ఆచంట శారదాదేవి
అప్పుడే తెల్లవారుతూంది. కిటికీలో నుంచి ఒక్క వెలుగు కిరణం శాంత ముఖం మీద పడింది.
శాంతకు మెలుకవ వచ్చింది. అయినా నిద్దురబద్ధకం వదలలేదు. నిద్ర కళ్ళతోనే కిటికీలోనుంచి బయటికి చూసింది.
నిద్రకళ్ళతోనే మందార పవ్వులు పలకరించినాయి. ఒక్కక్షణం ఆమె హృదయం అటువైపు ప్రశాంతిలో లీనమయింది……….
ఉన్నట్టుండి మిన్ను విరిగి మీద పడినట్లు ఏకరణ గొణ ధ్వని : దొడ్డివైపునుంచి ”కావు కావు” మంటూ కాకుల సమూహం, వీధివైపు నుంచి ”బొఁయ్”మంటూ కార్లల సమూహం. బావిదగ్గిర పంచమ శృతిలో పనిమనిషి. వాకిలి దగ్గర మధ్యమ శృతిలో కూరల మనిషి. అందరూ రకరకాల గొంతుకలతో ఇంత ప్రపంచంలో శాంతిలేదని ”బృందగానం” మొదలు పెట్టారు, ఆ గోలకు ఎవరికైనా మెలకువ వస్తుంది. శాంతకు మెలకువతో పాటు ఆమెను నిత్య జీవితంలో బాధిస్తున్న సమస్యలన్నీ ఒక్క పెట్టున ఆవరించాయి.
ఎప్పుడూ రాత్రి…. ఎప్పుడూ నిద్ర అయితేనే బాగుంటుందేమో! అప్పుడు సమస్యలేమీ వుండవు. ఆశ, నిరాశ, అసంతృప్తి వీటి బాధేమీ వుండదు. కాని రాత్రి అంతా వేకువ కోసం, పగలంతా రాత్రికోసం కనిపెట్టుకుని వుండడమే జీవితం!
అయినా ఇవాళ! ప్రతిరోజూ ఏదో మార్పు వస్తుంది వట్టిభ్రమ. అన్ని రోజుల్లాగే ఈ రోజూ గడిచిపోతుంది. అంతే….
మామూలుగానే మేడదిగి వచ్చింది. మామూలుగానే రమణమ్మ కూరలు బేరం చేస్తోంది.
”బెండకాయలు ఆరణాల కిస్తావా?”
”అదేంటండీ. వీశ ముప్సావలా అమ్ముతుంటేను.”
ఈ కబుర్లకేంలే, అరణాలకిస్తే ఇయ్యి అరవీశ! ”అబ్బే. ఇదేం బేరమండీ అన్నీ మండిపోతుంటేను”
అంతే! విసుగొచ్చి తను కలుగ జేసుకుని తీర్పు చెప్పేదాకా ఆ వాదన అట్లా సాగుతూనే వుంటుంది. రోజూ ఈ ఘోషలేకుండా వుండేందుకు కూరలకు ఎంత ధర ఇచ్చినా ఇవ్వవచ్చు!
త్వరగా స్నానంచేసి తల దువ్వుకుంది. ఇవ్వాళ రాణీ తనూ కలసి మల్లెతోటలోకి వెళ్ళాలనుకున్నారు… తెల్ల వారేసరికి పువ్వులన్నీ విచ్చివుంటాయి. ప్రొద్దుటిపూట తోట ఎంత బాగుంటుందో! ఆ పువ్వల వాసన తలచుకుంటేనే ఆమెకు వింతమత్తు కలిగింది… ఏనాడు మొట్టమొదటిసారి ఆమె హృదయం మల్లెపూవులతో స్నేహం చేసుకొన్నదో కాని మల్లెపూవులను చూసినప్పుడల్లా ఆమె హృదయం వుప్పొంగిపోతుంది….
తోటలోకి వెళితే, – అమ్మయ్య! ఒక్క గంటసేపయినా ఈ కలవరాన్నంతా మరచి పోయి విశ్రాంతిగా వుండవచ్చు….
బాబు వచ్చాడు.
”అమ్మా తల నొప్పిగావుందే”
శాంత నుదుటిమీద చెయ్యివేసి చూసింది. మసలిపోతున్నది.
