నియంతృత్వపు నీడల్ని దనుమాడిన ఛాయాదేవి కథలు -అనిశెట్టి రజిత

 

కుటుంబ పితృస్వామ్య వ్యవస్థలోని గృహ నిర్బంధంలో సంప్రదాయాల, ఆచారాల ఆకాంక్షల సంకెళ్ళలో బందీలు కాబడి ప్రాణమున్న మనుషుల్లా కాకుండా వట్టి నీడల్లా కదిలే స్త్రీల కథలనెన్నో రాసిన మద్దాలి (అబ్బూరి) ఛాయాదేవి 28 జులై 2019న అసమతుల్యతలతో, ఆధిపత్యాలతో, అణచివేతలతో, అరాచకాలతో చిన్నాభిన్నమైన ఈ డొల్ల సమాజం నుండి సెలవు తీసుకొని శాశ్వత విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు.

జులై 2న ఏదో అంతర్‌శక్తి నన్ను కొండాపూర్‌లోని సి.ఆర్‌.ఫౌండేషన్‌ హోమ్‌కి లాక్కుపోయింది. ఛాయా గారిని చూసి నిశ్చేష్టనయ్యాను. తను జబ్బుపడినట్లు నాకే మాత్రం తెలియదు. అంత బలహీనంగా ఉండడం చూసి బాధపడ్డాను. ఛాయాదేవి గారూ అని పిలవగానే దిగ్గున లేచి కూర్చుని చిరునవ్వులతో స్వాగతించి కూర్చోబెట్టుకుని ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంత చైతన్యం ఉన్న వ్యక్తికి అసలు అనారోగ్యమేంటి? అంతుబట్టలేదు. తన ఛాయాచిత్రీయం పుస్తకాన్ని పేజీ పేజీ తిప్పిచూపిస్తూ రాజమండ్రి నుండి రాజమండి దాకా ఎన్నో విషయాలు చెప్పారు. ఒకచోట తనతో నా ఫోటో ఉంది. అది చూపిస్తూ ఒకలాంటి సంబరం ప్రకటించారు. మొత్తానికి తనను చూస్తూ ఏదో వేదల లోపల తొలుస్తుంటే… అబ్బురంగా ఆమె కబుర్లు వింటూ ఉండిపోయాను. మిత్రులు ఫోటో తీస్తుంటే చిందరవందరగా ఉన్న తలను సర్దుకున్నారు.

నేను సెలవు తీసుకుని వచ్చేసినా కొన్ని రోజులపాటు దిగులు వెంటాడుతూనే ఉంది. ఇంతలో ఆమె ఇక లేరన్న దుర్వార్త. మళ్ళీ త్వరలోనే తన దగ్గరికి వెళ్ళి కాసేపు సాహిత్యపు కబుర్లతో సజీవ సమయాన్ని గడపాలన్న ఆలోచన ఓడిపోయింది. ఆ సమయాన్నీ, అవకాశాన్నీ కాలం కబళించింది.

ఆమె రచయిత్రిగా అత్యంత ప్రతిభావంతమైన ప్రభావశాలి. తన కథా సంపుటాల్లో మొదట ‘తన మార్గం’ చదివినప్పుడు ఇంత సరళంగా అరటిపండు ఒలిచిపెట్టినట్లు ఎట్లా రాశారీ కథలు అనుకుంటూనే ఇంటి గడప లోపలి క్రూరత్వాలను స్త్రీల పట్ల అలిఖితంగా అమలయ్యే శాసనాలను కథావస్తువులుగా చేసుకొని రాసిన కథలు చదివి విస్మయానికి గురయ్యాను. ఆ కథలు మలిచిన శిల్పం ఆశ్చర్యపర్చింది. స్త్రీల సామాజిక జీవిత చిత్రం. స్త్రీల పట్ల రాజకీయాల్ని బట్టబయలు చేస్తూ, ముసుగుల్ని లాగి చించిపడేస్తూ వాస్తవాల వెలుగులో గాయపడ్డ దీనుల మనోశరీరాలను ప్రదర్శించిన తీరు విభ్రాంతికి గురిచేసింది.

