం పత్రికల్లో ‘ఉదయిని’ పేరుతోను, ఆంధ్రప్రభ దినపత్రికలో కొంతకాలం, ఇంటర్‌నెట్‌లో ‘దృష్టి’ శీర్షిక కింద కొంతకాలం కాలమ్‌లు నిర్వహించారు ఛాయాదేవి గారు. స్త్రీ వాద పత్రిక భూమికలో చాలా సంవత్సరాలపాటు కాలమ్‌ కొనసాగింది. 2004 నుండి 2005 వరకు ‘నవ్య’ వారపత్రికలో ‘మాట సాయం’ పేరుతో ఒక కాలమ్‌ నిర్వహించారు. వివిధ పత్రికలకి ఎన్నో వ్యాసాలు రాశారు. ఆంధ్రప్రభలో కూడా స్వల్పకాలం కాలమ్‌ రాశారు ఛాయాదేవి.

ఉదయం పత్రికలో నిర్వహించిన ‘ఉదయిని’ మహిళా శీర్షికను ఛాయాదేవిగారు అద్భుతంగా నిర్వహించారు. ఆధునిక మహిళ ఎదుర్కొనే అనేకానేక సమస్యల మీద తాము రాయడంతో పాటు ఎందరో రచయిత్రులతో రాయించారు. పెళ్ళి సమస్య, ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులా? అత్తా కోడళ్ళ సంబంధం లాంటి వివిధ అంశాల మీద చర్చలు, వాదోపవాదాలు నిర్వహించారు. సత్తిరాజు రాజ్యలక్ష్మి, సోమరాజు సుశీల, ముక్తేవి భారతి, ఇల్లిందల సరస్వతీదేవి గారి లాంటి వారంతా ఈ మహిళా శీర్షికలో రచనలు చేశారు. మధ్య మధ్యలో తానూ రాస్తూ –

ఛాయాదేవి ఉదయిని శీర్షికను ప్రతిభావంతంగా నిర్వహించారు. శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘కొత్త చూపు’ కథ మీద ఆవిడ రాసిన కాలమ్‌ చాలా అద్భుతమైనది. కథ ఎంత గొప్పదో ఛాయాదేవి ఆ కథని విశ్లేషించిన తీరు చాలా హృద్యంగా ఉంది. సాహిత్య ప్రయోజనం గురించి ఇలా అంటారు…

”కథలూ, వ్యాసాలూ, సామాజిక వ్యవస్థని మారుస్తాయా? దుష్ట సంప్రదాయాలను రూపు మాపుతాయా? ఎందుకొచ్చిన రాతలు అని నిస్పృహ కలుగుతుంది అప్పుడప్పుడూ కొందరికి. కానీ పదునైన కలంతో సామాజిక రూపురేఖల్ని సరిదిద్దవచ్చనీ, కలం అనే హలంతో మనుషుల మెదళ్ళను దున్ని, కలుపు మొక్కల్లాంటి భావాలను ఏరిపారేసి, మంచి పంటలు పండేలా సారవంతంగా చేయవచ్చనీ నిరూపించారు సంఘ సంస్కరణాభిలాషులైన రచయితలు.”

సాహిత్య ప్రయోజనం గురించి, పదునైన రాత గురించి ఛాయాదేవి గారు రాసింది నూటికి నూరు పాళ్ళు వాస్తవం. నిజమే, ఆవిడ రాసినట్లు ఒకే అంశం మీద పదే పదే రాయాల్సి వచ్చినపుడు ఆ సమస్య తీవ్రత అలాగే మిగిలిపోతున్నపుడు రచయిత నైరాశ్యంలోకి జారడం ఖాయం. ఎంత రాసి ఏం ప్రయోజనం? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన సమాజంలో సమస్యలున్నప్పుడు అన్పిస్తుంది. అయితే రచయితలు నిరాశపడకూడదు. రాస్తూనే పోవాలి. సమస్యలున్నంత కాలం రాయాల్సిందే అని ఈ చిన్న వ్యాసంలో చెప్పారు.