”పడుకోబాబు జ్వరం వచ్చినట్లుంది”
బాబును పడుకోబెట్టి, డాక్టరుకు కబురుచేసింది.
”అమ్మా, ఎక్కడికీ వెళ్ళకు. ఇక్కడే వుంటావు కదూ?”
”ఎక్కడకూ పోనురా. ఇక్కడే వుంటాను,” అక్కడే కుర్చీలో చతికిలబడింది. ఈ జ్వరం అనుకోకుండా ఈవేళే రావాలా? ఏమో! ఇది కాకపోతే ఇంకేదైనా అడ్డువచ్చి వుండవచ్చును. ఎంత ప్రయత్నించినా ఈ బంధనలోనుంచి తప్పించుకోలేదు. పాపం రాణి తనకోసం ఎదురుచూస్తూ వుంటుందేమో! డాక్టరువచ్చి చూసి మందిచ్చి వెళ్లేడు. ప్రమాదమైన జ్వరమేమీకాదు. సాయంత్రానికి తగ్గిపోవచ్చు. బాబు నిద్రపోయాడు. కాని ఈ పాటికి రాణి వెళ్ళిపోయి వుంటుంది.
రమణమ్మ వచ్చింది. ”ప్రక్కఇంటి వాళ్ళు మళ్ళీ నిన్న రాత్రి మన చెట్టు అరిటాకులు కోసుకున్నారు.”
”పోనీలే, వారింటికి రాత్రి మళ్లీ చుట్టాలొచ్చారేమో!”
”మళ్ళీ ప్రొద్దున్న ఎంగిలాకులన్నీ మనదొడ్లోనే పడవేశారమ్మా.”
రమణమ్మకు ఉద్రేకం ఆగడంలేదు. ”పోనీలే పనిమనిషిని ఎత్తమను.”
ఊరుకోక!….. ఏం చెయ్యాలి? వాళ్ళతో పోట్లాడాలా? అది తనకు ఈ జన్మలో సాధ్యమయ్యేది కాదు. రమణమ్మ తన ఉద్దేశం చెప్పింది.
”ఏమైనా సరే నమ్మా ఇవాళ వీరు అడిగితే అడగండి. లేకపోతే నేను నోరు చేసుకోక తప్పదు.”
శాంత అదిరిపడింది.
రమణమ్మ అనుకున్నది మార్చటం ఎవరికీ చేతకాదు. ఆవిడ తీర్మానానికి ఫలితం ఏమిటో శాంతకు బాగా తెలుసు. ఇటు రమణమ్మ ఒక్క నోరుచేసుకుంటే అటువారు పదినోళ్ళు చేసుకోవటం, ఈ గొడవ భరించలేక ప్లీడరుగారు తన మీద విరుచుకుపడటం! ఇది మామూలే! ఇంక ఆరోజుకు శాంతి వుండదన్నమాట.
‘రమణమ్మా!”
ఉహు! ఆవిడ అప్పుడే దొడ్లో యుద్ధం ప్రకటించింది. ఇంక ఎంత అరచినా ఆవిడకు వినిపించదు. చెవిటి వాడి దగ్గర శంఖం వూదినట్లే. వీధి వైపు నుంచి ప్లీడరుగారి కేకలు వినబడుతున్నాయి.
”ఏమిటాగోల! ఇల్లా! చేపల బజారా!”
ఇదీ వరస.
ఈ గొడవలోనుంచి తప్పించుకుని ఎక్కడికైనా పారిపోవాలనుకున్నది. కాని వంట యింటికి కచ్చేరి సావిడికీ మధ్యవున్నది ఒక్కటే గది కాబట్టి అక్కడే ఆగిపోవలసి వచ్చింది.
తుఫాను అణిగింది.
పరధ్యానంగా ఏదో పుస్తకం పట్టు కుంది. తనకు తెలియకుండానే పేజీలు తిప్పుతోంది.కానిఏమీ అర్థమయ్యేటట్లు లేదు.
”నా రేజరు బ్లేడు చూశావా?”
ఉలిక్కిపడింది.
ఎప్పుడూ ఇంట్లో ఏమూల చూచినా రేజరు బ్లేడులే ఉంటాయి. కాని ప్లీడరుగారికి కావలసినప్పుడు మాత్రం ఒక్కటీ కనబడదు. రోజూ చూస్తున్న ఈ విచిత్రం శాంతకు వింతగానే వుంటుంది.