నిజానికి చాలా క్లుప్తంగా ఉండే ‘తనమార్గం’ కథలు చాలా తీవ్రమైనవి. తీవ్రవాద రసానుభూతిని కలిగించేవి. అవి స్త్రీ సమాజపు వ్యతిరేకులూ… పెత్తనాల వీర బాహువులూ చదివితే అట్టుడికిపోయేంత విప్లవాత్మకమైనవి. చాలా కథలు తన స్వీయానుభవం లోంచి రచింపబడినవే. అయితే కథలుగా మలచబడిన ఆమె స్వీయ అనుభవాలు అనుకోవాలి. అశాంత చిత్తురాలైన శాంతమూర్తి అయిన సాహితీవేత్త ఛాయాదేవి. ఆమె దురుసుగా పెళుసుగా విపరీతంగా మాట్లాడటం రాని మనిషి. తన నిత్య చిరునవ్వుల చాటున స్త్రీల తీరని సహజమైన ఇష్టాలను, ఆకాంక్షలను దాచుకున్న నిగూఢమైన పరిణిత స్త్రీ మూర్తి. ఆత్మకళను, రచనాకళకు జోడించి మహిళల మనో ఆవరణలను ఆవిష్కరించిన అద్భుత కళాశక్తి. స్పష్టత, సంక్షిప్తత, వాస్తవిక దృష్టికోణం ఆమె రచనలకు జీవకణాలుగా ఉంటాయి.

అసంఖ్యాకమైన స్త్రీల జీవితాలు విషాద కావ్యాలే. కంటినిండా ఒక్కరోజైనా నిద్రకు నోచుకోని ఆడవాళ్ళ దీనత్వం ఒక విషాద వాస్తవం. బాల్యం, యవ్వనం… ఏదైనా నిద్ర కరవు స్త్రీకు. ఒక్కరోజైనా హాయిగా కంటినిండా నిద్రపోవాలని ఎక్కువ నిద్రమాత్రలు మించి తన కథను ‘సుఖాంతం’ చేసుకునే స్త్రీ జీవితంలో నిద్రలేమి ఎంత విషాదమైన అనుభవం? పితృస్వామ్య కుటుంబాల్లో ఈ అంశాన్ని ఎవరు గుర్తిస్తారు? ఎందుకు గుర్తిస్తారు. ఒక చాకిరీ యంత్రానికి, ఒక గృహ బానిసకు, ఒక బానిసకు సరైన నిద్ర ఉండాలన్న స్పృహ ఎవరికైనా ఎందుకుంటుంది?

ఎదగకుండా, ఎదుగుదల లేకుండా, ఎదగనీయకుండా సంకెళ్లు తగిలిస్తుంది సమాజం కొన్ని సమూహాలకు, అందులో స్త్రీ సమాజానికి నిలువెల్లా సంకెళ్ళను అలంకరించి, వర్ణిస్తూ ఆనందపడుతుంది. ‘బోన్సాయ్‌’ చెట్లను కళగా ఎంచుకొని ఇళ్ళల్లో పెంచుతూ తెంచుతూ ముచ్చటపడిపోతుంటాము. ‘ఆడవాళ్ళదీ ‘బోన్సాయ్‌ బ్రతుకు’ అని గ్రహించామా? ‘ఆడముండకి అరటిపండు ఎందుకే’ అన్న నిరసన భావం నుండి అరచేతిలో పువ్వులా సుకుమారంగా చూస్తూ నిర్బంధంలోకి నెట్టబడే ఆడబ్రతుకులు బోన్సాయ్‌ బ్రతుకులే కదా….

కొంతమంది మగవాళ్ళకు స్త్రీలూ, భార్యలూ అవసరానికి అన్నీ అమర్చిపెట్టే పరికరాలు, ఇంటిపనులు చక్కబెట్టే పనిముట్టు, భార్యతో తాము సహజీవనం చేయాలనీ… దాన్నే దాంపత్యం, సహచర్యం అంటారనీ తెలియని మూర్ఖత్వం, కొంచెం తెలిసినా తెలియని నటనా… కౌసల్యం… ఇంకా చెప్తే పురుష దురహంకారం… ఆడవాళ్ళతో మాట్లాడేదేమిటి? వాళ్ళకు చెప్పేదేమిటి? వాళ్ళతో సరదాగా ఉండేందుకు ఏముంది? ఇలా చాలా నియమాలుంటాయి భర్తలకు… అదంతా భర్తల యాజమాన్యపు విరగబాటుతనం.

భార్యలతో స్నేహంగా ఉంటే నామోషీ… తక్కువతనంగా ఫీలవుతుంటారు. కానీ భార్య సూర్యోదయానికి ముందే నిద్ర లేచి రాత్రి అన్ని పనులూ చక్కబెట్టుకునేదాకా అన్ని అవసరాలూ అమర్చిపెడుతూ… కోరికలు తీరుస్తూ… యంత్రంలా కదులుతూ ఉండాలి నిశ్శబ్దంగా. అచ్చంగా ఇంట్లో మగ పురుషుల చుట్టూ ఆడ మనుషులు ఉపరిగ్రహాల్లా తిరుగుతూ ఉండాలి. స్వతంత్రం అనేది లేకుండా ఇష్టాయిష్టాల్ని చంపేసుకుని, దాన్నే

‘ఉపగ్రహం’ కథ ద్వారా సూటిగా అక్షరబద్ధం చేశారు రచయిత్రి.