”అబ్బూరి చాయాదేవి గారు ప్రతిభావంతురాలైన తెలుగు వచన కవయిత్రి. ఆమె చాలాకాలం క్రిందట కొంత కవిత్వం రాసినా అటువైపు కొట్టుకుపోకపోవడం తెలుగువారి అదృష్టం” అంటారు చేరా మాస్టారు (సుప్రభాతం 5 జులై 1996).

1995లో ఛాయాదేవి గారి ”వ్యాస చిత్రాలు” వ్యాసాల సంకలనం ప్రచురించారు. ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మిసిమి లాంటి పత్రికల్లో ఆవిడ రాసిన కాలమ్స్‌, వ్యాసాలు కలిపి ఈ పుస్తకం వేశారు. ఇందులో శ్రీ పాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలు, రచనలూ, విశ్వనాథ చెప్పిన విలక్షణ కథ ముగ్గురు బిచ్చగాళ్ళు, శ్రీ శ్రీ కథనం, వరవిక్రయం, ఇల్లాలి స్థానం. బొమ్మరిల్లు. ఛాయాదేవి గారు రాసిన వ్యాసాలు చదవడ అద్భుతమైన అనుభవం. ముఖ్యంగా ఇల్లాలి స్థానం – బొమ్మరిల్లు అనే వ్యాసం. నార్వీజియన్‌ నాటక రచయిత హెన్‌రిక్‌ ఇబ్సెన్‌ రాసిన ”ఏ డాల్స్‌ హౌస్‌” నాటకం గురించి ఛాయాదేవి గారు చక్కటి విశ్లేషణాత్మకమైన విమర్శ చేశారు. ఇబ్సెన్‌ నాటకాన్ని సంపూర్ణంగా చదివిన అనుభూతి కలుగుతుంది.

ఛాయాదేవి గారి ఇదే పుస్తకంలో కోపతాపాలు, ఉత్తర క్రియ, ప్రేమించడం ఎలా, స్వేచ్ఛ సమస్య – మనిషి అనే వ్యాసాలు

ఉన్నాయి. కోపం గురించి ”కోపం – కోపావేశంగా రూపాంతరం చెందకుండా ఉండాలి” అంటూ హితవు చెబుతారు. అలాగే ప్రేమించడం ఎలా? అనే వ్యాసంలో ”నిష్కల్మషమైన ప్రేమ అని వాడుతూ ఉంటాం – అంటే ప్రేమలో కల్మషం, కల్తీ ఉంటాయనే కదా దాని భావం”. ఇంకా ”ప్రేమించడం, ప్రేమించబడడం కూడా సులభం కాదు. ప్రేమించాలంటే ఎదుటివారు ఎలాంటి వారైనా, వారి లోపాలను పట్టించుకోకుండా ప్రేమించగలగాలి. దయ, సానుభూతి, ఔదార్యం, స్నేహం చూపించాలి”. ”అనాలోచితంగా ప్రేమించగలగడం ఒక కళ” అంటూ ముగిస్తారు. ప్రేమ పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్న వాళ్ళు, ‘ప్రేమ’ అనే పదాన్ని దుర్వినియోగం చేస్తున్నవాళ్ళు చదవాల్సిన వ్యాసం ఇది.

”స్వేచ్ఛ” గురించిన వ్యాసంలో ”మనిషికి స్వేచ్ఛ తెలియచెప్పేది మనస్సే, స్వేచ్ఛ లేకుండా చేసేదీ మనస్సే. ఈ సంఘర్షణలో చిక్కుకున్న మనిషి స్వేచ్ఛాజీవి ఎలా అవుతాడు?” అంటూ ప్రశ్నిస్తారు.