”నా కెందుకండి మీ బ్లేడు!”…..
”ఏమన్నా కూరలు తరుక్కుంటానా” అని మెల్లిగా అంది. ప్లీడరుగారు బీరువాలో పుస్తకాలన్నీ తీసి ఒక్కొటొక్కటీ క్రింద గిరవాటు వెయ్యడం మొదలుపెట్టారు.’
”అబ్బే పుస్తకాల బీరువాలో ఎందుకుంటుందండీ.”
”నీకెందుకు! నువ్వు వెతక్కపోగా పైగా!”
మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తను బ్లేడు వెతుక్కొచ్చేసరికి ప్లీడరుగారు బీరువా ఖాళీచేశారు. అమ్మయ్య మళ్ళీ పుస్తకం తీసుకోబోయింది.
”నా జేబురుమాలు చూశావా?”
చూడలేదు. కాని ఇప్పుడు చూడాలి, కాని ఎక్కడ వున్నదని! ప్లీడరుగారు సణుక్కుంటున్నారు.
”నెలకు రెండు డజన్లు కొను క్కుంటాను. కాని సమయానికి ఒక్కటైనా” – అలమారలోని ఇస్త్రీబట్టలూ, బుట్టలోని మాసిన బట్టలూ, అన్నీ బయటకు వచ్చిన తర్వాత జేబురుమాలు ప్లీడరుగారి జేబులోనే దొరికింది.
నా చెప్పులేవీ?
చెప్పులు బహుశః మేడమీద పడక గదిలో దొరకవచ్చు. రోజూ అవి అక్కడకు ఎలా వెళతాయో మాత్రం ఎవరూ చెప్పలేరు.
ప్లీడరుగారు మొదలు పెట్టారు :
”ఎవరూ నా సంగతి కనుక్కునే వాళ్లేలేరు. కొంచెం ఇవన్నీ చూడకూడదూ! పుస్తకం పట్టుకుని నిద్రపోకపోతే!”
ఇది మామూలు పాఠమే! ఇదంతా శాంతకు కంఠతా వచ్చు! రోజూ జాగ్రత్తగా వుండాలని అనుకొంటూనే వుంటుంది. రోజూ మర్చిపోతూనే వుంటుంది….
వీధి తలుపు ఫెడేలుమని చప్పుడైంది. ఇల్లంతా అరణ్యంలాగా వుంది. చుట్టూ ఇస్త్రీ బట్టలూ, మాసిన బట్టలూ, పుస్తకాలూ, న్యూస్‌పేపర్లూ! మధ్యన చలికిలబడింది. అవన్నీ తన్ను చూచి నవ్వుతున్నట్లుంది. తనకూ నవ్వువచ్చింది. ఏదో ఈ కోర్టు అనీ, ఆఫీసు అనీ వుండబట్టి సరిపోయిందికాని, ఈ మగవాళ్లు ఇరవై నాలుగు గంటలూ ఇంట్లోనే వుండేటట్లయితే!
నవ్వుకుంటూ లేచి ఇల్లంతా సర్దుకుంది. వెల్లి బాబు దగ్గర కూర్చున్నది. ఎండ మాడిపోతున్నది. తోటలో చెట్లన్నీ ఈ ఎండకు తట్టుకోలేక, తప్పించుకోలేక, వాడిన ముఖాలతో ఆయాసపడుతున్నాయి. చివరకు అలసిపోయి ఈ యెండలో ప్రాణాలు నిల్పుకో లేమని నిరాశతో తలలు వాల్చుకున్నాయి, అప్పటికి సూర్యుడు దయదల్చి చల్లబడ్డాడు.
మధ్యాహ్నం నుంచి రమణమ్మగారి గొంతు వాగుతూనే వుంది.
”కుళాయి గొట్టం విరిగిపోయింది. నీళ్ళన్నీ ఇల్లంతా నిండిపోయాయి. వంటిల్లు చెరువులాగ వున్నది. ఒక్కసారి వచ్చి చూడమ్మా”…..
”స్టోరు రూము తలుపు బిగుసుకు పోయింది. ఎంతతోసినా రావడంలేదు”…
”పాలన్నీ పిల్లి తాగిపోయింది. ప్లీడరుగారికి కాఫీ లేదు”….