మన తెలుగు సినిమాలో చూస్తుంటాం. తండ్రీ కొడుకుల మధ్య వాదన, పోట్లాటలు తలెత్తితే ఇంటి ఇల్లాలు కొడుకువైపే ఉంటుంది మనసులో. భర్త, కొడుకుల మధ్య కలగజేసుకోబోయినా, సర్దిచెప్పబోయినా భర్తగారు నువ్వు నోరుమూసుకొని లోపలికి పో అని కసురుకుంటాడు. ఆమె ‘మొగ్గు’ చూపితే దానికి విలువే ఉండదు. కానీ భర్త తనపై ఆధారపడిన పరాన్నజీవిగా గుర్తించిన ఇల్లాలు ఆయన జారీచేసే ఆజ్ఞలను, బెదిరింపులను తేలికగా తీసుకుంటూ భర్త హుంకరింపులను క్షమిస్తూ ఒక ఏమీ తెలియని పసిపిల్లవాడి కింద జమకడుతుంది. ఈ అంశాన్ని ‘మొగ్గు’ కథలో నిగ్గుదేల్చారు ఛాయాదేవి.

ఇంట్లో పుట్టెడు పనులు చేసుకుంటూ మళ్ళీ వేళకు బయటి పనుల్లోకి, ఉద్యోగాల్లోకి వెళ్ళే స్త్రీలకు ‘శ్రీమతి-ఉద్యోగి’ అంశం తీసుకొని ఇంటర్వ్యూ చేస్తే బయటపడే కఠిన యదార్థాలే ‘శ్రీమతి-ఉద్యోగి’ కథ. అంతా బాగానే

ఉందన్న స్త్రీల జీవన స్థితిగతుల్లోని గతి తప్పిన గతుకుల దారులు బయటపడి వెక్కిరిస్తాయి. మగవాళ్ళు వీరులు, త్యాగులూ, భోగులూ, కీర్తిమంతులు. వాళ్ళ కీర్తి తేజోకిరణాల జిలుగుల వెనక ఆడవాళ్ళు అనామకులు, ఉనికి లేనివాళ్ళు, అస్తిత్వ గుర్తింపు నిరాకరింపబడిన వాళ్ళు. మగవాళ్ళ వీరగాథల్లో తమ అర్ధాంగుల, గృహలక్ష్ముల ప్రస్తావనలు నామమాత్రంగా రంగు వెలిసిన అక్షరాల్లా ఉంటాయి. ‘ఆయన కీర్తి వెనక’ నక్కి స్త్రీల అభిలాషలు, అస్తిత్వాలు మసకబారి ఉంటాయి.’ఉడ్‌రోజ్‌’ పువ్వుల్ని వృద్ధాప్యానికి ప్రతీకగా, తాజా గులాబీలు యవ్వనానికి ప్రతీకలుగా కుటుంబాల్లోని సంబంధాలను పోలుస్తూ ‘ఉడ్‌రోజ్‌’లు ఇంట్లోని వృద్ధుల్లా ఎండిపోయి బయటికి విసిరివేయాల్సినవే అన్నట్లుంటాయని విశ్లేషనాత్మకంగా అల్లిన కథ ‘ఉడ్‌రోజ్‌’.

ఎంత గాఢంగా అల్లుకున్న అనుబంధాలైనా తీగల్నిన పీకి చెత్తకుండీల్లోకి తోసినట్టు పిల్లలు పెద్దవాళ్ళను ఇంట్లోనుంచి ఎప్పుడైనా తరిమివేయగలరు కానీ అల్లుకుపోయే తీగల్లా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకు అనుబంధాలను అల్లుకుపోవడమే తెలుసు. తెంచి పారేయడం రాదు. ఇంట్లో ఆడవాళ్ళను గడప దాటనీయకుండా వాళ్ళ అవసరాలు తీరుస్తూ తమపై ఆధారపడేలా చేసేవాళ్ళు ఉంటారు. ఒకరోజు మందుల షాపులో మాత్రలు కొనడానికని బయటికి వెళ్ళిన తల్లిని కొడుకూ, భర్తా ఇంట్లో అలిగి వెళ్ళిపోయిందన్న ఆలోచనతో యాగీ చేస్తారు. ఆలస్యంగా తిరిగొచ్చిన ఆమెను తప్పుపడ్తారు. ఆమె పరిధిని దాటిందన్నట్లుగా నిందిస్తారు. ఆడది గడప దాటడమంటే స్వాతంత్య్ర గంటికలు వీచినట్లే. ఇక తమ ఆగడాలూ… హక్కులూ చెల్లవేమోనన్న భయాలు మగవాళ్ళకు. పరిధుల్లో హద్దుల్లోని స్త్రీల జీవితాలు విముక్తి లేని బందీఖానాలు. ‘పరిధులు దాటిన వేళ’ కథ చెప్పే స్త్రీల చెరలు.. దీన గాథలు…