2016 ‘నవ్య’ వారపత్రికలో సంవత్సరం పైగా నిర్వహించిన ‘మాటసాయం’ కాలమ్‌లో రాసిన వ్యాసాలతో కలిపి ”మాటసాయం” పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ నవ్య సంపాదకుడు శ్రీ రమణ ”అబ్బూరి ఛాయాదేవి అయితే ఆ కాలమ్‌కి ఒక గౌరవం వస్తుందని భావించాము. ఆమె పెద్దరికం, క్రమశిక్షణ అందరికీ తెలిసిందే. ఎన్నో శీర్షికలు నడిపిన అనుభవం ఉంది…” అంటూ ”అబ్బూరి ఛాయాదేవి మితవాది, ఫెమినిస్టు అవడం వల్ల నాకు మరింత గౌరవం. స్వేచ్ఛకి, విచ్చలవిడితనానికి తేడా స్పష్టంగా తెలిసిన విదూషీమణి” అని కూడా అన్నారు. ఈ రెండో వాక్యంతో నాకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఛాయాదేవి గారిని మితవాద ఫెమినిస్టు అనడం అభ్యంతరకరం. ”అందుకే ఆవిడ మీద మరింత గౌరవం ఉంది” అని చెప్పడం మరింత అభ్యంతరకరం.

‘మాటసాయం’ శీర్షిక నడిచిన ఈ కాలమ్‌లో ఛాయాదేవి గారు అరవై వరకు ఆర్టికల్స్‌ రాశారు. కొన్నిసార్లు పాఠకులు అడిగిన సమస్యలకు జవాబుల రూపంలోను, చాలాసార్లు వ్యాసం రూపంలోను ఈ రచనలున్నాయి. కుటుంబ సంబంధాల్లోను, మానవ సంబంధాల్లోను ఎదురయ్యే సమస్యల గురించి విశ్లేషణాత్మకంగా రాశారు. ప్రేమ, ఈర్ష్య, అభద్రత, సుఖం, సంతోషం, తోచక పోవడం, సమానత్వం ఇలా భిన్న అంశాల మీద తేటైన, సూటి వచనంలో రాసుకుంటూ వెళ్ళారు. చాలా కాలమ్స్‌లో ప్రఖ్యాత తాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి చింతన అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే ఆయన ప్రభావం ఛాయాదేవి గారి మీద అపారంగా

ఉందన్న విషయం కూడా అర్థం చేయిస్తాయి. ”తోచకపోవడం, బోర్‌ కొట్టడం” అనే అంశం మీద రాస్తూ ”నా నిఘంటువులో తోచకపోవడం అనే మాటే లేదు. గదుల్లో పుస్తకాలూ, పత్రికలూ ఉన్నాయి. టి.వి. ఉంది. తోటలో మొక్కలున్నాయి, పిల్లులున్నాయి. ఇంటా బయటా చేసుకోవాల్సిన పనులుంటాయి. వచ్చేపోయే స్నేహితులూ, బంధువులూ ఉంటారు. ఫోనుంది. హాజరవ్వాల్సిన సభలూ సమావేశాలూ

ఉంటాయి. విసుగు పుట్టడానికి అవకాశం ఏదీ?” అంటూ ప్రశ్నిస్తారు.

ఛాయాదేవి గారి ఈ అభిప్రాయంతో నేను నూటికి నూరుపాళ్ళు అంగీకరిస్తాను. అసలు మనుషులకు బోర్‌ ఎందుకు కొడుతుంది? చేతినిండా పని లేకపోతేనే కదా! పనిలో మునిగినపుడు తోచకపోవడం అనే సమస్యే ఉండదు. అలాగే చాలామందికి ఒంటరితనానికి, ఏకాంతానికి తేడా తెలియదు. ఒక్కళ్ళు ఉండడానికి చాలా దిగులు పడతారు. కానీ ఏకాంతం అనేది చాలా అరుదుగా దొరికే అద్భుత సమయం. మనతో మనం, మనలో మనం, మన కోసమే మనం… ఇలాంటి అవకాశం దొరకడం చాలా అరుదు. అందుకే నా వరకు సమూహంలో ఉన్నప్పుడు ఎంత ఎంజాయ్‌ చేస్తానో, నాతో నేను ఏకాంతంగా ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఎంజాయ్‌ చేస్తాను. ఛాయాదేవి గారి కాలమ్స్‌లో చాలాచోట్ల ఇలాంటి అభిప్రాయం కనబడుతుంది.