”బాబుకు జావకావాలి. గోధుమరవ్వ లేదు.”….
”నిన్నటినుంచి చిన్న వెండిగిన్నె కనబడడం లేదమ్మా! ఏమైపోయిందో గాని!”….
చిన్నచిన్న విషయాలను పెద్ద పెద్ద సమస్యలుగా తయారు చెయ్యడం ఒక్క రమణమ్మకే చేతనవును! అయినా ఈ చిన్న విషయాలే ఎంత బాధ, ఎంత చిరాకు కలిగిస్తాయి.
ఇవ్వాళ మాత్రం ఈ ప్రశ్నలేవీ శాంత చెవిలో దూరటంలేదు.
పని మనిషి కూతురు పన్నెండేళ్ళ నరిసి జ్ఞప్తికొచ్చింది.
”నరిసీ, నీకు ఆ మల్లెపువ్వు లెక్కడివే?”
”మా బావ తెచ్చాడమ్మా!”
”ఏం చేస్తాడు మీ బావ?”
”ఏం పని లేదమ్మా! ఎప్పుడైనా కూలి కెల్తాడు, మీకు కావాలమ్మా మల్లెపూలు?”
”నాకెందుకే!”
తనకెందుకు? ఈ వాతావరణంలోకి మల్లెపూలు రాకూడదు…
మల్లె పువ్వులు ఒక జ్ఞాపకం! ఒక అందుకోలేని ఆదర్శం. అవి నిత్యజీవితంలోకి వస్తే వాడిపోతాయి. తను ఎక్కడవున్నా తనకు మల్లెపూల వాసన కొడుతూనే వుంటుంది, ఆ వాసన తలచుకుంటూనే ఈ జీవితాన్ని గడపగలదు!
సాయంత్రం మబ్బుగావుంటే వర్షం కురుస్తుందేమో ననుకుంది. కాని మబ్బులన్నీ విడిపోయి వెన్నెల వచ్చింది. డాబా మీద నక్షత్రాల కేసి చూస్తూ పడుకొంది. తెల్లవార్లూ అల్లాగే చందమామను, నక్షత్రాలనూ చూస్తూ గడపగలదు. రోజూ చూస్తున్నప్పటికీ వీటి ఆకర్షణ తగ్గదు… అబ్బ! ఈ వెన్నెల ఎంత హాయిగావుంది. నీలి పట్టుచీరమీద జరీ పువ్వులాగ ఈ నక్షత్రాలు ఎంత బాగున్నాయి!
”ఇక్కడున్నావా!” ప్లీడరుగారి గొంతు!
”బాబుకు జ్వరం తగ్గిందికదూ!”
”ఆ! చెమట్లు పోస్తున్నాయి. నిద్రపోతున్నాడు”.
ఏమీ తోచక ఆకాశంకేసి చూస్తూ కూర్చున్నాడు. కాసేపే ”చూడు, ప్రొద్దున్న అనవసరంగా విసుక్కున్నా”.
శాంత చిరునవ్వు నవ్వింది. తెల్లవారే వరకు ప్లీడరుగారు పరమ శాంతమూర్తి.
”ఎందుకు నవ్వుతావు?…. చూడు! రేపటినుంచి నిన్ను ఒక్కమాట అంటే ఒట్టు”.
రేపటినుంచి!
”రేపు”!
శాంత హృదయం ఒక్కసారి ఉత్సాహంతో ఉప్పొంగింది. తెల్లవారుతుంది. రేపు వస్తుంది. ఈ వేళ చేయలేక పోయిన వెన్నో రేపు చెయ్యవచ్చు… రేపు మల్లెతోటకు వెళ్ళవచ్చు. రేపు వీణ వాయించుకోవచ్చు. మరచిపోయిన పాటలన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవచ్చు.
ఈ ఆశతో ఆమె హృదయం తృప్తిపొందింది.
నిన్న, ఇవ్వాళ, రేపు – వీటిలో నిజంగా ఏమీ తేడాలేదు. అయినా ఇవ్వాళ గడిచి పోయినదని నిట్టూర్పు రేపు వస్తుందని ఆశ.
కాని ఈ రాత్రి, ఈ చల్లదనం, ఆ ఆశ లేకపోతే!….(లక్ష్మిగారికి కృతజ్ఞతలతో)
(ఆహ్వానం పత్రిక నుంచి పునర్ముద్రితం)