గతంలో చాలా ఇళ్ళల్లో, ఇప్పుడింకా కొన్ని ఇళ్ళల్లో కొనసాగుతున్న అంటరానితనం స్త్రీలు బయట కూర్చోవాల్సిన నాలుగు రోజుల సమయం. స్త్రీల శరీరాల పట్ల ఎన్నో విపరీత భావాలున్నట్లుగానే స్త్రీల రుతుస్రావం సమయంలో వాళ్ళ కదలికల్ని కట్టిపడేసి ఇండ్ల బయట కూర్చోబెట్టి అంటరానివాళ్ళల నియంత్రించడం ఒక ఆచారం. అది అనాచారంగా మారి స్త్రీలను ఆత్మన్యూనతకు గురిచేస్తూ వారి ఆత్మవిశ్వాసాలను దెబ్బతీస్తున్నది. అంతులేని చాదస్తాలూ, ఆంక్షలూ స్త్రీ స్వేచ్ఛా జీవనాన్ని బంధిస్తున్న తీరును హృదయవిదారకంగా చిత్రించిన కథ ‘మూడునాళ్ళ ముచ్చట’.

స్త్రీల మీద ఇన్ని రకాల వలలు వేసి సమాజం వారిని వంచిస్తున్నప్పటికీ, వారి మానవ హక్కులను మింగి త్రేనుస్తున్నప్పటికీ తమ మార్గాన్ని కనుగొని మొక్కవోని ధైర్యంతో మొండిగా నిలబడుతున్న సంఘటనలు కోకొల్లలు. ‘తన మార్గం’ తాను తెలుసుకోవడం, కనుగొనడం, ఆ మార్గంలో ప్రయాణించే సాహసం చేయడం సమాజానికి పెనుసవాలుగా ఉంటుంది. వైవాహిత జీవితంలో భర్త అధికారం కింద మూగబొమ్మలా బతికిన స్త్రీ భర్త మరణానంతరం ఎవరిమీదా ఆధారపడకుండా తనింట్లో పిల్లల్ని ఎవర్నీ పెట్టుకోకుండా ఎవరి తోడూ లేకుండా ఒంటరిగా జీవించే నిర్ణయాన్ని కఠినంగా పాటించడమే ‘తనమార్గం’ కథ. కష్టమైనా ఒంటరిగా తన పనులు తాను చేసుకుంటూ బయటి ప్రపంచంతో క్రమంగా సంబంధాలు నెలకొల్పుకుని స్వేచ్ఛగా రెక్కలల్లార్చడం ఒక స్త్రీ ఎంచుకున్న మార్గం. జీవితానుభవాల ఎదురు దెబ్బలు ఆమెను మార్గం ఎంచుకునేలా చేస్తాయి. పిల్లల పట్ల మమకారాలు లేకుండా నిబ్బరంగా ఒక విధంగా మమకారాలకు లొంగి బాధల్నీ, బానిసత్వాన్నీ కొని తెచ్చుకోనీయని దృఢత్వాన్ని ఆమె సంతరించుకుంటుంది.

ఛాయాదేవి స్త్రీల వెతలను పరిశీలించి, అనుభూతి చెంది నిశితంగా, విమర్శనాత్మకంగా విశ్లేషించిన తీరు ఆలోచనాత్మకంగా బాధల బరువుల్ని దించుకునే మార్గం కనుగొనేట్లుగా, ఆ కొత్త దారి స్పష్టంగా కనిపించేట్లుగా కథలను మలిచారు. నిజానికి ఆ మలుపులు అచ్చంగా స్త్రీల జీవన చిత్రాలపై కర్కశ ముద్రలు వేసిన మలుపులే. జీవితాన్ని తన వైపు మలుపుకునే స్పష్టతను ఈ కథలు స్త్రీలకు అందిస్తాయి. నియంతృత్వాలను ఎదిరించే పాఠాలను నేర్పుతాయి.

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.