‘మనసు’కి సంబంధించి ఛాయాదేవి గారు చాలాచోట్ల చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు. ‘మనసులో బూచాడు’, ‘మనసులోని మర్మం’, ‘లోపలి అల్లరి’, ‘మనసు-సునామీ’, ‘మనసులో సీరియల్స్‌’ ‘లోపలా-బయటా’ ఇలా ఎన్నో కాలమ్స్‌లో మనసు చేసే చేష్టలు, చెలరేగే ఆలోచనలు, సంఘర్షణల గురించి చర్చించారు.

”మనసు విరిగిపోయింది, మనసు కరిగిపోయింది, మనసులు కలవలేదు, మనసు పడ్డాను, మనసైంది’ వంటి మాటలు తరచు వింటుంటాం. కొన్ని మనసులు పెళుసుగా ఉండి విరిగిపోతాయి. కొన్ని ‘రాయి’లా కఠినంగా ఉంటాయి. కొన్ని ‘వెన్న’లా కరిగిపోతాయి” అంటారు. ‘మనసులోని మర్మం’లో ”మనసులో ఉత్పన్నమయ్యే ఆకాంక్షల్నీ, అత్యాశల్నీ, అసూయనీ, ద్వేషాన్నీ అనుక్షణం గమనిస్తూ వాటిని అవగాహన చేసుకుంటే మనసులో మార్పు వస్తుంది” అంటారు ‘మనసు-సునామీ’ వ్యాసంలో. ఇలా మనసు మీద చాలానే రాసారు చాలా కాలమ్స్‌లో.

ఛాయాదేవి గారు చటుక్కున ఒక జోక్‌ చెప్పి తెగ నవ్విస్తారు. వరద రాజేశ్వరరావు గారి జోకులు చాలాసార్లు పేలుస్తారు. ఆయన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు తొందరగా కోలుకోవడానికి విల్‌ పవర్‌ ఉండాలి అని ఎవరో అంటే విల్‌ పవరే కాదు బిల్‌ పవర్‌ కూడా ఉండాలి అని అన్నారని చెప్పినప్పుడు బాధతోపాటు, ఆ సునిశిత హాస్యానికి నవ్వొస్తుంది, ”రెండు వైపులా” అనే వ్యాసంలో.

”ఒకతను సాయంకాలం గుమ్మం ముందు నులకమంచం వేసుకుని వెల్లికిలా పడుకుని పాట పాడుకుంటున్నాడట. అతని స్నేహితుడు అటువైపు వెళుతూ చెయ్యి ఊపుతూ పలకరించి వెళ్ళాడట. సాయంత్రం అతని స్నేహితుడు తిరిగి వచ్చేసరికి అతను మంచం మీద బోర్లా పడుకుని పాట పాడుకుంటున్నాడట. అదేమిటి అలా పాడుతున్నావని అడిగితే ”ఇది రెండో వైపుది” అన్నాడట. ”ఆవిడలో ఉన్న హాస్య ప్రయత్నానికి ఇదొక మచ్చుతునక మాత్రమే. ‘మాటసాయం’ పుస్తకంలోని అరవై వ్యాసాలు చదవడం అద్భుతమైన అనుభవం.

2009లో ”వ్యాసాలూ, వ్యాఖ్యలూ” పేరుతో ఒక పుస్తకం ప్రచురించారు. ఆవిడే ముందు మాటలో చెప్పినట్లుగా ”వివిధ విషయాలపై రాసిన వ్యాసాలనూ, కాలమ్స్‌గా రాసిన వ్యాఖ్యలనూ కలిపి ప్రచురిస్తున్న సంపుటి ఇది. ఇందులో కొన్ని సాహిత్య వ్యాసాలూ, కొన్ని ఆధ్యాత్మిక వ్యాసాలూ, కొన్ని సామాజిక వ్యాఖ్యలూ ఉన్నాయి”.

భూమికలో చాలా సంవత్సరాల పాటు (1996-2006) ‘ఆలోకనం’ పేరుతో ఛాయాదేవిగారు కాలమ్‌ రాశారు. స్త్రీలకు సంబంధించి వివిధ అంశాల మీద చాలా నిశితమైన వ్యాసాలూ ఇందులో కనిపిస్తాయి. అలాగే, ఆంధ్రజ్యోతిలో కొంతకాలం పాటు కాలమ్‌ రాశారు. ‘స్వేచ్ఛ ఎప్పుడు’ అనే వ్యాసంలో ”మానవ సంబంధాల్లో పరస్పర స్నేహం, ప్రేమ, గౌరవం ఉండాలి. అటువంటి లక్షణాలు లోపించడం వల్లనే సమాజంలో దోపిడీలూ, అత్యాచారాలూ, హత్యలూ, ఆత్మహత్యలూ జరుగుతున్నాయి. ఇంకొకరి పట్ల అసహనం, అసూయ, క్రోధం, ద్వేషం ఉన్నంతకాలం మనస్సుకి స్వేచ్ఛ ఉండదు” అంటారు (భూమిక).

ఛాయాదేవి గారు ఏ సమావేవానికి వెళ్ళినా, ఏ అంశం మీద మాట్లాడినా దానిమీద సమగ్రమైన వ్యాసం రాసుకోకుండా వెళ్ళరు. అలాగే ఆయా సమావేశాల గురించి చాలాసార్లు చక్కటి రిపోర్టు కూడా రాస్తారు. ఉదా: ఆవిడ రాసిన ఒకానొక రిపోర్టు ఆధారంగానే భండారు అచ్చమాంబ తెరమీదకు వచ్చారు. భూమిక నిర్వహించిన కథా వర్క్‌షాప్‌లో కె.లలిత అచ్చమాంబ గురించి చెప్పినది ఛాయాదేవి రిపోర్టులో రాశారు. అందులోంచి అచ్చమాంబను మొదటిసారి పట్టుకుని, ఆవిడే తెలుగులో ప్రథమ కథకురాలు అని సోదాహరణంగా సాధికారికంగా నిరూపించడం జరిగింది. ఈ క్రెడిట్‌ కె.లలితతో పాటు ఛాయాదేవి గారికి కూడా వెళుతుంది. ఆ రిపోర్ట్‌లో ఆవిడ రాయకపోతే అచ్చమాంబ చరిత్ర ఎప్పటికీ చీకటిలోనే ఉండిపోయేది.

2001లో ఢిల్లీలో జరిగిన స్త్రీల రచనల జాతీయ సదస్సు గురించి, ఉస్మానియా యూనివర్శిటీలో జరగిన జెండర్‌ అవగాహనా సదస్సు గురించి చాలా వివరమైన వ్యాసాలూ, వ్యాఖ్యలూ పుస్తకంలో ఉన్నాయి. ”స్త్రీల హక్కులు మానవ హక్కులే. హక్కులు ఇద్దరికీ వర్తించాలి. రాజ్యాంగంలో ఉన్నంత మాత్రాన అమలులోకి రావు” అని ఖచ్చితంగా చెప్పారు ఈ వ్యాసంలో. ”స్త్రీలు ఎందుకేడుస్తారు”, ”ప్రేమ-హింస” వ్యాసాలు తప్పక చదవాల్సినవి. అలాగే ‘విషాద దర్శనం-ఉద్యమస్ఫూర్తి’ అంటూ భూమిక నిర్వహించిన రచయిత్రుల సాహతీ యాత్రలో ఎదురైన అనుభవాల గురించి రాసిన వ్యాసం ఎంతో ఆర్తితో రాశారు.

ఇలా రాసుకుంటూ పోతే ఈ వ్యాసం కొండపల్లి చాంతాడంత అవుతుంది. ఛాయాదేవి గారు రాసిన ఎన్నో కాలమ్స్‌లో వివిధ అంశాల గురించి నిశితంగా, సూటిగా రాశారు. ఆవిడ వచనం తేటగా, హాయిగా ఉంటుంది. సున్నితంగా (ఆవిడలాగే) హుందాగా ఉంటుంది.

చేరాగారు ”ఛాయాదేవి గారి సాహిత్య వ్యాసాలు తెలుగు సాహిత్యాన్నంతటినీ పుక్కిటపట్టిన మహా విమర్శలేం కావు. ఐతే ఆమె ఎన్నుకున్న రచయితల గురించి కానీ, గ్రంధాన్ని గురించి కానీ ఎవరూ చెప్పని విలక్షణ విషయాలు చెప్పటంలో ఆమె నేర్పు కన్పిస్తుంది” అంటారు. ”మనిషి – ఒంటరితనం, ప్రేమ – ప్రేమించకపోవడం, స్వేచ్ఛ – సంప్రదాయం, సమాజం – సంస్కరణ, రచన – దాని ధ్యేయం వంటి అనేకానేక విషయాలను మృదువుగా, స్నేహితురాలిగా విడమరిచిన ఈమె ఈనాటి స్త్రీలు పడే బాధల గురించి పదే పదే ప్రస్తావిస్తారు. ఈ సమస్య మీద అటు పురుషాహంకార వాదులు, ఇటు అతివాద ధోరణిలో రాస్తున్న రచయితలూ – ఇద్దరినీ చూపిస్తూనే మధ్యే మార్గం ఉందన్న మాట ఈ వ్యాస సరస్వతి వాక్రుచ్చారు” అంటారు వ్యాస చిత్రాలు ముందుమాటలో వాకాటి పాండురంగారావు గారు.

చివరగా, నాకత్యంత ఆత్యీయురాలు, ఆత్మబంధువు అయిన ఛాయాదేవి గారి రచనలు ఒకేసారి చదవడం గొప్ప అనుభవం. చదవడాన్ని ఎంజాయ్‌ చేస్తూ ఎన్నోసార్లు ఆవిడకు ఫోన్‌ చేసి ఆ సంతోషాన్ని పంచుకోవడం కూడా జరిగింది. తోచకపోవడం, బోర్‌ కొట్టడం, విసుగు చెందడం మీద తను రాసిన వ్యాసాలు చదువుతూ వాటిని జీవితంలోకి తెచ్చుకోవాలని అన్పించిన సందర్బాలూ, జిడ్డు కృష్ణమూర్తి గారి ఆలోచనాధార ఆవిడ కలంలోంచి జాలువారినపుడు ఆయన గురించి చదవాలనే ఉత్సుకత కలిగినమాట వాస్తవం. ఆఖరికి విశ్వనాథ కథలు చదవాలన్న కుతూహలాన్ని కూడా కల్పించారంటే అతిశయోక్తి కాదు. ఛాయాదేవి గారు ఇలాగే నేటి సామాజిక స్థితిగతుల మీద ఇంకా ఇంకా రాయాలని, ఆవిడ హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆ ప్రతిభామూర్తికి శిరసు వంచి నమస్కరిస్తూ శెలవు తీసుకుంటున్నాను.

(ప్రతిభా వైజయంతి – సాహితీ వైజయంతి సమ్మానోత్సవ విశేష సంచిక 2011) – అభోవిభో కందాళం ఫౌండేషన్‌

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.